తుప్పు ఆయుధం
జీవన కాలమ్
మనం రాజకీయ నాయకుల నిరాహార దీక్షలను చూస్తుంటాం. ప్రజలూ, ప్రభుత్వ యంత్రాంగం వణికి పోతూంటుంది. ఆ మహానుభావుడి ఔన్నత్యానికి కాదు. ఆయనకేదయినా అయితే ఎంత కల్లోలం, ఎంత అనర్థం చేస్తారోనని. పత్రికల్లో చాలామంది దృష్టిని ఈ వార్త దాటిపోయి ఉంటుంది. ఈమధ్య తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీజలాల తగువు సాగుతోంది. లోగడ రెండు రాష్ట్రాలూ చేసుకున్న ఒడం బడిక ప్రకారం కావేరీ నీరు తమిళనాడుకు కర్ణాటక వదిలిపెట్టాలి. ఈసారి వదలలేదు. తగాదా కేంద్రమంత్రి ఉమాభారతి దాకా వెళ్లింది. చర్చలు విఫలమయ్యాయి.
ఏకీభావం కుదరలేదు. ‘‘ఈ విషయంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను’’ అన్నారు కేంద్రమంత్రి ఉమాభారతి. ఇది పాఠకుల దృష్టిని దాటిపోయిన మెరుపు.
ఇదేమిటి? కాషాయ వస్త్రాలు ధరించిన యోగిని- చాలా మెట్లు దిగివచ్చి - లౌకిక ప్రపంచంలో - కాదు రాజకీయ ప్రపంచంలో కేంద్రీకృతమైన అధికారపీఠంలో కూర్చున్నారు. రాష్ట్రాల తగవులు, అసందర్భా లను సరిచెయ్యాల్సిన అధికారమూ, శక్తీ ఉన్న గద్దె అది. కాని సమస్య పరిష్కారం కాకపోతే ‘నిరాహార దీక్షని చేస్తానంటారేం!’ ఇదీ విషయం.
మంత్రుల పని నిరాహార దీక్షలు చేయడం కాదు. పాలించడం. పాలనకు అవసరమయితే అధికారాన్ని వినియోగించడం. ఉమాభారతిగారు భోజనం మానేస్తే సిద్ధరామయ్య, జయలలిత గారు మనసు మార్చుకుంటారనీ, వందల బస్సులు తగులబెట్టిన దౌర్జన్యకారులు కన్నీళ్లపర్యంతమయి కాషాయ వస్త్రాలు ధరిస్తారని మనం ఊహించలేము. కాని ఒకనాడు ఓ మహానుభావుడు సరిగ్గా అదే పనిచేశాడు. మానవతా విలువలకీ, రాజకీయ సమస్యకీ వంతెన వేసి ఫలితాలను రాబట్టగలిగాడు. ఆయన పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. ఎలా?
వ్యక్తిస్థాయిలో, మానవీయమయిన స్థాయిలో, నైతికమయిన స్థాయిలో - వ్యవస్థ అంతా గర్వించగల, వ్యవస్థకి ఆరాధ్యస్థానంలో ఉన్న ఒక వ్యక్తి- కాదు- ఆ వ్యవస్థ ఆరాధించే ‘శక్తి’ ఆ పనిచేస్తే అది ఆయుధ మవుతుంది. ఆరోజు మహాత్ముడు నిరాహార దీక్ష చేస్తే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సింహాసనం పునాదుల్లో కదిలింది. ఆ కర్తృత్వానికి బలం ‘నిరా హారం’ కాదు. ఆ వ్యక్తి వ్యక్తిత్వబలం. ఒక వ్యక్తిని సమాజం ప్రేమించి, ఆరాధించి, అక్కున చేర్చుకున్న ప్పుడే ఆయన్ని నష్టపోకుండా కాపాడుకుంటుంది.
ఆయన కోసం తిరగబడుతుంది. ఆయన్ని రక్షించుకోవడానికి అపురూపమయిన త్యాగాలు చేస్తుంది. నాకు బాగా నచ్చిన, పులకించిన సన్నివేశం-‘గాంధీ’ చిత్రంలో ఒకటుంది. కార్యకర్తల హింసకి పోలీసులు బలి అయినప్పుడు మహాత్ముడు నిరాహార దీక్ష చేశారు. దేశం చలించిపోయింది. ఒక మహనీయుడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం- సౌహార్దాన్ని ఎల్లెడలా భారతీయులు కుమ్మరించారు. ఆనందంగా వచ్చి నెహ్రూ మహాత్మునికి చెప్పారు. చెప్తూ ‘భోరుమన్నారు’. అదీ దృశ్యం. మహాత్ముడు నిరాహార దీక్షని చేసినప్పుడు కాదు- దాని ఫలితాన్ని దేశమంతటా గమనించినప్పుడు నెహ్రూ ఆవేశంతో చలించి పోయాడు. దీక్ష ఆయన్ని ఆర్ద్రం చెయ్యలేదు. దీక్ష ప్రభావం గుండెల్ని పిండింది. అది ఓ మహాత్ముని వ్యక్తిత్వానికి నివాళి.
మనం రాజకీయ నాయకుల నిరాహార దీక్షలను చూస్తుంటాం. ప్రజలూ, ప్రభుత్వ యంత్రాంగం వణికి పోతూంటుంది. ఆ మహానుభావుడి ఔన్నత్యానికి కాదు. ఆయనకేదయినా అయితే ఆ పార్టీవారో, ఆ వర్గం వారో, ఆ కులం వారో ఎంత కల్లోలం, ఎంత అనర్థం చేస్తారోనని. ఇది నిఖార్సయిన బ్లాక్‌మెయిల్. నిరాహార దీక్షకు ఈ నాయకులే మరుగుజ్జులు. వారి ‘బెల్లింపు’కి ఆ ‘దీక్ష’ కేవలం ముల్లును తీసే ఇనుప ముక్క. ఇనుపముక్క గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది. అదే యంత్రాంగం భయం. వారి భయం ఇనుపముక్క చేసే హాని కాని, వారి ఉదాత్తత కాదు.
వినోబా భావే 87వ ఏట-తన అనారోగ్యాన్ని కాపాడేందుకు మందులు ఉపయోగపడలేదన్న విష యాన్ని గ్రహించి-‘ఈ శరీరం నాకు ఇన్నాళ్లూ సహక రించింది. ఇప్పుడు దాని శక్తి సన్నగిల్లింది. సహకరించలేనంటోంది. దానిని ఇక శ్రమపెట్టను’ అని స్వచ్ఛం దంగా ఆహారం తీసుకోవడం నిలిపివేశారు. న్యాయంగా 1982లో ఇందిరాగాంధీ ‘ఆత్మహత్య’ నేరానికి ఆయన్ని అరెస్టు చేసి ఉండవచ్చు. కానీ ఆయనని ఎవరూ ముట్టుకోలేదు. స్వచ్ఛందంగా వెళ్లిపోయాడు ఆ మహర్షి. దరిమిలాను ఆయన్ని ఈ దేశం భారతరత్నను చేసింది-తమని తాము గౌరవించుకోవడానికి.
దీక్షని ఆకాశంలో నిలిపేది- ఆ దీక్ష లక్ష్యం. మహాత్ముడు ఆనాడు జాతి సమైక్యతకు నిరాహార దీక్ష చేశాడు. వినోబా భావే-మృత్యువుని ఆహ్వానించ డానికి. నీళ్ల కోసం బస్సులు తగలబెట్టే దౌర్జన్యకారుల దురాగతాలకి, రైళ్లు తగలబెట్టే నేరగాళ్లని జైళ్ల నుంచి విడిపించడానికి, తమ వర్గానికి మేలు జరగాలని బెల్లిం చడానికి కాదు. ఏతావాతా - పదవిలో ఉన్న మంత్రి- కాషాయం తొడిగినా- ఆధ్యాత్మిక నైరాశ్యం ఆవహిం చినా- లక్ష్యం కురచగా, నేలబారుగా, కేవలం ‘రాజకీ యం’ అయిన కారణానికి- ఒకనాటి పవిత్రమైన, అతి శక్తిమంతమయిన ఆయుధం తుప్పు పట్టిపోయింది.
- గొల్లపూడి మారుతీరావు