రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక పరిమళం
సుర్మా, అత్తర్లకు ముస్లింల ప్రాధాన్యం
వైద్యపరిభాషలో సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరు..
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు.
ఇదీ.. సుర్మా ప్రశస్తి..
నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది.
దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం.
కళ్లకెంతో మేలు..!
భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్‌ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు.
సుర్మ, అత్తర్ల విక్రయాలు..!
అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment