రెండాకులపై చదువు | opinion on rahulgandhi by gollapudi maruthirao | Sakshi
Sakshi News home page

ఆయనకు ‘పప్పు’ అనే ఓ ముద్దు పేరుంది..

Published Thu, Jul 28 2016 8:32 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

రెండాకులపై చదువు

రెండాకులపై చదువు

జీవన కాలమ్
 
నిద్ర పోవడానికి చిన్నపాటి సంగీతమో, జోలపాటో ఉండాలని పెద్దలంటారు. చరిత్రలో పార్లమెంటుకీ - కాంగ్రెస్ నాయకుల నిద్రకీ దగ్గర తోవ ఉన్నదనీ, వారికి పార్లమెంటు జోకొట్టే ఉయ్యాల లాగ పనిచేస్తుందని నాకనిపిస్తుంది.
 
నిద్ర సుఖమెరగదని సామెత. కాని సుఖం స్థల మెరుగదు - అని నేనంటాను. అందుకు మంచి నిదర్శనం - మన యువరాజు రాహుల్ బాబు. వారు ఉన్నట్టుండి ఇండియా నుంచి మాయమై, ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియక, మళ్లీ అంతలోనే ప్రత్యక్షమై, రాజకీయ అస్త్రాలను సంధించి, సుప్రీంకోర్టు కోపానికీ గురై - అలిసిపోతారు. ఇలాంటి సందర్భాలలో ఆయనకి సుఖంగా నిద్రపట్టే చోటు - పార్లమెంటు. ప్రజలు ఎన్నుకొన్న చాలామంది నాయకులకు పార్లమెంటులో చక్కని నిద్ర పట్టడం మనకి తెలుసు.
 
లోగడ మన ప్రధాని దేవెగౌడ గారు కూడా పార్లమెంటులో సుఖంగా నిద్రించేవారు. ఈ లెక్కన ఈ ఒక్క కార ణానికే రాహుల్ బాబు దేవెగౌడ అంతటివాడై ప్రధాని అవుతాడని నా నమ్మకం. అలనాడు పార్ల మెంటులో ప్రణబ్ ముఖర్జీ గారు ప్రసంగిస్తున్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వీర భద్ర సింగ్ గారికి మంచి నిద్ర పట్టింది. చరిత్రలో పార్లమెంటుకీ - కాంగ్రెస్ నాయకుల నిద్రకీ దగ్గర తోవ ఉన్నదనీ, వారికి పార్లమెంటు జోకొట్టే ఉయ్యాల లాగ పని చేస్తుందని నాకనిపిస్తుంది.
 
నిద్ర పోవడానికి చిన్నపాటి సంగీతమో, జోల పాటో ఉండాలని పెద్దలంటారు. గుజరాత్‌లో దళితుల సమస్యలు రాహుల్ బాబుగారికి అలాంటి నేపథ్యాన్ని కల్పిస్తున్నాయి. ఇటు తమ నాయకులు- మల్లికార్జున్ ఖర్గే గారి విసుర్లు, అటు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారి సమాధానాలు రాహుల్ గారిని జోకొట్టి నిద్ర పుచ్చాయి. అది కొందరి అదృష్టం.
 
 అయితే వీరికి మిగతా కాంగ్రెస్ నాయకుల పూర్తి సానుభూతి దక్కడం వారి పార్టీలో ఐకమత్యానికీ, గాంధీ కుటుంబంపట్ల వారికి గల భక్తి ప్రపత్తులకీ చిహ్నం. ఆ పనిని ఇప్పుడు ఘనత వహించిన రేణుకా చౌదరిగారు చేశారు. ఒక మహిళకు - కష్టపడి అలిసి పోయిన బిడ్డ మీద ఎంత ప్రేమ, సానుభూతి ఉన్నదో వారు నిన్న చెప్పిన సమాధానాన్ని బట్టి మనకి అర్థ మవుతుంది.
 
