మరో గాడిద కథ
మరో గాడిద కథ
Published Thu, Nov 26 2015 12:32 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
జీవన కాలమ్
అమెరికా రాజకీయ చరిత్రలో గాడిదకి సముచిత మైన స్థానం 1828 నుంచీ ఉంది. అప్పటి అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రాటిక్ ఆండ్రూ జాన్సన్‌ని గాడిదతో - ఓ మొద్దు, బండజంతువుగా పోలిస్తే- ఆయన ఏమాత్రం చెక్కుచెదరకుండా గాడిదను నెత్తిన పెట్టుకున్నాడు. 1837లో తన వెంట నడవని గాడిదని నడిపే నాయకుడిగా కార్టూన్లు వచ్చాయి. ప్రజాస్వామ్యంలో ‘గాడిద’ అవసరం ఎంతైనా ఉంది. చచ్చే బరువుల్ని మోయడం, యజమాని పట్ల కృతజ్ఞత, బండగా జీవించడం - ఇవన్నీ గొప్ప గుణాలు.
లల్లూ ప్రసాద్ గారి కొడుకు- 28 ఏళ్ల ముద్దు బిడ్డడు- తేజస్వీ యాదవ్ మొన్నటి ఐపీఎల్ క్రికెట్ ఆటల్లో పాల్గొన్నాడు. ఒక్క ఆటలోనూ ఆడకపోవచ్చు గాక- ఆడే ఆటగాళ్లకు చాలాసార్లు మంచినీటి సీసాలు మోసుకెళ్లాడు. మామూలు ఆటల్లో ఆడి ఒక్కసారి సున్నా, మరి ఒకటి రెండుసార్లు ఆడి మొత్తం 20 పరుగులు తీశాడు. తొమ్మిదో క్లాసు ఫెయిలయి - వాళ్లమ్మ కంటే- అంటే మాజీ ముఖ్యమంత్రి కంటే ఒక ఆకు ఎక్కువే చదివానని నిరూపించుకున్నాడు. ఆయనకి ‘అపేక్షించ’డానికీ, ‘ఉపేక్షించ’డానికీ తేడా తెలీదు. ‘అప్పుడు’, ‘ఇప్పుడు’కి తేడా తెలియదు. ఈ విషయం మనకి మొన్నటి పదవీ స్వీకార సభలో తెలిసింది. అయితే ఆయన చేత పదవీ స్వీకారం చేయిస్తున్న గవర్నరు ఎందుకు ఉన్నట్టు? అయితే గవర్న రుకు అర్థం కాని విషయం ఒకటుంది. తేజస్వీ బొత్తిగా నిజాయితీపరుడు. ‘ప్రజల ఆశలను ఉపేక్షిస్తాను’ అని ఆయన చాలా నిజాయితీగా చెప్పుకున్నాడు- వాళ్ల నాన్నలాగ. గవర్నరు బాధపడలేక ఆయన తృప్తి కోసం మాట మార్చాడు. పది కోట్ల జనాభా ఉన్న బిహార్‌లో 25-28 సంవత్సరాల వయసున్న నిరుద్యోగులు కేవలం కోటిమంది ఉండగా వారిలో ఒకరికి ‘ఉపముఖ్యమంత్రి’ పదవి లభించడం ఎంత గర్వకారణం?
ఈ ఎన్నికలలో లల్లూగారి ఇద్దరు కొడుకులు- 26, 28 ఏళ్ల వయసుల వారు మంత్రులయ్యారు. వారిలో ఒకరు ఉప ముఖ్యమంత్రి. అంటే లల్లూ గారింట్లో ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మామూలు మంత్రి ఉన్నారు.
