ఇంఫాల్: మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు యత్నిస్తున్న సైన్యానికి స్థానికంగా ఓ వర్గం మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిలిటెంట్లను విడిపించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్మీని దిగ్బంధించారు. దీంతో రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. చివరికి, ఆర్మీ తమ అదుపులో ఉన్న మెయిటీ వర్గం మిలిటెంట్లను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన తూర్పు ఇంఫాల్ జిల్లా ఇథమ్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
భద్రతా బలగాలు శనివారం ఉదయం గ్రామంలో సోదాలు జరిపి 12 మంది మిలిటెంట్లను అదుపులోకితీసుకున్నాయి. విషయం తెల్సుకున్న సుమారు 1,200 మంది మెయిటీ వర్గం మహిళలు సైనికులను చుట్టుముట్టారు. మిలిటెంట్లను వదిలేయాలని భీష్మించారు. సాయంత్రం వరకు ఇదే ప్రతిష్టంభన కొనసాగింది. చివరికి బలగాలు మిలిటెంట్లను వదిలేశాయి.
వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను, మందుగుండును మాత్రం తీసుకెళ్లామని ఆర్మీ తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా, బలప్రయోగంతో కలిగే నష్టాన్ని, గ్రామస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మానవతా దృక్పథంతో మిలిటెంట్లను స్థానిక నేతకు అప్పగించినట్లు ఆర్మీ తెలిపింది. ఆర్మీ విడిచిపెట్టిన వారిలో మెయిటీ వర్గం కేవైకేఎల్ గ్రూపునకు చెందిన స్వయం ప్రకటిత లెఫ్టినెంట్ కల్నల్ మొయిరంగ్‌థెమ్ తంటా అలియాస్ ఉత్తమ్ ఉన్నాడు.
ఇతడికి పలు హింసాత్మక ఘటనలతో సహా 2015లో ‘6 డోగ్రా యూనిట్’పై దాడితో సంబంధముంది. ఈ గ్రూప్ మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి చొరబడినట్లు ఆర్మీ తెలిపింది. గ్రామంలోకి అదనపు బలగాల ప్రవేశాన్ని ఆలస్యం చేసేందుకు ఆ మార్గంలోని కొన్ని వంతెనల వద్ద అడ్డంకులు కల్పించారంది. కాగా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆదివారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment