శ్రామిక విప్లవం
జీవన కాలమ్
‘ఉదయం’ పత్రిక నడిపే రోజుల్లో రోజంతా మద్రాసులో పనిచేసి సాయంకాలం విమానంలో– ప్రతీరోజూ విధిగా హైదరాబాదు ప్రయాణం చేసేవారు. ఏమిటీ కమిట్‌మెంట్. ఎందుకీ కమిట్‌మెంట్ అంటే.. పని ఆయనకు ప్రాణవాయువు.
నా 54 సంవత్సరాల సినీ జీవితంలో దాసరి లాగా శ్రమించిన, ఆ శ్రమని సత్ఫలితాలుగా మలిచిన వ్యక్తిని చూడలేదు. ఆయన అనూహ్యమైన శ్రామిక విప్లవం అంటాను నేను. ఒక దశలో ఇటు అక్కినేని, అటు ఎన్టీఆర్ వారి షూటింగుకి వీజీపీ కాటేజీలలో ఉండటం నాకు తెలుసు. అక్కినేని షూటింగు అయ్యాక, ఎన్టీఆర్‌కి పిలుపు వెళ్లేది. ఇద్దరి చిత్రాలకూ సమగ్రమైన న్యాయం చేసి ఇద్దరి అభిమానులనూ అలరించిన ఘనత దాసరిగారిది.
జబుల్లా రోడ్‌లో ఎన్టీఆర్ ఇంటికి ఎదురుగా దాసరి ఇల్లు. ఎప్పుడూ పెళ్లివారిల్లులాగా సందడిగా ఉండేది. రాత్రి అయితే మరీనూ. దాదాపు 40 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసేవారు. అందరి చేతుల్లోనూ టేప్ రికార్డర్లు. ఎందుకు? దాసరిగారు పిలిచినప్పుడు పరిగెత్తుకువెళ్తే –డైలాగులు– మాట్లాడేవారు. ఎవరి సినిమా? ఏ సీను? ఎవరు పాత్రలు? కథ ఏమిటి? అన్నీ దాసరిగారి మస్తిష్కంలో ఉండేవి. వీరుకాక మేకప్‌మాన్లు, చిన్న చిన్న నటీనటులు, కాస్ట్యూమ్స్ వారు– అందరికీ మించి నిర్మాతలు. అదొక సర్కస్. ఈ పద్మవ్యూహంలోకి ఏ రాత్రికో నాలాంటివారిని తీసుకెళ్లేవారు. ఎందుకు? కథ చెప్పడానికి.
నేను ఆయనతో అనేవాడిని: ‘‘బయట సమూహాన్ని, మనుషుల్నీ చూస్తూ, మీతో ఇలా మాట్లాడటం నేరం చేసినట్టు అనిపిస్తోంద’’ని. ఆయన నిర్మలంగా నవ్వేవారు. ఇన్ని ఒత్తిడుల మధ్య ఎంతో తీరుబాటుగా, పవిత్రంగా, హాయిగా కనిపించేవారు. ఓసారి ఆయనకి కథ చెప్పడానికి– కేవలం కథ చెప్పడానికి– ఆయనతో – అసిస్టెంట్ల బృందంతో తిరువనంతపురం రైలులో వెళ్లాను. ఆయన ఎదుటి బెర్తుపై పడుకున్నారు. ఓ రాత్రికి తెలివొచ్చినట్టుంది. ఎవరో అసిస్టెంటుని పిలి చారు. టేప్ రికార్డర్ ఆయన నోటి దగ్గరకు వచ్చింది. డైలాగులు చెప్పారు. అంతే. మళ్లీ నిద్రపోయారు. ఇదేమిటి? చర్చలేదా? నేను ఆయన చిత్రాలు ఎన్నింటిలోనో ప్రధాన పాత్రలు చేశాను. ఆయన టేపు రికార్డర్‌లో ‘చెప్పిన’ డైలాగులకు పొల్లుకూడా మారదు! అదీ ఆయన ఏకాగ్రత. అంతకుమించి– పది చిత్రాల అరలు మెదడులో వేర్వేరుగా, గొప్పగా, భద్రంగా నిక్షిప్తమయి ఉంటాయి.
ఎవరీ అసిస్టెంట్ డైరెక్టర్లు? రాబోయే కాలంలో కనీసం పాతిక సంవత్సరాలు తెలుగు చలన చిత్రసీమని ఏలిన ఉద్దండులు– కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రాజాచంద్ర, రేలంగి నరసింహారావు, ఎస్.ఎస్. రవి చంద్ర, దుర్గా నాగేశ్వరరావు, ధవళ సత్యం, నందం హరి శ్చంద్రరావు, డిమిట్ రావు, రమణబాబు, అనిల్, ఎమ్మనేని ప్రభాకర్, రాధాకృష్ణ– ఇలాగ. వీరందరితోనూ నేను పనిచేశాను. ఒక్కొక్కరూ–ఒక్కొక్క శిఖరం.
‘ఉదయం’ పత్రిక నడిపే రోజుల్లో రోజంతా మద్రాస్‌లో పనిచేసి సాయంకాలం విమానంలో–ప్రతీరోజూ విధిగా హైదరాబాద్ ప్రయాణం చేసేవారు. ఎన్నోసార్లు మేమిద్దరం కలిశాం. ఏమిటీ కమిట్‌మెంట్. అంతకుమించి–ఎందుకీ కమిట్‌మెంట్? సమాధానం నాకు తెలుసు–పని ఆయనకు ప్రాణవాయువు. ఒత్తిడి ఆయన మెదడు రిలాక్స్ కావడానికి సాధన. ఈ ఒత్తిళ్లలోనే ఒక సర్దార్ పాపారాయుడు, ఒక ప్రేమాభిషేకం, ఒక రాములమ్మ–అనూహ్యం!
చిన్న చిన్న కళాకారుల్ని నెత్తికి ఎత్తుకునేవారు. చిన్న చిన్న టెక్నీషియన్లకు ఊపిరి పోసేవారు. ఆ రోజుల్లో బడ్జెట్ సినిమాలకు మార్గాన్ని సుగమం చేసింది ఆయనే. మోహన్‌బాబు, అన్నపూర్ణ, నారాయణమూర్తి వంటి నటులు తమదైన ఫోకస్‌ని సాధించింది ఆ కార్ఖానాలోనే.
దాసరితో నా బంధుత్వం ఆయన హైస్కూలు రోజుల్నుంచి. నా షష్టిపూర్తి సంచికకి ఆయన రాసిన వ్యాసంలో మొదటి పేరా.. ‘‘ఆయన్ని చూడ్డానికంటే ముందు నేను ఆయన్ని చదివాను. ఆయన సృష్టించిన పాత్రని నా ఒంటికి తగిలించుకున్నాను. ఉత్తమ నటుడిగా బహుమతిని పొందాను.. ఆ నాటిక ‘అనంతం’. ఆయన అరుదైన మిత్రుడు, అమూల్యమైన హితుడు’’.
వ్యక్తిగా ఏ చిన్న వ్యక్తిలో, నిర్మాతలో, దర్శకునిలో ‘మెరుపు’ని చూసినా నెత్తికెత్తుకుని– పదిమందికి తెలిపే పెద్ద దిక్కు. పరిశ్రమలో ఏ సమస్యకయినా– ముందు నిలిచే మొండి ధైర్యం. ఇక్కడినుంచి సరాసరి ఢిల్లీ చేరి కేంద్రమంత్రిగా పదవి నెరపుకు రావటం మరో పెద్ద అంగ.
ఆఖరుసారి దర్శకమిత్రులు క్రిష్ పెళ్లిలో అక్షింతలు వేసి లిఫ్టు ఎక్కాను. దాసరీ ఎక్కారు. లిఫ్టు కిందకి దిగే లోపున ఆయన తృప్తిగా చెప్పిన విషయం– ‘‘ఈమధ్య ఎనిమిది కిలోల బరువు తగ్గాను మారుతీరావుగారూ’’ అన్నారు.
నవ్వాను. ‘‘తగ్గాలి. మీ కోసం కాదు. మా కోసం’’ అన్నాను. ఇద్దరం విడిపోయాం.
దాసరి ‘శ్రమ’లో విజయాన్ని ఏరుకున్న పధికుడు. ప్రతి విజయానికీ హృదయాన్ని విశాలం చేసుకున్న ‘మనిషి’. చాలామందికి గురువు, మార్గదర్శి. మహా దర్శకుడు. కానీ.. కానీ.. అందరికీ–నడిచే ఉద్యమం. ఒక తరం సినీ ప్రపంచాన్ని మిరుమిట్లు గొలిపిన ఆకాశం.
గొల్లపూడి మారుతీరావు