ఈ శుభపరిణామాన్ని- దేశంలో ఉన్న అన్ని పార్టీల వారూ- వారి వారి నాయకుల ద్వారా హాజరయి ఆశీర్వదించారు. ఈ పదవీ స్వీకార సభలో ఒక మాజీ ప్రధానమంత్రి, ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక పార్టీ ఉపాధ్యక్షులు, మరొక దక్షిణాది ద్రవిడ పార్టీ ఉపాధ్యక్షులూ - ఇలా మహామహులంతా ఉన్నారు. ఇందులో కమ్యూనిస్టులూ, మార్క్సిస్టులూ, ప్రజా హిత పార్టీలూ, ఆమ్ ఆద్మీలూ, తృణమూల్ వారూ, ద్రవిడ వికాసానికి కంకణం కట్టుకున్నవారూ, కశ్మీర్ వికాసానికి పాటుపడేవారూ, ఈ మధ్యనే దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ వారూ- అందరూ ఉన్నారు. అందరూ తమ వంతు మద్దతుని మన స్ఫూర్తిగా ప్రకటించారు. ఒకప్పుడు నితీశ్‌కుమార్, లల్లూల మధ్య ఇసుక వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇప్పుడు అభం శుభం తెలీని, అపేక్షకీ, ఉపేక్షకీ అర్థం తెలీని, అప్పుడో ఇప్పుడో అర్థం కాని, 28 ఏళ్ల చదువులేని, ఏ అనుభవమూ లేని కుర్రవాడు - రేపట్నుంచీ 10 కోట్ల ప్రజానీకాన్ని పాలిస్తాడు. అయితే వంటగదిలోంచి సరాసరి ముఖ్యమంత్రి పీఠానికి వచ్చిన వాళ్ల అమ్మ కంటే మెరుగే కదా!
నాకేమో ఎల్.కె. అద్వానీ, మురళీమనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హా, శాంతకుమార్ కూడా కొద్దిలో మొహమాటపడ్డారు గానీ, ఈ పదవీ స్వీకార సభకు వచ్చేవారేమోనని అనిపిస్తుంది. వీరందరూ పొర పాటునయినా ఒకరి ముఖం ఒకరు చూసుకోని పెద్దలు. వీరందరినీ ఏకం చేసిన ఘనత- భారతీయ జనతా పార్టీది. ఒక పార్టీని వ్యతిరేకించడానికి ఇన్ని పార్టీలు చెయ్యి కలపడం - అలనాడు మనదేశం మీద పొరుగు దేశం దండెత్తినప్పుడు మాత్రమే జరిగింది.
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఈ పదవీ స్వీకారానికి రావడాన్ని నిరసిస్తూ- కేరళ ప్రతిపక్ష నాయకులు అచ్యుతానందన్ గారు ఓ మాట అన్నారు. ‘చాందీ పగలు కాంగ్రెస్ మనిషి. రాత్రి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి’ అని.
దేశంలో వీరంతా మతేతర రాజకీయాలకు ప్రతినిధులు. తమకు అనుమానంగా ఉంటే- పాత వార్తాపత్రికల్నిఅటకెక్కించేసి- ఒక్కసారి లల్లూ, మమతాబెనర్జీ చెంపలు రాసుకుంటూ నిలబడిన సుందరదృశ్యాన్నీ, పొట్టలు పగిలేలాగ లల్లూప్రసాద్ గారు అరవింద్ కేజ్రీవాల్‌ని చంకకెత్తుకున్న దృశ్యాన్నీ చూసి తరించండి. నేను మోదీ భక్తుడని కాను. భారతీయ జనతా పార్టీ సభ్యుడినీ కాను. కానీ ఒక వ్యక్తి, ఒక పార్టీలోని ఒక వర్గమూ కారణంగా ఈ దేశం ‘మతం’ అనే కుళ్లు సరుకుతో కుక్కలు చింపిన విస్తరి కాకుండా ఇటు కన్యాకుమారి నుంచీ అటు కశ్మీర్‌దాకా - నాయకులు భుజాలు రాసుకున్న అతి విచిత్రమైన, చరిత్రాత్మకమైన సంఘటన బిహార్‌లో జరిగినది.
ఈ ఒక్క కారణానికే నేను మోదీ అనే శత్రువును అభినందిస్తున్నాను - ఎట్టకేలకు ఈ దేశాన్నీ- ఈ దేశంలో రాజకీయశక్తుల సమీకరణకు దోహదం చేసినందుకు.
చివరిగా- ప్రజాస్వామ్యమనే గాడిదకు నా నివాళి.
(గొల్లపూడి మారుతీ రావు)
Advertisement