ఇప్పటికైనా కదలాలి
దేశంలో గోరక్షణ పేరిట ఉన్మాద మూకల వీరంగం సాగుతున్నవేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఉదంతాలపై స్పందించారు. వాటిని సహించేది లేదంటూ హెచ్చరించారు. ఆ పేరిట హత్యలకు దిగడం ఆమోదయోగ్యం కాదన్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు మౌనం విడనాడి మాట్లాడటం ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో అవసరం. ఆ పని చేసినందుకు మోదీ అభినందనీయులు. అయితే మూక దాడులపై ఆయన స్పందించడం ఇది మొదటిసారేమీ కాదు. 2015 అక్టోబర్‌లో న్యూఢిల్లీకి సమీపం లోని గ్రామంలో ఒక ముస్లిం కుటుంబంపై దాడిచేసి ఆ కుటుంబ పెద్ద అఖ్లాక్‌ను కొట్టి చంపి, అతని కుమారుణ్ణి తీవ్రంగా గాయపరిచినప్పుడు ఆయన గళం విప్పారు. అలాగే నిరుడు ఆగస్టులో గుజరాత్‌లోని ఉనాలో కొందరు దళిత యువ కులు పశు కళేబరాలను తరలిస్తున్నారని ఆగ్రహించి దుండగులు నడిబజారులో వారిని బట్టలు ఊడదీసి, పెడరెక్కలు విరిచి కట్టి కొట్టినప్పుడు కూడా మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దురదృష్టమేమంటే ఆ తర్వాత కూడా అవి ఆగింది లేదు. గత మూడేళ్లలో ఆ మాదిరి ఉదంతాలు 32 చోటు చేసుకోగా 23మంది ప్రాణాలు కోల్పోయారని, 50మంది గాయపడ్డారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కనుక మాటలతోపాటు వెనువెంటనే చేతలు మొదలైనప్పుడే ఈ దుర్మార్గానికి అడ్డు కట్ట పడుతుందని ఎవరికైనా అర్ధమవుతుంది.. కానీ విషాదమేమంటే ఆ విషయం లో మన ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. శాంతిభద్రతల వ్యవహారా లను చూసే రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలుడిగి ఉండిపోతున్నాయి. కొందరు నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఈ కేసుల్లోని నిందితులు సులభంగా బెయిల్ తీసుకుని బయటికొస్తున్నారు. బాధిత కుటుంబాలు మాత్రం సమాజంలో వెలివేతకు గురవుతున్నాయి. దిక్కూ మొక్కూ లేకుండా మిగులుతున్నాయి.
మూక దాడులపై నరేంద్ర మోదీ స్పందించిన రోజే జార్ఖండ్‌లోని బజ్రతర్ గ్రామంలో ఒక వాహనంలో వెళ్తున్న 40 ఏళ్ల అలీముద్దీన్ అనే వ్యక్తిని పశుమాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో ఒక గుంపు అటకాయించి దాడిచేసి కొట్టి చంపింది. వాహనానికి నిప్పంటించింది. సరిగ్గా అంతకు వారంక్రితం ఈద్ పండగ కోసమని ఢిల్లీలో షాపింగ్ చేసుకుని రైల్లో హర్యానాలోని స్వస్థలానికి వెళ్తున్న నలుగురు పిల్లలను బోగీలోని కొందరు మతం పేరుతో అవమానించి, వారు సంప్రదాయంగా ధరించే టోపీలను లాగి దూషించడమే కాక వారిలో జునైద్ అనే పిల్లవాడిని తీవ్రంగా కొట్టి రైల్లోంచి తోసి ప్రాణం తీశారు. మరొకరిని గాయపరిచారు. ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు బోగీ నిండా ప్రయాణికులు న్నారు. కానీ ఒక్కరైనా వారించడానికి ప్రయత్నించలేదు. వారిపై క్రూరంగా దాడి చేస్తుంటే, ప్రాణం తీస్తుంటే మాట్లాడలేదు.
