తఖ్త్ శ్రీకేస్‌గఢ్ సాహిబ్ గురుద్వారాలో కాపలాదారుడిగా విధులు
చండీగఢ్: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన హత్యాయత్నం నుంచి తృటిలో బయటపడిన పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ ప్రాయశ్చిత్త దీక్షను వరుసగా మూడో రోజు యథాతథంగా కొనసాగించారు. ఆయన గురువారం రూప్‌నగర్ జిల్లాలోని తఖ్త్ శ్రీకేస్‌గఢ్ సాహిబ్ గురుద్వారా బయట కాపలాదారుడిగా(సేవాదార్) విధులు నిర్వర్తించారు.
ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన సుఖ్‌బీర్‌సింగ్ ఉదయం 9 గంటలకు చక్రాల కురీ్చలో గురుద్వారాకు చేరుకున్నారు. కాపలాదారుడి దుస్తులు ధరించి, చేతిలో ఈటెతో విధుల్లో చేరారు. తర్వాత కొంతసేపు సిక్కు కీర్తనలు విన్నారు. ఇక్కడి వంటశాలలో పాత్రలు శుభ్రంచేశారు. సుఖ్‌బీర్ సింగ్‌తో ఆయన భార్య, ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, కుమారుడు అనంత్‌బీర్ సింగ్ బాదల్, కుమార్తెలు హర్‌కీరత్‌కౌర్ బాదల్, గుర్లీన్ కౌర్ బాదల్ సైతం వంటశాలలో సేవలందించారు.
2007 నుంచి 2017 దాకా పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా సిక్కు అత్యున్నత సంస్థ అకల్ తఖ్త్ సుఖ్‌బీర్ సింగ్‌కు మతపరమైన శిక్ష విధించిన సంగతి తెలిసిందే. స్వర్ణ దేవాలయంలోపాటు మొత్తం ఐదు గురుద్వారాల్లో రెండు రోజుల చొప్పున పది రోజులపాటు సేవాదారుడిగా పనిచేయాలని అకల్ తఖ్త్ ఆదేశించింది. స్వర్ణ దేవాలయంలో రెండో రోజు బుధవారం ప్రాయశ్చిత్త దీక్షల ఉండగా సుఖ్‌బీర్ సింగ్‌పై హత్యాయత్నం జరిగింది. మాజీ ఉగ్రవాది నారాయన్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment