gollapudi maruthirao
-
స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి నేటికీ నిరంతర అన్నదానం..
సాక్షి, వేటపాలెం(ప్రకాశం): గొల్లపూడి రాధాకృష్ణయ్య దాతృత్వం.. ముందుచూపు. 88 ఏళ్లగా పేదవిద్యార్ధుల ఆకలి తీరుస్తుంది. స్వాతంత్య్రంరాక పూర్వమే ప్రారంభించిన హాస్టల్ నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కష్టపడి చదువు కొనే విద్యార్ధులకు కులమతాలకు అతీతంగా పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పానికి భవిష్యత్‌లోను డోకాలేని విదంగా శాశ్వత నిధి ఏర్పాటు చేసిన రాధాకృష్ణయ్యకు విద్యార్ధులు నిత్యం జ్యోహార్లు అర్పిస్తుంటారు. వేటపాలెంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రావుసాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి పాఠశాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్ధులు వస్తుండేవారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక భోజనం కోసం ఇబ్బందులు పడుతుండేవారు. దీన్ని గొల్లపూడి రాధాకృష్ణయ్య గమనించారు. పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దుస్తులు వ్యాపారం నిర్వహించే ఈయన మద్రాసులోని షావుకారు పేటలో ఉన్న హిందూ థీయోసాఫికల్ స్కూల్ ప్రధానోపాద్యాయుడు రంగస్వామి అయ్యర్ ప్రేరణతో 1933 సంవత్సరంలో మొదటి సారిగా వేటపాలెంలో బిబిహెచ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బోజనం సౌకర్యం కల్పించారు. మొదటి హాస్టల్ నిర్వహణకు తన వ్యాపారం నుంచి నిధులు సమకూర్చేవారు. కానీ తన అనంతరం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచన ట్రష్టును ఏర్పాటు చేసేలా చేసింది. శాశ్వత భవనం, పర్నిచర్‌తో పాటు మూలనిధిని కూడా ఏర్పాటు చేయడంతో పాటు 88 సంవత్సరాలుగా విద్యార్ధులు కడుపు నిండా బోజనం తింటున్నారు. రాధాకృష్ణయ్య అనంతరం ఆయన దత్తపుత్రుడు గొల్లపూడి సీతారం 1977లో హాస్టల్ నిర్వహణ బాద్యతలను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భోజనం ఎవరికి పెడతారంటే... ప్రతి ఏడాది బండ్ల బాపయ్య శెట్టి కళాశాల్లో అడ్మిషన్లు జరుగుతాయి. కళాశాల్లో చేరిన విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు ఒక పద్యం నేర్పిస్తారు. ఈ పద్యం తప్పుపోకుండా చెప్పిన పేద విద్యార్థులను గుర్తించి వారికి బోజనం కోసం టోకేన్లు అందిస్తారు. ఈ టోకెన్ పొందిన విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు వారు పొందిన టోకెన్లను హాష్టల్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో వేసిరావాల్సి ఉంటుంది. టోకెన్లు ఆదారంగా హాస్టల్లో బోజనం తయారుచేస్తారు. ప్రతి రోజు 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుకోనే 100 నుంచి 150 మంది విద్యార్థులు హాష్టల్లో భోజనం చేస్తుంటారు. బోజనానికి ముందుగా ప్రార్ధన చేయాల్సి ఉంటుంది. -
నాలుగు నమూనాలు
నేను దాదాపు రోజూ టీ. నగర్‌లోని అగస్త్య గుడికి వెళ్లి కూర్చుని వస్తూం టాను. అక్కడ పనిచేసే ఓ ముసలాయన ఉన్నాడు. దాదాపు ఒకే కాషాయ రంగు ధోవతిని కట్టుకుంటాడు. అది మాసిపోయి ఉంటుంది. రోజూ వదల కుండా అదే ఎలా కట్టుకుంటాడు? రాత్రి వేళల్లో ఏదయినా గోచీ కట్టుకుని ఈ ధోవతిని ఉతుక్కుని ఆరవేసుకుంటాడేమో? అది ఏనాడూ తెల్లగా ఉండదు. కానీ ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. తెల్లని జుత్తు. హడావుడిగా నడుస్తూంటాడు. అతను చేసేవి– నాకు తెలిసి– రెండే పనులు. స్వామికి దీపం వెలిగించడానికి గుడ్డ వొత్తిని సిద్ధం చేస్తూ ఉంటాడు. పెద్ద నల్లటి గుడ్డని చిన్న ముక్కలుగా స్వామి ముందు వెలిగించడానికి పీలికలుగా కత్తిరిస్తాడు. ఆ పనివాడితనం చూసి తీరవలసిందే. మరొక పని? సరిగ్గా 11 గంటలకి గుడి రెండు తలుపులూ మూస్తాడు. చేతికి వాచీ లేదు. కానీ అతను తాళం చెవులు పట్టుకు తలుపులు మూయడానికి వెళ్తే– 11 గంటలయిందని అర్థం. మరొకాయన ఉన్నాడు. అందగాడు. వయస్సు 48. పేరు నీరవ్ మోదీ. వజ్రాలు, రత్నాలు అంతర్జాతీయంగా అమ్ముతాడు. గత పదేళ్లలో బ్యాంకుల దగ్గర దొంగ లెక్కలతో 13 వేల కోట్లు అప్పు చేశాడు. ఇందుకు అతని మేనమామ మద్ధతు. చివరికి తన ఆట కట్టుబడే సమయం వచ్చిందని కాస్త ముందు గ్రహించి దేశం ఎల్లలు దాటిపోయాడు. బ్యాంకుల్లో 28 నకిలీ అకౌంట్లు ఉన్నవాడు. బెల్జియంలో పౌరసత్వం ఉన్నవాడు. చట్టం నుండి తప్పించుకోవడానికి– యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాలు తిరిగినవాడు. గత్యంతరం లేక ఇంగ్లండులో చట్టానికి దొరికిపోయి లండన్ జైలులో ఉన్నవాడు. ఇప్పుడు అతని గతి ఏమిటి? మరో వారం రోజుల్లో ఇంగ్లండు చట్టం నిర్ణయిస్తుంది. మరొకాయన ఉన్నాడు. ఆయన జిమ్మీ కార్టర్. 42 సంవత్సరాల కిందట ఈ ప్రపంచంలో అతి ధనవంతమయిన, శక్తివంతమయిన దేశాన్ని– అమెరి కాని పాలించాడు. పదవిలోకి వచ్చిన మరునాడే– అలనాడు వియత్నాం యుద్ధానికి వెళ్లని వీరులకి క్షమాభిక్ష పెట్టాడు. దేశంలో ఎన్నో సంస్కరణలు చేశాడు. అమెరికా చరిత్రలో ఎక్కువ కాలం బతికిన హెర్బర్టు హూవర్ కన్నా ఒక అడుగు ముందు నిలిచాడు. ఉరిశిక్షను వ్యతిరేకించాడు. నోబెల్ బహుమ తిని పుచ్చుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఎల్విస్ ప్రెస్లీ పాటలు వింటూ, పెన్సిల్వేనియాలో 1961లో తాను కట్టుకున్న అతి మామూలు ఇంట్లో మనశ్శాం తితో హాయిగా జీవిస్తున్నాడు. ఆయనకిప్పుడు ఎన్ని సంవత్సరాలు? 94. మరొక్క నమూనా. ఆవిడ పుట్టడమే రాచరికపు పుట్టుక. 93 సంవత్సరాల కిందట పుట్టింది. ఎనిమిదవ ఎడ్వర్డ్ రాజు ఇంగ్లండుని పాలిస్తే ఆమె మామూలు జీవితాన్ని గడిపేది. కానీ 1936లో ఆయన సింప్సన్ అనే ఓ మామూలు వ్యక్తి ప్రేమలో పడి కిరీటాన్ని, సింహాసనాన్నీ వదులుకున్నాడు. తన దేశంలోనూ, ప్రపంచంలోనూ జరిగిన ఎన్నో రాజకీయ, సామాజిక పరిణామాలకి ఆమె ప్రత్యక్ష సాక్షి. సంప్రదాయాన్నీ, రాచరికాన్నీ ప్రేమించి, గౌరవించే వ్యవస్థలో ఆమె సింహాసనం, హోదా యథాతథంగా నిలిచాయి. ఎన్నో ప్రపంచ యుద్ధాలూ, దేశీయ పరిణామాలలో వ్యక్తిగతంగానూ, వ్యవస్థాగతంగానూ తన హోదానీ, అర్హతనీ నిలదొక్కుకుంటూ– ప్రస్తుతం ‘బ్రెక్సిట్’ పరిణామాన్ని ఎదుర్కోబోతున్న ఏకైక రాజకీయ ప్రతీక ఎలిజబెత్ మహారాణీ. నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని. ఒక్కసారి ఆ వ్యవస్థలో ‘సోషలిస్టు’ భావజాలం తొంగిచూస్తే. అయితే ‘పరిణామం’ కంటే ‘చరిత్ర’ ఉన్నతమయినదని వారూ భావిస్తే? ఇంతకూ ఆమె స్థిరత్వానికి కారణం– ఇంగ్లిష్‌లోనే చెప్పాలి– వ్యవస్థ dignity, జాతి సంప్రదాయ నిబద్ధత. ఒక వ్యక్తి జీవనంలో ఆనందం, ఆరోగ్యం, అభిరుచి, అభిజాత్యం– ఇన్నిటి పాత్ర ఉంది. వీటన్నిటినీ జయించే మరొక ముఖ్యమైన లక్షణం మరొకటి ఉంది. ఇది వ్యక్తిత్వ వికాసానికి మూలస్తంభం. స్వామి ముందు వెలిగించే దీపపు ఒత్తుల్ని సిద్ధం చేస్తూ సమాజంలో తన ఉనికికే అర్థం కాంక్షించని ఓ మూగ జీవనానికీ, తన ఉనికిని, అస్తిత్వాన్నీ మార్చుకుని తనదికాని కోట్ల ధనాన్ని అవినీతితో అనుభవించాలన్న లక్ష్యానికీ, ఈ ప్రపంచాన్ని శాసించగల అధికారాన్ని చేతి వేటు దూరంలో నిలిపి– ఇప్పటికీ ‘మనశ్శాంతి’కి పట్టం కట్టిన ఓ సంస్కారికీ, తన పుట్టుకకీ, తన జీవనానికీ గంభీరమయిన వంతెనను నిర్మించుకుని– ఆ జాతికి గర్వకారణంగా జీవించే– ‘వ్యవస్థ’ ప్రాతినిధ్యానికీ ఎంత దూరం. అయితే వ్యక్తి జీవనంలో– వ్యక్తిత్వ నిర్ధారణలో వీటన్నిటి వెనుకా ఓ సామాన్య లక్షణం ఉంది. దాని పేరు– తృప్తి. అది కూడా కాదు. తృప్తితో జీవిస్తున్న గర్వం. అది కూడా కాదు. గర్వం పట్ల అవగాహన. అది కూడా కాదు. అవగాహనను స్వభావం చేసుకున్న అలవాటు. గొల్లపూడి మారుతీరావు -
అధికారం–అపశ్రుతులు
నేను అందరిలాగే పత్రిక లలో రాజకీయ పరిణా మాలు తెలుసుకుని స్పందించే ఓటర్ని. ఏ రాజ కీయ పార్టీకీ చెందినవాడినీ కాను. ఆ కారణానికే కొన్ని పరిణామాలు వింతగా, విడ్డూరంగా, వికృతంగా, విపరీతంగా కనిపిస్తాయి. పార్టీలో నాయకత్వం పట్ల అందరికీ అన్నివి ధాలా విధేయత ఉండాలి. ఇది అందరు రాజకీయ నాయకులు ఒప్పుకునే, గర్వంగా చెప్పుకునే సద్గు ణం. లోగడ కనీసం అయిదారు సందర్భాలలో మెజా రిటీ సాధించిన కాంగ్రెస్ అతిగర్వంగా ‘మేం అధి ష్టాన వర్గం మాటని అక్షరాలా పాటిస్తామ’ని చెప్ప డం మనకి తెలుసు. నిజానికి వారేం చెప్తారో ముందు మనకే తెలుసు. కానీ తీరా నాయకుడి ఎన్నిక జరిగాక చాపకింద నీరులాగ మెల్లగా తమ తమ అసంతృప్తు లను అనుచరుల ద్వారానో– ఇంకా బరితెగిస్తే తామో బయటపడి చెప్పడం మనం విన్నాం. నిజా నికి కాంగ్రెసులోంచి విడిపోయి మరో పార్టీగా అవతరించిన అన్ని పార్టీల మూల కథ ఇదే. అలనాటి దేవరాజ్ ఉర్స్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, శరద్‌యాదవ్, సంగ్మా ప్రభృతుల కథలన్నీ ఇవే. అయితే ఈ నాయ కులు ఉన్నతులు. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు. కాగా–ముఖ్యమైన విషయం– అప్పటి అధిష్టాన వర్గం గురుతరమైనది. కాగా, ఇప్పటి నాయకులు మరుగుజ్జులు. అంత వ్యక్తిత్వాలున్న నాయకులు లేరు. ఉదాహరణకు అలనాడు ఆనంద శర్మ, గులాంనబీ ఆజాద్ పేర్లు చిన్నవి. రెండో పేరు చెప్తే అలనాడు పాలకవర్గానికి చెందిన ఒకాయన చర్రుమన్న సందర్భం నాకు తెలుసు. ఏతావాతా ఇవాళ ముఖ్యమంత్రి పదవికి ఎన్ని కైన నాయకులలో ఒకాయన మీద 1984 మారణ కాండ ‘మచ్చ’ ఉంది. మరొకాయన ‘నీతులు మాట్లాడే’ పార్టీ మీటింగు ముందు వరసలో కనిపిం చారు. వీరంతా అద్భుతమైన కాఫీ డికాషన్ కింద మిగిలిన ‘మడ్డి’ లాంటి వారు.ఈ మధ్య కాంగ్రెస్ పదవిలోకి వచ్చి చాలా రోజు లయింది. అదిన్నీ చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఎదుటి పార్టీ లోపంవల్ల మిగిలిన చచ్చు మెజారిటీ. వెంటనే ఈ నాయకుల భాషణ విన్నాం. ‘మా అధి ష్టానం ఏం చెప్తే అది పాటిస్తాం’ అంటూ. అధిష్టానం ఏం చెప్పాలో తాము చెప్పడానికి ఢిల్లీ పరిగెత్తిన సంఘటనలు మనం చూస్తున్నాం. తీరా అధిష్టానం– రాజస్తాన్లోలాగ సీనియర్ నాయకుని పదవిలో నిలి పితే ఛోటా నాయకుని వర్గీయులు ‘కాంగ్రెస్‌ని నాశ నం చేస్తాం’ అని టీవీ కెమెరాల ముందు బోరవిరు చుకోవడం మనం చూశాం. సరే. మధ్యప్రదేశ్ నాయ కుని మీద 1984 ‘పొడ’ ఉందని విమర్శలు లేచాయి. కర్ణాటకలో చచ్చీ చెడీ పదవిలోకి వచ్చిన ప్రభు త్వంలో అధిష్టానానికి ఎదురు తిరిగిన సభ్యులు, ముష్టియుద్ధాలు ఇప్పుడు టీవీల్లో చూస్తున్నాం. వారు అధికార అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు. ఇక అటువేపు చూద్దాం. మనం ఎప్పుడూ ఆనందీ బెన్ పేరు వినలేదు. విజయ్ రూపానీ పేరు వినలేదు. దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెలీదు. ఆ మాటకి వస్తే నితిన్ గడ్కరీ పేరు వినలేదు. ఇవాల్టి స్పీకర్ సుమిత్రా మహాజన్ గారి పేరు వినలేదు. కానీ వీరి ఎంపిక జరిగాక ఎవరూ టీవీల ముందు కాంగ్రెస్‌లో లాగ సన్నాయి నొక్కులతో విరగబడలేదేం? అలాగే పదవిలో ఉన్న ముఖ్యమంత్రి (ఆనందీబెన్) ‘నాకు వయస్సు మీద పడింది. పదవిలో ఉండను’ అని తప్పుకోవడం వినలేదు. మనకు హైదరాబాద్ రాజ్ భవన్లో శృంగార కార్యకలాపాలు వెలగబెట్టిన ముసిలి గుజ్జు ఎన్డీ తివారీలే తెలుసు. పార్టీ పదవి లోకి వచ్చాక ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషికి పదవులు రాకపోవడం తెలీదు. అడ్వాణీని రాష్ట్రపతిని చేయడం తెలీదు. ఏమైంది? అధికారానికి బేషరతయిన, అకల్మషమయిన భక్తి అయినా ఉండాలి. శక్తి అయినా ఉండాలి. ఉదా హరణలు బోలెడు: జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ. మొదటి వ్యక్తిపట్ల భక్తి, రెండవ వ్యక్తిది శక్తి. ఎమ్.జీ.ఆర్, ఎన్.టీ.ఆర్ నికార్సయిన మెజారిటీ. అందుకనే మహిళలకు ఆస్తిలో వాటా, గ్రామాలలో అధికారాల సరళతరం, మద్యపాన నిషేధం వంటి పనులు నల్లేరుమీద బండిలాగ చేయగలిగారు. అధికారంలో ఆత్మవంచన, అవకాశవాదం, స్వార్థం, పరిస్థితులకు పబ్బం గడుపుకునే స్వభావం– ఆ అధికారాన్ని గబ్బు పట్టిస్తాయి. ఉదాహరణ–10 జనపథ్ ఒక్కటి చాలు. అలనాడు శ్రీరాముడిది ప్రజల భక్తి. రావణుడిది శక్తి. అయినా రాముడి పాలనలో రజకుడు ఉన్నాడు. లంకలో రజకుడు నోరెత్తలేడు. అవిధేయత పునాదులు పెకలించలేనంత బలంగా, లోతులకు పాతుకున్నప్పుడు– అధికారా నికి తప్పనిసరిగా ‘శక్తి’ అవసరం. ఇది సమకాలీన వ్యవస్థకి అవసరమైన ఆయుధం. ఇప్పటి వ్యవస్థలో దీని పేరు ‘మెజారిటీ’. అధికారానికి పట్టిన ‘గబ్బు’ని అచిరకాలంలోనే మనం చూశాం. 70 ఏళ్ల వ్యవస్థలో ప్రజాస్వామ్యం కంపు కొడు తోందని ఆనాడే గుర్తించిన గాంధీగారు కాంగ్రెస్ పార్టీని ఆనాడే అటకెక్కించమన్నారు. ఎక్కించకపోతే ఏమవుతుంది? ముందు రోజులు చెప్తాయి. గొల్లపూడి మారుతీరావు -
ఉల్లిపాయ–ఉక్కు మనిషి
ఉల్లిపాయకీ ఉక్కుమనిషికీ దగ్గర సంబంధం ఉన్నదని చెప్పడం తాటిచెట్టుకీ తాత పిల కకీ ముడిపెట్టడం అని చాలామందికి అనిపించవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ఉల్లిపాయని చిన్నచూపు చూడటానికి వీలు లేదని అనుభవజ్ఞులకు ఈపాటికే అర్ధమయివుంటుంది. నిజానికి ఉల్లిపాయని ‘రాజకీయ’ ఆయు ధంగా మనం గుర్తించాలి. 1998లో ఉల్లిపాయ బిజేపీ ప్రభుత్వాన్ని అల్లల్లాడించింది. ఈ సందర్భంగా రెండు జోకులు గుర్తుచేసుకోవాలి. ఆ రోజుల్లో ఢిల్లీలో ఉల్లిపాయ ధర కిలో 60 రూపాయలు కాగా, ఒక వ్యాపారి ఒక కిలో ఉల్లిపాయ కొన్నవారికి రెండు టీ–షర్టులు ఉచితమని ప్రకటించాడట! గ్రేటర్ కైలాష్‌లో దొంగలు ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చారు. 500 రూపాయలు దోచుకుని బొత్తిగా ఇంట్లో ఏమి విలువైన వస్తువులు ఉంచనందుకు యజమానిని హింసించబోయి–5 కిలోల ఉల్లిపాయలు చూశారట. తృప్తిపడి ఉల్లిపాయ సంచీతో వారు నిష్క్రమించారట! అలనాడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు తమ రాష్ట్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించడానికి నిర్ణయించారు. ప్రపంచంలోకెల్లా ఎల్తైన ఈ విగ్రహాన్ని ప్రధానిగా మొన్న ఆవిష్కరిం చారు. కేవలం 33 నెలలలో నిర్మితమైన ఈ విగ్రహం 2,989 కోట్ల ఖర్చుతో నిర్మితమైంది. ఈ స్ఫూర్తితోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మొన్న సరయు నదీతీరాన 151 మీటర్ల ఎత్తున శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మింపజేయనున్నట్టు ప్రకటించారు. ఇంతకూ ఉల్లిపాయకీ పటేల్గారికీ ఏం సంబంధం? పటేల్‌గారు ‘ఐరన్ మాన్’ మాత్రమే కాక ‘ఆనియన్ మాన్’ అని ఒకానొక పత్రికలో పేర్కొన్నారు. రెజినాల్డ్ రేనాల్డ్స్ అనే గాంధీజీ అనుయాయుడు సబర్మతి ఆశ్రమంలో తన అనుభవాల గురించి ఒక పుస్తకాన్ని (టు లివ్ ఇన్ మాన్‌కైండ్) రాశారు. ఒకసారి ఎవరో ఆశ్రమానికి కూరగాయల సంభారాన్ని బహుకరించారట. అందులో ఉల్లిపాయలున్నాయి. ఉల్లిపాయలు బ్రహ్మచారులకు నిషిద్ధం–అవి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి కనుక . ఆశ్రమంలో ఉన్న మరో బ్రిటిష్ అనుయాయురాలు మిరాబెన్–అందరికన్నా చాదస్తురాలు. ఈ ఉల్లిపాయలని వెంటనే నిషేధించాలని అన్నారట. కాని పటేల్ గారు ‘‘ఉండనీయండి. నేనూ రెజినాల్డ్ ఈ ఉల్లిపాయల్ని తింటాం’’ అన్నారట. వీరిద్దరూ నరభక్షణ చేస్తున్నట్టు అందరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా వీరు భుజించారట. తరు వాత తరువాత గాంధీజీ ఉల్లిపాయ ఉపకారాన్ని గ్రహిం చారు. ముఖ్యంగా వెల్లుల్లిపాయ చేసే మేలుని ఆయన గుర్తించారు. కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలకు అనుగుణంగా పటేల్ తన కర్తవ్యాన్ని మలుచుకోవడానికి ఈ సందర్భం ఒక గుర్తుగా నిలుస్తుంది. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సమైక్య భారత స్థాపనకు–ఆస్థానాల విలీనానికి అప్పటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యమించిన ఉక్కుమనిషి కర్తవ్య మూలాలు ఇలాంటి సందర్భాలలో కనిపిస్తాయి. ఒకే ఒక సంస్థాన విలీనానికి నెహ్రూగారు తలదూర్చారు–కశ్మీర్. ఆ సమస్య ఇప్పటికీ రావణకాష్టంలాగా రాజుకుం టూనే ఉంది. మరొక సంస్థానంలో నెహ్రూ కలగజేసుకోబోయారు–హైదరాబాదు. అదృష్టవశాత్తూ పటేల్ ఆయన్ని దృష్టి మళ్లించి పోలీసు యాక్షన్ జరిపించారు. లేకపోతే దక్షిణాన మరో కాష్టం ఈనాటికీ రాజు కుంటూ ఉండేది. మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి వచ్చి–అక్కడ ఆచరించిన సత్యాగ్రహాన్ని మన దేశంలో అమలు జరపాలనుకున్నప్పుడు–1918లో ఖేడాలో–గ్రామీణులని మేల్కొల్పడానికి పటేల్ ఉల్లిపాయను గాంధీగారికి తీసుకువచ్చారట. ఆ ప్రాంతంలో ఉల్లి రైతులకు జీవనాధారం. అయితే పంటలు పండకపోయినా రైతులు శిస్తుకట్టాల్సిందేనని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుబట్టారు. అప్పటి స్థానిక కలెక్టరు ఫెడిరిక్ ప్రాట్ బ్రిటిష్ ఆదాయానికి ఆటపట్టు ఉల్లి పంటల భూముల శిస్తు అని గాంధీకి హెచ్చరించి చెప్పారట. అప్పుడే పాలకవర్గాన్ని గద్దె దించేది ‘ఉల్లిపాయ’ అని గాంధీజీ గ్రహించారు. దండి యాత్రలో కూడా గాంధీజీ ‘బ్రిటిష్ వారి జులుంకి మనం తలవొంచం. అవసరమైతే ఉల్లిపాయలు కారణంగా వెయ్యిసార్లు జైలుకి వెళ్తాం’’ అన్నారట. ఈవిధంగా పటేల్ గారి ప్రమేయంతో, స్ఫూర్తితో–సామాన్య రైతు జీవనాన్ని, తద్వారా ప్రజానీకానికంతటికీ వినియోగపడే ఉల్లిపాయ ‘జాతీయో ద్యమం’లో భాగమైనది అంటే పరోక్షంగా ‘ఉప్పు’ సత్యాగ్రహంలో ‘ఉల్లి’ సత్యాగ్రహం భాగమన్నమాట. నాకనిపిస్తుంది–ఇదంతా వింటున్నప్పుడు–కొద్దిలో తప్పిపోయింది కానీ–అది ప్రపంచ ప్రఖ్యాత ‘‘ఉప్పు–ఉల్లి సత్యాగ్రహం’’ అయ్యేదని. ఆవిధంగా 1998లో ఉల్లిపాయకీ అప్పటి ప్రభుత్వానికీ, 1918లో ఉల్లిపాయకీ బ్రిటిష్ ప్రభుత్వానికీ సంబంధించిన ‘చరిత్ర’ ఉన్నది. మొదటి చరిత్రకి మూలపురుషుడు–సామాన్య ప్రజానీకం అవసరాలను తీర్చి, ప్రతీక్షణం వారి జీవికకు ఆసరాగా నిలిచే ప్రాణ ధాతువుని పట్టుకున్న ఘనుడు–నేడు ప్రపంచంలో అందరికన్నా ఎత్తుగా నిలిచిన ఉక్కుమనిషి–సర్దార్ పటేల్. గొల్లపూడి మారుతీరావు -
కొత్త ఉపద్రవం
జీవన కాలమ్ బతికున్నవారు బుద్ధిగా, బాధ్యతగా ‘చావడం’ ఎంత ముఖ్యమో, ఎంత తప్పనిసరో ప్రచారం చేసే ఉద్యమాలు రావచ్చు. స్వచ్ఛందంగా చచ్చిపోయేవారికి ప్రభుత్వాలు తాయిలాలు ప్రకటించవచ్చు. దావోస్‌లో జరుగుతున్న సర్వదేశ సమ్మేళనంలో సత్య నాదెళ్ల ప్రసంగిస్తూ కొద్దికాలంలో మానవుడు 140 సంవత్సరాలు జీవించబోతున్నాడని సోదాహరణంగా వక్కాణించారు. ఇది మానవాళి మీద పెద్ద గొడ్డలిపెట్టు. మా చిన్నతనంలో ఏదైనా అనర్థం జరిగినప్పుడు మా నాయనమ్మ అంటూండేది: ‘ఈ ఘోరాలు చూడటానికా నేను ఇంకా బతికి ఉన్నాను. నన్ను త్వరగా తీసుకుపో దేవుడా!’ అని. ఇది తేలికగా 70 సంవత్సరాల కిందటిమాట. ఇప్పటి మనుషులు 140 ఏళ్లు బతకబోతున్నారు. రోజుకి లక్షల గాలన్ల చమురును తవ్వుకుంటున్న నేపథ్యంలో భూమిలో చమురు నిల్వలు మరో 22 సంవత్సరాలలో పూర్తిగా నిండుకుంటున్నాయి. మనం ఇప్పుడే తాగే మంచినీళ్లని కొనుక్కుంటున్నాం. అచిరకాలంలో పీల్చే గాలిని కొనుక్కోవలసిన రోజులు వస్తాయని ఒక శాస్త్ర జ్ఞుడు అన్నాడు. 70 సంవత్సరాల తర్వాత ఇప్పటిలాగ విరివిగా వాడుకోడానికి నీరు దొరకదు. స్నానానికి బదులు రసాయనాలతో ఒళ్లు శుభ్రం చేసుకునే ప్రత్యా మ్నాయ ధోరణులు వస్తాయన్నారు. ధృవాలలో మంచు కరిగిపోతోంది. ఈ సీజనులోనే ఒక హరియాణా రాష్ట్ర మంత మంచు శకలం కరిగి సముద్రంలోకి దూసుకు వచ్చిందట. ఇది ఒక పార్శ్వం. ఈ మధ్య అమెరికాలో ఉద్యోగం చెయ్యని పిల్లలు లేని కుటుంబాలు లేవు. లక్షల ఆస్తి ఉన్న, పోస్టు మాస్ట ర్గా రిటైరయి పెన్షన్ తీసుకుంటున్న ఒకాయన తమ కూతురు అమెరికాలో 40 ఏళ్లుగా ఉంటూ చుట్టపు చూపుగా వచ్చిపోతూంటే– ఆయన వృద్ధాశ్రమంలో కాలం చేశారు. ఒక దశలో సంపాదనకి విలువ పోయి, జీవితం యాంత్రికమై, తమ పిల్లలు– బంధువులకీ, భాషకీ, భారతీయ జీవన విధానానికీ దూరమై బతుకు తూంటే– నిస్సహాయంగా ఆత్మవంచన చేసుకుంటు న్నారు. ఇది మరొక పార్శ్వం. ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పులనే ఖాతరు చేయ కుండా–ఓ సినీమాలో లేని అభ్యంతరాలని, లేవని నిరూపించినా–మారణ హోమాన్ని సృష్టించే గూండాలు, వారి అకృత్యాలకు భయపడి.. సుప్రీంకోర్టు అదిలించినా చేష్టలుడిగిన రాష్ట్ర ప్రభుత్వాలు, పరీక్షలు వాయిదా కోసం హత్య అవసరమని భావించే హింసాత్మకమైన ‘ఆలోచన’లకి పసితనంలోనే పునాదులు పడుతున్న విష సంస్కృతి, చదువుకోలేదని గదమాయించిన టీచర్ని కాల్చి చంపిన విద్యార్థి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతీ దశ లోనూ కోట్లు నొల్లుకునే ‘నీచపు’ ఆఫీసర్ల ఉద్యోగుల వీర విహారం– ఇది మరొక పార్శ్వం. సరే. 140 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ప్రతీ పౌరుడికీ కనీసం రెండు హత్యలు–సజావయిన కారణాలకు చేసుకునే రాయితీని ప్రభుత్వం కలిగిం చవచ్చు. లల్లూ వంటి మహా నాయకుల ఆరో తరం మునిమనుమడు–ప్రతీ మనిషీ తన జీవితంలో 570 టన్నుల గడ్డి తినే అనుమతిని కల్పించవచ్చు. ప్రతి పౌరుడూ విధిగా మోసుకుతిరిగే ఆక్సిజన్ సిలిండర్ల దొంగ తనం చేసి అమ్ముకునే వ్యాపారాలు దావూద్ ఇబ్రహీం ఏడో తరం వారసుడు ప్రారంభించవచ్చు. ఏ భక్తుడైనా తన జీవితకాలంలో తనకు నచ్చిన మూడు క్షేత్రాలలో క్షుద్ర పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు–సాలీనా కనీసం 120 కోట్లు భక్షించవచ్చునని అనుమతిని ఇవ్వవచ్చు. తన ఆరో తరం ముని మనుమడు చదువుతో హింసి స్తున్న బడిపంతుల్ని క్లాసులో బాంబు పెట్టాలనుకుంటు న్నట్టు 120 ఏళ్ల ముత్తాతకి తెలిస్తే–రెండు హత్యలకు రాయితీ ఉన్న ఈ మనుమడు–తాతని పొడిచి చంపవచ్చు. గూండాలు నాయకులవొచ్చు. హంతకులు ప్రవచనాలు చెప్పవచ్చు. సెక్స్ కథలు పాఠ్య పుస్తకాలలోనే చోటు చేసు కోవచ్చు. సాయంకాలం పార్కుల్లో కనిపించే ముసిలి గుంపుల లక్ష్యం ‘ఆరోగ్యం’ కాదు– ఇంట్లో వారి చాద స్తాన్ని భరించలేని పిల్లలు, కోడళ్లూ కనీసం ఆ రెండు గంటలు విశ్రాంతికి వాళ్లకి కార్లిచ్చి తగలెయ్యడం. మరి 80, 100, 120, 130 సంవత్సరాల ముసిలి వొగ్గుల మాటే మిటి? వృద్ధాశ్రమాలు మాత్రమే కాక, ముసిలివారి ‘చాదస్త’ విముక్తి ఆశ్రయాలు కల్పిస్తారేమో! ఇర్విన్ షా అనే ఆయన ‘బరీ ది డెడ్’ (Bury the Dead) అనే నాటిక రాశాడు. చచ్చిపోయినవాళ్లు చచ్చి నట్టు సమాధుల్లో ఉండక లేచి నిలబడ్డారు. ఎంత పెద్ద విపత్తు? ఎవరి బంధువులు వారి దగ్గరికి వచ్చి ‘చచ్చి నవారు చచ్చినట్టు’ ఉండటం ఎంత అవసరమో నచ్చ చెప్తారు. ఈ ఇబ్బంది ఇప్పుడు బతికున్నవారికి రాబో తోంది. బతికున్నవారు బుద్ధిగా, బాధ్యతగా ‘చావడం’ ఎంత ముఖ్యమో, ఎంత తప్పనిసరో ప్రచారం చేసే ఉద్య మాలు రావచ్చు. స్వచ్ఛందంగా చచ్చిపోయేవారికి ప్రభు త్వాలు తాయిలాలు ప్రకటించవచ్చు. ఇందులో మళ్లీ దొంగదారిన అనుమతులు తెచ్చుకుని బతికేస్తున్నవారూ, లంచాలిచ్చి బతికేసేవారు... ‘అయ్యో దేవుడా! నన్ను ఎప్పుడు తీసుకు పోతావు!’ అని మా నాయనమ్మలాగా ప్రాధేయపడే రోజులు ముందున్నాయి. - గొల్లపూడి మారుతీరావు -
శ్రామిక విప్లవం
జీవన కాలమ్ ‘ఉదయం’ పత్రిక నడిపే రోజుల్లో రోజంతా మద్రాసులో పనిచేసి సాయంకాలం విమానంలో– ప్రతీరోజూ విధిగా హైదరాబాదు ప్రయాణం చేసేవారు. ఏమిటీ కమిట్మెంట్. ఎందుకీ కమిట్మెంట్ అంటే.. పని ఆయనకు ప్రాణవాయువు. నా 54 సంవత్సరాల సినీ జీవితంలో దాసరి లాగా శ్రమించిన, ఆ శ్రమని సత్ఫలితాలుగా మలిచిన వ్యక్తిని చూడలేదు. ఆయన అనూహ్యమైన శ్రామిక విప్లవం అంటాను నేను. ఒక దశలో ఇటు అక్కినేని, అటు ఎన్టీఆర్ వారి షూటింగుకి వీజీపీ కాటేజీలలో ఉండటం నాకు తెలుసు. అక్కినేని షూటింగు అయ్యాక, ఎన్టీఆర్‌కి పిలుపు వెళ్లేది. ఇద్దరి చిత్రాలకూ సమగ్రమైన న్యాయం చేసి ఇద్దరి అభిమానులనూ అలరించిన ఘనత దాసరిగారిది. జబుల్లా రోడ్లో ఎన్టీఆర్ ఇంటికి ఎదురుగా దాసరి ఇల్లు. ఎప్పుడూ పెళ్లివారిల్లులాగా సందడిగా ఉండేది. రాత్రి అయితే మరీనూ. దాదాపు 40 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసేవారు. అందరి చేతుల్లోనూ టేప్ రికార్డర్లు. ఎందుకు? దాసరిగారు పిలిచినప్పుడు పరిగెత్తుకువెళ్తే –డైలాగులు– మాట్లాడేవారు. ఎవరి సినిమా? ఏ సీను? ఎవరు పాత్రలు? కథ ఏమిటి? అన్నీ దాసరిగారి మస్తిష్కంలో ఉండేవి. వీరుకాక మేకప్మాన్లు, చిన్న చిన్న నటీనటులు, కాస్ట్యూమ్స్ వారు– అందరికీ మించి నిర్మాతలు. అదొక సర్కస్. ఈ పద్మవ్యూహంలోకి ఏ రాత్రికో నాలాంటివారిని తీసుకెళ్లేవారు. ఎందుకు? కథ చెప్పడానికి. నేను ఆయనతో అనేవాడిని: ‘‘బయట సమూహాన్ని, మనుషుల్నీ చూస్తూ, మీతో ఇలా మాట్లాడటం నేరం చేసినట్టు అనిపిస్తోంద’’ని. ఆయన నిర్మలంగా నవ్వేవారు. ఇన్ని ఒత్తిడుల మధ్య ఎంతో తీరుబాటుగా, పవిత్రంగా, హాయిగా కనిపించేవారు. ఓసారి ఆయనకి కథ చెప్పడానికి– కేవలం కథ చెప్పడానికి– ఆయనతో – అసిస్టెంట్ల బృందంతో తిరువనంతపురం రైలులో వెళ్లాను. ఆయన ఎదుటి బెర్తుపై పడుకున్నారు. ఓ రాత్రికి తెలివొచ్చినట్టుంది. ఎవరో అసిస్టెంటుని పిలి చారు. టేప్ రికార్డర్ ఆయన నోటి దగ్గరకు వచ్చింది. డైలాగులు చెప్పారు. అంతే. మళ్లీ నిద్రపోయారు. ఇదేమిటి? చర్చలేదా? నేను ఆయన చిత్రాలు ఎన్నింటిలోనో ప్రధాన పాత్రలు చేశాను. ఆయన టేపు రికార్డర్లో ‘చెప్పిన’ డైలాగులకు పొల్లుకూడా మారదు! అదీ ఆయన ఏకాగ్రత. అంతకుమించి– పది చిత్రాల అరలు మెదడులో వేర్వేరుగా, గొప్పగా, భద్రంగా నిక్షిప్తమయి ఉంటాయి. ఎవరీ అసిస్టెంట్ డైరెక్టర్లు? రాబోయే కాలంలో కనీసం పాతిక సంవత్సరాలు తెలుగు చలన చిత్రసీమని ఏలిన ఉద్దండులు– కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రాజాచంద్ర, రేలంగి నరసింహారావు, ఎస్.ఎస్. రవి చంద్ర, దుర్గా నాగేశ్వరరావు, ధవళ సత్యం, నందం హరి శ్చంద్రరావు, డిమిట్ రావు, రమణబాబు, అనిల్, ఎమ్మనేని ప్రభాకర్, రాధాకృష్ణ– ఇలాగ. వీరందరితోనూ నేను పనిచేశాను. ఒక్కొక్కరూ–ఒక్కొక్క శిఖరం. ‘ఉదయం’ పత్రిక నడిపే రోజుల్లో రోజంతా మద్రాస్‌లో పనిచేసి సాయంకాలం విమానంలో–ప్రతీరోజూ విధిగా హైదరాబాద్ ప్రయాణం చేసేవారు. ఎన్నోసార్లు మేమిద్దరం కలిశాం. ఏమిటీ కమిట్మెంట్. అంతకుమించి–ఎందుకీ కమిట్మెంట్? సమాధానం నాకు తెలుసు–పని ఆయనకు ప్రాణవాయువు. ఒత్తిడి ఆయన మెదడు రిలాక్స్ కావడానికి సాధన. ఈ ఒత్తిళ్లలోనే ఒక సర్దార్ పాపారాయుడు, ఒక ప్రేమాభిషేకం, ఒక రాములమ్మ–అనూహ్యం! చిన్న చిన్న కళాకారుల్ని నెత్తికి ఎత్తుకునేవారు. చిన్న చిన్న టెక్నీషియన్లకు ఊపిరి పోసేవారు. ఆ రోజుల్లో బడ్జెట్ సినిమాలకు మార్గాన్ని సుగమం చేసింది ఆయనే. మోహన్‌బాబు, అన్నపూర్ణ, నారాయణమూర్తి వంటి నటులు తమదైన ఫోకస్‌ని సాధించింది ఆ కార్ఖానాలోనే. దాసరితో నా బంధుత్వం ఆయన హైస్కూలు రోజుల్నుంచి. నా షష్టిపూర్తి సంచికకి ఆయన రాసిన వ్యాసంలో మొదటి పేరా.. ‘‘ఆయన్ని చూడ్డానికంటే ముందు నేను ఆయన్ని చదివాను. ఆయన సృష్టించిన పాత్రని నా ఒంటికి తగిలించుకున్నాను. ఉత్తమ నటుడిగా బహుమతిని పొందాను.. ఆ నాటిక ‘అనంతం’. ఆయన అరుదైన మిత్రుడు, అమూల్యమైన హితుడు’’. వ్యక్తిగా ఏ చిన్న వ్యక్తిలో, నిర్మాతలో, దర్శకునిలో ‘మెరుపు’ని చూసినా నెత్తికెత్తుకుని– పదిమందికి తెలిపే పెద్ద దిక్కు. పరిశ్రమలో ఏ సమస్యకయినా– ముందు నిలిచే మొండి ధైర్యం. ఇక్కడినుంచి సరాసరి ఢిల్లీ చేరి కేంద్రమంత్రిగా పదవి నెరపుకు రావటం మరో పెద్ద అంగ. ఆఖరుసారి దర్శకమిత్రులు క్రిష్ పెళ్లిలో అక్షింతలు వేసి లిఫ్టు ఎక్కాను. దాసరీ ఎక్కారు. లిఫ్టు కిందకి దిగే లోపున ఆయన తృప్తిగా చెప్పిన విషయం– ‘‘ఈమధ్య ఎనిమిది కిలోల బరువు తగ్గాను మారుతీరావుగారూ’’ అన్నారు. నవ్వాను. ‘‘తగ్గాలి. మీ కోసం కాదు. మా కోసం’’ అన్నాను. ఇద్దరం విడిపోయాం. దాసరి ‘శ్రమ’లో విజయాన్ని ఏరుకున్న పధికుడు. ప్రతి విజయానికీ హృదయాన్ని విశాలం చేసుకున్న ‘మనిషి’. చాలామందికి గురువు, మార్గదర్శి. మహా దర్శకుడు. కానీ.. కానీ.. అందరికీ–నడిచే ఉద్యమం. ఒక తరం సినీ ప్రపంచాన్ని మిరుమిట్లు గొలిపిన ఆకాశం. గొల్లపూడి మారుతీరావు -
‘‘వైజ్ఞానిక వ్యభిచారం’’
జీవన కాలమ్ పురాణాల్లో శక్తి లేకపోతే కాలగర్భంలో కలసిపోతాయి. కానీ వాటికి కొత్త వికారాలను జత చేసి ‘‘వైజ్ఞానిక వ్యభిచారం’ చెయ్యడం ఈనాడు మేధావులనిపించుకునేవారి వ్యసనం. పాపులారిటీకి దొంగ తోవ. ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శాంతి భూషణ్గారు ఉత్తరప్రదేశ్‌లో రోమియోల కార్యకలాపాలను అదుపులోకి తెచ్చే ’వ్యతిరేక ఉద్యమాన్ని’ విమర్శిస్తూ ’’రోమియోకి ఒకరే ప్రియురాలు. మరి శ్రీకృష్ణుడికి వేల మంది ప్రియురాళ్లు. ఈ ఉద్యమాన్ని ’’శ్రీకృష్ణ వ్యతిరేక ఉద్యమం’ అని పిలిచే దమ్ము యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఉందా?’ అన్నారు. 21వ శతాబ్దపు తెలివితేటలు వికటించినప్పుడు వచ్చే వికారమిది. ఈ మధ్య ఈ తెలివితేటలు చాలా మంది ‘అధునిక రచయిత’లలో మరీ వికటిస్తున్నాయి. ముఖ్యంగా పురాణాలమీదా, దేవుడిమీదా బొత్తిగా నమ్మకం లేని వారిమాట. ఒకానొక సభలో కుచేలుని గురించి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఆయనతో అన్నాడట: ’’ఏమయ్యా, ఎనిమిది మంది భార్యల్ని పెట్టుకుని నేను ఒక్కడినే కన్నాను. పేదరికంలో ఉంటూ అంతమంది పిల్లల్ని కని నీ పెళ్లాన్ని హింసించేవేమయ్యా’’ అని. ప్రేక్షకులు ఈ ’రుచి’కరమైన జోక్‌కి కిసుక్కున నవ్వుకున్నారు. కుచేలుడి వృత్తాంతం ఉద్దేశం అదికాదు. రచనల్లో literary metaphorని అర్ధం చేసుకోలేని ప్రబుద్ధుల కుప్పిగంతులివి. ఇప్పటి చాలా మంది స్త్రీలకి విష్ణుమూర్తి పాలసముద్రం మీద పాము పడుకుని ఉండగా, లక్ష్మిదేవి కాళ్లుపట్టడం ఎబ్బెట్టుగా, అభ్యంతరంగా కనిపించవచ్చు. మన వేదాల్లో చెప్పారు స్త్రీకి మూడు దశల్లో ముగ్గురి రక్షణ ఉంటుందట. చిన్నతనంలో తండ్రి, పెళ్లాయ్యాక భర్త, వృద్ధాప్యంలో కొడుకు? ఇది ఎప్పటి మాట! ఇవాళ స్త్రీలు రాజ్యాలు ఏలుతున్నారు. ఇందిరాగాంధీ ఆనాడు బంగ్లాదేశ్‌ని విముక్తం చేసి ప్రత్యేక పాలకులకు అప్పగించారు. వాలెంతినా తెరిస్కోవా, చావ్లా రోదసీయానం చేశారు. దీపా కర్మాకర్, సింధు భారతదేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపారు. అలసిన భార్య కాళ్లు పట్టిన భర్త నా ‘‘మనసున మనసై’’ కార్యక్రమంలో 22 ఏళ్ల క్రితం గర్వంగా చెప్పుకున్నాడు. కాలం మా రింది. విలువలూ మారుతాయి. ఆయా రచనలను, పాత్రలను ఆ నేపథ్యంలోనే బేరీజు వెయ్యాలి. ఆ రచనలమీద విమర్శకి ఈనాటి కొలబద్దలు న్యాయంకాదు– అన్నారు సింగపూర్ తెలుగు సభల్లో ప్రముఖ విమర్శకులు ఆచార్య వెలమల సిమ్మన్నగారు. ముందు ముందు రాముడు అరణ్యాలలో ఉంటూ ప్రతీరోజూ వరస తప్పకుండా ఏ బ్లేడుతో గెడ్డం గీసుకున్నాడు? ఎలా క్షవరం చేసుకున్నాడు. అలా కడిగిన ముత్యంలా కనిపించడానికి ఎవరు అతని బట్టలు, ఏ సబ్బుతో రోజూ ఉతికి పెట్టారు. సీతమ్మవాడిన శానిటరీ టవల్స్ ఏ కంపెనీవయివుంటాయి? వంటి విలక్షణమయిన వికారాలు రావచ్చు. దేవుళ్లనీ, పురాణాలనీ వెనకేసుకు రావడం నా లక్ష్యం కాదు. ఇలాంటి రచనలు లోగడ చాలా మంది లబ్దప్రతిష్టులు చేశారు. ‘‘ఆ నాటకాలన్నీ బుద్ధిలేక రాశాను’’ అన్నారు చలంగారు. మిగతా వారు అనలేదు. కానీ అనే పక్షానికి ఒరిగారు. శ్రీకృష్ణుడు, భీష్ముడు, రాముడు – ఇలాంటి పాత్రలు ఒక సంస్కృతీ పరిణామంలో కొన్ని దేశాలలో కేవలం పాత్రలుకావు– ‘వ్యవస్థ’లు (Institutions). దమ్ముంటే మరో ‘శ్రీకృష్ణుడి’ని సృష్టించమనండి. ఆ పాత్రకి ‘‘శాంతి భూషణ్’’ అని పేరు పెట్టమనండి. శ్రీకృష్ణుడు ఈ జాతికి ‘భగవద్గీత’ని ఇచ్చిన ఆచార్యుడు. ఆయన్ని వెక్కిరిస్తే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు. కొన్ని శతాబ్దాల రాపిడిలో నిగ్గు తేలిన పాత్రీకరణ అది. An evolved institution. అవి కొన్ని శతాబ్దాల సంస్కృతి పెంచిన పూలతోటలు. మనసుంటే ఇన్ని నీళ్లు పోయండి. మనసు లేకపోతే మంట పెట్టకండి. విష వృక్షాల్ని పెంచకండి. ఈ దేశంలో దిగంబర కవుల్లో ఒకాయన ఆశ్రమ స్వీకారం చేసి సన్యాసి అయ్యాడు. విప్లవ గీతాలతో జాతిని ఉత్తేజపరిచిన గాయకుడు గద్దర్ ఆధ్యాత్మికతవేపు మలుపు తిరిగారు. కాళీపట్నం రామారావు మేష్టారు తొంభైవ పడిలో రామాయణం, భాగవతం చదువుకుంటున్నారు. రావిశాస్త్రి గారు చివరిరోజుల్లో సద్గురు శివానందమూర్తిగారిని దర్శించుకుని ‘అయ్యో! వీరిని ముందుగా కలసి ఉంటే బాగుండేదే!’’ అని వాపోయారట. త్రిపురనేని గోపీచంద్, కొడవటిగంటి, జ్యేష్ట, శ్రీపతి వంటివారు తమ ఆలోచనాసరళిని మలుపుతిప్పారు. అది ఆక్షేపణీయం కాదు. విశ్వాసానికి ఆలస్యంగా వేసిన మారాకు. ఇది సామాజిక చైతన్యంలో పరిణామం. వెక్కిరించడం వెకిలితనం. తను నమ్మిందే సత్యమనే అర్థం లేని అహంకారం. శతాబ్దాల రాపిడిలో ఒక వ్యవస్థలో చిరస్మరణీయమైన – పాత్రలుగా కాక ‘వ్యవస్థ’లయిన పాత్రలను ఆధునికమైన ‘ఎంగిలి’ తెలివితేటలకి ‘రీ ఇంటర్‌ప్రెటేషన్’ అని దొంగపేరు పెట్టిన పెద్దలు నాలిక కొరుక్కున్నారు. పురాణాల్లో శక్తిలేకపోతే కాలగర్భంలో కలసిపోతాయి. కాని వాటికి కొత్త వికారాలను జత చేసి ‘‘వైజ్ఞానిక వ్యభిచారం’ చెయ్యడం ఈనాడు మేధావులనిపించుకునేవారి వ్యసనం. పాపులారిటీకి దొంగ తోవ. వ్యాసకర్త గొల్లపూడి మారుతీరావు -
దమ్ము–సొమ్ము
జీవన కాలమ్ ‘నగదు’ అంటే అర్థం తెలీని కోట్లాదిమంది ఈ దేశంలో ఉన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్’ అన్నాడో మహాకవి. ప్రధానికి ఇది ఉవాచగా కాక, హెచ్చరికగా తెలుగు మంత్రులు చెప్పవలసిన క్షణాలు వచ్చేశాయి. ఎవరో నాకు వాట్సప్‌లో ఈ సమీక్షను పంపారు. ‘దమ్మున్నవాడికి పదవి లేదు. పదవి ఉన్నవాడికి దమ్ము లేదు. పదవి ఉండి దమ్మున్నవాడికి సపోర్ట్ లేదు. ఇది మన దేశ దౌర్భాగ్యం. ఇప్పుడు గనుక మోదీని సపోర్ట్ చెయ్యకపోతే, ఈ దేశాన్ని మార్చడం మన తరం కాదుగదా, మన తర్వాతి తరం కూడా కాదు’. నవంబర్ 8 తర్వాత చాలామంది చాలాకాలం పాటు ఈమాటే అనుకున్నారు. క్రమంగా ఈ మాట బలహీనపడి–ఇలా వాట్సప్‌లో వాపోవాల్సిన అగత్యం ఏర్పడింది. కారణం–ఈ దేశంలో కనీసం 60 శాతం మందికి నల్లడబ్బు, పరాయి దేశపు దొంగనోట్లు వంటివి తెలీ దు–తెలియవలసిన దశలో వారు జీవించడం లేదు కనుక. తెల్లవారి లేస్తే–కందిపప్పు, బియ్యం, నూనె, కూరలు, అనారోగ్యానికి మందులు–ఇలాంటి దైనందిన అవసరాలు తీర్చుకోవడమే వారికి తెలుసు కనుక. ఇప్పుడిప్పుడు ఎవరో తమని ఎక్కడినుంచో దోచుకుంటున్నారనీ–ఇలా నోట్లని అదుపులో పెట్టడంవల్ల తమకి మేలు జరుగుతుందనీ వారు విన్నారు. నమ్మారు. లంబసిం గిలో ఎర్రప్పడికి, మర్రివలసలో చినపడాలకీ ఇంతకంటే ఏమీ తెలీదు. వెనకటికి.. గిరీశం బండివాడికి రాజకీయాలమీద రెండు గంటలు లెక్చరిస్తే–అంతా విని ‘అయితే బాబూ– మావూరి హెడ్ కానిస్టేబుల్ని ఎప్పుడు బదిలీ చేస్తారు’ అని అడిగాడట. ఎర్రప్పుడు, చినపడాల ఆ కోవకి చెంది నవారే. నవంబర్ 8 తర్వాత వీళ్లకి ఎవరో చెప్పి ఉంటారు. ‘ఒరేయ్, మోదీగారు చేసిన పనివల్ల మీకు లాభం కలుగుతుందిరా’ అని. ‘పోనీ బాబూ–అంతే శాన’ అనుకుని బ్యాంకుల ముందు వారు బారులు తీరారు. వారాలు గడచిపోయాక ‘ఎప్పుడొత్తాది బాబూ ఈ నాభం? ఇప్పుడెక్కడిదాకా వచ్చినాది?’ అని అడిగారు. క్రమంగా పేదవాడి విశ్వాసానికి నెరియలు పడే స్థితి వచ్చింది. ఇది ఒక పార్శ్వం. ఆలోచన ప్రకారమే రిజర్వ్‌బ్యాంక్ కొత్త నోట్లను విడుదల చేస్తుండగా–ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి–రాత్రికి రాత్రే 30 లక్షల కొత్త నోట్లను రిజర్వ్ బ్యాంక్ నుంచే సరాసరి తన గల్లాపెట్టెకి రవాణా చేయగా, అతని కొడుకు 5 కిలోల బంగారాన్ని, మరికొన్ని లక్ష ల కొత్త నోట్లని దోచుకోగా, వెంకటేశ్వర స్వామి సేవకు కంకణం కట్టుకున్న టీటీడీ బోర్డు సభ్యులు–దైవ భక్తుల్ని తలదన్నినట్టు పెద్ద నామా లు, జరీ ఉత్తరీయం ధరించి–ప్రజ లకు ఉపయోగపడాల్సిన కోట్ల సొమ్ముని (24 కోట్ల కొత్త నోట్లు, 50 కిలోల బంగారం) దోచుకుంటుం డగా, ఎక్సైజ్ కమీషనర్లు, హవాలా వ్యాపారులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్లు గడ్డి కరుస్తుండగా–మాయమైన కోట్ల సొమ్ము క్యూలలో నిలబడిన పెద గదిలి కూలీకి ఎలా అందుతుంది? ఇంతకాలం నేలబారు మనిషికి చేరాల్సిన ప్రయోజనం–ఎన్నిరకాల, ఎంత పెద్ద పదవుల్లో ఉన్న గుంటనక్కల పాలవుతుందో క్రమంగా తెలియ వస్తోంది. అయితే అవినీతి, అక్రమ చర్యలు కారణంగా– ఈ దేశపు వాయుసేన శాఖ అధిపతి త్యాగీ, టీటీడీ బోర్డు సభ్యులు, ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, బ్యాంకు సీనియర్ ఆఫీసర్లు బారులు తీర్చి జైలుకి వెళ్తున్నారు. ఇది 70 ఏళ్ల భారతీయ చరిత్రలో–గుండెలు తీసిన దొంగల్ని గుండెబలం గల ఒక వ్యవస్థ వీధిన పెట్టడం అనూహ్యమైన పరిణామం. అయితే ఏ విధంగా ఇది మామూలు మనిషికి ఉపయోగిస్తుంది? ఏనాడూ రోడ్డుమీది మనిషిని పట్టించుకోకుండా 22 రకాల కుంభకోణాలలో శాస్త్రయుక్తంగా దేశాన్ని దోచుకున్న ఒకప్పటి రాజకీయ పార్టీ, మిగతా పార్టీలు హఠాత్తుగా నేలబారు మనిషి కష్టాలను నెత్తికెత్తుకుని 22 రోజులపాటు పార్లమెంటు సభల్ని మంటగలిపారు. ఓ చీఫ్ సెక్రటరీ, కొడుకూ సాక్ష్యాలతో ççపట్టుబడగా–ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి–మమతా బెనర్జీ ఇది ప్రభుత్వం కక్ష సాధింపు అంటున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ–కనీ వినీ ఎరుగని రీతిలో–ఇంతకుముందు ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యని విజయవంతంగా సాధించలేక పోయిందని తెలిసి కూడా–అతి శక్తిమంతమైన, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న దోపిడీదారులను తట్టుకుని–రొంకిలి గుండు ముత్తడు, బూసాయవలస చెల్లమ్మలకు ఈ మేలు చేరడానికి 46 రోజులు సరిపోతాయా? ఏమైనా 46 రోజుల తర్వాత వాట్సప్‌లో ఇలాంటి గొంతు విని పించడం విశేషం. కానీ రోజులు గడిచేకొద్దీ వేళ మించిపోతోంది. మన దేశంలో 2016లోనూ, 1889 నాటి కన్యాశుల్కం బండీవాళ్లు చాలామంది ఉన్నారు. వారికి ఉర్జిత్ పటేల్ కుప్పిగెంతులు తెలీదు. మోదీగారి ‘దమ్ము’ తెలీదు. తెల్లారితే ఉల్లిపాయ కొనుక్కునే ‘సొమ్ము’ మాత్రమే తెలుసు. నగదు రహిత లావాదేవీలు చదువుకున్న నాలాంటివాడికే చికాకు పరిచే సౌకర్యాలు. ‘నగదు’ అంటే అర్థం తెలీని కోట్లాదిమంది ఈ దేశంలో ఉన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్’ అన్నాడో మహాకవి. ప్రధానికి ఇది ఉవాచగా కాక, హెచ్చరికగా తెలుగు మంత్రులు చెప్పవలసిన క్షణాలు వచ్చేశాయి. (రచయిత : గొల్లపూడి మారుతీరావు ) -
తుప్పు ఆయుధం
జీవన కాలమ్ మనం రాజకీయ నాయకుల నిరాహార దీక్షలను చూస్తుంటాం. ప్రజలూ, ప్రభుత్వ యంత్రాంగం వణికి పోతూంటుంది. ఆ మహానుభావుడి ఔన్నత్యానికి కాదు. ఆయనకేదయినా అయితే ఎంత కల్లోలం, ఎంత అనర్థం చేస్తారోనని. పత్రికల్లో చాలామంది దృష్టిని ఈ వార్త దాటిపోయి ఉంటుంది. ఈమధ్య తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీజలాల తగువు సాగుతోంది. లోగడ రెండు రాష్ట్రాలూ చేసుకున్న ఒడం బడిక ప్రకారం కావేరీ నీరు తమిళనాడుకు కర్ణాటక వదిలిపెట్టాలి. ఈసారి వదలలేదు. తగాదా కేంద్రమంత్రి ఉమాభారతి దాకా వెళ్లింది. చర్చలు విఫలమయ్యాయి. ఏకీభావం కుదరలేదు. ‘‘ఈ విషయంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను’’ అన్నారు కేంద్రమంత్రి ఉమాభారతి. ఇది పాఠకుల దృష్టిని దాటిపోయిన మెరుపు. ఇదేమిటి? కాషాయ వస్త్రాలు ధరించిన యోగిని- చాలా మెట్లు దిగివచ్చి - లౌకిక ప్రపంచంలో - కాదు రాజకీయ ప్రపంచంలో కేంద్రీకృతమైన అధికారపీఠంలో కూర్చున్నారు. రాష్ట్రాల తగవులు, అసందర్భా లను సరిచెయ్యాల్సిన అధికారమూ, శక్తీ ఉన్న గద్దె అది. కాని సమస్య పరిష్కారం కాకపోతే ‘నిరాహార దీక్షని చేస్తానంటారేం!’ ఇదీ విషయం. మంత్రుల పని నిరాహార దీక్షలు చేయడం కాదు. పాలించడం. పాలనకు అవసరమయితే అధికారాన్ని వినియోగించడం. ఉమాభారతిగారు భోజనం మానేస్తే సిద్ధరామయ్య, జయలలిత గారు మనసు మార్చుకుంటారనీ, వందల బస్సులు తగులబెట్టిన దౌర్జన్యకారులు కన్నీళ్లపర్యంతమయి కాషాయ వస్త్రాలు ధరిస్తారని మనం ఊహించలేము. కాని ఒకనాడు ఓ మహానుభావుడు సరిగ్గా అదే పనిచేశాడు. మానవతా విలువలకీ, రాజకీయ సమస్యకీ వంతెన వేసి ఫలితాలను రాబట్టగలిగాడు. ఆయన పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. ఎలా? వ్యక్తిస్థాయిలో, మానవీయమయిన స్థాయిలో, నైతికమయిన స్థాయిలో - వ్యవస్థ అంతా గర్వించగల, వ్యవస్థకి ఆరాధ్యస్థానంలో ఉన్న ఒక వ్యక్తి- కాదు- ఆ వ్యవస్థ ఆరాధించే ‘శక్తి’ ఆ పనిచేస్తే అది ఆయుధ మవుతుంది. ఆరోజు మహాత్ముడు నిరాహార దీక్ష చేస్తే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సింహాసనం పునాదుల్లో కదిలింది. ఆ కర్తృత్వానికి బలం ‘నిరా హారం’ కాదు. ఆ వ్యక్తి వ్యక్తిత్వబలం. ఒక వ్యక్తిని సమాజం ప్రేమించి, ఆరాధించి, అక్కున చేర్చుకున్న ప్పుడే ఆయన్ని నష్టపోకుండా కాపాడుకుంటుంది. ఆయన కోసం తిరగబడుతుంది. ఆయన్ని రక్షించుకోవడానికి అపురూపమయిన త్యాగాలు చేస్తుంది. నాకు బాగా నచ్చిన, పులకించిన సన్నివేశం-‘గాంధీ’ చిత్రంలో ఒకటుంది. కార్యకర్తల హింసకి పోలీసులు బలి అయినప్పుడు మహాత్ముడు నిరాహార దీక్ష చేశారు. దేశం చలించిపోయింది. ఒక మహనీయుడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం- సౌహార్దాన్ని ఎల్లెడలా భారతీయులు కుమ్మరించారు. ఆనందంగా వచ్చి నెహ్రూ మహాత్మునికి చెప్పారు. చెప్తూ ‘భోరుమన్నారు’. అదీ దృశ్యం. మహాత్ముడు నిరాహార దీక్షని చేసినప్పుడు కాదు- దాని ఫలితాన్ని దేశమంతటా గమనించినప్పుడు నెహ్రూ ఆవేశంతో చలించి పోయాడు. దీక్ష ఆయన్ని ఆర్ద్రం చెయ్యలేదు. దీక్ష ప్రభావం గుండెల్ని పిండింది. అది ఓ మహాత్ముని వ్యక్తిత్వానికి నివాళి. మనం రాజకీయ నాయకుల నిరాహార దీక్షలను చూస్తుంటాం. ప్రజలూ, ప్రభుత్వ యంత్రాంగం వణికి పోతూంటుంది. ఆ మహానుభావుడి ఔన్నత్యానికి కాదు. ఆయనకేదయినా అయితే ఆ పార్టీవారో, ఆ వర్గం వారో, ఆ కులం వారో ఎంత కల్లోలం, ఎంత అనర్థం చేస్తారోనని. ఇది నిఖార్సయిన బ్లాక్మెయిల్. నిరాహార దీక్షకు ఈ నాయకులే మరుగుజ్జులు. వారి ‘బెల్లింపు’కి ఆ ‘దీక్ష’ కేవలం ముల్లును తీసే ఇనుప ముక్క. ఇనుపముక్క గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది. అదే యంత్రాంగం భయం. వారి భయం ఇనుపముక్క చేసే హాని కాని, వారి ఉదాత్తత కాదు. వినోబా భావే 87వ ఏట-తన అనారోగ్యాన్ని కాపాడేందుకు మందులు ఉపయోగపడలేదన్న విష యాన్ని గ్రహించి-‘ఈ శరీరం నాకు ఇన్నాళ్లూ సహక రించింది. ఇప్పుడు దాని శక్తి సన్నగిల్లింది. సహకరించలేనంటోంది. దానిని ఇక శ్రమపెట్టను’ అని స్వచ్ఛం దంగా ఆహారం తీసుకోవడం నిలిపివేశారు. న్యాయంగా 1982లో ఇందిరాగాంధీ ‘ఆత్మహత్య’ నేరానికి ఆయన్ని అరెస్టు చేసి ఉండవచ్చు. కానీ ఆయనని ఎవరూ ముట్టుకోలేదు. స్వచ్ఛందంగా వెళ్లిపోయాడు ఆ మహర్షి. దరిమిలాను ఆయన్ని ఈ దేశం భారతరత్నను చేసింది-తమని తాము గౌరవించుకోవడానికి. దీక్షని ఆకాశంలో నిలిపేది- ఆ దీక్ష లక్ష్యం. మహాత్ముడు ఆనాడు జాతి సమైక్యతకు నిరాహార దీక్ష చేశాడు. వినోబా భావే-మృత్యువుని ఆహ్వానించ డానికి. నీళ్ల కోసం బస్సులు తగలబెట్టే దౌర్జన్యకారుల దురాగతాలకి, రైళ్లు తగలబెట్టే నేరగాళ్లని జైళ్ల నుంచి విడిపించడానికి, తమ వర్గానికి మేలు జరగాలని బెల్లిం చడానికి కాదు. ఏతావాతా - పదవిలో ఉన్న మంత్రి- కాషాయం తొడిగినా- ఆధ్యాత్మిక నైరాశ్యం ఆవహిం చినా- లక్ష్యం కురచగా, నేలబారుగా, కేవలం ‘రాజకీ యం’ అయిన కారణానికి- ఒకనాటి పవిత్రమైన, అతి శక్తిమంతమయిన ఆయుధం తుప్పు పట్టిపోయింది. - గొల్లపూడి మారుతీరావు -
‘మాల్యా-ఆమ్యామ్యా’
అప్పటి హైదరాబాద్ చిన్న చిన్న రిక్షాలతో, అంతకు మించి నాలుగు రెట్లు సైకిళ్లతో, ఎటు చూసినా ప్రశాంత జీవనం గడుపుతున్న జనంతో- అంతకు మించి 2,800 పైచిలుకు జలాశయాలతో ధైర్యంగా ఉన్న గుర్తు. అవినీతికి దగ్గర తోవలున్నాయి. కాస్త కుశాగ్రబుద్ధిని వినియోగిస్తే తప్పించుకునే మార్గాలూ ఉన్నాయి. ఒక వ్యక్తి సాక్ష్యాలతో అవినీతిలో పట్టుబడ్డాడనుకోండి. రూఢీగా జైలుకి వెళతాడు. ఆ అవినీతిని పది మందికి పంచాడనుకోండి. అది అవినీతి అనిపించుకోదు. వ్యవస్థ నిస్సహాయత అవుతుంది. వందమంది పంచుకున్నారనుకోండి- ఆ అవినీతిని నీతిగా తర్జుమా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అవుతుంది. ఎందుకని? ఆ ‘సమూహం’ ఓట్లకు పదవిని నిలబెట్టే శక్తి ఉంది కనుక. ఆ సమూహంలో అయిదుగురు ఉన్నారనుకోండి- అది ఆదర్శమవుతుంది. ‘ఆదర్శ హౌసింగ్’ కుంభకోణమవుతుంది. అప్పుడు కొన్నవాడికి ఏమీ అవదు. కొనిపించిన వాడి ఉద్యోగం పోతుంది. ఏ ముఖ్యమంత్రో వెళ్లిపోతాడు. మరి ఏభైఏళ్ల పాటు - అవినీతి తెలిసి తెలిసీ - లక్షల కోట్లు చేతులు మారి- లక్షల ఇళ్లు లేచి- ప్రతిసారీ వరదలకు జుత్తు పీక్కొంటే ఏమవుతుంది? ఏమీ అవదు. జుత్తు ఊడుతుంది. వర్షాలు తగ్గుతాయి. కుళ్లునీరు ఇళ్లలోంచి సెలవు తీసుకుంటుంది. కొందరు జబ్బు పడతారు. డాక్టర్లకు డబ్బులొస్తాయి. అందరికీ కోపం వస్తుంది. కొందరు పళ్లు కొరుకుతారు. కొన్ని పళ్లు ఊడతాయి. కానీ జీవితం మళ్లీ వరదలొచ్చేదాకా యథా ప్రకారంగా సాగుతుంది. 1987లో 347 హెక్టారులున్న మీరాలం చెరువు నానాటికీ కుంచించుకుపోవడం అందరూ చూస్తున్నారు. కుంచించుకుపోయిన దుర్గం చెరువు, తుర్క చెరువు లాంటి చెరువుల చుట్టూ తెలిసితెలిసి చాలామంది కోట్లు గుమ్మరించి ఇళ్లు కొనుక్కున్నారు. అమ్మినవాడిది భాగ్యం. కొన్నవాడిది దరిద్రం. కనీసం 17 చెరువుల్లో 43 హౌసింగ్ కాలనీలు లేచాయి. ఈ కాలనీలలో గవర్న మెంటు ఉద్యోగులూ, పెద్దమనుషులూ, అవినీతి తెలిసి నవారూ, తెలియక కొనుక్కున్నవారూ చాలామంది ఉన్నారు. ఇంకా నెక్టార్ కాలనీ, నదీం కాలనీ, నవాబ్ సాహెబ్ కుంట, అంబికానగర్, రాజీవ్‌గాంధీనగర్, బన్సీలాల్ పేటా- ఈ జాబితా నమూనా మాత్రం. 50 సంవత్సరాల పాటు అవినీతిని తరతరాలుగా - క్రమ బద్ధంగా, ప్రణాళిక ప్రకారం పంచిన ‘అవినీతి’ విశ్వ రూపమిది. ఒకప్పుడు నీటిని ఆహ్వానించి, గుండెల్లో దాచుకుని-అవసరాలను తీర్చే 2,800 చెరువులను భూబకాసురులు ఆపోశన పట్టేశారు. ఈ యజ్ఞంలో - ప్లానుని అంగీకరించిన కింది తరగతి గుమాస్తా దగ్గ ర్నుంచి, ఫైలుని టేబులు నుంచి కదిపిన నౌఖరు వరకు వాటాలు దక్కి ఉంటాయి. ఇప్పుడు ఎవరి మీద ఎవరు చర్య తీసుకోగలరు? ఇది విశ్వరూపం దాల్చిన ఆదర్శనగర్. నేను సరిగ్గా 62 సంవత్సరాల కిందట మొదటిసారిగా హైదరాబాద్ వచ్చాను. పంజాగుట్ట దాటిన తర్వాత ఇప్పటి శ్రీనగర్ కాలనీ దాటి నగరం లేదు. చీకటిపడగానే ఆ ప్రాంతాలకు నక్కలు రావడం నాకు తెలుసు. అప్పటి హైదరాబాద్ చిన్న చిన్న రిక్షాలతో, అంతకు మించి నాలుగు రెట్లు సైకిళ్లతో, ఎటు చూసినా ప్రశాంత జీవనం గడుపు తున్న జనంతో- అంతకు మించి 2,800 పైచిలుకు జలాశయాలతో ధైర్యంగా ఉన్న గుర్తు. ఇప్పుడు జనాభా ఎన్నో రెట్లు పెరిగింది. అంతకు మించి భూబకాసురు లకు డబ్బు చేసుకునే యావ పెరిగింది. ‘నలుగురితో చావు పెళ్లితో సమానమని’ వారికి అర్థమయింది. ఇప్పుడు ఎటు చూసినా ‘ఇళ్లు’ కావు- ఓటు బ్యాంకులు. కులాల, మతాల, పదవుల, కరెన్సీ జులుం. ఎవరిని ఎవరు కదిపే ధైర్యం ఉంది? ఇది కనీసం 50 సంవత్స రాలుగా నిశ్శబ్దంగా సాగుతున్న దందా. నీరు ప్రాణాధారం. నీటి వనరుల్ని ఆనుకునే జీవసంతతి నిలదొక్కుకుంటుంది. సంస్కృతీ వికాసానికి సంకేతం- జలాధారమే. సింధునదీ సంస్కృతి, నైలునదీ సంస్కృతి, గంగానది, నర్మదా నది, రైన్ నది, ఓల్గా నది- ఇవి మానవ సంస్కృతీ వికాసానికి ప్రతీకలు. నీరు జీవాధారం. మనిషి జీవనానికి చక్కని దన్ను. ఇది ఒక పార్శ్వం. నీరు ప్రాథమిక శక్తి. దాని మర్యాదను కాపా డుకోలేకపోతే తిరగబడుతుంది. ఆ మధ్య కేదార్లో, ఇటీవలే చెన్నైలో, ఇప్పుడిప్పుడు హైదరాబాద్, సికిం ద్రాబాద్ నగరాల్లో అదే జరిగింది. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? నోరులేని- కాని సమయం వస్తే తన సత్తా చాటే నీటి విలయాన్ని తట్టు కుని- నోరుమూసుకుంటే ఎవరికీ గొడవలేదు. కాదం టారా? 50 సంవత్సరాల గోత్రాలను విప్పి ‘తిలా పాపం’ పంచుకున్న, అడ్రసులు తెలీని ఏ భూబకాసు రులను వేటాడతారు? అదీ అవినీతిని పంచిన బకా సురుల ధైర్యం. ఈ మాట కొనేవారికీ చెప్పి, ఒప్పించి ఉంటారు ఆ రోజుల్లో. కొందరు తెలిసీ వాటాలు పంచుకుని ఉంటారు. ఇదే నేను చెప్పిన ‘అవినీతి’ పంపిణీ. ఇంకా తమకి అర్థం కాకపోతే లండన్‌లో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన ప్రస్తుతం భారతదేశాన్ని కొల్లగొట్టి ఇంగ్లిష్ అమ్మాయిలతో సరసాలు సాగిస్తు న్నాడు. వారిని సంప్రదించమని మనవి. (తాజావార్త: తెలంగాణ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్రమ కట్టడాలను కూలుస్తోంది-హేట్సాఫ్!) - గొల్లపూడి మారుతీరావు -
బంగారంలాంటి ‘వెండి’
జీవన కాలమ్ స్వర్ణపతక విజేత నేలమీద కూలబడి భోరుమన్నప్పుడుఆమెను మన సింధు నేలమీదనుంచి లేపి కాళ్లమీదనిలిపి కావలించుకున్నప్పుడు నేను మనసారా ఏడ్చాను. రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఆటలో ఆఖరి పోటీలో ఆఖరి క్షణాలు. ఒక దశలో కారొలినా, సింధూ - ఇద్దరూ రెండు గేమ్‌లు - చెరో పది పాయింట్లు గెలుచుకున్నారు. వారి విజయానికి ఆ పది పాయింట్లే దూరం. రెండు దేశాల చరిత్ర, రెండు జీవితాల చరిత్ర ఆ పది పాయింట్లు, పది నిముషాల వ్యవధిలో పెనవేసుకుని ఉంది. నేను ఆటని మర్చిపోయాను. ఈ చిన్న జీవితాలలో - 20 ఏళ్లు పైబడిన ఈ ఇద్దరు పిల్లలు - జీవితంలో అన్ని రకాల ఎల్లలనూ దాటి కేవలం తమ ఉద్యమాన్ని ఆ క్షణాలలో పూరించారు. ప్రతీ కదలికలోనూ స్పెయిన్ క్రీడాకారిణి కారొలినా రంకె వేస్తోంది. అది నరాలను పూరించే ఊతం. సింధు నిశ్శబ్దంగా - కాని నిప్పులు చెరిగే కళ్లతో బ్యాట్‌ని సంధిస్తోంది.కారొలినా కదలికలో జయిస్తున్న విశ్వాసం. సింధు కదలికలో జయించాలన్న అగ్ని. ఆ క్షణంలో వాళ్ల మనసుల్లో ఏముంది? ప్రపంచం - ముఖ్యంగా రెండు దేశాలు - ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న క్షణాలవి. 63 ఏళ్ల కిందట నేను రేడియోలో చేరిన కొత్తలో ఢిల్లీ శిక్షణకి వెళ్లినప్పుడు ‘మేరధాన్’ అనే రేడియో నాటకాన్ని వినిపించారు. ప్రపంచ పరుగు పోటీలో ఆటగాడు పరిగెడుతూంటాడు. పక్కనే కారులో అనుసరిస్తున్న ఆ దేశపు కోచ్. ఒక దశలో ‘నేను అలిసిపోయాను’ అంటాడు పరుగు వీరుడు రొప్పుతూ. ‘‘ఇప్పుడు నువ్వు నువ్వు కావు. ఇప్పుడు నువ్వు నీ దేశం’’ అని హెచ్చరిస్తాడు కోచ్. ‘ఇంక ఓపిక లేదు - పరిగెత్తలేను’ అంటాడు వీరుడు. ‘‘పరిగెత్తాలి. దేశ చరిత్రను ఆపే హక్కు నీకు లేదు’’ అంటాడు కోచ్. నాకు భగవద్గీత బోధించిన ఆచార్యుడు వినిపించాడు ఆ శ్రవ్య నాటకంలో - ‘‘నియతం కురు కర్మత్వం’’ అంతే. ఆ క్షణంలో సింధు భారతదేశం. ఆఖరి పదినిమిషాలూ ఈ దేశపు చరిత్రలో భాగం. ఎక్కడో పుట్టి - పన్నెండో యేటినుంచి ఒక లక్ష్యాన్ని సంతరించుకుని - రోజుకి 56 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఓ అమ్మాయి - కొన్ని వేల గంటలు - కేవలం ప్రతిభనే కొలబద్ధగా ప్రయాణం సాగించిన ఓ పిల్ల - తన ఊరినీ, తన రాష్ట్రాన్నీ, తన ఖండాన్నీ దాటి కేవలం తన దేశానికి ప్రాతినిధ్యం వహించే ‘శక్తి’గా మాత్రమే నిలవడం ఎంత గొప్ప ప్రస్థానం! మొన్నటి దీపా కర్మార్కర్ ‘గెంతు’ కొన్ని వేలసార్లు జరిపిన కృషికి ప్రతిరూపం. ఆమె శరీరం కదలిక - చివర ఆమె వేసిన మొగ్గ - అపురూపమైన గొప్ప కవితకు దృశ్యరూపం.It was visual poetry. ఆ మొగ్గ (ప్రొడునోవా)ని ప్రపంచ క్రీడల్లో బహిష్కరించాలనుకుంటున్నారట. కారణం - చిన్న పొరపాటు జరిగితే - ఆ దూకు ఏ మాత్రం బెసికినా వ్యక్తి శాశ్వతంగా మూలన పడవచ్చు. ఒకింత పొరపాటు జరిగితే ప్రాణానికి ముప్పు రావచ్చు. ఎన్నిసార్లు తన ప్రాణహానిని పక్కనపెట్టి దీప ఆ ‘గెంతు’ని ఒడిసి పట్టుకుందో! సెకనుకి కొన్ని క్షణాల తేడా కారణంగా బహుమతికి ఇటు నిలిచినా - చరిత్రలో సమున్నతంగా నిలిచిన మహారాణి దీప. 58 కిలోల కుస్తీ పోటీలలో సాక్షి మలిక్ కాంస్య పతకం అతి చిన్న ఊరట. ఆమె లక్ష్యం నికార్సయిన బంగారం. ప్రపంచాన్ని జయించిన ఆమె నవ్వు - నూటికి నూరుపాళ్లూ ఏ పొరపొచ్చాలూ లేని నిష్కల్మషమయిన విజయానికి పట్టాభిషేకం. ఒక లక్ష్యానికి అపూర్వమైన పరాకాష్టని సాధించిన ఈ దేవకన్యలకు ఈ జాతి శాశ్వతంగా రుణపడి ఉంటుంది. మానవ ప్రయత్నానికి, పట్టుదలకీ, ప్రతిభకీ, మానవీయమైన లక్ష్యాలకీ - వెరసి ఈ జాతి ప్రాథమికమైన నైశిత్యానికి వీరు అభిజ్ఞలు. మానవ సంకల్ప బలానికి ఎవరెస్టు శిఖరమది. అసలు అది కాదు నన్ను కుదిపేసిన క్షణం. కారొలినా చేతుల్లో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచిన సింధు - మొదటిస్థానంలో ఉన్న చాంపియన్ నేలమీద కూలబడి భోరుమన్నప్పుడు నేలమీదనుంచి లేపి కాళ్లమీద నిలిపి కావలించుకున్నప్పుడు - నేను మనసారా ఏడ్చాను. సింధు ఉదాత్తత - బంగారంకన్నా గొప్పది. ఆ స్థాయి మాటలకి అందనిది. అది అలౌకికమైన సంస్కారం. ఓ గొప్ప విలువకు పట్టాభిషేకం. ఈ విజయాన్ని పంచుకోవలసిన మరొక చాంపియన్, గురువు పుల్లెల గోపీచంద్ - పోరాడే దమ్మునేకాదు, ఓటమినీ అంగీకరించే పెద్ద మనసుని నేర్పినందుకు.తీరా సింధు రజత పతకం గెలిచాక - ఆమెను తప్పనిసరిగా ఈ మురికి రాజకీయ వాతావరణంలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశాన్నే ఆకాశంలో నిలిపిన ఒక క్రీడాకారిణి తెలంగాణ బిడ్డా? లేక ఆంధ్రా అమ్మాయా? అన్న గొంతులు వినిపిస్తున్నాయి. ఆమెని ప్రాంతీయ స్థాయికి గుంజే యావ మొదలైంది. మన నాయకమ్మణ్యుల చేతుల్లో ఈ ‘ఒలింపిక్స్’ ఉంటే కులం, మతం, ప్రాంతం, వెనుకబడిన, ముందుపడిన ప్రాతిపదికన ఈ స్వర్ణాలూ, రజతాలూ, కాంస్యాలూ పంచేసుకునేవారు. పంపకం కుదరకపోతే రైళ్లు, ఇళ్లు తగలెట్టేవారు. నిరాహార దీక్షలు జరిపేవారు. అది మన దరిద్రం. రచయిత: గొల్లపూడి మారుతీరావు -
రెండాకులపై చదువు
జీవన కాలమ్ నిద్ర పోవడానికి చిన్నపాటి సంగీతమో, జోలపాటో ఉండాలని పెద్దలంటారు. చరిత్రలో పార్లమెంటుకీ - కాంగ్రెస్ నాయకుల నిద్రకీ దగ్గర తోవ ఉన్నదనీ, వారికి పార్లమెంటు జోకొట్టే ఉయ్యాల లాగ పనిచేస్తుందని నాకనిపిస్తుంది. నిద్ర సుఖమెరగదని సామెత. కాని సుఖం స్థల మెరుగదు - అని నేనంటాను. అందుకు మంచి నిదర్శనం - మన యువరాజు రాహుల్ బాబు. వారు ఉన్నట్టుండి ఇండియా నుంచి మాయమై, ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియక, మళ్లీ అంతలోనే ప్రత్యక్షమై, రాజకీయ అస్త్రాలను సంధించి, సుప్రీంకోర్టు కోపానికీ గురై - అలిసిపోతారు. ఇలాంటి సందర్భాలలో ఆయనకి సుఖంగా నిద్రపట్టే చోటు - పార్లమెంటు. ప్రజలు ఎన్నుకొన్న చాలామంది నాయకులకు పార్లమెంటులో చక్కని నిద్ర పట్టడం మనకి తెలుసు. లోగడ మన ప్రధాని దేవెగౌడ గారు కూడా పార్లమెంటులో సుఖంగా నిద్రించేవారు. ఈ లెక్కన ఈ ఒక్క కార ణానికే రాహుల్ బాబు దేవెగౌడ అంతటివాడై ప్రధాని అవుతాడని నా నమ్మకం. అలనాడు పార్ల మెంటులో ప్రణబ్ ముఖర్జీ గారు ప్రసంగిస్తున్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వీర భద్ర సింగ్ గారికి మంచి నిద్ర పట్టింది. చరిత్రలో పార్లమెంటుకీ - కాంగ్రెస్ నాయకుల నిద్రకీ దగ్గర తోవ ఉన్నదనీ, వారికి పార్లమెంటు జోకొట్టే ఉయ్యాల లాగ పని చేస్తుందని నాకనిపిస్తుంది. నిద్ర పోవడానికి చిన్నపాటి సంగీతమో, జోల పాటో ఉండాలని పెద్దలంటారు. గుజరాత్లో దళితుల సమస్యలు రాహుల్ బాబుగారికి అలాంటి నేపథ్యాన్ని కల్పిస్తున్నాయి. ఇటు తమ నాయకులు- మల్లికార్జున్ ఖర్గే గారి విసుర్లు, అటు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారి సమాధానాలు రాహుల్ గారిని జోకొట్టి నిద్ర పుచ్చాయి. అది కొందరి అదృష్టం. అయితే వీరికి మిగతా కాంగ్రెస్ నాయకుల పూర్తి సానుభూతి దక్కడం వారి పార్టీలో ఐకమత్యానికీ, గాంధీ కుటుంబంపట్ల వారికి గల భక్తి ప్రపత్తులకీ చిహ్నం. ఆ పనిని ఇప్పుడు ఘనత వహించిన రేణుకా చౌదరిగారు చేశారు. ఒక మహిళకు - కష్టపడి అలిసి పోయిన బిడ్డ మీద ఎంత ప్రేమ, సానుభూతి ఉన్నదో వారు నిన్న చెప్పిన సమాధానాన్ని బట్టి మనకి అర్థ మవుతుంది. ‘‘ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఎల్లెడలా ధూళి వ్యాపించి ఉంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గారు - పాపం - ఏం చెయ్యగలరు? కాస్సేపు కళ్లు మూసు కున్నారు. దీనికంత రాద్ధాంతం చేస్తారేం?’’ అని విసుక్కున్నారు. పార్లమెంటు అంతా రాజకీయ నాయకుల రాకపోకలతో ధూళి దూసరితమైందని మనం మరిచిపోకూడదు. మరొకరు - వారు నిద్రపోవడం లేదని-మొబైల్ ఫోన్లో మాట్లాడడానికి కింద చూపులు చూస్తున్నారని వాక్రుచ్చారు. ‘నిద్రపోయేటట్టు కనిపించే కింద చూపుల’ మొబైల్ ఫోన్‌ని వెంటనే ఆపిల్ సంస్థ పేటెంటు చెయ్యగలదని నా నమ్మకం. అయితే ఇందులో చిన్న కొసమెరుపు ఉంది. రాహుల్‌గాంధీ గారు హడావుడిగా నిద్ర మేల్కొని గుజరాత్‌కి వచ్చి హింసకు గురి అయిన దళితుల్ని, ఓ బాధితుడి తల్లిని - ఆమె పేరు రమాబెన్ - పరామర్శించారు. ‘నేను బాధితుడి తల్లిని కలిశాను. ఆమె బాధతో కృంగి పోయి, ప్రతిదినం మోడీగారి గుజరాత్లో తాము ఎంత హీనంగా బతుకుతున్నారో హృదయవిదారకంగా చెప్పు కున్నారు’ అని రాహుల్ గారు పత్రికలతో వాక్రుచ్చారు. కాని విషయమేమిటంటే - ఇలా మొరపెట్టుకున్న ఫలానా ‘తల్లి’ ఆ బాధితుని తల్లికాకపోగా, ఏ విధం గానూ దళితులతో సంబంధంలేని తల్లి. నిజానికి ఈ రమాబెన్ అనే ఆవిడ - దొంగ సారా రవాణా, దౌర్జన్యాలు, ఒక హత్య కేసులో ఇరుక్కున్న ఒకానొక రౌడీ చరిత్ర గల మహిళా శిరోమణి. ఈవిడ మొన్నటి ఎన్నికలలో రాజ్‌కోట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్య గురు తరఫున ప్రచారం చేశారట. పార్టీ శ్రేణులు - ఇలాంటి ‘తల్లి’ని ప్రత్యేక రక్షణ వలయాన్ని (ఎస్పీజీ) దాటించి ఎలా రాహుల్ గాంధీ గారి ముందు నిలప గలిగారో అర్థం కావడం లేదు. తీరా ఈ రమాబెన్ని నిలదీస్తే ‘నేను బాధితుడి తల్లి నని చెప్పలేదు. నేనూ దళిత వ్యక్తిని కనుక - తల్లిలాంటి దానిని - అన్నాను’ అని ఈ రమాబెన్ ఈ గూడు పుఠా ణీని అన్వయించారు. రాహుల్ గాంధీ గారికి ‘పప్పు’ అనే ఓ ముద్దు పేరుంది. ఆయన సార్థక నామధేయులు. అతి తరచుగా ‘పప్పు’లో కాలేస్తూ వారు తమ పేరుని నిలబెట్టుకుంటున్నారు. రోజురోజుకీ రాహుల్ ధర్మమా అని పార్టీ కొత్త ఊబిలో దిగుతూ ఉండడం - ఆ ‘ఊబి’ని సహేతుకంగా సమర్థించాలని పార్టీ శ్రేణుల్లో దిగ్విజయ్ సింగ్, రేణుకా చౌదరి వంటి సానుభూతిపరులు తాపత్రయపడడం - పత్రికలు, కెమెరాలు మోసం చేసినా మోసపోని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను - ఓటరు. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని చేసే హాస్యాస్పదమైన ప్రయత్నాలు అతని దృష్టిని దాటిపోవడం లేదు. ఇవాల్టి ఓటరు - నిన్నటి ఓటరులాగ వెర్రి గొర్రె కాడు. కాంగ్రెస్‌ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. అతనికి ఏం చూస్తున్నాడో, ఎందుకు చూస్తున్నాడో - చెప్పేవారికంటే బాగా తెలుసు. నేటి ఓటరు ఈ నాయకమ్మణ్యులకంటే రెండాకులు ఎక్కువే చదివాడు. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీ రావు) -
కబాలి
చిన్న ఫోకస్ లైట్లు వెలుగుతున్నాయి. ఆ చీకటిలో ఎవరో భుజం మీద చెయ్యి వేసి పలకరించారు. చీకట్లోకి చూస్తే- రజనీకాంత్. ఉండబట్టలేక - నేను మీకు కథ చెప్పాను-అన్నాను. ‘‘నాకు తెలుసు సార్! తెలుసు’’ అన్నారు. దశాబ్దాల పాటు కోట్లాది అభిమానుల్ని ఆకట్టుకున్న హీరో-పదిమందిలోకి వచ్చి నప్పుడు-కాస్త షోకు చేసుకో వాలనీ, తెర మీద కనిపించే హీరో అవతారాన్ని గుర్తు చేసేలాగ మురిపించాలనీ నాకనిపిస్తుంది. ఇది వ్యాపార బాధ్యత. కాగా, అవసరం కూడా. అసలు ఆ రంగానికి ఉన్న మొదటి సూత్రమే- ప్రదర్శన. వాస్తవానికి చిన్న ముసుగు. అయితే ఈ ముసుగుని బొత్తిగా చించేసిన నటుడు, బహుశా ప్రపంచంలో మరే నటుడికీ లేనంత ఆవేశపూరిత మయిన అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు, రోడ్డు మీద తారసపడితే కలలోనైనా తెర మీద హీరోతో పోల్చడానికయినా అవకాశం ఇవ్వని నటుడు- రజనీ కాంత్. నల్లగా, ఒక పద్ధతిలో లేని బట్టతలా, రెండు పక్కలా అస్తవ్యస్తంగా చెదిరిన జుత్తూ, తెల్లని మాసిన గెడ్డం, నలిగిపోయిన బట్టలూ - బయటకు వచ్చే ముందు ఒక్కసారయినా అద్దంలో తన ముఖం చూసు కున్నాడా అనిపిస్తుంది. మాటల్లో కూడా - ఈ 65 ఏళ్ల హీరో ‘‘మా అమ్మాయి వయస్సులో, ఆమెతో సరదాగా ఉండే చిన్నపిల్లతో పాటలు పాడాను’’ అని ఆయనే చెప్తారు సభల్లో. కొన్ని కోట్ల వ్యాపారానికి పెట్టుబడి అయిన ఈ నటుడు- ఆ వ్యాపారానికి ఏ విధమయిన ఉపకారమూ చెయ్యడేం! అనిపిస్తుంది. అయితే ఆయన చిత్రాలు, వాటి ఆదాయం అద్భుతాలు. నానాటికీ ప్రచార మాధ్యమాల శక్తీ, ఉధృతీ పెరుగుతున్న రోజుల్లో- వ్యాపారానికి ఎల్లలు చెరిగిపోతున్న రోజుల్లో రేపు రిలీజు కాబోతున్న చిత్రం ‘కబాలి’, రిలీజు కాకముందే కొత్త రికార్డులను సృష్టించింది. 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రిలీజు కాక ముందే 200 కోట్ల ఆదాయాన్ని తెస్తుందని పండితుల అంచనా. రిలీజయాక మరో వంద కోట్లు. 4 వేల థియేటర్లలో ప్రపంచమంతటా, 400 థియేటర్లలో ఒక్క అమెరికాలో ఈ చిత్రం రేపు రిలీజు కాబోతోంది. తమిళం, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో వస్తున్న ఈ చిత్రం మలేసియా, థాయ్‌లాండ్‌లలో కూడా రిలీజవుతోంది. మొదటి రోజే హాంకాంగ్, చైనాలో రిలీజుకి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎయిర్ ఏషియా సంస్థ ఈ చిత్ర ప్రచారానికి చెయ్యి కలిపి - ఒక విమానానికి రజనీ కాంత్ బొమ్మ వేసింది. కబాలి బనీన్లు, కప్పులు, తాళం చెవులూ - అమెరికా వెర్రికి ఇండియా హీరో బొమ్మ తోడయింది. ఈ చిత్రం టీజర్‌ని కేవలం 24 గంటల్లో 50 లక్షల మంది ఆసియాలో చూశారట! ఇదొక రికార్డు. 28 మే నాటికి 5 కోట్ల మంది చూశారు. చాలామందికి తెలియని విషయం- రజనీకాంత్ అతి నేలబారు మనిషి. ఏ మాత్రం భేషజాలకు పోని మనిషి. విగ్గు పెట్టి కెమెరా ముందు నిలిచినప్పుడు ఆయ నలో కనిపించే దుడుకుతనం, పెళుసుతనం, వేగం, విసురూ, ప్రేక్షకుల్ని కిర్రెక్కించే విన్యాసాలు నిజ జీవితంలో దగ్గరకయినా రానివ్వని మనిషి. నేను ఆయనకి ఓ సినీమా రాశాను. ఆయన ఇంట్లో మా పెద్దబ్బాయితో కూర్చుని కనీసం రెండు గంటలు కథ చెప్పాను. తెలుగు మాట్లాడుతారు. హేమ్నాగ్ సంస్థ- మూడు దక్షిణాది భాషల్లో- తమిళం, కన్నడ, మలయాళంలో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆయా భాషల్లో దిగ్గజాలయిన ముగ్గురు రచయితల్ని కూర్చోబెట్టి కథ చెప్పాను. రాశాను- పంజు అరుణాచలం, ఉదయ్‌శంకర్, శ్రీకుమరన్ తంబి. సినీమా పేరు ‘గర్జనై’. ఇది 35 సంవత్సరాల కిందటి మాట. ఆ మధ్య కమల్‌హాసన్ పుట్టినరోజుకి ఒక హోటల్లో విందుకి వెళ్లాను. దక్షిణాది సినీ పరిశ్రమ అంతా ఉంది. దీపాలు ఆర్పేశారు. చిన్న ఫోకస్ లైట్లు వెలుగుతున్నాయి. ఆ చీకటిలో ఎవరో భుజం మీద చెయ్యి వేసి పలకరించారు. చీకట్లోకి చూస్తే- రజనీ కాంత్. ఉండబట్టలేక - నేను మీకు కథ చెప్పాను- అన్నాను. ‘‘నాకు తెలుసు సార్! తెలుసు’’ అన్నారు. గ్లామర్‌ని తన భుజాల మీద మోస్తూ గాలిలో నడి చే నటుల్ని మనం తరతరాలుగా చూస్తున్నాం. వృద్ధా ప్యంలో కూడా యువకులతో సమంగా గ్లామర్‌ని పెద్ద రికంతో నిలుపుకున్న అమితాబ్ బచ్చన్‌ని తెలుసు. గ్లామర్‌ని రాజకీయాలకు తర్జుమా చేయడానికి ప్రయ త్నించి పిల్లిమొగ్గలు వేసిన చిరంజీవిని తెలుసు. తాగి మనుషుల్ని చంపి గ్లామర్ వెనుక మాయమయే సుల్తా న్లను తెలుసు. తన పరపతి, గ్లామర్‌ని పెట్టుబడిని చేసి రాష్ట్రాలను ఏలిన అపూర్వ నాయకులు- ఎమ్.జి.ఆర్.; ఎన్.టి.ఆర్‌లను తెలుసు. తన పరిమితిని ఎరిగి- హుందాతనం స్థాయిలో నిలిచి జీవించిన నటసమ్రాట్ని తెలుసు. కాని ప్రచార మాధ్యమాలు గ్లామర్‌ని ఆకాశంలో (మాటవరసకి కాదు - అక్షరాలా! ఎయిర్ ఏషియా అందుకు సాక్ష్యం) నిలిపిన కొత్త స్థాయిని ఇప్పుడు చూస్తున్నాం. కాని-కాని- వీటన్నిటినీ భుజాల మీద మోస్తూనే ఎప్పటికప్పుడు తెర మీది హీరో ఇమేజ్‌ని చీల్చి చెండాడుతూ జీవించే అతి సరళమయిన హీరో విశ్వరూపాన్ని - కపాలీశ్వర న్ వెరసి- కబాలిని రేపు ప్రపంచం చూడబోతోంది. - గొల్లపూడి మారుతీరావు -
దేవుళ్లారా! మీ పేరేమిటి?
- జీవన కాలమ్ ఐస్లాండ్ - విశాఖలో ఒక పేట జనాభా కూడా లేని చిన్న దేశం ప్రపంచ బంతాటలో పాల్గొంటోంది. భారతదేశం గత 50 సంవత్సరాల్లో పోటీలలో పాల్గొనడానికి ‘అర్హత’ని కూడా సంపాదించుకోలేదు. స్క్రీన్‌ప్లే మొదటి సూత్రం- తెలియనిదాన్ని తెలిసిన విషయంతో పోల్చి చూపడం. ఇతని కంటే ఇతను గొప్ప అంటే ‘ఇతని’ గొప్పతనం తెలుస్తుంది. మనదేశంలో క్రికెట్ అంటే పిచ్చి. ఇంతమంది చూసే, ఇంత ఆదాయాన్నిచ్చే దేశం ప్రపంచంలో మరొకటి లేదు. ఇప్పుడు క్రికెట్‌తో బంతాటని పోల్చి చూద్దాం. ప్రధానంగా ప్రపం చంలో తొమ్మిది దేశాలు మాత్రమే క్రికెట్ ఆడుతాయి. కానీ 203 దేశాల్లో బంతాట పాపులర్. ప్రపంచంలో వంద నుంచి వందా యాభయ్ కోట్ల మంది క్రికెట్‌ని చూస్తారు. తేలికగా 300 నుంచి 400 కోట్లు బంతాట చూస్తారు. ఫ్రాన్స్‌లో జరిగే ఈ యూరో 2016 పోటీల్లో ప్రపంచంలోని 24 దేశాలు పాల్గొంటున్నాయి. జూన్ 10 నుంచి ఫ్రాన్స్‌లో ప్రారంభమైన ఈ పోటీలు సరిగ్గా నెలరోజులు, 10 చోట్ల సాగుతాయి. ఫ్రాన్స్‌లో నవంబర్‌లో జరిగిన మారణహోమంతో 130 మంది మరణం దృష్ట్యా ఇది చాలా బాధ్యతాయుతమైన, క్లిష్టమైన టోర్న్‌మెంట్. కారణం, ఒక్క బ్రిటన్ నుంచే 5 లక్షల మంది ఈ ఆటల్ని చూడడానికి వస్తున్నారు. ఆటగాళ్లు, మిగతా సిబ్బంది, ఉద్యోగులు- వీరుకాక ఇన్ని లక్షల మంది క్షేమంగా ఈ ఆటల్ని చూసే అవ కాశాన్ని ఫ్రాన్స్ కల్పించాలి. ఇందుకు కేవలం 90 వేల మంది రక్షణ దళాల్ని మోహరించారు. ఈ ఆటలకు గాను సిద్ధపరిచిన 250 లక్షల టికెట్లలో 99 శాతం ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ పోటీలో పాల్గొంటున్న ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లెవరు? ఎవరు గెలుస్తారని మీరనుకుంటు న్నారు? ప్రపంచం అంతటిలోనూ ఏరి ఒక టీమ్‌ని తయారు చేయమంటే మీరు ఎవరిని ఎంపిక చేస్తారు? మెస్సీ, క్రిస్టియానో రొనాల్జినో, పాల్ బోగ్బా, డేవిడ్ అలబా- ఇలా ఇలా. ఆవేశపూరిత మైన ఊహాగానాలు టీవీల్లో సాగుతున్నాయి. గత పోటీల్లో చాంపియన్షిప్ని గెలుచుకున్న స్పెయిన్‌ని ఈ పోటీల్లో ఫ్రాన్స్ ఓడించవచ్చునన్న పండితుల కథనాలు వినిపిస్తున్నాయి. అనుకోని విచిత్రమైన మలుపులు ఎన్నో జరిగే విచిత్రమైన పోటీలు ఇవి. ఒక అరుదైన ఉదాహరణ. 1968లో ఇటలీ-రష్యా అద్భుతంగా తలపడ్డాయి. ఎన్ని ఆటలు జరిగినా ఏ జట్టూ బెసగలేదు. అప్పుడేం చెయ్యాలి? నేపుల్స్ డ్రెస్సింగు రూంలో బొమ్మా బొరుసు వేశారు. ఇటలీ గెలిచింది. ప్రపంచాన్నే ఆనంద సాగరాల్లో ముంచెత్తిన గొప్ప గొప్ప బంతాట ఆటగాళ్ల చరిత్రలెన్నో ఉన్నాయి. క్రికెట్‌కి టెండూల్కర్ ఒక్కడే దేవుడు. ఆయా దేశాలకి, ఆ ఆటకి ఎందరో దేవుళ్లు. పీలే, మారడోనా, రొనాల్డో, మెస్సీ, నిల్టన్ శాంటోస్, కాఫూ, జికో, బాబీ మూర్- ఇలాగ. ఒక్క పీలే కథ చాలు. ఆయనకి ఇప్పుడు 75. ‘ఈ శతాబ్దపు ఆటగాడు’గా గౌరవాన్ని దక్కించుకున్నాడు. టైమ్ మేగజైన్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన పేరు గణించుకున్న 100 మందిలో పీలేను పేర్కొంది. ఫ్రెంచ్ ఆటగాడు జినెదానే జిదానే గత 50 సంవత్స రాలలో అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నికయ్యాడు. 2005లో జిదానే మళ్లీ ఫ్రెంచ్ టీమ్‌లోకి చేరినప్పుడు అతని తోటి ఆటగాడు ధియరీ హెన్రీ ఒకమాట అన్నాడు, ‘ఫ్రాన్స్‌లో అందరికీ తెలుసు దేవుడున్నా డని. అతను ప్రస్తుతం ఫ్రెంచ్ టీమ్‌లో చేరాడు.’ మరొకపక్క జరుగుతున్న కోపా అమెరికా బంతాట పోటీల్లో మొన్న అర్జెంటీనా మీద కేవలం 19 నిమిషాల్లో మరో ‘దేవుడు’ మెస్సీ హ్యాట్రిక్ (మూడు గోల్స్) కొట్టి పనామాను గడ్డి కరిపించిన దృశ్యాలు, ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచే బ్రెజిల్ మొన్న పెరూతో ఆడుతూ చివరి 15 నిమి షాల్లో రాల్ రూయ్డిజ్ చెయ్యితో గోల్ చేసిన కారణంగా పోటీలోంచే వైదొలగడం ఎంతమంది అభిమానుల గుండెల్ని పగలగొట్టిందో! ఇలా ప్రతి రోజూ నరాల్ని వేడెక్కించే ఎన్నో ఎన్నో సంఘటనలు. అయితే ఒక్క విషయం నన్నెప్పుడూ ఆశ్చ ర్యపరుస్తుంది. ఐస్లాండ్ జనాభా మూడు లక్షల ముప్పయ్వేలు. ఒక్క విశాఖనగరం జనాభా ఒక కోటీ డెబ్బై లక్షలు. అంటే విశాఖలో ఒక పేట జనాభా కూడా లేని చిన్నదేశం ప్రపంచ బంతాటలో పాల్గొం టోంది. భారతదేశం గత 50 సంవత్సరాల్లో పోటీ లలో పాల్గొనడానికి ‘అర్హత’ని కూడా సంపాదించు కోలేదు. సెర్బియా 9 కోట్లు జనాభా గల దేశం. అంటే మన తెలుగుదేశం జనాభా కంటే తక్కువ. ఆ దేశస్తుడు డొకోవిచ్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన టెన్నిస్ ఆటగాడు, ఆనా ఇవానోవిచ్ టెన్నిస్ ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిచిన మహిళా క్రీడాకారిణి. ఇంత పెద్దదేశం - మనం- ఎందుకు ఈ స్థాయికి చేరలేకపోతున్నాం? ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యం అఖండ జ్యోతి. అది అవినీతి మధ్య, అసహనం మధ్య, చెప్పుడు మాటలు, తప్పుడు రాద్ధాంతాలు, దొంగ ధనార్జన, దీక్షలు, రిజర్వేషన్ల మధ్య వెలగదు. అది నరాల్ని వేడెక్కించే నిప్పు. దాని గుర్తు పట్టాలంటే రొనాల్జినో ఆట, మెస్సీ గోల్, డొకోవిచ్ బాక్ హ్యాండ్లో వెతకాలి. - గొల్లపూడి మారుతీరావు -
‘‘ సీతాకోకచిలుక ఆత్మ’’
జీవన కాలమ్ ఒక జీవితకాలం తను నమ్మిన నిజాల కోసం పోరాడిన ఓ ప్రపంచ యోధుడు కాలం పుటల్లో చిరస్థాయిగా నిలుస్తాడు. మానవత్వం జీవితాన్ని కుదిస్తుందేమో కానీ ‘కీర్తి’ని కాదని నిరూపించిన వీరుడు మహమ్మద్ ఆలీ. ఇది చింతా దీక్షితులు, తిలక్ కవిత్వంలో వాక్యం కాదు. ప్రపంచంలో అనితర సాధ్య మైన ముష్టి యుద్ధ వీరుడిగా మూడుసార్లు టైటిల్‌ని గెలుచు కున్న చరిత్రకారుడు మహ మ్మద్ ఆలీ రచనకు శీర్షిక (""Soul of a butterfly''). కొన్ని వందలసార్లు మృత్యు వుకి దగ్గరగా వెళ్లి, కొన్ని వేలసార్లు ప్రత్యర్థులను మృత్యువుకి దగ్గరగా తీసుకెళ్లిన ప్రసిద్ధుడయిన వీరుడు చెప్పిన మాటలు ఇవి: ‘‘జీవితం చాలా కురుచ. మనం చాలా త్వరగా వృద్ధాప్యంలో పడతాం. ‘ద్వేషం’ పెంచు కొని జీవితాన్ని వృథా చేసుకోవడంలో అర్థం లేదు’’ మరొక్కసారి - ఈ మాటలు చెప్పింది మహాత్మాగాంధీ కాదు. థోరో కాదు. రామకృష్ణ పరమహంస కాదు. ఒక బాక్సింగ్ చాంపియన్. అమెరికా పౌరుడిగా ఆయన్ని వియత్నాం యుద్ధంలో సైనికుడిగా వెళ్లమని అమెరికా ప్రభుత్వం ఆర్డరు ఇచ్చింది. ఆయన సమాధానం: ‘‘నాకు ఆ ప్రజ లతో తగాదా లేదు. బలిసిన అమెరికా కోసం నా సోదరు డిమీద, ఓ నల్లవాడిమీద, బురదలో తమ జీవితాన్ని గడుపుకుంటున్న పేద ఆకలిగొన్న ప్రజలమీద యుద్ధా నికి వెళ్లను. వాళ్లని ఎందుకు కాల్చాలి? వాళ్లు నన్ను వెక్కిరించలేదు. నన్ను హింసించలేదు. నామీద కుక్కల్ని ఉసిగొల్పలేదు. నా తల్లిని మానభంగం చేయలేదు. నా తండ్రిని చంపలేదు. పేదవాళ్లని కాల్చను. కావాలంటే నన్ను జైలుకి పంపండి’’ అన్నాడు. అమెరికా ప్రభుత్వం అతని టైటిల్‌ని రద్దు చేసింది. పాస్‌పోర్టుని స్వాధీనం చేసుకుంది. పోటీలలో పాల్గొనే లెసైన్సుని రద్దుచేసింది. 22వ యేట ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మహమ్మద్ ఆలీ, కేవలం తన ఆత్మగౌరవం, మానవీయమైన దృక్పథం కారణంగా - మంచి వయస్సులో ఉన్నా - పోటీలకు దూరమయ్యాడు. అయితే మూడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు అమెరికా చర్యని కొట్టివేసింది. అతని అసలు పేరు కేసియస్ క్లే. కానీ మానవీయ మైన దృక్పథానికి, అహింసాయుతమైన సిద్ధాంతాలకూ ఆకర్షితుడై ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘మహమ్మద్ ఆలీ’గా మారాడు. ఆయన తన స్వీయకథలో-తాను ముష్టి యుద్ధంలో దిగడానికి కారణాలు చెప్తూ-నా మానాన తెల్లవారు నన్ను బతకనిస్తే నేను ఈ రంగంలోకి రాకపోయేవాడిని- అంటూ కేవలం ఆత్మరక్షణకీ, తెల్ల వారినుంచి తన ఉనికిని కాపాడుకోడానికీ ఈ నైపు ణ్యాన్ని పెంచుకోవలసి వచ్చిందన్నాడు. ఆయన పన్నెండో యేట ఎవరో అతని సైకిల్ని ఎత్తుకు పోయారు. ‘‘వాడిని చావగొడతాను’’ అన్నాడు పోలీసు ఆఫీసరుతో. ఆఫీసరు నవ్వి ‘‘ముందు కొట్టడం ఎలాగో నేర్చుకో’’ అన్నాడు. అంతేకాదు. ఆ ఆఫీసరు ముష్టి యుద్ధాన్ని (బాక్సింగ్) నేర్పే టీచరు. ఎలాగో ఇతనికి నేర్పాడు. అదీ ప్రారంభం. రోజూ అలిసిపోయేదాకా పరుగుతీసి - ఇక కాలు కదపలేని స్థితికి వచ్చినప్పుడు - గుర్తు పెట్టుకుని - ఆ తర్వాత తీయగల పరుగు - తనకి ప్రత్యర్థితో చేసే ముష్టి యుద్ధంలో ‘అదనపు’ దమ్ము (ట్ట్చఝజ్చీ)ని ఇస్తుందని గుర్తు పెట్టుకునేవాడట. అదీ ప్రాక్టీసు. ఈ విషయాన్ని ‘ది గ్రేటెస్ట్ : మై ఓన్ స్టోరీ’’ అనే తన ఆత్మకథలో రాసు కున్నాడు. అతని జీవితంలో మరిచిపోలేని పెద్ద పోటీ - జో ఫ్రేజర్ అనే వస్తాదుతో. తేదీ 1971 మార్చి 8. ఆ పోటీకి ‘‘ఈ శతాబ్దపు పోటీ’’ అని పేరు పెట్టారు. 35 దేశాలు ఆ పోటీని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఆయన కీలకమైన దెబ్బ - ప్రపంచంలో చాలా ప్రసిద్ధమైనది. పోటీలో - రింగు చుట్టూ ఉన్న రబ్బరు తాడుమీద నుంచి ఊపును తీసుకుని అతను కొట్టే దెబ్బ వెయ్యి పౌనులు శక్తి ఉంటుందట. ఈ చాకచక్యాన్ని - నా అదృష్టవశాత్తూ నేను స్వయంగా చూశాను. 1980లో మహమ్మద్ ఆలీ చెన్నై వచ్చినప్పుడు మూర్ మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనకి ముఖ్య అతిథి అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్. నేను ప్రేక్ష కులలో ఉన్నాను. ఆలీ అతి సరళంగా తన ఆటను ప్రద ర్శించారు. ‘‘ఆయన సీతాకోకచిలుకలాగా విహరిస్తాడు. తేనెటీగలాగా కాటు వేస్తాడు’’ (He floats like a butterfly but stings like a bee) అన్న నానుడి ఎందుకు వచ్చిందో ఆనాడు అర్థమయింది. జీవితమంతా అతి కఠోరమైన వృత్తిని చేస్తూ - హింసని, మృత్యువుని ఎల్లప్పుడూ ఒరుసుకు ప్రయా ణం సాగించే ఓ ప్రపంచ చాంపియన్ హృదయం అతి ఆర్ద్రమైనది. కేవలం ఆ కారణంగానే తన దేశాన్నీ, తన మతాన్నీ ఎదిరించి నిలిచాడు. అయితే ఒకే ఒక్క రుగ్మత ఆయన్ని లొంగదీసుకుంది. దాదాపు ముప్ఫై ఏళ్ల కిందట ఆల్మైర్స్ వ్యాధి. మూడు దశాబ్దాలు పోరాటం సాగించి - మొన్న జూన్ 4న అలసిపోయాడు. ప్రతిభకీ, మానవత్వానికీ దగ్గర తోవని రచించి - ఒక జీవితకాలం తను నమ్మిన నిజాల కోసం పోరాడిన ఓ ప్రపంచ యోధుడు కాలం పుటల్లో చిరస్థాయిగా నిలుస్తాడు. మానవత్వం జీవితాన్ని కుదిస్తుందేమో కానీ ‘కీర్తి’ని కాదని నిరూపించిన వీరుడు మహమ్మద్ ఆలీ. - గొల్లపూడి మారుతీరావు -
సొంతింటి పుల్లకూర
జీవన కాలమ్ బీబీసీలో ఏమైనా లోపాలుంటే? బీబీసీ పక్షపాత ధోరణిని అవలంబిస్తే? నిలదీసే కమిషన్ ఒకటుంది. ఇది గత 35 సంవత్సరాలుగా ఇంగ్లండ్‌లో ఉంటూ బాధ్యతా యుతమైన పాత్రని నిర్వహిస్తున్న డాక్టరు వ్యాకరణం రామారావు చెప్పిన విషయం. వార్త లక్ష్యం వాస్తవాన్ని చెప్పడం. సమీక్ష కాదు. విమర్శ కాదు. విశ్లేషణ అంతకన్నా కాదు. లిచ్చయ్య వచ్చాడు. వార్త. లిచ్చయ్య తొందరగా వచ్చాడు, సమీక్ష. లిచ్చయ్య తొందరపడి వచ్చాడు. విమర్శ. లిచ్చయ్య ఎందుకు తొందరపడ్డాడు? విశ్లేషణ. వార్త చానల్ బాధ్యత. నిజానికి పౌరుడి హక్కు. చానల్స్ గురించి మాట్లాడుతున్నాం కనుక డాక్యుమెంటరీ వార్త మీద సాధికారికమైన విశ్లేషణ. ఇందులో ‘ఎడిటర్’ పాత్ర ఎంతయినా ఉంది. ఎడిటర్‌నే ప్రత్యేకంగా పేర్కొ నడం, అది విశ్లేషకుడి మొదటి పని కనుక. ఇక్కడ ఎడిటర్ కేవలం సాంకేతిక నిపుణుడు కాదు. విశ్లేషకుడు కనుక. చెప్పే మాట కన్నా, చూపే దృశ్యానికి బలం ఎక్కువ. ప్రఖ్యాత ఫ్రెంచ్ దర్శకుడు గొదార్ద్ ఒక మాట అన్నాడు. సినీమా రీలు ఒక సెకనుకి 24 ఫ్రేములు కదులుతుంది. అది 24 ఫ్రేములు కాదట. సెకనుకి 24 సార్లు వాస్తవాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుందట. A film narrates truth 24 times per second. మరి టెలివిజన్‌లో దృశ్యం కదలాలంటే సెకనుకి 26 ఫ్రేములు కదులుతాయి డ్రాయింగ్ రూమ్‌లో. వాస్తవానికి - సినీమా కథకి కాదు, బలం ఎక్కువ. ప్రభావం ఎక్కువ. ఒక ఉదాహరణ. టీవీలో వీరయ్య రెండూ రెండూ కలిపితే నాలుగంటున్నాడు. అది కేవలం ప్రకటన. వీరయ్య అదే మాట అనడాన్ని మరోసారి చూపించారు. అది వాస్తవాన్ని నొక్కి చెప్పడం. మూడోసారి చూపించారు. మరచిపోకండి సుమా-హెచ్చరిక. నాలుగోసారి చూపిం చారు. అది కర పత్రం. అయిదోసారి చూపించారు. అది ఉద్యమం. ఆరో సారి చూపించారు. అది వెకిలితనం. మన దేశంలో చానళ్లు ఆయా సంస్థల జేబులు. వార్త ఏమిటని కాదు. ఏ చానల్ చెప్పింది అన్నదే ముఖ్యం. అవి ఆయా సంస్థల గొంతులు కనుక. అవి వార్తల్ని ప్రసారం చెయ్యవు. వార్తల పట్ల తమ అన్వయాన్ని ప్రసారం చేస్తాయి. తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తాయి. ఉద్యమంగా ముందుకు సాగుతాయి. నేనీమధ్య ఇంగ్లండు, జర్మనీ వెళ్లాను. అక్కడెవరూ చానళ్లు ప్రసారం చెయ్యరు. ఒకే ఒక్క ఇంట్లో 24x7 చూశాను. అదేమిటి? ఫలానా చానల్ చాలా హడావుడి చేస్తుంది కదా! మా దేశంలో గొప్ప ప్రచారంలో ఉన్న చానల్ కదా? ఒకాయన నవ్వి, ‘‘అది హడావుడే. వాస్తవానికి వాగుడు ఆయుధం కాదు’’ అన్నారు. అది అన్యా యాన్ని ఎండగట్టడం కాదు. తామనుకున్న న్యాయాన్ని ఎత్తి చూపడం. ‘నిజం’ చెప్పడానికి గొంతు చించుకోనక్కరలేదు. అద్దం చూపిస్తే చాలు. ఆవేశం వాస్తవాన్ని వక్రీకరిస్తుంది. ప్రసార మాధ్యమాలకీ, ప్రజాభిప్రాయానికీ దగ్గర తోవ కావాలి. ఇంగ్లండ్ యూరోపియన్ యూనియన్‌లో ఉండాలా లేదా అన్న విషయం మీద కొద్దికాలంలో ప్రజాభి ప్రాయాన్ని సేకరించనుంది ప్రభుత్వం. అందులో పాల్గొన వలసిన ఆవశ్యకతని తప్ప మాధ్యమాలు మన ఎన్నికల లాగా ఊదరగొట్టేయడం లేదు ఎక్కడా. ఇక బ్రిటన్‌లో ప్రసార మాధ్యమం గురించి, వాటి నిష్పక్షపాత వైఖరి, నియతిని గురించి. బ్రిటన్‌లో బీబీసీ ప్రసార సంస్థకి ప్రతీ ఇల్లు సాలీనా 148 పౌండ్లు చెల్లించాలి- విధిగా. ఇది పౌర బాధ్యత. ఒక్క ముసలివారికి మినహా యింపు. ఈ విషయంలో పేదరికం కొలమానం కాదు. మరి టీవీ ఇంట్లో లేకపోతే? లేదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆ వ్యక్తిదే. ఏమిటి ఈ నిరంకుశత్వం? మాకు స్వేచ్ఛలేదా? బీబీసీకి మేమెందుకు చెల్లించాలి? అని మన దేశంలో వందలమంది కోర్టుకు వెళ్లేవారు. విషయమేమి టంటే బీబీసీ ప్రభుత్వ సంస్థ కాదు. స్వచ్ఛంద సంస్థ. వాస్త వాన్ని వాస్తవంగా చెప్తూ, అవసరమయితే ప్రభుత్వాన్నీ నిలదీయగల (ఆ పని బీబీసీ చేస్తుంది)ఒక స్వచ్ఛంద మాధ్య మాన్ని ప్రజలు నిలుపుకున్నారు- తమ ఖర్చుతో. ఒక బాధ్య తాయుతమైన ‘ప్రజావగాహన’ అనే ఉద్యమంలో ప్రతీ పౌరుడూ వాటాదారుడు- అన్నమాట. బీబీసీలో ఏమైనా లోపాలుంటే? బీబీసీ బాధ్యతల్ని విస్మరిస్తే? బీబీసీ పక్షపాత ధోరణిని అవలంబిస్తే? నిలదీసే కమిషన్ ఒకటుంది. ఇది గత 35 సంవత్సరాలుగా ఇంగ్లం డ్లో ఉంటూ బాధ్యతాయుతమైన పాత్రని నిర్వహిస్తున్న తెలుగు డాక్టరుగారు-వ్యాకరణం రామారావు గారు దాదాపు గర్వంగా చెప్పిన విషయం. మనదేశంలో ఉన్నన్ని చానళ్లు బహుశా మరే దేశంలోనూ లేవేమో! ఏ ఒక్క చానల్కీ సామాజిక బాధ్యత ఉండాలనే నియమం లేదు. నియంత్రించే బలమైన యంత్రాంగం లేదు. నిజానికి వాటి ఉనికికి కారణం ఆయా వర్గాల ప్రాతినిధ్యమే. అలాంటి మాధ్యమాలు ప్రజల్ని ఎలా మభ్యపెడతాయో, వాటి వల్ల ఎన్ని దుష్ఫలితాలు వస్తాయో - రోజూ మన దేశంలో జరిగే సంఘటనలే చెప్తున్నాయి. ఆయా సంఘటనల్ని నేను కావాలనే ఎత్తి చూపడం లేదు. ఒకే ఒక్క ఉదాహరణ: నేను దినపత్రికలో పని చేసే రోజుల్లో ‘రాయ్‌టర్’ అనే ఒక సామ్రాజ్యవాద దేశపు వార్తా సంస్థ ఆనాటి కాంగో పోరాటాన్ని ‘తిరుగుబాటుదారుల చర్య’గా వర్ణించేది. మేము తప్పనిసరిగా జాతీయవాదుల పోరాటంగా రాసుకునేవాళ్లం. ఒక దేశపు పోరాటానికి ఒక మాధ్యమం ఇవ్వగల ‘రంగు’ అది. మరి కులం మాట? మతం మాట? హిందూత్వం మాట? వర్గ పోరాటం మాట? ఫలానా పార్టీ లక్ష్యాల మాట? మేము మా కళ్లతో చూసే అవినీతి మాట? ప్రతీ సంఘటనకీ ఆయా చానల్ వాటి వాటి అవసరాల్ని బట్టి పులిమే ‘రంగు’- ఇంద్రధనుస్సు లాగ మన కళ్ల ముందు పరుచుకుని - మన ఆలోచనా శక్తిని కబళించివేస్తుంది. సొంతింటి పుల్లకూర రుచి చూస్తున్నవాడిగా పొరు గింటి చక్రపొంగలి గురించి చెప్పాలనే ఈ ప్రయత్నం. - గొల్లపూడి మారుతీరావు -
ప్రాణాలు - పేలాలు
ఈ కాలమ్కీ, రాజకీయాలకీ ఎటువంటి సంబంధమూ లేదు. మొన్న దయనీయమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న యువకుని ఘటనని ఈ దేశంలో రాజకీయ పార్టీలన్నీ సొమ్ము చేసుకున్నాయి. కానీ ఏ ఒక్కరూ ఆ యువకుని సమస్య గురించి ఆలోచించడం కానీ, పరిష్కరించడానికి కానీ ప్రయత్నించలేదు. కలకత్తా నుంచి తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి డెరిక్ ఓబ్రియన్ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఏచూరి వారూ దయచేశారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ దిగ్విజయ్‌సింగ్‌తో సహా వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వచ్చారు. బహుజన సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు వేంచేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. వీరంతా ఈ దేశం, ముఖ్యంగా యువత ఈ ప్రభుత్వం చేతుల్లో ఎంతగా నష్టపోతోందో హాహాకారాలు చేశారు. బొత్తిగా బొడ్డూడని ఓ నాయకుడు కన్నుమూసిన కుర్రాడిని మహాత్మా గాంధీతో పోల్చారు. ఈ నేతకి ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ తప్ప మహాత్మా గాంధీ గురించి తెలిసే అవకాశం లేదు. వీరి యావ చనిపోయిన కుర్రాడికి జరిగిన అన్యాయం, జరగవలసిన న్యాయం గురించి కాదు. ఢిల్లీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం. ఆ పని పూర్తికాగానే అందరూ మాయమయిపోయారు. దీనికి తెలుగులో ఓ సామెత ఉంది- శవాల మీద పేలాలు ఏరుకోవడం. ఇది ఒకప్పుడు సామెత. కానీ మన కళ్ల ముందే రాజకీయ నాయకులు నిజంగా నిరూపించారు. యూపీఏ హయాంలో కనీసం 8 మంది ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు. న్యాయంగా వీరంతా 8 మంది మహాత్మా గాంధీలు. వీరి గురించి ఈ కుర్ర నాయకుడు ఆ రోజుల్లో పట్టించుకోలేదు. కారణం - అప్పుడు వాళ్ల అమ్మ పాలన సాగుతోంది కనుక. ఇప్పుడు మొన్నటి సియాచిన్ దుర్ఘటన గురించి. మైనస్ 46 డిగ్రీల చలి ప్రాంతంలో - సియాచిన్‌లో ఆరురోజుల పాటు 25 అడుగుల కింద మంచు చరియల్లో కూరుకుపోయిన పదిమందిలో ఒకరు- హనుమంతప్ప కొన ఊపిరితో బయటపడ్డాడు. 9 మంది మరణించారు. ఆరురోజుల తరువాత ఈ వ్యక్తిని రక్షించడం, ఇలా ప్రాణాలతో మిగలడం ఒక అద్భుతం. అయినా మొన్న పేలాలు పంచుకున్న రాజకీయ నాయకులెవరూ ఒక్కసారయినా స్పందించలేదు. ఒక్కరూ మిలటరీ ఆసుపత్రికి వెళ్లలేదు. మొన్న చెన్నైలో వర్షాల తాకిడికి జరిగిన ఉపద్రవంలో సైనికులు తరలి వచ్చి చేసిన ఉపకారం గురించి ఒక్కరూ మాట్లాడలేదు. ఒక్క సైనికుడి పేరు ఎవరికీ తెలియదు. పైగా ఎవరో వదాన్యులు ఉచితంగా ఇచ్చిన ఆహార పొట్లాల మీద అమ్మ (ముఖ్యమంత్రమ్మ) ఫొటోని చేర్చి రాజకీయ పార్టీ సొమ్ము చేసుకుందట. ఇవి మరికొన్ని పేలాలు వారికి. తెలంగాణ శాసనసభ్యులు తమ జీతాలు 200 శాతం పెంచాలని అడగడం కాదు- డిమాండ్ చేస్తున్నారు. సైన్యంలో పనిచేసే ఒక మామూలు లాన్స్‌నాయక్ జీతమెంతో తెలుసా? కేవలం రూ.6,100. క్రితంసారి ఇలాగే మంచు కింద కప్పబడినవారిలో సియాచిన్‌లో రక్షించబోయి చేతి, కాలివేళ్లు పోగొట్టుకున్న ఆనాటి 23 ఏళ్ల సైనికుడిని టీవీలో ప్రశ్నించారు: ‘‘ఆ సమయంలో మీకేమనిపించింది?’’ అని. ‘‘ఆ మంచు పెళ్లల కింద నేనే ఉంటే నాకీ ఉపకారం నా సహోద్యోగులు తప్పక చేసేవారు అనుకున్నాను’’ అన్నాడా యువకుడు. ఒకే ఒక ఫొటోని ఇక్కడ జత చేస్తున్నాను. భయంకరమైన విపత్తులో, వంతెన నిర్మించడానికి అవకాశం, వనరులు లేని దశలో - కొన్ని వందల మంది సైనికులు వంతెనగా పడుకుని తమ శరీరాల మీద నుంచి మనుషులు నడిచి వెళ్లి ప్రాణాలు దక్కించుకునే అవకాశాన్ని కల్పించారు. వారిలో ఒక్కరి పేరూ ఈ దేశ ప్రజలకి తెలీదు. ఈ శాసన సభ్యులకీ తెలీదు. తెలియాలని భావించలేదు. ఆశించలేదు. త్యాగం వ్యాపారం కాదు. ఈ దేశంలో పదవి వ్యాపారం కాదు. కాదు పేలాల మూట. నాయకత్వానికి త్యాగం ముసుగు, నీచమయిన సాకు. ఇంతకీ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న సిపాయిని తన చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని లెక్క చేయక ఒక నాయకుడు- ఒకే ఒక్క నాయకుడు- కాదు- ఒకే ఒక వ్యక్తి- ఆయన పేరు నరేంద్ర మోదీ ఆసుపత్రికి వెళ్లి ఆ కుర్రాడిని చూసి వచ్చారు. ‘‘సైనికులంటే ఈ దేశపు నాయకత్వం స్పందిస్తున్న దని మేము తృప్తి పడుతున్నాం’’ అన్నాడు మాజీ సైనికోద్యోగి, ఈ వ్యక్తి చూపిన మానవత్వపు మర్యాదకి మురిసిపోయి. పేలాలను ఏరుకోకుండా, పదవిని అడ్డు పెట్టుకోకుండా, ఒక సైనికుడిని పరామర్శించ బోయిన ఒక ‘మానవత్వం గల మనిషి’కి- నేను మనసారా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దురదృష్టవశాత్తు హనుమంతప్ప మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. జీవన కాలమ్: గొల్లపూడి మారుతీరావు -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ప్రముఖ నటుడు, రచయిత గొల్లపుడి మారుతీరావు వెంకన్న సేవలో పాల్గొన్నారు. -
మరో గాడిద కథ
జీవన కాలమ్ అమెరికా రాజకీయ చరిత్రలో గాడిదకి సముచిత మైన స్థానం 1828 నుంచీ ఉంది. అప్పటి అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రాటిక్ ఆండ్రూ జాన్సన్‌ని గాడిదతో - ఓ మొద్దు, బండజంతువుగా పోలిస్తే- ఆయన ఏమాత్రం చెక్కుచెదరకుండా గాడిదను నెత్తిన పెట్టుకున్నాడు. 1837లో తన వెంట నడవని గాడిదని నడిపే నాయకుడిగా కార్టూన్లు వచ్చాయి. ప్రజాస్వామ్యంలో ‘గాడిద’ అవసరం ఎంతైనా ఉంది. చచ్చే బరువుల్ని మోయడం, యజమాని పట్ల కృతజ్ఞత, బండగా జీవించడం - ఇవన్నీ గొప్ప గుణాలు. లల్లూ ప్రసాద్ గారి కొడుకు- 28 ఏళ్ల ముద్దు బిడ్డడు- తేజస్వీ యాదవ్ మొన్నటి ఐపీఎల్ క్రికెట్ ఆటల్లో పాల్గొన్నాడు. ఒక్క ఆటలోనూ ఆడకపోవచ్చు గాక- ఆడే ఆటగాళ్లకు చాలాసార్లు మంచినీటి సీసాలు మోసుకెళ్లాడు. మామూలు ఆటల్లో ఆడి ఒక్కసారి సున్నా, మరి ఒకటి రెండుసార్లు ఆడి మొత్తం 20 పరుగులు తీశాడు. తొమ్మిదో క్లాసు ఫెయిలయి - వాళ్లమ్మ కంటే- అంటే మాజీ ముఖ్యమంత్రి కంటే ఒక ఆకు ఎక్కువే చదివానని నిరూపించుకున్నాడు. ఆయనకి ‘అపేక్షించ’డానికీ, ‘ఉపేక్షించ’డానికీ తేడా తెలీదు. ‘అప్పుడు’, ‘ఇప్పుడు’కి తేడా తెలియదు. ఈ విషయం మనకి మొన్నటి పదవీ స్వీకార సభలో తెలిసింది. అయితే ఆయన చేత పదవీ స్వీకారం చేయిస్తున్న గవర్నరు ఎందుకు ఉన్నట్టు? అయితే గవర్న రుకు అర్థం కాని విషయం ఒకటుంది. తేజస్వీ బొత్తిగా నిజాయితీపరుడు. ‘ప్రజల ఆశలను ఉపేక్షిస్తాను’ అని ఆయన చాలా నిజాయితీగా చెప్పుకున్నాడు- వాళ్ల నాన్నలాగ. గవర్నరు బాధపడలేక ఆయన తృప్తి కోసం మాట మార్చాడు. పది కోట్ల జనాభా ఉన్న బిహార్‌లో 25-28 సంవత్సరాల వయసున్న నిరుద్యోగులు కేవలం కోటిమంది ఉండగా వారిలో ఒకరికి ‘ఉపముఖ్యమంత్రి’ పదవి లభించడం ఎంత గర్వకారణం? ఈ ఎన్నికలలో లల్లూగారి ఇద్దరు కొడుకులు- 26, 28 ఏళ్ల వయసుల వారు మంత్రులయ్యారు. వారిలో ఒకరు ఉప ముఖ్యమంత్రి. అంటే లల్లూ గారింట్లో ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మామూలు మంత్రి ఉన్నారు. ఈ శుభపరిణామాన్ని- దేశంలో ఉన్న అన్ని పార్టీల వారూ- వారి వారి నాయకుల ద్వారా హాజరయి ఆశీర్వదించారు. ఈ పదవీ స్వీకార సభలో ఒక మాజీ ప్రధానమంత్రి, ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక పార్టీ ఉపాధ్యక్షులు, మరొక దక్షిణాది ద్రవిడ పార్టీ ఉపాధ్యక్షులూ - ఇలా మహామహులంతా ఉన్నారు. ఇందులో కమ్యూనిస్టులూ, మార్క్సిస్టులూ, ప్రజా హిత పార్టీలూ, ఆమ్ ఆద్మీలూ, తృణమూల్ వారూ, ద్రవిడ వికాసానికి కంకణం కట్టుకున్నవారూ, కశ్మీర్ వికాసానికి పాటుపడేవారూ, ఈ మధ్యనే దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ వారూ- అందరూ ఉన్నారు. అందరూ తమ వంతు మద్దతుని మన స్ఫూర్తిగా ప్రకటించారు. ఒకప్పుడు నితీశ్‌కుమార్, లల్లూల మధ్య ఇసుక వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇప్పుడు అభం శుభం తెలీని, అపేక్షకీ, ఉపేక్షకీ అర్థం తెలీని, అప్పుడో ఇప్పుడో అర్థం కాని, 28 ఏళ్ల చదువులేని, ఏ అనుభవమూ లేని కుర్రవాడు - రేపట్నుంచీ 10 కోట్ల ప్రజానీకాన్ని పాలిస్తాడు. అయితే వంటగదిలోంచి సరాసరి ముఖ్యమంత్రి పీఠానికి వచ్చిన వాళ్ల అమ్మ కంటే మెరుగే కదా! నాకేమో ఎల్.కె. అద్వానీ, మురళీమనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హా, శాంతకుమార్ కూడా కొద్దిలో మొహమాటపడ్డారు గానీ, ఈ పదవీ స్వీకార సభకు వచ్చేవారేమోనని అనిపిస్తుంది. వీరందరూ పొర పాటునయినా ఒకరి ముఖం ఒకరు చూసుకోని పెద్దలు. వీరందరినీ ఏకం చేసిన ఘనత- భారతీయ జనతా పార్టీది. ఒక పార్టీని వ్యతిరేకించడానికి ఇన్ని పార్టీలు చెయ్యి కలపడం - అలనాడు మనదేశం మీద పొరుగు దేశం దండెత్తినప్పుడు మాత్రమే జరిగింది. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఈ పదవీ స్వీకారానికి రావడాన్ని నిరసిస్తూ- కేరళ ప్రతిపక్ష నాయకులు అచ్యుతానందన్ గారు ఓ మాట అన్నారు. ‘చాందీ పగలు కాంగ్రెస్ మనిషి. రాత్రి ఆర్ఎస్ఎస్ మనిషి’ అని. దేశంలో వీరంతా మతేతర రాజకీయాలకు ప్రతినిధులు. తమకు అనుమానంగా ఉంటే- పాత వార్తాపత్రికల్నిఅటకెక్కించేసి- ఒక్కసారి లల్లూ, మమతాబెనర్జీ చెంపలు రాసుకుంటూ నిలబడిన సుందరదృశ్యాన్నీ, పొట్టలు పగిలేలాగ లల్లూప్రసాద్ గారు అరవింద్ కేజ్రీవాల్‌ని చంకకెత్తుకున్న దృశ్యాన్నీ చూసి తరించండి. నేను మోదీ భక్తుడని కాను. భారతీయ జనతా పార్టీ సభ్యుడినీ కాను. కానీ ఒక వ్యక్తి, ఒక పార్టీలోని ఒక వర్గమూ కారణంగా ఈ దేశం ‘మతం’ అనే కుళ్లు సరుకుతో కుక్కలు చింపిన విస్తరి కాకుండా ఇటు కన్యాకుమారి నుంచీ అటు కశ్మీర్‌దాకా - నాయకులు భుజాలు రాసుకున్న అతి విచిత్రమైన, చరిత్రాత్మకమైన సంఘటన బిహార్‌లో జరిగినది. ఈ ఒక్క కారణానికే నేను మోదీ అనే శత్రువును అభినందిస్తున్నాను - ఎట్టకేలకు ఈ దేశాన్నీ- ఈ దేశంలో రాజకీయశక్తుల సమీకరణకు దోహదం చేసినందుకు. చివరిగా- ప్రజాస్వామ్యమనే గాడిదకు నా నివాళి. (గొల్లపూడి మారుతీ రావు) -
రెండు ముసుగుల కథలు
జీవన కాలమ్ ఈ రోజుల్లో స్వేచ్ఛకి అర్థాలు మారిపోయాయి. ముసుగుల అవసరాలు మారిపోయాయి. తన ఉనికిని దాచుకోవలసిన కర్మ తనకు లేదని ఓ ఢిల్లీ అమ్మాయి బోరవిరుచుకోవడమే ఇందుకు నిదర్శనం. మొన్న ఢిల్లీలోని తిలక్‌నగర్ లో జస్లీన్ కౌర్ రోడ్డు దాటు తోంది. మోటారు సైకిలు మీద వెళ్తున్న సరబ్జిత్ సింగ్ అనే కుర్రాడు జోరుగా వెళ్తూ దాదా పు ఆమెను గుద్దేశాడు. ‘సిగ్న ల్స్ చూసుకో’ అంది అమ్మా యి కోపంగా. అక్కడితో కుర్రా డు మోటారు సైకిలు దిగి తిట్లు లంకించుకున్నాడు. ‘నాతో మోటారు సైకిలు ఎక్కు తావా?’ అన్నాడు బులిపిస్తూ. మనది భారతదేశం కనుక చుట్టూ రెండు డజన్ల మోటారు సైకిళ్ల వారున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ అమ్మాయి అతని ఫొటో తీసింది. సింగుగారు వీరుడిలాగ పోజిచ్చి నిలబడ్డాడు. ఆ అమ్మాయిని బెదిరించి వెళ్లాడు. కౌర్ పోలీస్ స్టేషన్లో రిపోర్టి చ్చింది. కుర్రాడిని అరెస్టు చేశారు. ఈ కథలో నాకు నచ్చిన అంశం ఇది. సెంట్ స్టీఫెన్ కాలేజీ విద్యార్థిని కౌర్ అన్నది: ‘నేను నా ముఖాన్ని కప్పుకోను. కప్పుకొంటే అది కుర్రాడి విజయం అవుతుంది’. అంతేకాదు నేరస్థు లను ముసుగులు కప్పుకోనిస్తారెందుకు? ముసుగులు తియ్యండి. దేశాన్ని ఆ మహానుభావుల్ని దర్శించని య్యండి’. కౌర్‌కి నా హార్దిక అభినందనలు. మరో ముసుగు కథ. నేను విశాఖపట్నం బీచిలో మిత్రులతో కూర్చున్నాను. ఒక అమ్మాయీ అబ్బాయీ చెట్టాపట్టాలేసుకుని నడుస్తూ వెళ్తున్నారు. అమ్మాయి తల నిండా ముసుగు. రెండు కళ్లు మాత్రం తెలుస్తున్నాయి. నన్ను చూడగానే ఆ అమ్మాయి చటుక్కున తలమీద ముసుగు తీసేసింది. కుర్రాడు దూరంగా నిలబడ్డాడు. ఒక పుస్తకం తీసి నా ఆటోగ్రాఫ్ అడిగింది. ‘‘ఈ ముసుగు వేసుకున్నావేం’ అనడిగాను- ఎన్నా ళ్లనుంచో ఏ అమ్మాయినయినా ఈ ప్రశ్న అడగాలని నా ఆరాటం. ఆ పిల్ల నవ్వింది - అది అర్థం లేని ప్రశ్న అన్నట్టు ‘నాకు గాలికి చర్మం మీద దురదలు వస్తాయి’’ అంది. ‘‘మీ అమ్మగారు ముసుగు వేసుకునేవారా?’ ‘‘లేదు’’. ‘‘మీ నాన్నగారు?’’ ‘‘లేదు’’. ‘నీ పక్కనున్న నీ బాయ్ ఫ్రెండుకి ముసుగు లేదు. నాకు లేదు. నా పక్కనున్న ఎవరికీ లేదు. బీచిలో నడిచే రెండు వందల మందికీ దు. ఈ చుట్టుపక్కల - అయి దారు మంది వయసున్న ఆడపిల్లలకి మాత్రమే ఉంది. వారికే దురదలు ఎందుకొస్తున్నాయి?’’. ఆ అమ్మాయికి యీ మాటలు ఇబ్బందిగా ఉన్నా యని అర్థమవుతోంది. ఈ దిక్కుమాలిన నటుడిని ఎం దుకు ఆటోగ్రాఫ్ అడిగానా అన్న విసుగు తెలుస్తోంది. ‘‘ఎన్నాళ్లయింది ఈ ముసుగు వేసి?’’ ‘‘ఎనిమిది నెలలు’’ ‘‘ఎన్నాళ్లయింది మీ యిద్దరూ కలిసి?’’ ‘‘తొమ్మిది నెలలు’’ ఇబ్బంది ఎక్కువయింది. మా మిత్రుడు తెగేదాకా లాగొద్దని నన్ను గోకాడు. నా పెద్దరికం ఒక గీత దాటితే అక్కరకు రాదు. పుస్తకం మీద సంతకం పెట్టాను. చటు క్కున మాయమయింది. నాలుగు అడుగులు వేయగానే మళ్లీ ముసుగులోకి వెళ్లిపోయింది. ఢిల్లీలో అమ్మాయి గర్వంగా ‘‘నా గుర్తింపుని దాచి పెడితే నేరస్థుడి విజయం’’ అంటూ తన ఉనికిని చాటు కుంది. విశాఖపట్నం అమ్మాయి తన గుర్తింపుని దాచు కుంది. ఢిల్లీలో నేరస్థుడు ఆమె మొబైల్ ముందు బోర విరిచి నిలబడ్డాడు. విశాఖపట్నంలో బోయ్‌ఫ్రెండు (అతనూ తెలుగువాడే!) దూరంగా నిలబడ్డాడు. ఏమయినా ఇప్పుడిప్పుడు వయస్సున్న అమ్మా యిల్ని పర్యావరణ కాలుష్యం చాలా ఇబ్బంది పెడు తోంది. దురదలు ఎక్కువవుతున్నాయి. ఈ దురదల్ని వదలగొట్టి వాళ్లు ముసుగులు తీసి స్వేచ్ఛగా నడిచే అవకాశాన్ని కల్పించాలని నేను మోదీ గారిని కోరుతు న్నాను. ఇది ఈ కాలం కాలేజీ పిల్లల హక్కు అని హెచ్చ రిస్తున్నాను. ఈ రోజుల్లో స్వేచ్ఛకి అర్థాలు మారిపోయాయి. ముసుగుల అవసరాలు మారిపోయాయి. తన ఉనికిని దాచుకోవలసిన కర్మ తనకు లేదని ఓ ఢిల్లీ అమ్మాయి బోరవిరుచుకోవడమే ఇందుకు నిదర్శనం. అయితే ఈ రోజుల్లో పర్యావరణ కాలుష్యం వయస్సున్న ఆడపిల్లల్ని బాధపెడుతోందన్న విషయం ఏ నగరంలో ఏ రోడ్డు మీద చూసినా మనకు అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం నిజం. నిజాయితీకి ముసుగు వేసే వాళ్లే ముసుగుల్ని ఆశ్రయిస్తారు. అలాగని ముసుగు వేసే వారంతా నిజాయితీపరులు కారని నేననడం లేదు. ఏ ముసుగులో ఏ అర్థం ఉందో తెలియని రోజులొచ్చాయి. ఇలా నేను చెప్తున్నప్పుడు కొందరయినా వ్యక్తి స్వేచ్ఛ తమ హక్కని ఘోషించవచ్చు. వ్యక్తి స్వేచ్ఛ బూతుమాటలాగ కనిపించే రోజులొచ్చాయి. సభ్య సమాజంలో సామూహిక విలువలను పాటించడం కూడా వ్యక్తి బాధ్యతే. ఇదంతా జస్లీన్ కౌర్ అనే 20 ఏళ్ల ఆడపిల్ల ‘‘నా గుర్తింపును నేను దాచుకోవలసిన ఖర్మ లేదు’’ అని గర్వంగా చెప్పి నా నోరు తెరిపించింది కనుక. గొల్లపూడి మారుతీరావు. -
ఇద్దరు దేవకన్యలు
జీవన కాలమ్ దేవకన్యలు ఎలా ఉంటారు? తెల్లటి చీరల్లో- ‘జగదేకవీరు డు-అతిలోకసుందరి’లో శ్రీదే విలాగ తెల్లని రెక్కలు టపటప లాడించుకుంటూ ఆకాశంలో ఎగురుతారా? కాదు బాబూ, కాదు. ఆలోచనలు ఆకాశంలో విహరిస్తుండగా - శరీరం హె చ్చరికలని బేఖాతరు చేస్తూ- కలలని నిజం చేసే అరుదైన అద్భుతాలుగా దర్శనమి స్తారు. ఈ కాలమ్‌లో ఇద్దరిని వారి ఫొటోలతో సహా పరి చయం చేస్తాను. మొదట ఒక నమూనా దేవకన్య. ఆమె రెండో ఏట టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. నాలుగో ఏట టెన్నిస్ ఆడిం ది. వాళ్ల నాన్నకి సరైన డబ్బు లేక భార్యని రష్యాలో వది లేసి, కేవలం ఏడేళ్ల అమ్మాయిని తీసుకుని అమెరికా వచ్చాడు. 11 ఏళ్ల తరువాత ఆమె ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచి ప్రపంచాన్ని తన విజయంతో, తన అం దంతో మిరిమిట్లు గొలిపింది. ఆ అమ్మాయి పేరు మారి యా షరపోవా. ఇది నమూనా మాత్రం. మరొక అమ్మాయి జెక్ దేశస్తురాలు- మార్టినా హిం గిస్. ఈ అమ్మాయి రెండేళ్లప్పుడే టెన్నిస్ రాకెట్‌ని పట్టు కుంది. నాలుగేళ్లప్పుడు టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొం ది. 1994లో 12 సంవత్సరాల హింగిస్ ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ చాంపియన్‌గా చరిత్రను సృష్టించింది. విశేష మేమిటంటే ఈమె రికార్డు సృష్టించాలని తల్లి కల. అం దుకనే ఆనాటి గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్ర తిలోవా పేరు కూతురికి పెట్టుకుంది. కొందరి చరిత్రలు తల్లి కడుపులోంచే ప్రారంభమవుతాయి. ఇది మరో నమూనా. 1996. లండన్‌లో ఒలింపిక్ క్రీడలు. జమ్నాస్టిక్స్ విన్యాసాలు జరుగుతున్నాయి. సాధారణంగా ఆ బహు మతిని దక్కించుకునే జర్మనీ, రుమేనియాలు ఆనాడు వెనుకబడ్డాయి. అమెరికా క్రీడాకారిణి కెర్రీ స్ట్రగ్వాల్ట్స్ మీంచి దూకింది. కాలి మణవ దగ్గర బెణికింది. 32 వేల మంది ప్రేక్షకులకీ, ప్రపంచానికీ అర్థమవుతోంది. కోచ్ కెరోల్యీ కూడా గుర్తు పట్టాడు. ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి. మరో రౌండుకు ఆమె కాలి ఎముక టప్పున విరిగింది. 32 వేల మంది గుర్తించారు. విరిగిన కాలితో మరో రౌండ్ చేయగలిగితే ఆమెదే స్వర్ణ పతకం. కెరో ల్యీకి గుండె గొంతులో కదిలింది. కెర్రీ నొప్పిని బిగబట్టి బనీనుతో కంట తడిని తుడుచుకుంది. ఆఖరి విన్యాసం అయ్యాక ఒక్క క్షణం నిలవాలి. ఈసారి గాలిలోకి లేచి దూకింది. మరిన్ని ఎముకలు విరిగాయి. నిలబడగల దా? ప్రపంచమంతా లేచి నిలబడింది. ఒక్క క్షణం నిలి చి కుప్పలా కూలిపోయింది. చప్పట్లు మిన్నుముట్టాయి. కెరోల్యీ వచ్చి ఆమెని చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ‘‘నేను బహుమతిని అందుకోవచ్చా?’’ అంది. ‘‘ప్రపంచమం తా ఎదురయి నిలిచినా నేను నిన్ను తీసుకువెళ్తాను ’’ అన్నాడు కెరోల్యీ. ఆమెను ఎత్తుకునే విజేతలు నిలిచే స్థలంలో నిలిచి ఆమె స్వయంగా స్వర్ణపతకాన్ని అందు కునేటట్టు చేశాడు కెరోల్యీ. ‘‘భగవంతుడు అందమైన రబ్బరు బొమ్మల్ని తయారు చేసి అందులో ఎముకలని ఉంచడం మరచిపోయాడు’’ అన్నాడు ఓ పత్రికా రచ యిత. తరువాత కెర్రీ స్కూలు టీచరుగా పని చేసి టక్సన్ (అరిజోనా)లో రాబర్ట్ ఫిషర్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకుంది. ఒక కొడుకు పుట్టాడు (ఈ కథని ఈ కాల మ్లో మూడోసారి రాస్తున్నాను). 2015. న్యూయార్క్‌లో స్వీట్‌హోం హైస్కూలులో చదువుతున్న 15 ఏళ్ల అమ్మాయి. పేరు శామ్ పీటర్ మాన్. ఆమెకి న్యూరో కార్డియోజనిక్ వ్యాధి. ఎక్కువగా పరిగెడితే ఈ జబ్బువల్ల నరాల వ్యవస్థ అదుపు తప్పు తుంది. ఊపిరి అందదు. ప్రాణం పోవచ్చు. 1500 మీట ర్ల పరుగు పందెంలో ఆ అమ్మాయి రోగం తెలిసీ పాలు పంచుకుంది. ఆమె స్కూలులో 6వ స్థానంలో ఉంది. ఇప్పుడు తన స్థానాన్ని మెరుగు పరుచుకోవడానికి పరుగు. ఆమె ఆరోగ్యం గురించి తెలిసిన తండ్రి డేల్ పీటర్ మ్యాన్ గమ్యం దగ్గర నిలబడతాడు. ఆమె పరుగు అయ్యాక కూలిపోతుంది. అప్పుడు అతని పరుగు ప్రారంభమవుతుంది. ఈసారి మొదటి స్థానంలోకి వచ్చింది. ఊపిరి అందడం లేదు. తండ్రి చేతులు చాచా డు. అతని చేతుల్లోకి వాలిపోయింది. గడ్డి మీద పడు కోబెట్టి శ్వాస అందుకునేటట్టు చేసి మంచినీరిచ్చాడు. ‘‘నాకు మెడల్ వస్తుందా?’’ అని అడిగింది శామ్. తండ్రి కన్నీళ్ల పర్యంతమై కూతుర్ని పొదివి పట్టుకుని భుజం మీద ఎత్తుకున్నాడు (ఎంత ప్రయత్నించినా ఇంతకంటే మంచి ఫొటో సంపాదించలేకపోయినందుకు క్షమిం చాలి). అనూహ్యమైన లక్ష్యశుద్ధి, అజేయమైన సంకల్ప బలం ఆయా వ్యక్తులను చరిత్ర సృష్టించేటట్టు చేస్తాయి. అన్నిటికీ మించి- ఆకాశాన్ని కళ్ల ముందు నిలుపుకుని- అనుకున్నది సాధించడం అపూర్వమైన గుండెబలం. ఈ దేవకన్యల సౌందర్యం శరీరానిది కాదు. కొండలని ఢీకొనే వారి వజ్ర సంకల్పానిది. గొల్లపూడి మారుతీరావు. -
మాగీ యాగీ
వ్యాపారానికి విశ్వాసం పెట్టుబడి. మనకు తెలియని సమాచారాన్ని, మనకు తెలిసిన, మనం అభిమానించిన వ్యక్తి తెలియచేయడమే ప్రక టన. బజారులో అమ్మే మిఠాయి తినవద్దంది అమ్మ. అటు వేపు కూడా చూడం. బజారులో ఉన్న ఫలానా పకోడీ బాగుంటుందన్నాడు పక్కింటాయన. ‘ఆయనెవరయ్యా చెప్పడానికి?’ అంటాం. ఇంకా, పక్కింటాయన మీద కోపం ఉంటే పకోడీ తిని మరీ ఆయన మాట తప్పని నిరూపిస్తాం. ప్రకటనకు పెట్టుబడి ఆ పెద్దమనిషి పరపతి. ‘పెద్దమనిషి’ అంటున్నాను కాని, ‘సినీ నటుడు’ అనడం లేదు. కారణం ఈ మధ్య ఎస్.పి. బాలసుబ్రహ్మ ణ్యం, సిరివెన్నెల, మనూ కూడా ప్రకటనల్లో పాల్గొంటున్నారు. ఆయా వ్యక్తుల పట్ల ప్రజల అభిమానం, విశ్వాసం ఆ ప్రకటనకు దన్ను. పిండికొద్దీ రొట్టె. మరీ బొత్తిగా ముఖం తెలియని వ్యక్తులతో ప్రకటనలు- చాలా సందర్భాలలో వారి అందమో, మాటలో ఆటలో చమత్కారమో కారణం కావచ్చు. కత్రినా కైఫ్, జెనీలియా, ప్రీతీ జింటా మొదలైనవారు ప్రకటనల ద్వారా వెండితెరకు వచ్చినవారు. ఇర్ఫాన్ ఖాన్, ఓం పురీ లాంటి వాళ్లు వెండితెర ద్వారా ప్రకటనలలో జొర బడినవారు. దేనికైనా పరపతి, ప్రచారమే ముఖ్యం. బొత్తిగా ప్రకటనల వ్యవహారం తెలియనివారు కొందరు ఈ మధ్య నన్ను అడిగారు: ‘‘అయ్యా! ఒక నిముషం ప్రకటన సినీమాలో నటించడానికి అంత డబ్బు ఎందుకండీ?’’ అని. చూడడానికి ఇది విపర్యంలాగే కని పిస్తుంది. కాని ఇందులో తిరకాసు ఉంది. బండగా చెప్పాలంటే ‘సినీమా’ నూనె తయారు చేసే గానుగ. ప్రకటన- సీలు వేసి నూనెను సూపర్ మార్కెట్లో అమ్మే దుకాణం. సినీమా పెట్టుబడి. ప్రకటన కరెన్సీ. ప్రకట నకు ఎక్కువ డబ్బు ఇచ్చేది - వ్యవధిని బట్టి కాదు. ఆ వ్యక్తి పరపతిని బట్టి. ‘‘మీరు ఖరీదు చేసేది ఆ నిమిషాన్ని కాదు. డబ్బు చేసుకొనేది - మున్ఫై సంవత్సరాలు ఆ నటుడు కూడబెట్టుకున్న పరపతిని. అమితాబ్ బచ్చన్ చేతిలో కొంగమార్కు పళ్లపొడి పొట్లం ఉంటే కోటి మంది దాన్ని గుర్తిస్తారు. అప్పలకొండ అనే వ్యక్తి చేతిలో ప్రపంచ ప్రఖ్యాత టూత్‌పేస్ట్ ట్యూబు ఉంటే పక్కవాడు కూడా గుర్తించడు. ఎన్.టి. రామారావుకి వేసే ఓటు ఆయన నిరూపించిన ఒక జీవితకాలపు సంప్రదాయం పట్ల చూపే విశ్వాసం. స్క్రీన్‌ప్లే రచనలో బండసూత్రం- తెలియని విషయాన్ని తెలిసిన మార్గంలో పరిచయం చెయ్యాలి. మరొక్కసారి - గుర్తింపుకి ‘విశ్వాసం’ పెట్టుబడి. కావాలనే ఈసారి ‘వ్యాపారం’ అనడం లేదు. అమితాబ్ బచ్చన్ తెరమీద తొడుక్కోమన్న చెప్పుల్ని మనం తొడుక్కుంటున్నామంటే అర్థం-మనకి తెలిసిన, మనం అభిమానించే, మనం నమ్మిన ఓ వ్యక్తి మన లాగే ఆ పని చేసి తృప్తి చెందాడు కనుక. అమితాబ్ బచ్చన్ చెప్పుల తయారీలో డిగ్రీ సంపాదించినవాడని కాదు. ‘‘ఈ కారు అద్భుతం’’ అని మనకు తాళాలు చూపించే హిందీ నటుడు షారుక్‌ఖాన్‌ని ‘‘ఏమయ్యా! నువ్వెప్పుడైనా ఆటోమొబైల్ కోర్సు చేశావా?’’ అని ఎవరైనా అడిగారా? ఇప్పుడు అసలు కథ. అలా అడగాలా? వద్దా? దేశ మంతా ఆవురావురుమని తింటున్న మాగీ నూడుల్స్ గొప్పవని, మంచివని ముగ్గురు తారలు మనకు చెప్పా రు. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా. గత 30 సంవత్సరాలుగా దేశమంతా తింటోంది. ఇప్పు డు మాగీ నూడుల్స్‌ను చాలా రాష్ట్రాలు బహిష్కరించా యి. నెస్లే సంస్థే ఆ సరుకుని ఈ దేశం నుంచి ఉపసంహరించింది. ఇందులో సినీతారల బాధ్యత ఎంతవరకు ఉంది? ప్రపంచమంతటా వ్యాపారం చేస్తున్న ఓ కార్పొరేట్ సంస్థ సరుకుని ఆ సంస్థ పరపతి దృష్ట్యా అంగీకరించి- బోలెడంత డబ్బు పుచ్చుకుని ప్రకటనలు ఇవ్వడం ఎంత వరకు సమంజసం? ఇందులో మోనోసోడియం గ్లుటా మేట్ పాలు ఎక్కువ కావడం వల్ల రక్తహీనత, మోతాదు మరీ మించితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని అమి తాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా తెలుసు కోవలసిన అవసరం ఎంతవరకు ఉంది? వారి మీద కేసులు నమోదయ్యాయి. తీరా వాద ప్రతివాదాలు జరుగుతాయి. తమ విశ్వాసాన్ని పెట్టుబ డిగా వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారి సరుకుని ఏమాత్రం మంచిచెడ్డలు తెలుసుకోకుండా సమర్థించడం నేర మే కదా! అయితే 30 సంవత్సరాలు తెలుసుకోవలసిన, తెలియజెప్పవలసిన జాతీయ సంస్థకే ఈ నిజం తెలియలేదు కదా! అయితే అది సమర్థించుకునే ‘కారణం’ అవుతుందా? విశ్వాసాన్ని పెట్టుబడిగా వినియోగించుకుంటున్న వ్యాపారికీ, దాన్ని డబ్బు చేసుకుంటున్న ‘సినీతార’కీ సామాజిక బాధ్యతల పాళ్లు ఎంతవరకూ ఉన్నాయి? ఇది నీతికీ, న్యాయానికీ, చట్టానికీ కొరుకుడు పడని విచికిత్సే. విచారణ, న్యాయవాదుల వాదనలూ ఆసక్తిక రంగా ఉండక తప్పవు. (రచయిత: గొల్లపూడి మారుతీరావు) -