దగ్గరలోని ప్లాట్‌ఫాంపై ఉన్న దాదాపు 200మంది ప్రవర్తనా ఆ విధంగానే ఉంది. తోటి మనుషులతో, అందులోనూ కనీసం ఆత్మరక్షణ కూడా చేసుకోలేని పిల్లలతో దుండగులు అంత అమానుషంగా ప్రవర్తిస్తుంటే అంతమంది ఉండి కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం దేనికి సంకేతం? ఇలాంటి మూక దాడులు జరిగిన సందర్భంలోనే నాగరిక విలువ గురించి, వైవిధ్యత గురించి, బహుళత్వం గురించి రాష్ట్రపతి మాట్లాడారు. కానీ ఉన్నకొద్దీ ఆ విలువలు అడుగంటుతున్న వైనం కనబడుతోంది. ఆమధ్య రైల్లో వెళ్తున్న మహిళల వద్ద పశుమాంసం ఉన్నదన్న అనుమానంతో అమానుషంగా దాడి చేయడం, మరోచోట పశువుల్ని తరలిస్తున్నవారిని అనుమానించి వారితో ఆవుపేడ, మూత్రం, నెయ్యి, పెరుగూ కలిపి తినిపించిన ఉదంతం ఎవరూ మరిచిపోరు.
ఇలాంటి హంతకముఠాలు గాల్లోంచి ఊడిపడవు. ఎవరి దన్నూ లేకుండా అలా చెలరేగిపోవు. పౌరుల ప్రాణాలు కాపాడటం తమ కర్తవ్యమని విశ్వసించే పాల కులుంటే, ఘటన జరిగిన వెంటనే స్పందించే గుణముంటే సమస్య ఇంతగా విష మించదు. అది లేకపోగా అధికార పార్టీలో ఉంటున్న నేతలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. అఖ్లాక్‌ను కొట్టి చంపిన ఉదంతంపై మాట్లాడిన ఒక బీజేపీ నేత కేవలం పశుమాంసం తిన్నారన్న వదంతి ఆధారంగా దాడి చేయడం తప్పని అన్నారు.
అది నిజమని నిర్ధారణ అయితే దాడి చేయొచ్చని ఆయన పరోక్షంగా చెప్పారు. మన దేశంలో గోవధ నిషేధ చట్టాలున్న రాష్ట్రాల్లో ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని వధిస్తే...వాటిని ఆ ఉద్దేశంతో తరలిస్తే బాధ్యులైనవారికి విధించే శిక్షలైనా, జరిమానాలైనా వేర్వేరు రకాలుగా ఉన్నాయి. పశువుల తరలింపు దానికదే నేరమని ఏ చట్టమూ చెప్పడం లేదు. పైగా మిగిలిన అన్ని చట్టాల్లాగే ఆ చట్టాన్ని అమలు చేయాల్సింది కూడా అధికార యంత్రాంగమే తప్ప ప్రైవేటు ముఠాలు కాదు. కానీ గోరక్షణను నెత్తినేసుకున్నవారు పశువుల్ని తరలిస్తున్నవారిపైనా, పశుమాంసం దగ్గరున్నదని అనుమానం వచ్చినవారిపైనా దాడులు చేస్తున్నారు. చంపుతున్నారు. అఖ్లాక్ కేసు నిందితుడు మరణించి నప్పుడు కేంద్రమంత్రి మహేష్ శర్మ అతని మృతదేహంపై జాతీయజెండాను కప్పారు. పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు దుండ గులపై చర్య తీసుకోవడానికి అధికార యంత్రాంగం సాహసిస్తుందా? పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరిం చడానికి ముందుకొస్తారా?
ఈ మూకదాడులపై నిరసనలు వ్యక్తమైనప్పుడు కేరళ, పశ్చిమబెంగాల్ వంటిచోట్ల ఆరెస్సెస్ నేతలను హత్య చేయడాన్ని బీజేపీ నేతలు ఎత్తిచూపుతున్నారు. ఇవన్నీ ఖండించదగినవే. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ రాజకీయ కారణాలతో, పరస్పర కక్షలతో జరిగే హత్యలనూ...ఒక మతానికి చెందిన సాధారణ పౌరులను గోరక్షణ పేరుతో హతమార్చడం ఒకే గాటన కట్టగలమా? కనీసం మోదీ ప్రసంగాన్ని గమనించాకైనా అలాంటి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వాలు చురుగ్గా కదిలి దుండగులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలి. వారికి వెంటవెంటనే శిక్షలుపడేలా చర్యలు తీసుకోవాలి. ఈ అమానవీయ ఉదంతాలు అవిచ్ఛిన్నంగా కొనసాగడం మన దేశానికి తలవొంపులు తెస్తుందని తెలుసుకోవాలి.