కూటమి గెలిస్తే.. కిడ్నాప్ రాజ్యమే!
లాలూ రిమోట్ కంట్రోల్ పాలన సాగిస్తారు
♦ ఎన్నికల ప్రచారంలో మోదీ
♦ ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ల పొత్తుపై ధ్వజం
ససారం/ఔరంగాబాద్: ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ల మహా లౌకిక కూటమి అధికారంలోకి వస్తే బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ద్వారా రిమోట్ కంట్రోల్ పాలన సాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మహా కూటమి పాలనలో ఒక్క కిడ్నాపింగ్ పరిశ్రమ మాత్రమే వర్ధిల్లుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శుక్రవారం కూడా మోదీ ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ససారం, ఔరంగాబాద్‌ల్లో ఎన్నికల సభల్లో పాల్గొన్న మోదీ.. లాలూ, జేడీయూ నేత నితీశ్‌కుమార్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఈ మూడు పార్టీలు చెప్పుకోవడానికి రాష్ట్రంలో తమ 60 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలేవీ లేకపోవడంతో.. తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ‘మోదీని తిట్టడం కోసం వారు ప్రతీరోజు ఉదయం డిక్షనరీలో కొత్త దూషణల కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు డిక్షనరీ కూడా సరిపోకపోవడంతో ఏకంగా తిట్ల ఫ్యాక్టరీనే ప్రారంభించారు’ అని ఎత్తిపొడిచారు. ‘ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదు కనుక కూటమి అధికారంలోకి వస్తే తాను పరోక్ష పాలన సాగించాలనుకుంటున్నారు.
తనను తాను ఆయన బిగ్ బాస్‌గా అభివర్ణించుకుంటారు. తాను చెప్పినట్లే అందరూ నడుచుకుంటారని చెబుతారు’ అంటూ లాలూపై ధ్వజమెత్తారు. ‘నా జంగిల్ రాజ్ వ్యాఖ్యలపై ఎక్కువగా ఇబ్బంది పడుతోంది నితీశే. లాలూ పాలనను జంగిల్ రాజ్(ఆటవిక పాలన)గా తొలుత అభివర్ణించింది నితీశే’ అని అన్నారు.జేడీయూ, ఆర్జేడీల పాలన మొదలయ్యాక రాష్ట్రంలో నేరాలు పెరిగాయని, ఈ ఏడాది తొలి ఆర్నెళ్లలోనే 400 కిడ్నాప్‌లు జరిగాయన్నారు. తాజాగా ఒక పోలీస్ ఆఫీసర్ హత్యను ప్రస్తావిస్తూ.. ‘ఇక సాధారణ పౌరుడి గతి ఏంటి?. వారు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం గతి ఏంటి?’ అని ప్రశ్నించారు. ఆ పార్టీలకు ఓటేయకుండా ఉండి, రాష్ట్రాన్ని కాపాడాలంటూ ఓటర్లను కోరారు. దాణా స్కాంలో లాలూ దోషిగా తేలిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆయన ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? పోటీ చేయడాన్ని నిషేధించేంతగా ఏ తప్పు చేశారు? ఏ నేరంపై ఆయనను న్యాయవ్యవస్థ ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆదేశించింది?’ అని అన్నారు.
ప్రైవేటులోనూ రిజర్వేషన్లు: పాశ్వాన్
బిహార్‌లో ఎన్డీయే కూటమికి అధికారమిస్తే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేస్తామని లోక్ జనశక్తి పారీ చీఫ్, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఎల్జేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో అన్నారు.
ఎన్డీయేదే విజయం!
జీ న్యూస్ సర్వే అంచనా
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధిస్తుందని జీ న్యూస్ సర్వే అంచనా. అక్టోబర్ 12న తొలి దశ ఎన్నికలు జరగడానికి ముందు జీ న్యూస్, సర్వే సంస్థ ‘జనతా కా మూడ్’ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో.. మొత్తం 243 స్థానాలకు ఎన్డీయే అత్యధికంగా 162 సీట్లను.. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ల లౌకిక కూటమి కేవలం 51 స్థానాలను గెలుచుకుంటుందని తేలింది. ఎన్డీయేకు 54.8% ఓట్లు, లౌకిక కూటమికి 40.2% ఓట్లు వస్తాయంది. కులాల లెక్కల్లోనూ, యాదవులను మినహాయించి అన్ని కులాల్లోనూ ఎన్డీయేనే ఎక్కువ ఓట్లు సాధిస్తుందని సర్వే విశ్లేషించింది. అక్టోబర్ 5 నుంచి 8 మధ్య మొత్తం 243 నియోజకవర్గాల్లో 54,411 మందిని సర్వే చేసి ఈ ఫలితాలను వెల్లడించారు.