సద్గురువుల అస్తమయం
ఆయన ముందు కూర్చుని, ఆయన మాట విని లేచాక భారతీయుడినైనందుకు, అంతటి సద్గురువుల నుంచి అన్ని సత్యాలను ఎరిగినందుకు వొళ్లు పులకిస్తుంది. ఆయన నిజమైన సద్గురువు. రామాయణ, భారత, భాగవత ప్రవచనాలు చెప్పలేదు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వ లేదు. తాయెత్తులు కట్టలేదు. మంత్రాలు వెయ్యలేదు. కాని అత్యంత హృద్యమైన రీతిలో ఏంత్రోపాలజీ, చరిత్ర, మాన వ సంస్కృతి, ధర్మనిరతి, సం ప్రదాయ ఔచిత్యం, జీవనసరళి-ఇన్నింటినీ సమన్వ యించి ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతివ్యక్తికీ అందే మా ర్గంలో సత్యాన్ని నిరూపించిన నిజమైన గురువు శివానందమూర్తిగారు. అపూర్వమైన అవగాహన, అనూహ్యమై న సమన్వయం, ఆశ్చర్యకరమైన నైర్మల్యం మూర్తీభవిం చిన గురువరేణ్యులు శివానందమూర్తి మహోదయులు. ఎప్పుడు వారి సమక్షంలో కూర్చున్నా ఒక జీవితకా లం మననం చేసుకోవలసిన విజ్ఞాన సంపదను - మన దృష్టిని దాటిపోయే విలక్షణమైన కోణాన్ని - ఆవిష్కరిం చేవారు. వారి ప్రత్యేక భాషణాన్ని రాసుకుని మరీ కాల మ్స్ రాసిన సందర్భాలున్నాయి. కొన్ని విషయాలను స్థాళీపులాక న్యాయంగా ఉటంకిస్తాను. శైవం ఒక్క భారతదేశంలోనే కాదు-ఈజిప్టు, మొస పటేమియా, ఆఫ్రికా, మలేసియా వంటి ఎన్నో దేశాలలో ఉంది- అంటూ సోదాహరణంగా నిరూపించారు. పరాశక్తి ఈశ్వరుని స్వభావం. కన్నుమూస్తే ఈశ్వరుడినే చూడాలి. కన్నుతెరిస్తే ధర్మాన్ని చూడాలి. మంచి భావాలే విద్య. ధర్మాన్ని ప్రాణంగా కలిగిన ఆచార వ్యవహారాలే మతం. శివానుగ్రహం నాకుందని తెలుస్తోం ది. అది అర్హత కాదు. అనుగ్రహం. సత్యమంత రుచికరమైన వస్తువు ప్రపంచంలో మరొకటి లేదు. ప్రపంచానికంతటికీ పేదరికం అంటే దరిద్రం. కాని ఒక్క హైందవ జీవనంలోనే అది వైభవం. ఇక్కడ ప్రసక్తి ‘లేమి’ కాదు. ‘అక్కర లేకపోవడం’. అన్ని ప్రతిభలూ, ప్రజ్ఞాపాటవాలూ, శక్తిసామర్థ్యా లూ, విజయాలూ-అన్నీ పర్యవసించే, పర్యవసించాల్సి న ఒకే ఒక్క గుణం-సంస్కారం. (75 సంవత్సరాల వయస్సున్న నన్ను శృంగేరీస్వామికి ఒకే ఒక్కమాటతో పరిచయం చేశారు- ‘సంస్కారి’ అని!) సంపద కూడబెట్టడానికి కాదు- వితరణ చెయ్య డానికి. అవసరం ఉన్నవాడికి ఇవ్వడానికి చేర్చి పెట్టుకున్నవాడు కేవలం కస్టోడి యన్. (ఒకసారి భీమిలి ఆనందాశ్రమం లో నేను వారిసమక్షంలో కూర్చుని ఉం డగా ఒక పేదవాడు వచ్చి తన కష్టమేదో చెప్పుకున్నాడు. శివానందమూర్తిగారు లోపల్నుంచి మనిషిని పిలిచి ‘ఇతనికి ఐదువేలు ఇచ్చి పంపించు’ అని చెప్పా రు.) ఈ సత్యాన్ని ఉర్లాం జమీందారీ కుటుంబంలో పుట్టిన ఆయన తన జమీందారీని వదిలి అతి సరళమ యిన జీవికని ఎంచుకుని నిరూపించారు. ఉత్తర హిందూ దేశంలో గిరిజనుల పునరావాసా లకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నో ప్రజాహిత ప్రణాళికలకు కార్యరూపం ఇచ్చారు. వారు నెలకొల్పిన ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ, సనాతన హిందూ పరిషత్తు - ఎన్ని భారతీయ సంప్రదాయ వైభవాన్ని ఆవిష్కరించే కార్యక్రమాలు నిర్వహించిందో లెక్కలేదు. ఆయన ముందు కూర్చుని, ఆయన మాట విని లేచాక భారతీయుడినైనందుకు, అంతటి సద్గురువుల నుంచి అన్ని సత్యాలను ఎరిగినందుకు వొళ్లు పులకిస్తుం ది. గర్వపడాలనిపిస్తుంది. అది నా స్థాయి. కాని గర్వా నికీ, స్వోత్కర్షకీ ఆయన దూరం. ఏనాడూ ‘నేను’ అనే మాటని ఆయన నోటి వెంట వినలేదు. నా షష్టి పూర్తికి వారి ఆశీర్వాదాన్ని తీసుకోడానికి నేనూ, నా భార్యా వెళ్లాం. ‘‘రండి. నా పనిని తేలిక చేశారు’’ అంటూ రుద్రాక్ష, ముత్యాల బంగారు మాలని నా మెడలో వేసి ‘దీన్ని ఎప్పుడూ తియ్యకండి’ అంటూ మా యిద్దరికీ బట్ట లు పెట్టి దీవించారు. ఈ సృష్టిలో అవినీతి, క్రౌర్యం, దుర్మార్గం, దౌష్ట్యం వంటి శక్తులు ప్రబలినప్పుడు సమాజగతిని సమతు ల్యం చేయడానికి ఒక్క గొప్ప శక్తి అవసరమౌతుందన్నది భగవద్గీతకారుడి వాక్యం. ఎన్నో అరాచకాలు, రుగ్మ తలు, దౌష్ట్యాల మధ్య ఒక్క మహానుభావుడి ఉనికి గొప్ప ఊరట. చలివేంద్రం. గొడుగు. గొప్పశక్తుల, వ్యక్తుల సౌజన్యం ఇలాంటి దుష్టశక్తుల నుంచి విడుదల. అలాం టి గొప్ప శక్తి, స్ఫూర్తిని కోల్పోయిన దురదృష్టమైన క్షణం శివానందమూర్తి సద్గురువుల నిర్యాణం. ఎన్ని అవాం చిత పర్యవసానాలకో ఆయన సమక్షం ఒక గొప్ప సమా ధానం. గొప్ప చేయూత. గొప్ప ధైర్యం. ఆ అదృష్టాన్ని ఈ తరం నష్టపోయింది. - గొల్లపూడి మారుతీరావు -
చట్టానికి చుట్టాలు
(జీవన కాలమ్) తీరా నేరం చేశాక- ఈ హీరోగారు ఒక ట్రస్టుని ప్రారంభించి ప్రజా సేవ చేస్తున్నారట. కానీ బాధితుల కుటుంబాలకు కేటాయించిన 19 లక్షల్లో ఒక్క రూపాయి కూడా ఈ 13 ఏళ్లలో వారికి చేరలేదు! ఈ దేశంలో దాదాపు అన్ని రంగాలూ అవినీతితో భ్రష్టు పట్టిపోతుండగా ఒక్క చట్ట మూ, న్యాయమూ ఏకాస్తో ఉపశమనం కలిగిస్తున్నదన్న ఆశ సామాన్య మానవునికి మిగిలింది. అయితే డబ్బూ, పరపతి, పదవి, అధికారం వంటివి ఆ చట్టాన్ని కూడా లొంగదీసుకోవచ్చునని ఇప్పుడిప్పుడే రుజువవుతోంది. అలనాడు మహాత్మా గాంధీ ‘యంగ్ ఇండియా’లో అన్నా రు: ‘‘బ్రిటిష్ న్యాయ స్థానాల్లో న్యాయం ఖరీదైన సరు కు. సాధారణంగా బరువైన డబ్బు సంచీదే విజయం’’ అని. మనం బ్రిటిష్ వ్యవస్థ వారసులం. 13 సంవత్సరాల కిందట తాగి, లెసైన్సు లేకుండా కారు నడిపి ఒకరిని చంపి, నలుగురిని గాయపరిచి, సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ప్రముఖ నటు డు- సల్మాన్ ఖాన్ ఈ 13 సంవత్సరాలూ ఖరీదయిన లాయర్ల దన్నుతో కేసుని సాగదీశారు. 13 ఏళ్ల తర్వాత కారులోలేని మరొక కొత్త సాక్షిని -డ్రైవర్ని-రంగంలోకి దింపారు. చట్టంలో అలసత్వం కారణంగా న్యాయవ్య వస్థ - ఎంత డబ్బుని, ఎంత సమయాన్ని, ఎంత విలు వైన సిబ్బంది కృషిని వెచ్చించిందో ఆలోచిస్తే ఇలాంటి నేరస్థుల వల్ల వ్యవస్థ ప్రజాధనాన్ని ఎంత వృథా చేస్తోం దో అర్థమవుతుంది. ఇది సామాన్య పౌరుడి పెట్టుబడి. మనందరి సొమ్ము. తీరా న్యాయస్థానం సల్మాన్ ఖాన్ నేరస్థుడని తీర్పు ఇచ్చాక- ఏనాడూ జరగని విధంగా కోర్టులూ, ఆఫీ సులూ రాత్రి ఎనిమిది వరకు పనిచేసి ఈ నేరస్థుడయిన హీరోగారు జైలుకి వెళ్లకుండా కాపాడాయి. 48 గంటల తర్వాత 13 సంవత్సరాల బెయిలుని మరో రెండు రోజులు పొడిగించారు. కోర్టు ఆర్డరు చేతికి రాకుండానే హైకోర్టు రెండు గంటల్లో తీర్పుని ఇచ్చింది! ఈ దేశంలో కనీసం రెండున్నర లక్షల మంది- నూరు రూపాయల లంచం తీసుకున్న పాపానికి బెయి లు డబ్బు కట్టుకోలేక, కోర్టులకు తమ గోడుని ఎలా వినిపించాలో తెలియక సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 1984లో 57 రూపాయలు మనియా ర్డరు సొమ్ము తిన్న ఒకానొక పోస్టుమాన్ 372 సార్లు - 17 సంవత్సరాలు కోర్టుకు హాజరయాడట! చివరికి అతను నిరపరాధి అని కోర్టు తీర్పు ఇచ్చింది! తీరా నేరం చేశాక- ఈ హీరోగారు ఒక ట్రస్టుని ప్రారంభించి ప్రజా సేవ చేస్తున్నారట. చేతులు కాల్చుకు న్నాక, చేతులు కాలాయని తెలిసిన గడుసయిన ‘డబ్బు న్న’ నటుడు ఆకులు పట్టుకున్న తెలివైన ప్రణాళిక. ఇం తకీ చచ్చిపోయిన వ్యక్తి కుటుంబానికీ, గాయపడినవారి కుటుంబాలకూ కేటాయించిన 19 లక్షల్లో ఒక్క రూపా యి కూడా ఈ 13 ఏళ్లలో బాధితులకి చేరలేదు! ఇంతకూ సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్తారా? వారి పట్ల అభిమానులు ఎలా ఆవేశపడుతున్నారు? సినీ ప్రపంచం ఏకమయి ఎలా సానుభూతి పలుకుతోంది? ఆయన్ని కోర్టులో చూసి తరించిన పోలీసులు అతి ఆనందంగా వారితో ఎలా కరచాలనం చేస్తున్నారు? చట్టాన్ని అటకె క్కించి తనని జైలు నుంచి తప్పించిన లాయర్లని హీరో గారు ఎంత ఉదారంగా కావలించుకుంటున్నారు?- ఈ దృశ్యాల్ని కేవలం 72 గంటలు చూపించి చానళ్లు సమృ ద్ధిగా డబ్బు చేసుకున్నాయి. ఇదంతా పెద్ద తమాషా. మరో పంచ రంగుల కల. 1988లో 28 ఏళ్ల ఫిలిం డెరైక్టర్ చారుదత్ ఆచా ర్యని ఓ ప్రముఖ దర్శకుడు, కవి కూతురు కారుతో గుద్దేసింది. అతని కాలు నుగ్గు నుగ్గు అయి శాశ్వతంగా కుంటి అయ్యాడు. ఆమె యాక్సిడెంటు స్థలం నుంచి యథాప్రకారంగా నిష్ర్కమించింది. ఈ ఆచార్యగారి మాటలు: ‘‘ఢీకొట్టి, పారిపోవడంలో (హిట్ అండ్ రన్) రెండు అంశాలున్నాయి. ఢీకొట్టడం, పారిపోవడం. చాలా సందర్భాల్లో-రక్తంలో విస్కీ పాలు ఎక్కువయి ఢీకొట్టవచ్చు. కాని పారిపోవడం- వ్యక్తిలో మానవతా విలువలు పూర్తిగా లోపించాక, రక్తంలో అహంకారం ప్రబలినప్పుడు మాత్రమే జరుగుతుంది. విస్కీ మత్తులో ఉన్నవాడు కారు నడపడం రద్దీగా ఉన్న వీధిలో చింపాం జీ చేతికి ఏకే-47 రైఫిల్ ఇచ్చినట్టు. ఇది కేవలం తాగు బోతు కారు నడిపిన కేసు మాత్రమే కాదు. సిగ్గూ యెగ్గూ లేకుండా పరారీ అయిన నేరస్థుడి కథ. తమ కోటీశ్వరుల క్లబ్బులో వాటాదారుడయిన ఒక స్టార్‌కి వెన్నెముకలేని పరిశ్రమ మద్దతు పలికే సిగ్గు మాలిన కథ.’’ ఇవి నా మాటలు కావు. 17 సంవత్సరాలు ఇలాం టి యాక్సిడెంటులో ఎన్నో ఆపరేషన్లు, ఎన్నో వైఫ ల్యాలు, రోగాలు తట్టుకుని ఉపాధిని కోల్పోయి చేతి కర్రతో మిగిలిన ఓ దురదృష్టవంతుడి గొంతు. చట్టాలకు కొందరు చుట్టాలుంటారు. వారిలో డబ్బులేని పేద నేర స్థులకి చోటు లేదు. ఆ కారణానికే ఈ దేశంలో ఖరీద యిన చింపాంజీలు చాలా వున్నాయి. (గొల్లపూడి మారుతీరావు) -
కప్పల తక్కెడ
జీవన కాలమ్ కొందరికి, కొన్నింటికి - వాటి ద్వారా కలిగే ప్రభావాన్ని బట్టి కొన్ని అపప్రథలు మిగులుతాయి. సంస్కృతం ‘మతవాది’ అన్నది కూడా అలాంటిదే. బొత్తిగా బూజుపట్టిన ఆలోచనలున్న ఒక పాఠ కుడు - ఒకానొక ఆంగ్ల దినపత్రికలో మొన్న ఒక సంపాదక లేఖ రాశాడు. ఈ దేశంలో సంస్కృత భాషని పెంపొందించుకో వాలని అంటూ, ఆ భాష మతానికే కాక వైద్యం, రసాయనిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, గణితశాస్త్రం, ధనుశ్శాస్త్రం, అణుశాస్త్రం వంటి విభా గాలలో ఎంతో పురోగతిని సాధించిందని గర్వ పడ్డాడు. ఇలాంటి మైనారిటీ ఆలోచనలున్న వ్యక్తు లింకా ఈ దేశంలో ఉండటం ఆశ్చర్యకరం. చాలా కాలం కిందట ఓ విదేశీ దౌత్య ఉద్యోగి మన భారతీయ ఉద్యోగిని అడిగారట: ‘ఏమండీ! మీ దేశంలో ప్రపంచానికి దీటుగా నిలువగల, అత్యంత పురాతనమయిన సంస్కృత భాష ఉందికదా, దాని వికాసానికి మీ ప్రభుత్వం పూనుకోదేం?’’ అని. భారత దౌత్య ఉద్యోగి ఆ ప్రశ్నకే కంగారు పడి పోయి ‘‘బాబూ, మా దేశంలో సంస్కృతానికీ మతా నికీ లంకె. అందుకని ఆ భాషని మేం ముట్టుకోము’’ అన్నారట. మన దేశంలో చాలా దున్నలు ఈనుతూ ఉంటాయి. వాటి దూడల్ని మనం అనునిత్యం పశు వుల కొట్టాల్లో కట్టేస్తూంటాం. మన గొప్పతనం పొరుగువాడు చెప్తే మనకు రుచిస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థలో సైంటిస్టు రిక్ బ్రిగ్ మాటలివి. ‘సంస్కృతం గణితం, శాస్త్ర పరిశోధనకేకాక ఉచ్చారణను అభివృద్ధి చేయ డానికి ఉపయోగపడుతుంది. ఏకాగ్రతను పెంచు తుంది. ఆ భాషలోని అక్షరాలు సశాస్త్రీయమైనవి. వాటిని సరిగ్గా ఉచ్చరిస్తే మాటలో స్వచ్ఛత, ధాటీ పెరుగుతుంది. ఆలోచనాశక్తి పదునుదేరి, జ్ఞాపకశక్తి, ధారణ పెరుగుతుంది.’ విచిత్రంగా ప్రపంచ భాషల న్నింటిలో నేటి కంప్యూటర్‌కి చక్కగా అతికినట్టు సరిపోయే భాష సంస్కృతం (ట). Sanskrit and computer are perfect fit. ఐర్లాండులో ఒక స్కూలులో సంస్కృతం నేర్పు తారు. ఇలాంటి స్కూళ్లు ప్రపంచంలో ఆరే ఉన్నాయి. ఓ జర్మన్ తండ్రి రడ్గర్ కోర్టెన్‌హోస్ట్ తన కొడుక్కి ఎం దుకు సంస్కృతం నేర్పిస్తున్నాడో ఒక వ్యాసం రాశా డు. ఆయన మాటలు: శబ్ద సౌందర్యం, ఉచ్చారణ లో తూకం, భాషా శిల్పంలో నిర్దుష్టత ఏ భాషలోనూ ఇంతగా లేదు. మిగతా భాషల్లాగ సైద్ధాంతికంగా ఈ భాషలో ఎట్టి మార్పూ రాదు. మానవాళి ఆర్జించు కున్న అతి పరిణతిగల భాషగా సంస్కృతానికి ఎలాంటి మార్పూ అవసరం లేదు. అందుకే సంస్కృ తం లిపిని ‘అక్షరం’, అంటే నశించనిది, అన్నారు. ఇదీ ఆయన వివరణ. కొందరికి, కొన్నింటికి - వాటి ద్వారా కలిగే ప్రభావాన్ని బట్టి కొన్ని అపప్రథలు మిగులుతాయి. సంస్కృతం ‘మతవాది’ అన్నది కూడా అలాంటిదే. ఈ రోజుల్లో ప్రతి రచనా కాలధర్మాన్ని బట్టి ఎలా పీడిత ప్రజాభ్యుదయం లక్ష్యంగా పురోగమిస్తోందో, ఆ రోజుల్లో సంస్కృతమూ ధర్మమూ, దైవమూ ప్రాతిపదికగా రచనల్ని సాగించింది. ఊహించని స్థాయిలో మేధా సంపత్తిని, భక్తి తత్పరతని ప్రదర్శించినప్పుడు తన్మయులమవు తాం. ఆ ప్రతిభ అవధులు దాటితే చెప్పడానికి మాటలు చాలవు. అప్పుడేమంటాం? మాటలకం దని ‘దేవుడు’ అంటాం. ఇంకా పై దశ - సాక్షాత్తూ దేవుని అవతారమే అంటాం. వర్తమానంలో అలాం టి ఉదాహరణ ఒకటుంది. సచిన్ తెందూల్కర్‌ని మనం ‘దేవుడు’ అనే అంటున్నాం. ఈ యీ అపూర్వమైన మౌలిక రచనల మీద మతం ‘మరక’కి అర్థం అదే. కాగా, మనది ప్రజాస్వామిక వ్యవస్థ. పాపం, మన ప్రభుత్వం ఆగస్టు 7-15 వరకు సంస్కృత వారోత్సవాలు జరపాలని సెకెండరీ విద్యా కేంద్ర సంస్థ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. తమిళనాడులో వైకోగారి ఎం.డి.ఎం.కె.; రామదాసుగారి పి.ఎం.కె. పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వెంటనే ఈ ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. డి.ఎం.కె. ఇలంగోవన్ ఒకమాట అన్నారు: ‘మా తమిళం సంస్కృతం కంటే ఏ మాత్రం తీసి పోదు’ - అని. వర్తమాన పరిభాషలో ‘వెంకయ్య మహానుభావుడు’ అంటే ‘వీరయ్య శుంఠ’ అని అర్థం. హిందీ భాష పట్ల ఇలాంటి ఉద్యమాన్నే ద్రవిడ మున్నేత్ర కజగం జరిపి-హిందీని వ్యతిరేకించిన కారణంగానే ప్రజామోదాన్ని సంపాదించి 45 సంవత్సరాలుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది. భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ‘సున్నా’ను కనిపెట్టింది. గణితశాస్త్రంలో అదొక పెద్ద మలుపు. ఆర్యభట్టు, వరాహమిహు రుడు, చరకుడు, శుశ్రుతుడు, పాణిని, లీలావతి వంటివారెందరో సంస్కృతంలో ఎన్నో విభాగాల వికాసానికి బాటలు వేశారు. అయినా ఈనాటి భాషా వికాసం ఆయా విష యాల మీద బొత్తిగా అవగాహన లేని రాజకీయ పార్టీలు, నాయకుల పరిధిలో ఇరుక్కోవడం - ఈనాటి అభివృద్ధికి నిదర్శనం. మరొక్కసారి - సంస్కృతంలో మతం వాటా కేవలం పది శాతం.