పార్టీని నడిపించే సత్తా లేదు | AAP founder Shanti Bhushan questions Arvind Kejriwal, says no internal democracy in party | Sakshi
Sakshi News home page

పార్టీని నడిపించే సత్తా లేదు

Published Wed, Aug 13 2014 10:09 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

AAP founder Shanti Bhushan questions Arvind Kejriwal, says no internal democracy in party

సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ పై మరోమారు విమర్శలు వెల్లువెత్తాయి. స్వపక్ష నేతల నుంచి, ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలకు గురికావడం కొత్తకాకపోయినప్పటికీ ఈసారి ఏకంగా ఆప్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సుప్రీంకోర్టు న్యాయవాది శాంతిభూషణ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కేజ్రీవాల్ నాయక త్వ పటిమను శాంతిభూషణ్ సవాల్ చేశారు. ‘అర్వింద్  కేజ్రీవాల్ తెలివైనవాడు, చురుకైనవాడు, గొప్ప వ్యూహకర్త అయినప్పటికీ పార్టీని నడిపించే సామర్థ్యం ఆయనకు లేదు’ అని శాంతి భూషణ్ అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్‌కు వ్యవస్థాపక నైపుణ్యం లేదని, అందువల్లనే దేశమంతటా పార్టీని విస్తరించలేకపోయారన్నారు. సమయం, సామర్థ్యమున్న మరొకరికి  ఆ బాధ్యతను అప్పగించాలన్నారు.
 
 నేషనల్ కౌన్సిల్ తనను కన్వీనర్‌గా నియమించినందువల్ల పార్టీకి ప్రాతినిధ్యం వహించే ప్రధాన గొంతుక తనదేననేది ఆయన మనోగతమై ఉండొచ్చన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అపరిపక్వతతో కూడినదన్నారు. ఎవరినీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల విషయమై ఒత్తిడి పెంచేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించిన రోజునే శాంతిభూషణ్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్‌పై విమర్శలు చేయడం సంచలనం రేకెత్తించింది. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్న తరుణంలో కేజ్రీవాల్ నాయకత్వ సామర్థ్యాన్ని సవాలుచేస్తూ శాంతిభూషణ్ విమర్శలు చేయడం పార్టీని ఇరుకునపడేసింది.
 
 వ్యక్తిగత అభిప్రాయం
 అది శాంతిభూషణ్ వ్యక్తిగత అభిప్రాయమని, దానిని పార్టీ వేదికపై ప్రస్తావిస్తే బాగుండేదని శాంతిభూషణ్ కుమారుడు, ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ అన్నారు. మరోవైపు పార్టీలో అంతర్గత ప్రజస్వామ్యం లేదనే ఆరోపణలతో అదే పార్టీకిచెందిన మరో నాయకుడు యోగేంద్ర యాదవ్ ఏకీభవించలేదు. ఆప్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని ఆయన అన్నారు.
 
 ఏకీభవిస్తున్నా: షాజియా ఇల్మీ
 శాంతిభూషణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యతిరేకులు ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు. శాంతి భూషణ్  అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానంటూ ఆప్ అధినాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న షాజియా ఇల్మీ పేర్కొన్నారు. కాగా శాంతిభూషణ్ వంటి వ్యక్తి విమర్శిం చినందువల్ల అర్వింద్ కేజ్రీవాల్...పార్టీకి రాజీ నామా చేయాలని మాజీ నేత, మ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే కేజ్రీవాల్ అంత ఆశపోతు రాజకీయనేత  మరొకరు లేరని కాంగ్రెస్ నేత ముఖేష్ శర్మ విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement