దేవుళ్లారా! మీ పేరేమిటి? | god, what is your name | Sakshi
Sakshi News home page

దేవుళ్లారా! మీ పేరేమిటి?

Published Thu, Jun 16 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

దేవుళ్లారా! మీ పేరేమిటి?

దేవుళ్లారా! మీ పేరేమిటి?

- జీవన కాలమ్

ఐస్‌లాండ్ - విశాఖలో ఒక పేట జనాభా కూడా లేని చిన్న దేశం ప్రపంచ బంతాటలో పాల్గొంటోంది. భారతదేశం గత 50 సంవత్సరాల్లో పోటీలలో పాల్గొనడానికి ‘అర్హత’ని కూడా సంపాదించుకోలేదు.

స్క్రీన్‌ప్లే మొదటి సూత్రం- తెలియనిదాన్ని తెలిసిన విషయంతో పోల్చి చూపడం. ఇతని కంటే ఇతను గొప్ప అంటే ‘ఇతని’ గొప్పతనం తెలుస్తుంది. మనదేశంలో క్రికెట్ అంటే పిచ్చి. ఇంతమంది చూసే, ఇంత ఆదాయాన్నిచ్చే దేశం ప్రపంచంలో మరొకటి లేదు. ఇప్పుడు క్రికెట్‌తో బంతాటని పోల్చి చూద్దాం. ప్రధానంగా ప్రపం చంలో తొమ్మిది దేశాలు మాత్రమే క్రికెట్ ఆడుతాయి. కానీ 203 దేశాల్లో బంతాట పాపులర్. ప్రపంచంలో వంద నుంచి వందా యాభయ్ కోట్ల మంది క్రికెట్‌ని చూస్తారు. తేలికగా 300 నుంచి 400 కోట్లు బంతాట చూస్తారు.

ఫ్రాన్స్‌లో జరిగే ఈ యూరో 2016 పోటీల్లో ప్రపంచంలోని 24 దేశాలు పాల్గొంటున్నాయి. జూన్ 10 నుంచి ఫ్రాన్స్‌లో ప్రారంభమైన ఈ పోటీలు సరిగ్గా నెలరోజులు, 10 చోట్ల సాగుతాయి. ఫ్రాన్స్‌లో నవంబర్‌లో జరిగిన మారణహోమంతో 130 మంది మరణం దృష్ట్యా ఇది చాలా బాధ్యతాయుతమైన, క్లిష్టమైన టోర్న్‌మెంట్. కారణం, ఒక్క బ్రిటన్ నుంచే 5 లక్షల మంది ఈ ఆటల్ని చూడడానికి వస్తున్నారు. ఆటగాళ్లు, మిగతా సిబ్బంది, ఉద్యోగులు- వీరుకాక ఇన్ని లక్షల మంది క్షేమంగా ఈ ఆటల్ని చూసే అవ కాశాన్ని ఫ్రాన్స్ కల్పించాలి. ఇందుకు కేవలం 90 వేల మంది రక్షణ దళాల్ని మోహరించారు. ఈ ఆటలకు గాను సిద్ధపరిచిన 250 లక్షల టికెట్లలో 99 శాతం ఇప్పటికే అమ్ముడుపోయాయి.

 ఈ పోటీలో పాల్గొంటున్న ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లెవరు? ఎవరు గెలుస్తారని మీరనుకుంటు న్నారు? ప్రపంచం అంతటిలోనూ ఏరి ఒక టీమ్‌ని తయారు చేయమంటే మీరు ఎవరిని ఎంపిక చేస్తారు? మెస్సీ, క్రిస్టియానో రొనాల్జినో, పాల్ బోగ్బా, డేవిడ్ అలబా- ఇలా ఇలా. ఆవేశపూరిత మైన ఊహాగానాలు టీవీల్లో సాగుతున్నాయి.

 గత పోటీల్లో చాంపియన్‌షిప్‌ని గెలుచుకున్న స్పెయిన్‌ని ఈ పోటీల్లో ఫ్రాన్స్ ఓడించవచ్చునన్న పండితుల కథనాలు వినిపిస్తున్నాయి. అనుకోని విచిత్రమైన మలుపులు ఎన్నో జరిగే విచిత్రమైన పోటీలు ఇవి. ఒక అరుదైన ఉదాహరణ. 1968లో ఇటలీ-రష్యా అద్భుతంగా తలపడ్డాయి. ఎన్ని ఆటలు జరిగినా ఏ జట్టూ బెసగలేదు. అప్పుడేం చెయ్యాలి? నేపుల్స్ డ్రెస్సింగు రూంలో బొమ్మా బొరుసు వేశారు. ఇటలీ గెలిచింది.

