‘‘వైజ్ఞానిక వ్యభిచారం’’
జీవన కాలమ్
పురాణాల్లో శక్తి లేకపోతే కాలగర్భంలో కలసిపోతాయి. కానీ వాటికి కొత్త వికారాలను జత చేసి ‘‘వైజ్ఞానిక వ్యభిచారం’ చెయ్యడం ఈనాడు మేధావులనిపించుకునేవారి వ్యసనం. పాపులారిటీకి దొంగ తోవ.
ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శాంతి భూషణ్‌గారు ఉత్తరప్రదేశ్‌లో రోమియోల కార్యకలాపాలను అదుపులోకి తెచ్చే ’వ్యతిరేక ఉద్యమాన్ని’ విమర్శిస్తూ ’’రోమియోకి ఒకరే ప్రియురాలు. మరి శ్రీకృష్ణుడికి వేల మంది ప్రియురాళ్లు. ఈ ఉద్యమాన్ని ’’శ్రీకృష్ణ వ్యతిరేక ఉద్యమం’ అని పిలిచే దమ్ము యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఉందా?’ అన్నారు. 21వ శతాబ్దపు తెలివితేటలు వికటించినప్పుడు వచ్చే వికారమిది. ఈ మధ్య ఈ తెలివితేటలు చాలా మంది ‘అధునిక రచయిత’లలో మరీ వికటిస్తున్నాయి.
ముఖ్యంగా పురాణాలమీదా, దేవుడిమీదా బొత్తిగా నమ్మకం లేని వారిమాట. ఒకానొక సభలో కుచేలుని గురించి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఆయనతో అన్నాడట: ’’ఏమయ్యా, ఎనిమిది మంది భార్యల్ని పెట్టుకుని నేను ఒక్కడినే కన్నాను. పేదరికంలో ఉంటూ అంతమంది పిల్లల్ని కని నీ పెళ్లాన్ని హింసించేవేమయ్యా’’ అని. ప్రేక్షకులు ఈ ’రుచి’కరమైన జోక్‌కి కిసుక్కున నవ్వుకున్నారు. కుచేలుడి వృత్తాంతం ఉద్దేశం అదికాదు. రచనల్లో literary metaphorని అర్ధం చేసుకోలేని ప్రబుద్ధుల కుప్పిగంతులివి.
ఇప్పటి చాలా మంది స్త్రీలకి విష్ణుమూర్తి పాలసముద్రం మీద పాము పడుకుని ఉండగా, లక్ష్మిదేవి కాళ్లుపట్టడం ఎబ్బెట్టుగా, అభ్యంతరంగా కనిపించవచ్చు. మన వేదాల్లో చెప్పారు స్త్రీకి మూడు దశల్లో ముగ్గురి రక్షణ ఉంటుందట. చిన్నతనంలో తండ్రి, పెళ్లాయ్యాక భర్త, వృద్ధాప్యంలో కొడుకు? ఇది ఎప్పటి మాట! ఇవాళ స్త్రీలు రాజ్యాలు ఏలుతున్నారు. ఇందిరాగాంధీ ఆనాడు బంగ్లాదేశ్‌ని విముక్తం చేసి ప్రత్యేక పాలకులకు అప్పగించారు. వాలెంతినా తెరిస్కోవా, చావ్లా రోదసీయానం చేశారు.
దీపా కర్మాకర్, సింధు భారతదేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపారు. అలసిన భార్య కాళ్లు పట్టిన భర్త నా ‘‘మనసున మనసై’’ కార్యక్రమంలో 22 ఏళ్ల క్రితం గర్వంగా చెప్పుకున్నాడు. కాలం మా రింది. విలువలూ మారుతాయి. ఆయా రచనలను, పాత్రలను ఆ నేపథ్యంలోనే బేరీజు వెయ్యాలి. ఆ రచనలమీద విమర్శకి ఈనాటి కొలబద్దలు న్యాయంకాదు– అన్నారు సింగపూర్ తెలుగు సభల్లో ప్రముఖ విమర్శకులు ఆచార్య వెలమల సిమ్మన్నగారు.
