‘‘ సీతాకోకచిలుక ఆత్మ’’
జీవన కాలమ్
ఒక జీవితకాలం తను నమ్మిన నిజాల కోసం పోరాడిన ఓ ప్రపంచ యోధుడు కాలం పుటల్లో చిరస్థాయిగా నిలుస్తాడు. మానవత్వం జీవితాన్ని కుదిస్తుందేమో కానీ ‘కీర్తి’ని కాదని నిరూపించిన వీరుడు మహమ్మద్ ఆలీ.
ఇది చింతా దీక్షితులు, తిలక్ కవిత్వంలో వాక్యం కాదు. ప్రపంచంలో అనితర సాధ్య మైన ముష్టి యుద్ధ వీరుడిగా మూడుసార్లు టైటిల్‌ని గెలుచు కున్న చరిత్రకారుడు మహ మ్మద్ ఆలీ రచనకు శీర్షిక (""Soul of a butterfly''). కొన్ని వందలసార్లు మృత్యు వుకి దగ్గరగా వెళ్లి, కొన్ని వేలసార్లు ప్రత్యర్థులను మృత్యువుకి దగ్గరగా తీసుకెళ్లిన ప్రసిద్ధుడయిన వీరుడు చెప్పిన మాటలు ఇవి: ‘‘జీవితం చాలా కురుచ. మనం చాలా త్వరగా వృద్ధాప్యంలో పడతాం. ‘ద్వేషం’ పెంచు కొని జీవితాన్ని వృథా చేసుకోవడంలో అర్థం లేదు’’ మరొక్కసారి - ఈ మాటలు చెప్పింది మహాత్మాగాంధీ కాదు. థోరో కాదు. రామకృష్ణ పరమహంస కాదు. ఒక బాక్సింగ్ చాంపియన్.
అమెరికా పౌరుడిగా ఆయన్ని వియత్నాం యుద్ధంలో సైనికుడిగా వెళ్లమని అమెరికా ప్రభుత్వం ఆర్డరు ఇచ్చింది. ఆయన సమాధానం: ‘‘నాకు ఆ ప్రజ లతో తగాదా లేదు. బలిసిన అమెరికా కోసం నా సోదరు డిమీద, ఓ నల్లవాడిమీద, బురదలో తమ జీవితాన్ని గడుపుకుంటున్న పేద ఆకలిగొన్న ప్రజలమీద యుద్ధా నికి వెళ్లను. వాళ్లని ఎందుకు కాల్చాలి? వాళ్లు నన్ను వెక్కిరించలేదు. నన్ను హింసించలేదు. నామీద కుక్కల్ని ఉసిగొల్పలేదు. నా తల్లిని మానభంగం చేయలేదు. నా తండ్రిని చంపలేదు. పేదవాళ్లని కాల్చను. కావాలంటే నన్ను జైలుకి పంపండి’’ అన్నాడు. అమెరికా ప్రభుత్వం అతని టైటిల్‌ని రద్దు చేసింది. పాస్‌పోర్టుని స్వాధీనం చేసుకుంది. పోటీలలో పాల్గొనే లెసైన్సుని రద్దుచేసింది. 22వ యేట ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మహమ్మద్ ఆలీ, కేవలం తన ఆత్మగౌరవం, మానవీయమైన దృక్పథం కారణంగా - మంచి వయస్సులో ఉన్నా - పోటీలకు దూరమయ్యాడు. అయితే మూడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు అమెరికా చర్యని కొట్టివేసింది.
అతని అసలు పేరు కేసియస్ క్లే. కానీ మానవీయ మైన దృక్పథానికి, అహింసాయుతమైన సిద్ధాంతాలకూ ఆకర్షితుడై ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘మహమ్మద్ ఆలీ’గా మారాడు. ఆయన తన స్వీయకథలో-తాను ముష్టి యుద్ధంలో దిగడానికి కారణాలు చెప్తూ-నా మానాన తెల్లవారు నన్ను బతకనిస్తే నేను ఈ రంగంలోకి రాకపోయేవాడిని- అంటూ కేవలం ఆత్మరక్షణకీ, తెల్ల వారినుంచి తన ఉనికిని కాపాడుకోడానికీ ఈ నైపు ణ్యాన్ని పెంచుకోవలసి వచ్చిందన్నాడు. ఆయన పన్నెండో యేట ఎవరో అతని సైకిల్‌ని ఎత్తుకు పోయారు. ‘‘వాడిని చావగొడతాను’’ అన్నాడు పోలీసు ఆఫీసరుతో. ఆఫీసరు నవ్వి ‘‘ముందు కొట్టడం ఎలాగో నేర్చుకో’’ అన్నాడు. అంతేకాదు. ఆ ఆఫీసరు ముష్టి యుద్ధాన్ని (బాక్సింగ్) నేర్పే టీచరు. ఎలాగో ఇతనికి నేర్పాడు. అదీ ప్రారంభం.
రోజూ అలిసిపోయేదాకా పరుగుతీసి - ఇక కాలు కదపలేని స్థితికి వచ్చినప్పుడు - గుర్తు పెట్టుకుని - ఆ తర్వాత తీయగల పరుగు - తనకి ప్రత్యర్థితో చేసే ముష్టి యుద్ధంలో ‘అదనపు’ దమ్ము (ట్ట్చఝజ్చీ)ని ఇస్తుందని గుర్తు పెట్టుకునేవాడట. అదీ ప్రాక్టీసు. ఈ విషయాన్ని ‘ది గ్రేటెస్ట్ : మై ఓన్ స్టోరీ’’ అనే తన ఆత్మకథలో రాసు కున్నాడు.
అతని జీవితంలో మరిచిపోలేని పెద్ద పోటీ - జో ఫ్రేజర్ అనే వస్తాదుతో. తేదీ 1971 మార్చి 8. ఆ పోటీకి ‘‘ఈ శతాబ్దపు పోటీ’’ అని పేరు పెట్టారు. 35 దేశాలు ఆ పోటీని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఆయన కీలకమైన దెబ్బ - ప్రపంచంలో చాలా ప్రసిద్ధమైనది. పోటీలో - రింగు చుట్టూ ఉన్న రబ్బరు తాడుమీద నుంచి ఊపును తీసుకుని అతను కొట్టే దెబ్బ వెయ్యి పౌనులు శక్తి ఉంటుందట. ఈ చాకచక్యాన్ని - నా అదృష్టవశాత్తూ నేను స్వయంగా చూశాను. 1980లో మహమ్మద్ ఆలీ చెన్నై వచ్చినప్పుడు మూర్ మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనకి ముఖ్య అతిథి అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్. నేను ప్రేక్ష కులలో ఉన్నాను. ఆలీ అతి సరళంగా తన ఆటను ప్రద ర్శించారు. ‘‘ఆయన సీతాకోకచిలుకలాగా విహరిస్తాడు. తేనెటీగలాగా కాటు వేస్తాడు’’ (He floats like a butterfly but stings like a bee) అన్న నానుడి ఎందుకు వచ్చిందో ఆనాడు అర్థమయింది.
జీవితమంతా అతి కఠోరమైన వృత్తిని చేస్తూ - హింసని, మృత్యువుని ఎల్లప్పుడూ ఒరుసుకు ప్రయా ణం సాగించే ఓ ప్రపంచ చాంపియన్ హృదయం అతి ఆర్ద్రమైనది. కేవలం ఆ కారణంగానే తన దేశాన్నీ, తన మతాన్నీ ఎదిరించి నిలిచాడు. అయితే ఒకే ఒక్క రుగ్మత ఆయన్ని లొంగదీసుకుంది. దాదాపు ముప్ఫై ఏళ్ల కిందట ఆల్మైర్స్ వ్యాధి. మూడు దశాబ్దాలు పోరాటం సాగించి - మొన్న జూన్ 4న అలసిపోయాడు.
ప్రతిభకీ, మానవత్వానికీ దగ్గర తోవని రచించి - ఒక జీవితకాలం తను నమ్మిన నిజాల కోసం పోరాడిన ఓ ప్రపంచ యోధుడు కాలం పుటల్లో చిరస్థాయిగా నిలుస్తాడు. మానవత్వం జీవితాన్ని కుదిస్తుందేమో
కానీ ‘కీర్తి’ని కాదని నిరూపించిన వీరుడు మహమ్మద్ ఆలీ.
- గొల్లపూడి మారుతీరావు