ప్రపంచాన్నే ఆనంద సాగరాల్లో ముంచెత్తిన గొప్ప గొప్ప బంతాట ఆటగాళ్ల చరిత్రలెన్నో ఉన్నాయి. క్రికెట్‌కి టెండూల్కర్ ఒక్కడే దేవుడు. ఆయా దేశాలకి, ఆ ఆటకి ఎందరో దేవుళ్లు. పీలే, మారడోనా, రొనాల్డో, మెస్సీ, నిల్టన్ శాంటోస్, కాఫూ, జికో, బాబీ మూర్- ఇలాగ. ఒక్క పీలే కథ చాలు. ఆయనకి ఇప్పుడు 75. ‘ఈ శతాబ్దపు ఆటగాడు’గా గౌరవాన్ని దక్కించుకున్నాడు. టైమ్ మేగజైన్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన పేరు గణించుకున్న 100 మందిలో పీలేను పేర్కొంది. ఫ్రెంచ్ ఆటగాడు జినెదానే జిదానే గత 50 సంవత్స రాలలో అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నికయ్యాడు. 2005లో జిదానే మళ్లీ ఫ్రెంచ్ టీమ్‌లోకి చేరినప్పుడు అతని తోటి ఆటగాడు ధియరీ హెన్రీ ఒకమాట అన్నాడు, ‘ఫ్రాన్స్‌లో అందరికీ తెలుసు దేవుడున్నా డని. అతను ప్రస్తుతం ఫ్రెంచ్ టీమ్‌లో చేరాడు.’

మరొకపక్క జరుగుతున్న కోపా అమెరికా బంతాట పోటీల్లో మొన్న అర్జెంటీనా మీద కేవలం 19 నిమిషాల్లో మరో ‘దేవుడు’ మెస్సీ హ్యాట్రిక్ (మూడు గోల్స్) కొట్టి పనామాను గడ్డి కరిపించిన దృశ్యాలు, ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచే బ్రెజిల్ మొన్న పెరూతో ఆడుతూ చివరి 15 నిమి షాల్లో రాల్ రూయ్‌డిజ్ చెయ్యితో గోల్ చేసిన కారణంగా పోటీలోంచే వైదొలగడం ఎంతమంది అభిమానుల గుండెల్ని పగలగొట్టిందో! ఇలా ప్రతి రోజూ నరాల్ని వేడెక్కించే ఎన్నో ఎన్నో సంఘటనలు.

 అయితే ఒక్క విషయం నన్నెప్పుడూ ఆశ్చ ర్యపరుస్తుంది. ఐస్‌లాండ్ జనాభా మూడు లక్షల ముప్పయ్‌వేలు. ఒక్క విశాఖనగరం జనాభా ఒక కోటీ డెబ్బై లక్షలు. అంటే విశాఖలో ఒక పేట జనాభా కూడా లేని చిన్నదేశం ప్రపంచ బంతాటలో పాల్గొం టోంది. భారతదేశం గత 50 సంవత్సరాల్లో పోటీ లలో పాల్గొనడానికి ‘అర్హత’ని కూడా సంపాదించు కోలేదు. సెర్బియా 9 కోట్లు జనాభా గల దేశం. అంటే మన తెలుగుదేశం జనాభా కంటే తక్కువ. ఆ దేశస్తుడు డొకోవిచ్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన టెన్నిస్ ఆటగాడు, ఆనా ఇవానోవిచ్ టెన్నిస్ ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిచిన మహిళా క్రీడాకారిణి. ఇంత పెద్దదేశం - మనం- ఎందుకు ఈ స్థాయికి చేరలేకపోతున్నాం?

ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యం అఖండ జ్యోతి. అది అవినీతి మధ్య, అసహనం మధ్య, చెప్పుడు మాటలు, తప్పుడు రాద్ధాంతాలు, దొంగ ధనార్జన, దీక్షలు, రిజర్వేషన్ల మధ్య వెలగదు. అది నరాల్ని వేడెక్కించే నిప్పు. దాని గుర్తు పట్టాలంటే రొనాల్జినో ఆట, మెస్సీ గోల్, డొకోవిచ్ బాక్ హ్యాండ్‌లో వెతకాలి.

 

- గొల్లపూడి మారుతీరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement