ఒక వాహనం కొనుగోలు చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించి తీసుకోవడం. రెండు 'ఈఎమ్ఐ' రూపంలో తీసుకోవడం. ఇంతకీ ఏ విధంగా కొనుగోలు చేస్తే ఉత్తమం? మొత్తం డబ్బు చెల్లించడం (ఫుల్ క్యాష్) ద్వారా లాభాలేంటి? ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేస్తే వచ్చే లాభ, నష్టాల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
బంధువులు కొన్నారు, పక్కింటి వాళ్ళు కొన్నారు, ఎదురింటి వాళ్ళు కొన్నారు అని, ఆవేశంతో ఆలోచించకుండా వాహనాలు కొనుగోలు చేస్తే.. ఆ తరువాత ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక వడ్డీలు ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి ఒక వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోవడం మాత్రమే.. సంపాదనను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం డబ్బు చెల్లించి (ఫుల్ క్యాష్)
ఏదైనా వాహనం (కారు / బైక్) కొనాలంటే మొత్తం డబ్బు చెల్లించడం అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఒకేసారి వాహన ఖరీదును చెల్లించాలమంటే.. ప్రతి నెలా ఈఎమ్ఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్టేషన్స్, యాక్ససరీస్ వంటివన్నీ ఒకేసారి పొందవచ్చు. వడ్డీ చార్జీలు నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాకుండా వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా కొన్ని సార్లు ఆఫర్స్ కూడా లభిస్తాయి. తక్షణమే మీరు వాహనానికి ఓనర్ కూడా అవ్వొచ్చు.
లోన్ మీద కారు కొనుగోలు
నిజానికి ప్రతి ఒక్కరూ మొత్తం డబ్బు చెల్లించే విధానం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కారు కొనాలంటే కనీసం రూ. 10 లక్షల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకేసారి అంత మొత్తం చెల్లించడం కొందరికి కష్టమే. కానీ వారు ప్రతి నెలా కొంత మొత్తంగా చెల్లిస్తూ కారును కొనుగోలు చేసే స్థోమత ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా లోన్ మీద కారును తీసుకోవచ్చు.
లోన్ ద్వారా కారు కొనుగోలు చేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
👉లోన్ తీసుకుని కారు కొనేయాలనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒక బ్యాంకు మీకు వెహికల్ లోన్ ఇవ్వాలంటే ముందుగా మీ సంపాదన, సిబిల్ స్కోర్ వంటి వాటిని చూస్తుంది. ఇవన్నీ బేరీజు వేసుకుని మీరు లోన్ తీసుకోవడానికి అర్హులేనా? అర్హులైతే ఎంత వరకు లోన్ మంజూరవుతుంది, అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది.
👉వెహికల్ లోన్ తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించే సమయం (డ్యూరేషన్) ఎంచుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమును ఏమిటంటే? మీరు ఎంచుకున్న సమయం లేదా సంవత్సరాలను బట్టి వడ్డీ అనేది నిర్ణయిస్తారు. డ్యూరేషన్ అనేది వీలైనంత తక్కువ సెలక్ట్ చేసుకుంటే వడ్డీ తగ్గుతుంది.
👉కొన్ని సందర్భాల్లో కొన్ని డీలర్‌షిప్‌లు కొంత కాలానికి 0% ఫైనాన్సింగ్‌తో సహా ప్రమోషనల్ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఇది మీరు తీసుకునే లోన్‌కు సంబందించిన ఖర్చులను కొంత తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
👉లోన్ తీసుకునే వ్యక్తి వడ్డీ రేట్లను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో తొందరపడితే నష్టపోయేది మీరే. కాబట్టి తక్కువ వడ్డీ రేటుకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోకండి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ విషయంలో భారీ వడ్డీలను వసూలు చేసి అమాయక ప్రజలను దోచుకునే అవకాశం ఉంది.
లోన్ తీసుకుని వాహనాలను కొనుగోలు చేయడంలో పెద్దగా లాభాలు కనిపించవు, కానీ ఆదమరిస్తే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
👉రుణ గ్రహీత లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ చార్జీలను తీసుకోకుండా ముందడుగు వేస్తే.. అసలు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
👉వడ్డీ అనేది కూడా చివరి వరకు ఒకేలా ఉండదు. ఇందులో కొన్ని సార్లు పెరుగుదలలు కూడా ఉంటాయి. రేపో రేటు పెరిగితే కొన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వడ్డీలను అమాంతం పెంచేస్తాయి. ఇది రుణ గ్రహీత మీద భారం పడేలా చేస్తాయి.
👉ముందుగానే మీ సంపాదన, ఈఎమ్ఐ వంటి వాటిని లెక్కించుకోవాలి. ఒకసారి ఈఎమ్ఐ మొదలు పెట్టిన తరువాత.. ఇతరత్రా ఖర్చులు తగ్గించుకోవాలి. లేకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుపోవాల్సి ఉంటుంది. నెలవారీ ఖర్చులు కూడా లెక్కించుకోవడం ఉత్తమం. పొరపాటున ఈఎమ్ఐ కట్టడం ఆలస్యమైతే.. కట్టాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది సిబిల్ స్కోర్ మీద కూడా ప్రభావం చూపుతుంది.
10 లక్షల కారును 7 సంవత్సరాల వ్యవధితో లోన్ ద్వారా తీసుకుంటే?
👉ఒక వ్యక్తి రూ. 10 లక్షల కారును కొనాలనుకుంటే.. దానికి కావాల్సిన లోన్‌ను బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుంచి తీసుకుంటారు. డ్యూరేషన్ 7 సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే.. నెలకు సుమారు రూ. 15వేలు కంటే ఎక్కువ ఈఎమ్ఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు లోన్ ఇచ్చే బ్యాంక్ ఫిక్స్ చేసే వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు.. ఒక బ్యాంక్ 8.65 శాతం వడ్డీతో రూ. 10 లక్షలు లోన్ ఇస్తే (7 సంవత్సరాల కాల వ్యవధి) నెలకు రూ. 15912 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు 7 సంవత్సరాల్లో మొత్తం రూ. 13,36,608 చెల్లించాల్సి ఉంటుంది. అంటే తీసుకున్నదానికంటే సుమారు రూ. 3.36 లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
అదే వడ్డీ రేటు 11 శాతం అనుకుంటే (10 లక్షలు 7 సంవత్సరాల డ్యూరేషన్) అప్పుడు నెలకు రూ. 17122 చొప్పున మొత్తం రూ. 14,38,248 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఎంత వడ్డీకి ఎంత చెల్లించాల్సి ఉంటుందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment