బీజేపీ బ్రహ్మాస్త్రం.. కిరణ్‌బేడీ
బేడీపై శాంతి భూషణ్ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కిరణ్ బేడీ అని ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ అన్నారు. కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయడం బీజేపీ మాస్టర్ స్ట్రోక్ అని గురువారం విలేకరులతో అన్నారు. కిరణ్‌బేడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అయితే అన్నా హజారే ఎంతో సంతోషిస్తారని శాంతిభూషణ్ వ్యాఖ్యానించారు.
అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేసిన పోరాట ప్రభావం బేడీపై తీవ్రంగా ఉందని.. ఆమె బీజేపీలో చేరటం ఎన్నికల్లో ఆ పార్టీ ప్రత్యర్థులకు తిరుగులేని దెబ్బ అని అన్నారు. కిరణ్ బేడీ తనకు బాగా తెలుసునని ఆమె ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి నిజాయితీతో కూడిన సర్కారును అందిస్తారని చెప్పారు. అయితే తాను కిరణ్ బేడీని మాత్రమే సమర్థిస్తున్నానని, బీజేపీని కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. కిరణ్ బేడీ ఆప్ తరపున సీఎం అయితే బాగుండేదని చెప్పారు. ఆప్‌లో ఏదీ సక్రమంగా లేదని, వ్యవస్థాపక సిద్ధాంతాల నుంచి ఆ పార్టీ పక్కదారి పట్టిందని ఈ విషయం పై పార్టీ పున:సమీక్ష జరపాలని శాంతిభూషణ్ అభిప్రాయపడ్డారు.
పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార పిపాసి అని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ కన్నా అజయ్ మాకెన్ మెరుగైన సీఎం అభ్యర్థి అని అభిప్రాయపడ్డారు. పార్టీ నేషనల్ కౌన్సిల్ దారితప్పిన కేజ్రీవాల్‌ను పార్టీ కన్వీనర్ పదవి నుంచి తప్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, కిరణ్‌బేడీ శాంతి భూషణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆప్‌లో కలకలం: శాంతి భూషణ్ వ్యాఖ్యలు ఆప్‌లో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యానికి శాంతిభూషణ్ వ్యాఖ్య లు ప్రతిబింబమని కేజ్రీవాల్ తెలిపారు. శాంతి భూషణ్‌కు అన్ని విషయాలు తెలిసినట్టు లేదని తాము తెలియజెప్తామని అన్నారు. శాంతి భూషణ్ కుమారుడు ప్రశాంత్ కూడా తండ్రి మాటలను ఖండించారు.
ఆ మాటల్లో తప్పు లేదు... కాంగ్రెస్, బీజేపీల నుంచి డబ్బులు తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయమని తాను అనటంలో తప్పేమీ లేదని అరవింద్ కేజ్రీవాల్ గురువారం అన్నారు. రాజకీయాల్లో స్వచ్ఛత కోసమే తాను ఆ మాటలన్నానని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్నికల సందర్భంగా పంచి పెట్టేది పూర్తిగా నల్లధనమని, ఆ సొమ్ముల్ని తీసుకుని వాటికి ఓటు వేయవద్దని చెప్పటం లంచాన్ని ప్రోత్సహించినట్లు కాదని ఆయన అన్నారు. కాగా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు ఇచ్చిన ఈసీ.. ఆయన జవాబివ్వటం కోసం మరో రెండు రోజులు గడువిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ మాటలను యునెటైడ్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ సమర్థించారు. కేజ్రీవాల్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని ఈసీకి లేఖ రాశారు.
ఎన్నికల బరిలో 693 మంది
నామినేషన్ల పరిశీలన అనంతరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలిచిన అభ్యర్థు లు 693మంది అని ఎన్నికల సంఘం తెలి పింది. 923 మంది నామినేషన్ వేయగా, 230 నామినేషన్లను తిరస్కరించారు.