రెండు ముసుగుల కథలు
జీవన కాలమ్
ఈ రోజుల్లో స్వేచ్ఛకి అర్థాలు మారిపోయాయి. ముసుగుల అవసరాలు మారిపోయాయి. తన ఉనికిని దాచుకోవలసిన కర్మ తనకు లేదని ఓ ఢిల్లీ అమ్మాయి బోరవిరుచుకోవడమే ఇందుకు నిదర్శనం. మొన్న ఢిల్లీలోని తిలక్‌నగర్ లో జస్లీన్ కౌర్ రోడ్డు దాటు తోంది. మోటారు సైకిలు మీద వెళ్తున్న సరబ్‌జిత్ సింగ్ అనే కుర్రాడు జోరుగా వెళ్తూ దాదా పు ఆమెను గుద్దేశాడు. ‘సిగ్న ల్స్ చూసుకో’ అంది అమ్మా యి కోపంగా. అక్కడితో కుర్రా డు మోటారు సైకిలు దిగి తిట్లు లంకించుకున్నాడు. ‘నాతో మోటారు సైకిలు ఎక్కు తావా?’ అన్నాడు బులిపిస్తూ. మనది భారతదేశం కనుక చుట్టూ రెండు డజన్ల మోటారు సైకిళ్ల వారున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ అమ్మాయి అతని ఫొటో తీసింది. సింగుగారు వీరుడిలాగ పోజిచ్చి నిలబడ్డాడు.
ఆ అమ్మాయిని బెదిరించి వెళ్లాడు. కౌర్ పోలీస్ స్టేషన్లో రిపోర్టి చ్చింది. కుర్రాడిని అరెస్టు చేశారు. ఈ కథలో నాకు నచ్చిన అంశం ఇది. సెంట్ స్టీఫెన్ కాలేజీ విద్యార్థిని కౌర్ అన్నది: ‘నేను నా ముఖాన్ని కప్పుకోను. కప్పుకొంటే అది కుర్రాడి విజయం అవుతుంది’. అంతేకాదు నేరస్థు లను ముసుగులు కప్పుకోనిస్తారెందుకు? ముసుగులు తియ్యండి. దేశాన్ని ఆ మహానుభావుల్ని దర్శించని య్యండి’. కౌర్‌కి నా హార్దిక అభినందనలు.
మరో ముసుగు కథ. నేను విశాఖపట్నం బీచిలో మిత్రులతో కూర్చున్నాను. ఒక అమ్మాయీ అబ్బాయీ చెట్టాపట్టాలేసుకుని నడుస్తూ వెళ్తున్నారు. అమ్మాయి తల నిండా ముసుగు. రెండు కళ్లు మాత్రం తెలుస్తున్నాయి. నన్ను చూడగానే ఆ అమ్మాయి చటుక్కున తలమీద ముసుగు తీసేసింది. కుర్రాడు దూరంగా నిలబడ్డాడు. ఒక పుస్తకం తీసి నా ఆటోగ్రాఫ్ అడిగింది.
‘‘ఈ ముసుగు వేసుకున్నావేం’ అనడిగాను- ఎన్నా ళ్లనుంచో ఏ అమ్మాయినయినా ఈ ప్రశ్న అడగాలని నా ఆరాటం.
ఆ పిల్ల నవ్వింది - అది అర్థం లేని ప్రశ్న అన్నట్టు ‘నాకు గాలికి చర్మం మీద దురదలు వస్తాయి’’ అంది.
‘‘మీ అమ్మగారు ముసుగు వేసుకునేవారా?’
‘‘లేదు’’.
‘‘మీ నాన్నగారు?’’
‘‘లేదు’’.
‘నీ పక్కనున్న నీ బాయ్ ఫ్రెండుకి ముసుగు లేదు. నాకు లేదు. నా పక్కనున్న ఎవరికీ లేదు. బీచిలో నడిచే రెండు వందల మందికీ దు. ఈ చుట్టుపక్కల - అయి దారు మంది వయసున్న ఆడపిల్లలకి మాత్రమే ఉంది. వారికే దురదలు ఎందుకొస్తున్నాయి?’’.
ఆ అమ్మాయికి యీ మాటలు ఇబ్బందిగా ఉన్నా యని అర్థమవుతోంది. ఈ దిక్కుమాలిన నటుడిని ఎం దుకు ఆటోగ్రాఫ్ అడిగానా అన్న విసుగు తెలుస్తోంది.
‘‘ఎన్నాళ్లయింది ఈ ముసుగు వేసి?’’
‘‘ఎనిమిది నెలలు’’
‘‘ఎన్నాళ్లయింది మీ యిద్దరూ కలిసి?’’
‘‘తొమ్మిది నెలలు’’
ఇబ్బంది ఎక్కువయింది. మా మిత్రుడు తెగేదాకా లాగొద్దని నన్ను గోకాడు. నా పెద్దరికం ఒక గీత దాటితే అక్కరకు రాదు. పుస్తకం మీద సంతకం పెట్టాను. చటు క్కున మాయమయింది. నాలుగు అడుగులు వేయగానే మళ్లీ ముసుగులోకి వెళ్లిపోయింది. ఢిల్లీలో అమ్మాయి గర్వంగా ‘‘నా గుర్తింపుని దాచి పెడితే నేరస్థుడి విజయం’’ అంటూ తన ఉనికిని చాటు కుంది. విశాఖపట్నం అమ్మాయి తన గుర్తింపుని దాచు కుంది. ఢిల్లీలో నేరస్థుడు ఆమె మొబైల్ ముందు బోర విరిచి నిలబడ్డాడు. విశాఖపట్నంలో బోయ్‌ఫ్రెండు (అతనూ తెలుగువాడే!) దూరంగా నిలబడ్డాడు.
ఏమయినా ఇప్పుడిప్పుడు వయస్సున్న అమ్మా యిల్ని పర్యావరణ కాలుష్యం చాలా ఇబ్బంది పెడు తోంది. దురదలు ఎక్కువవుతున్నాయి. ఈ దురదల్ని వదలగొట్టి వాళ్లు ముసుగులు తీసి స్వేచ్ఛగా నడిచే అవకాశాన్ని కల్పించాలని నేను మోదీ గారిని కోరుతు న్నాను. ఇది ఈ కాలం కాలేజీ పిల్లల హక్కు అని హెచ్చ రిస్తున్నాను.
ఈ రోజుల్లో స్వేచ్ఛకి అర్థాలు మారిపోయాయి. ముసుగుల అవసరాలు మారిపోయాయి. తన ఉనికిని దాచుకోవలసిన కర్మ తనకు లేదని ఓ ఢిల్లీ అమ్మాయి బోరవిరుచుకోవడమే ఇందుకు నిదర్శనం. అయితే ఈ రోజుల్లో పర్యావరణ కాలుష్యం వయస్సున్న ఆడపిల్లల్ని బాధపెడుతోందన్న విషయం ఏ నగరంలో ఏ రోడ్డు మీద చూసినా మనకు అర్థమవుతుంది.
ఒక్కటి మాత్రం నిజం. నిజాయితీకి ముసుగు వేసే వాళ్లే ముసుగుల్ని ఆశ్రయిస్తారు. అలాగని ముసుగు వేసే వారంతా నిజాయితీపరులు కారని నేననడం లేదు. ఏ ముసుగులో ఏ అర్థం ఉందో తెలియని రోజులొచ్చాయి.
ఇలా నేను చెప్తున్నప్పుడు కొందరయినా వ్యక్తి స్వేచ్ఛ తమ హక్కని ఘోషించవచ్చు. వ్యక్తి స్వేచ్ఛ బూతుమాటలాగ కనిపించే రోజులొచ్చాయి. సభ్య సమాజంలో సామూహిక విలువలను పాటించడం కూడా వ్యక్తి బాధ్యతే. ఇదంతా జస్లీన్ కౌర్ అనే 20 ఏళ్ల ఆడపిల్ల ‘‘నా గుర్తింపును నేను దాచుకోవలసిన ఖర్మ లేదు’’ అని గర్వంగా చెప్పి నా నోరు తెరిపించింది కనుక.
గొల్లపూడి మారుతీరావు.