సాక్షి, ముంబై : గోసంరక్షణ పేరిట జరుగుతున్న దురాగతాలను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్షంగా సమర్థించారు. గోసంరక్షకులు చట్టాలను ఉల్లంఘించడంలేదని, వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి సందర్బంగా పుణేలో ఆర్‌ఎస్సెస్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. గోసంరక్షణ రాజ్యాంగంలో భాగమేనన్నారు. ఆవు ఒక మతానికి సంబంధించినది కాదని, ఎంతో మంది ముస్లింలు ఆవులను పెంచి పోషించారని, వాటి రక్షణ కోసం ప్రాణాలు కూడా అర్పించారని పేర్కొన్నారు. కావాలనే కొంతమంది గోసంరక్షణ పేరిట హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారన్నారు.
కానీ, గోవులను దొంగ రవాణా చేసే వారి చేతుల్లో కూడా గోసంరక్షకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారనే విషయం గుర్తించాలని సూచించారు. గోసంరక్షణ సమస్యను మతంతో ముడిపెట్టకుండా చూస్తున్నామని తెలిపారు. ఆవు పాలు, మూత్రాలను ఉపయోగించే మనదేశంలో, చిన్నా చితక రైతులకు ఆవులు ఎంతో అవసరమని, గో ఆధారిత వ్యవసాయాన్ని రక్షించాలని రాజ్యాంగంలో ఉందని ఈ సందర్భంగా మోహన్ భగవత్ గుర్తుచేశారు. గోసంరక్షకులపై కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వాలు సంఘ విద్రోహ శక్తులకు చేయూతనిస్తున్నాయని ఆరోపించారు.
రోహింగ్యాలు దేశానికి ముప్పు..
రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పు అని, వారికి ఆశ్రయం కల్పించవద్దని ప్రధాని నరేంద్రమోదీకి భగవత్ సూచించారు. ఇప్పటికే అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీలతో సమస్య ఎదుర్కొంటున్నామన్నారు. రోహింగ్యాలతో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లడమే కాక దేశంలో హింసాత్మక ఘటనలు చెలరేగుతాయని, మయన్మార్‌లో వారు సృష్టించిన ఘటనలే సాక్ష్యమని భగవత్ పేర్కొన్నారు.