ముందు ముందు రాముడు అరణ్యాలలో ఉంటూ ప్రతీరోజూ వరస తప్పకుండా ఏ బ్లేడుతో గెడ్డం గీసుకున్నాడు? ఎలా క్షవరం చేసుకున్నాడు. అలా కడిగిన ముత్యంలా కనిపించడానికి ఎవరు అతని బట్టలు, ఏ సబ్బుతో రోజూ ఉతికి పెట్టారు. సీతమ్మవాడిన శానిటరీ టవల్స్ ఏ కంపెనీవయివుంటాయి? వంటి విలక్షణమయిన వికారాలు రావచ్చు. దేవుళ్లనీ, పురాణాలనీ వెనకేసుకు రావడం నా లక్ష్యం కాదు. ఇలాంటి రచనలు లోగడ చాలా మంది లబ్దప్రతిష్టులు చేశారు. ‘‘ఆ నాటకాలన్నీ బుద్ధిలేక రాశాను’’ అన్నారు చలంగారు. మిగతా వారు అనలేదు. కానీ అనే పక్షానికి ఒరిగారు.
శ్రీకృష్ణుడు, భీష్ముడు, రాముడు – ఇలాంటి పాత్రలు ఒక సంస్కృతీ పరిణామంలో కొన్ని దేశాలలో కేవలం పాత్రలుకావు– ‘వ్యవస్థ’లు (Institutions). దమ్ముంటే మరో ‘శ్రీకృష్ణుడి’ని సృష్టించమనండి. ఆ పాత్రకి ‘‘శాంతి భూషణ్’’ అని పేరు పెట్టమనండి. శ్రీకృష్ణుడు ఈ జాతికి ‘భగవద్గీత’ని ఇచ్చిన ఆచార్యుడు. ఆయన్ని వెక్కిరిస్తే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు. కొన్ని శతాబ్దాల రాపిడిలో నిగ్గు తేలిన పాత్రీకరణ అది. An evolved institution. అవి కొన్ని శతాబ్దాల సంస్కృతి పెంచిన పూలతోటలు. మనసుంటే ఇన్ని నీళ్లు పోయండి. మనసు లేకపోతే మంట పెట్టకండి. విష వృక్షాల్ని పెంచకండి.
ఈ దేశంలో దిగంబర కవుల్లో ఒకాయన ఆశ్రమ స్వీకారం చేసి సన్యాసి అయ్యాడు. విప్లవ గీతాలతో జాతిని ఉత్తేజపరిచిన గాయకుడు గద్దర్ ఆధ్యాత్మికతవేపు మలుపు తిరిగారు. కాళీపట్నం రామారావు మేష్టారు తొంభైవ పడిలో రామాయణం, భాగవతం చదువుకుంటున్నారు. రావిశాస్త్రి గారు చివరిరోజుల్లో సద్గురు శివానందమూర్తిగారిని దర్శించుకుని ‘అయ్యో! వీరిని ముందుగా కలసి ఉంటే బాగుండేదే!’’ అని వాపోయారట. త్రిపురనేని గోపీచంద్, కొడవటిగంటి, జ్యేష్ట, శ్రీపతి వంటివారు తమ ఆలోచనాసరళిని మలుపుతిప్పారు. అది ఆక్షేపణీయం కాదు. విశ్వాసానికి ఆలస్యంగా వేసిన మారాకు. ఇది సామాజిక చైతన్యంలో పరిణామం. వెక్కిరించడం వెకిలితనం. తను నమ్మిందే సత్యమనే అర్థం లేని అహంకారం.
శతాబ్దాల రాపిడిలో ఒక వ్యవస్థలో చిరస్మరణీయమైన – పాత్రలుగా కాక ‘వ్యవస్థ’లయిన పాత్రలను ఆధునికమైన ‘ఎంగిలి’ తెలివితేటలకి ‘రీ ఇంటర్‌ప్రెటేషన్’ అని దొంగపేరు పెట్టిన పెద్దలు నాలిక కొరుక్కున్నారు. పురాణాల్లో శక్తిలేకపోతే కాలగర్భంలో కలసిపోతాయి. కాని వాటికి కొత్త వికారాలను జత చేసి ‘‘వైజ్ఞానిక వ్యభిచారం’ చెయ్యడం ఈనాడు మేధావులనిపించుకునేవారి వ్యసనం. పాపులారిటీకి దొంగ తోవ.
వ్యాసకర్త
గొల్లపూడి మారుతీరావు