బంగారంలాంటి ‘వెండి’
జీవన కాలమ్
స్వర్ణపతక విజేత నేలమీద కూలబడి భోరుమన్నప్పుడుఆమెను మన సింధు నేలమీదనుంచి లేపి కాళ్లమీదనిలిపి కావలించుకున్నప్పుడు నేను మనసారా ఏడ్చాను.
రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఆటలో ఆఖరి పోటీలో ఆఖరి క్షణాలు. ఒక దశలో కారొలినా, సింధూ - ఇద్దరూ రెండు గేమ్‌లు - చెరో పది పాయింట్లు గెలుచుకున్నారు. వారి విజయానికి ఆ పది పాయింట్లే దూరం. రెండు దేశాల చరిత్ర, రెండు జీవితాల చరిత్ర ఆ పది పాయింట్లు, పది నిముషాల వ్యవధిలో పెనవేసుకుని ఉంది. నేను ఆటని మర్చిపోయాను. ఈ చిన్న జీవితాలలో - 20 ఏళ్లు పైబడిన ఈ ఇద్దరు పిల్లలు - జీవితంలో అన్ని రకాల ఎల్లలనూ దాటి కేవలం తమ ఉద్యమాన్ని ఆ క్షణాలలో పూరించారు. ప్రతీ కదలికలోనూ స్పెయిన్ క్రీడాకారిణి కారొలినా రంకె వేస్తోంది. అది నరాలను పూరించే ఊతం. సింధు నిశ్శబ్దంగా - కాని నిప్పులు చెరిగే కళ్లతో బ్యాట్‌ని సంధిస్తోంది.కారొలినా కదలికలో జయిస్తున్న విశ్వాసం. సింధు కదలికలో జయించాలన్న అగ్ని. ఆ క్షణంలో వాళ్ల మనసుల్లో ఏముంది? ప్రపంచం - ముఖ్యంగా రెండు దేశాలు - ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న క్షణాలవి.
63 ఏళ్ల కిందట నేను రేడియోలో చేరిన కొత్తలో ఢిల్లీ శిక్షణకి వెళ్లినప్పుడు ‘మేరధాన్’ అనే రేడియో నాటకాన్ని వినిపించారు. ప్రపంచ పరుగు పోటీలో ఆటగాడు పరిగెడుతూంటాడు. పక్కనే కారులో అనుసరిస్తున్న ఆ దేశపు కోచ్. ఒక దశలో ‘నేను అలిసిపోయాను’ అంటాడు పరుగు వీరుడు రొప్పుతూ. ‘‘ఇప్పుడు నువ్వు నువ్వు కావు. ఇప్పుడు నువ్వు నీ దేశం’’ అని హెచ్చరిస్తాడు కోచ్. ‘ఇంక ఓపిక లేదు - పరిగెత్తలేను’ అంటాడు వీరుడు. ‘‘పరిగెత్తాలి. దేశ చరిత్రను ఆపే హక్కు నీకు లేదు’’ అంటాడు కోచ్. నాకు భగవద్గీత బోధించిన ఆచార్యుడు వినిపించాడు ఆ శ్రవ్య నాటకంలో - ‘‘నియతం కురు కర్మత్వం’’ అంతే.
ఆ క్షణంలో సింధు భారతదేశం. ఆఖరి పదినిమిషాలూ ఈ దేశపు చరిత్రలో భాగం. ఎక్కడో పుట్టి - పన్నెండో యేటినుంచి ఒక లక్ష్యాన్ని సంతరించుకుని - రోజుకి 56 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఓ అమ్మాయి - కొన్ని వేల గంటలు - కేవలం ప్రతిభనే కొలబద్ధగా ప్రయాణం సాగించిన ఓ పిల్ల - తన ఊరినీ, తన రాష్ట్రాన్నీ, తన ఖండాన్నీ దాటి కేవలం తన దేశానికి ప్రాతినిధ్యం వహించే ‘శక్తి’గా మాత్రమే నిలవడం ఎంత గొప్ప ప్రస్థానం!
మొన్నటి దీపా కర్మార్కర్ ‘గెంతు’ కొన్ని వేలసార్లు జరిపిన కృషికి ప్రతిరూపం. ఆమె శరీరం కదలిక - చివర ఆమె వేసిన మొగ్గ - అపురూపమైన గొప్ప కవితకు దృశ్యరూపం.It was visual poetry. ఆ మొగ్గ (ప్రొడునోవా)ని ప్రపంచ క్రీడల్లో బహిష్కరించాలనుకుంటున్నారట. కారణం - చిన్న పొరపాటు జరిగితే - ఆ దూకు ఏ మాత్రం బెసికినా వ్యక్తి శాశ్వతంగా మూలన పడవచ్చు. ఒకింత పొరపాటు జరిగితే ప్రాణానికి ముప్పు రావచ్చు. ఎన్నిసార్లు తన ప్రాణహానిని పక్కనపెట్టి దీప ఆ ‘గెంతు’ని ఒడిసి పట్టుకుందో! సెకనుకి కొన్ని క్షణాల తేడా కారణంగా బహుమతికి ఇటు నిలిచినా - చరిత్రలో సమున్నతంగా నిలిచిన మహారాణి దీప.
58 కిలోల కుస్తీ పోటీలలో సాక్షి మలిక్ కాంస్య పతకం అతి చిన్న ఊరట. ఆమె లక్ష్యం నికార్సయిన బంగారం. ప్రపంచాన్ని జయించిన ఆమె నవ్వు - నూటికి నూరుపాళ్లూ ఏ పొరపొచ్చాలూ లేని నిష్కల్మషమయిన విజయానికి పట్టాభిషేకం. ఒక లక్ష్యానికి అపూర్వమైన పరాకాష్టని సాధించిన ఈ దేవకన్యలకు ఈ జాతి శాశ్వతంగా రుణపడి ఉంటుంది. మానవ ప్రయత్నానికి, పట్టుదలకీ, ప్రతిభకీ, మానవీయమైన లక్ష్యాలకీ - వెరసి ఈ జాతి ప్రాథమికమైన నైశిత్యానికి వీరు అభిజ్ఞలు. మానవ సంకల్ప బలానికి ఎవరెస్టు శిఖరమది.
అసలు అది కాదు నన్ను కుదిపేసిన క్షణం. కారొలినా చేతుల్లో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచిన సింధు - మొదటిస్థానంలో ఉన్న చాంపియన్ నేలమీద కూలబడి భోరుమన్నప్పుడు నేలమీదనుంచి లేపి కాళ్లమీద నిలిపి కావలించుకున్నప్పుడు - నేను మనసారా ఏడ్చాను. సింధు ఉదాత్తత - బంగారంకన్నా గొప్పది. ఆ స్థాయి మాటలకి అందనిది. అది అలౌకికమైన సంస్కారం. ఓ గొప్ప విలువకు పట్టాభిషేకం. ఈ విజయాన్ని పంచుకోవలసిన మరొక చాంపియన్, గురువు పుల్లెల గోపీచంద్ - పోరాడే దమ్మునేకాదు, ఓటమినీ అంగీకరించే పెద్ద మనసుని నేర్పినందుకు.తీరా సింధు రజత పతకం గెలిచాక - ఆమెను తప్పనిసరిగా ఈ మురికి రాజకీయ వాతావరణంలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశాన్నే ఆకాశంలో నిలిపిన ఒక క్రీడాకారిణి తెలంగాణ బిడ్డా? లేక ఆంధ్రా అమ్మాయా? అన్న గొంతులు వినిపిస్తున్నాయి. ఆమెని ప్రాంతీయ స్థాయికి గుంజే యావ మొదలైంది. మన నాయకమ్మణ్యుల చేతుల్లో ఈ ‘ఒలింపిక్స్’ ఉంటే కులం, మతం, ప్రాంతం, వెనుకబడిన, ముందుపడిన ప్రాతిపదికన ఈ స్వర్ణాలూ, రజతాలూ, కాంస్యాలూ పంచేసుకునేవారు. పంపకం కుదరకపోతే రైళ్లు, ఇళ్లు తగలెట్టేవారు. నిరాహార దీక్షలు జరిపేవారు. అది మన దరిద్రం.
రచయిత: గొల్లపూడి మారుతీరావు