 ‘‘ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఎల్లెడలా ధూళి వ్యాపించి ఉంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గారు - పాపం - ఏం చెయ్యగలరు? కాస్సేపు కళ్లు మూసు కున్నారు. దీనికంత రాద్ధాంతం చేస్తారేం?’’ అని విసుక్కున్నారు. పార్లమెంటు అంతా రాజకీయ నాయకుల రాకపోకలతో ధూళి దూసరితమైందని మనం మరిచిపోకూడదు. మరొకరు - వారు నిద్రపోవడం లేదని-మొబైల్ ఫోన్‌లో మాట్లాడడానికి కింద చూపులు చూస్తున్నారని వాక్రుచ్చారు. ‘నిద్రపోయేటట్టు కనిపించే కింద చూపుల’ మొబైల్ ఫోన్‌ని వెంటనే ఆపిల్ సంస్థ పేటెంటు చెయ్యగలదని నా నమ్మకం.
 
అయితే ఇందులో చిన్న కొసమెరుపు ఉంది. రాహుల్‌గాంధీ గారు హడావుడిగా నిద్ర మేల్కొని గుజరాత్‌కి వచ్చి హింసకు గురి అయిన దళితుల్ని, ఓ బాధితుడి తల్లిని - ఆమె పేరు రమాబెన్ - పరామర్శించారు. ‘నేను బాధితుడి తల్లిని కలిశాను. ఆమె బాధతో కృంగి పోయి, ప్రతిదినం మోడీగారి గుజరాత్‌లో తాము ఎంత హీనంగా బతుకుతున్నారో హృదయవిదారకంగా చెప్పు కున్నారు’ అని రాహుల్ గారు పత్రికలతో వాక్రుచ్చారు.
 
కాని విషయమేమిటంటే - ఇలా మొరపెట్టుకున్న ఫలానా ‘తల్లి’ ఆ బాధితుని తల్లికాకపోగా, ఏ విధం గానూ దళితులతో సంబంధంలేని తల్లి. నిజానికి ఈ రమాబెన్ అనే ఆవిడ - దొంగ సారా రవాణా, దౌర్జన్యాలు, ఒక హత్య కేసులో ఇరుక్కున్న ఒకానొక రౌడీ చరిత్ర గల మహిళా శిరోమణి. ఈవిడ మొన్నటి ఎన్నికలలో రాజ్‌కోట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్య గురు తరఫున ప్రచారం చేశారట. పార్టీ శ్రేణులు - ఇలాంటి ‘తల్లి’ని ప్రత్యేక రక్షణ వలయాన్ని (ఎస్‌పీజీ) దాటించి ఎలా రాహుల్ గాంధీ గారి ముందు నిలప గలిగారో అర్థం కావడం లేదు. తీరా ఈ రమాబెన్‌ని నిలదీస్తే ‘నేను బాధితుడి తల్లి నని చెప్పలేదు. నేనూ దళిత వ్యక్తిని కనుక - తల్లిలాంటి దానిని - అన్నాను’ అని ఈ రమాబెన్ ఈ గూడు పుఠా ణీని అన్వయించారు.

రాహుల్ గాంధీ గారికి ‘పప్పు’ అనే ఓ ముద్దు పేరుంది. ఆయన సార్థక నామధేయులు. అతి తరచుగా ‘పప్పు’లో కాలేస్తూ వారు తమ పేరుని నిలబెట్టుకుంటున్నారు. రోజురోజుకీ రాహుల్ ధర్మమా అని పార్టీ కొత్త ఊబిలో దిగుతూ ఉండడం - ఆ ‘ఊబి’ని సహేతుకంగా సమర్థించాలని పార్టీ శ్రేణుల్లో దిగ్విజయ్ సింగ్, రేణుకా చౌదరి వంటి సానుభూతిపరులు తాపత్రయపడడం - పత్రికలు, కెమెరాలు మోసం చేసినా మోసపోని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను - ఓటరు. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని చేసే హాస్యాస్పదమైన ప్రయత్నాలు అతని దృష్టిని దాటిపోవడం లేదు. ఇవాల్టి ఓటరు - నిన్నటి ఓటరులాగ వెర్రి గొర్రె కాడు. కాంగ్రెస్‌ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. అతనికి ఏం చూస్తున్నాడో, ఎందుకు చూస్తున్నాడో - చెప్పేవారికంటే బాగా తెలుసు. నేటి ఓటరు ఈ నాయకమ్మణ్యులకంటే రెండాకులు ఎక్కువే చదివాడు.
 
 
 
 
 
 
వ్యాసకర్త: గొల్లపూడి మారుతీ రావు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement