అమెరికన్ ప్రజాస్వామ్యం కేంద్రబిందువైన కేపిటల్ హిల్‌లో కనీవినీ ఎరుగని హింస, అల్లర్లు జరుగుతున్న దృశ్యాలు టెలివిజన్ తెరలపై విస్తృతంగా కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగానూ కోట్లాదిమంది ప్రజలు షాక్‌కు గురయ్యారు. కానీ దీంట్లో మరీ అంతగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. అధ్యక్ష పీఠం నుంచి సాక్షాత్తూ డొనాల్డ్ ట్రంప్ అల్లుతూ వచ్చిన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలకు పరాకాష్టే బుధవారం జరిగిన హింసాకాండ. అధ్యక్ష ఎన్నికలను తమనుంచి తస్కరించారని ట్రంప్ మద్దతుదారులు నమ్మేలా రిపబ్లికన్ పార్టీ శాసనసభ్యులు, మితవాద మీడియా వ్యక్తులు కలిసి ప్రయత్నించారు. వీరందరూ కలిసి దేశాధ్యక్షుడే తన మద్దతుదారులను హింసకు పురిగొల్పేలా రెచ్చగొట్టడంలో తలా ఒక చేయి వేశారు. ఈ క్రమంలో అమెరికా ఎన్నికల ప్రక్రియనే వీరు అపహాస్యం చేసిపడేశారు. అమెరికా అజేయం అనే ఒక ప్రత్యేకతత్వం ఇవాళ ఎక్కడికి చేరుకుంటూ ఉంటోందో మనం ఇప్పుడు స్పష్టంగా చూడవచ్చు.
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ జనవరి 6న ఎలక్టోరల్ ఓట్లను లెక్కించడానికి అమెరికన్ కాంగ్రెస్‌లోని రెండు చాంబర్లను సమావేశపర్చారు. ఓట్ల లెక్కింపు తర్వాత డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీచేసిన జో బైడెన్ అమెరికా తాజా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని అధికారంగా నిర్ధారించారు. ఇది మాములు పరిస్థితుల్లో అయితే నేరుగా, స్వచ్ఛంగా ఒక గంటలోపు ముగియవలసిన అతి సాధారణమైన, లాంఛనప్రాయమైన ప్రక్రియ. అవును.. అమెరికా రాజకీయ రణరంగంలో ఇప్పుడు నడుస్తున్నవి ’సాధారణ’ సమయాలు కావు మరి.
మొట్టమొదట్లో, పలువురు రిపబ్లికన్ శాసనసభ్యులు డొనాల్డ్ ట్రంప్‌ను మరో దఫా అధ్యక్ష పదవిలో నిలిపి ఉంచడానికి నిస్సిగ్గుగా, వినాశకరమైన రీతిలో ప్రయత్నించి, ఎలక్టోరల్ కాలేజీలో వెలువడిన ఫలితాలపై అభ్యంతరాలు లేవనెత్తడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతూ వచ్చింది. తర్వాత ఎన్నికను తారుమారు చేయడానికి వేలాదిమంది ట్రంప్ అనుకూలురైన అమెరికన్లు కేపిటల్ హిల్‌పై దాడి చేసి లోపలకు ప్రవేశించడానికి ప్రయత్నించారు. ‘అమెరికాను మళ్లీ గొప్పగా మలుద్దాం’ అనే అతిశయపూరితమైన టోపీలు ధరించిన నిరసనకారులు ట్రంప్ జెండాలను పట్టుకుని కేపిటల్ హిల్ కార్యాలయాల్లోకి దూసుకెళ్లి, శాసనసభలోని ఆయా ఫ్లోర్ల లోనికి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ సభ్యులను హౌస్ గ్యాలరీలో తలదాచుకోవాలని అధికారులు చెప్పారట. తర్వాతి క్రమంలో వాషింగ్టన్ డీసీ మేయర్ మురెల్ బౌజర్ అమెరికా కేపిటల్ హిల్‌లో కర్ఫ్యూ ప్రకటించి రెండువారాల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
అమెరికన్ ప్రజాస్వామ్యం నడిగడ్డలో కనీవినీ ఎరుగని హింస, అల్లర్లు జరుగుతున్న దృశ్యాలు టెలివిజన్ తెరలపై, సోషల్ మీడియా టైమ్ లైన్లలో విస్తృతంగా కనిపించడంతో అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కోట్లాదిమంది ప్రజలు షాక్‌కు గురయ్యారు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో మరీ అంతగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఇది అనూహ్యంగా జరిగిన ఘటన మాత్రం కానేకాదు. అమెరికా రాజ్యాంగాన్ని, అక్కడి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తూ అధ్యక్ష పీఠం నుంచి సాక్షాత్తూ డొనాల్డ్ ట్రంప్ అల్లుతూ వచ్చిన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలకు పరాకాష్టే బుధవారం జరిగిన హింసాకాండ అని మనందరం స్పష్టం చేసుకోవలసిన అవసరం ఉంది.
చాలా కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందని, అధ్యక్ష పదవిని తననుంచి దొంగిలించారని పేర్కొంటూ నిరాధారపూరితమైన ప్రకటనలను పథకం ప్రకారం వ్యాపింపజేస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే శాంతియుతంగా అధికార మార్పిడి ప్రక్రియను హింసాత్మకంగానైనా సరే అడ్డుకోవడానికి ట్రంప్ తన మద్దతుదారులను బహిరంగంగానే రెచ్చగొట్టి వదిలారు. అంతేకాకుండా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో సహా రిపబ్లికన్ పార్టీ అధికారులపై ఒత్తిడి చేసి తనను అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వారివారి రాజ్యాంగ విధులను పక్కనపెట్టాలని చెప్పడానికి కూడా ట్రంప్ సాహసించారు.
పైగా జార్జియా రాష్ట్ర కార్యదర్శి బ్రాడ్ రఫెన్‌స్పెర్జర్‌కి నేరుగా కాల్ చేసి, జార్జియా రాష్ట్రంలో తాను గెలిచేందుకు అవసరమైన ఓట్లను వెతికిపెట్టాలని కూడా ట్రంప్ ఫోన్ చేసి బాగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. వాషింగ్టన్ డీసీలో అల్లర్లు, హింసాకాండ జరగడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు వైట్‌హౌస్ సమీపంలో 70 నిమిషాలపాటు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంలో కూడా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వెలువడిన ఫలితం మన ప్రజాస్వామ్య వ్యవస్థపై చేసిన పెనుదాడిగా పేర్కొన్నారు. పైగా ‘మీరు మన దేశాన్ని బలహీనతతో ఎన్నటికీ ముందుకు తీసుకుపోలేరు’ అని చెబుతూ కేపిటల్ హిల్‌కి తరలి రావలిసిందిగా తన మద్దతుదారులకు బహిరంగంగా ఆదేశాలిచ్చారు.
అయితే బుధవారం కేపిటల్ హిల్‌లో జరిగిన అల్లర్లకు, హింసాకాండకు ఒక్క ట్రంప్‌ని మాత్రమే బాధ్యుడిగా చేయడం తప్పు. అసంఖ్యాకులైన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అధికారులు, మితవాద మీడియా వ్యక్తులు మొత్తంగా కలిసి అమెరికా అధ్యక్ష ఎన్నికలను తమనుంచి తస్కరించారని ట్రంప్ మద్దతుదారులు నమ్మేలా అనేక ప్రయత్నాలు చేశారు. భావజాలపరమైన విశ్వాసం కావచ్చు, దూరదృష్టి లేని రాజకీయ ఆచరణ వాదం కావచ్చు లేదా నిస్సిగ్గుగా అవలంబించిన పక్షపాత వైఖరి కావచ్చు వీరందరూ కలిసి దేశాధ్యక్షుడే తన మద్దతుదారులను హింసకు పురిగొల్పేలా, అమెరికా రాజ్యాంగాన్నే కించపర్చేలా రెచ్చగొట్టడంలో తలా ఒక చేయి వేయటంలో విజయం సాధించారు. ఈ క్రమంలో అమెరికా ఎన్నికల ప్రక్రియనే వీరు అపహాస్యం చేసిపడేశారు.
అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి దేశాధ్యక్షుడు చేస్తున్న చట్టవ్యతిరేక ప్రయత్నాలను ఖండించడానికి అనేకమంది రిపబ్లికన్ పార్టీ ప్రముఖులు చివరి నిమిషం వరకు తిరస్కరిస్తూ వచ్చారు. ఎందుకంటే ట్రంప్‌ని నమ్మే కోట్లాదిమంది అభిమానుల మద్దతును ఒక్కసారిగా తాము కోల్పోతామని వీరంతా భయపడ్డారు. అదేసమయంలో చాలామంది ఇతరులు దేశాధ్యక్షుడి విదూషక చేష్టలను తీసిపడేయడం లేక తగ్గించి చూపడం చేయసాగారు. ట్రంప్ ప్రభావం అతిత్వరలో కరిగిపోతుందని వీరు నమ్ముతూవచ్చారు. ఈలోగా మితవాద తీవ్రవాదం నెమ్మదిగా ప్రధానస్రవంతిగా మారిపోయింది.
ఇప్పుడు, ఒక రోజంతా ఆందోళనలు, నిరసనలు కొనసాగిన తర్వాత కేపిటల్ హిల్‌ని సురక్షితం చేసి బైడెన్ గెలుపును అధికారికంగా ధ్రువీకరించిన తర్వాత రిపబ్లికన్, డెమోక్రాటిక్ రెండు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ట్రంప్‌ని బహిరంగంగా ఖండించడానికి ముందుకు రావడమే కాకుండా, బైడెన్ నేతృత్వంలోని నూతన పాలనా యంత్రాంగం, అమెరికా ఎదుర్కోనున్న కొత్త సవాలుకు ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడటం మొదలెట్టారు. అయితే ట్రంప్ విదేశీయతా విముఖత, ప్రజలను విభజించేలా తాను వాడే భాషను ఇంతకాలం వారు ఎలా ఆమోదిస్తూ వచ్చారు?
ఎన్నికలు జరగడానికి కొన్ని వారాల ముందు మాత్రమే కాదు.. అధ్యక్ష పదవిలో ఉన్నంతకాలం దేశచట్టాలను తుంగలో తొక్కడానికి, అధికారాలను దుర్వినియోగం చేయడానికి ట్రంప్‌ని ఎందుకు అనుమతించారు? ట్రంప్ ఈల వేస్తే చాలు శ్వేతజాతి దురహంకారులూ, జాత్యహంకారులూ, హింసోన్మాదులైన ఫాసిస్టులూ ఎందుకు స్వేచ్ఛగా రోడ్లమీదికొచ్చి వీరంగమాడుతున్నారు? బుధవారం జరిగిన అల్లర్లను, హింసాకాండను నిరోధించడానికి అమెరికన్ రాజ్య వ్యవస్థ అవసరమైన చర్యలను ఎందుకు తీసుకోలేకపోయింది? అధ్యక్షుడు రెచ్చగొట్టినందుకే ట్రంప్ మద్దతుదారులు తమ హింసాకాండను అందరూ చూడాలని బహిరంగంగా ముందుకొచ్చారా?
చివరకు మీడియా సైతం ట్రంప్ రెచ్చగొట్టి జరిపించిన ఈ హింసాకాండకు ఏమాత్రం సిద్ధం కానట్లు కనిపించింది. దేశాధ్యక్ష స్థానంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది నెలలుగా బహిరంగంగానే కుట్ర చేయడానికి దారులు వెతుక్కుంటున్నారు. అధ్యక్ష పదవి తస్కరణను ఆపివేయండి అంటూ అమెరికా నగరాల్లో వేలాదిమంది నిత్యం నినాదాలు చేస్తూ, తమ ప్రైవేట్ తుపాకులను కూడా పబ్లిగ్గా ప్రదర్శిస్తూ రావడం ప్రపంచమంతా చూస్తూ వచ్చింది.
అమెరికాలో జరుగుతున్న పరిణామాలు లాటిన్ అమెరికా, దక్షిణ యూరప్, తూర్పు యూరప్, ఆఫ్రికా ఖండాల్లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా జరిగి ఉంటే అమెరికా మీడియా సంస్థలు డజన్ల కొద్దీ రిపోర్టర్లను ఆయా దేశాల పార్లమెంటు వద్దకు సకల రక్షణలతో పంపించి అక్కడి ఎన్నికల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని, ఆవరించిన హింసాకాండను వారాల తరబడి వ్యాసాల మీద వ్యాసాలు రాయించి ప్రచురించేవారు. టీవీల్లో అసంఖ్యాక ఎపిసోడ్లను ప్రసారం చేసేవారు. కానీ అమెరికాలో జరిగితే మాత్రం ఏమీ ఎరగనట్లు, ఏమీ కానట్లు మౌనం పాటిస్తూ ధర్మపన్నాలు వల్లిస్తుంటారు.
దీనికి ఒక కారణాన్ని మనం చూపించవచ్చు. అమెరికా ప్రజాస్వామ్యం ఎట్టిపరిస్థితుల్లోనూ వైఫల్యం చెందడానికి వీల్లేనంత బలంగా ఉందని అందరూ అభిప్రాయపడుతూ ఉండవచ్చు. అమెరికా అజేయం అనే ఒక ప్రత్యేకతత్వం, పాశ్చాత్య ఉదారవాద సంస్థల సంపూర్ణ ఆధిక్యతపై తిరుగులేని విశ్వాసం అనే రెండింటినీ కలిపి చూడండి. అమెరికా ఇవ్వాళ ఎక్కడకు చేరుకుంటూ ఉందో ఇప్పుడు మనం స్పష్టంగా చూడవచ్చు.
ఆండ్రియా మమోన్
వ్యాసకర్త చరిత్రకారుడు, రాయల్ హొలోవే
లండన్ యూనివర్సిటీ
(అల్‌జజీరా సౌజన్యంతో...)
Comments
Please login to add a commentAdd a comment