jeevan kalam
-
‘నేనూ చౌకీదార్‌నే!’
పేదరికం పెద్ద ఉపద్రవం. పెద్ద ఊబి. అభిమానధనుడి ఆత్మాశ్రయం. నిస్సహా యుడి గుండెలో అగ్నిప ర్వతం. దాటి ముందుకు సాగాలని ప్రయత్నించే చెలి యలికట్ట. దాటలేని ఒక్క కారణానికే గంభీరమైన వారధి. ఆ ఒక్క కారణానికే ముట్టుకుంటే జివ్వుమనే రాచపుండు. మొట్టమొదట– అయిదేళ్ల కిందట ఈ తేనె తుట్టని కదిపింది మణిశంకర్ అయ్యర్. మోదీ పూర్వా శ్రమంలో నిద్రాణమైన జీవన సత్యాన్ని లేపి వెక్కిరిం చిన ఘనత ఆ ప్రముఖ రాజకీయ నాయకుడిది. అంతే. మిన్ను విరిగి మీద పడింది. 2014 ఎన్నికలకు పెద్ద ఉద్యమానికి ఆ ‘వెక్కిరింత’ నాంది పలికింది. ‘ఛాయ్‌వాలాతో ముఖాముఖీ’, ‘ఛాయ్‌వాలాతో పిచ్చాపాటీ’ ఛాయ్‌వాలా పురోగతి, ఏ విధంగానూ సిగ్గుపడనక్కరలేని ఓ నాయకుని గతం విశ్వరూపం దాల్చింది. ఇది ఊహించని మలుపు. ఈ కథలో నీతి. ఎప్పుడూ నిద్రపోతున్న ‘పేద రికం’ జూలుని సవరించకు. అది సిగ్గుపడే విషయం కాదు. చేజేతులా పూనుకున్న అవినీతి కాదు. ఆ ‘నిజం’ కోట్లాదిమంది జనసందోహం మధ్య పదే పదే ప్రతిధ్వనించింది.ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిద్రపోతున్న సింహం జూలును మరో విధంగా సవరించారు. ‘రెచ్చగొట్టారు’ అనే మాటకి నిస్సహాయమైన ప్రత్యా మ్నాయాన్ని వాడుతున్నాను. రకరకాల చర్యలను ప్రశ్నిస్తూ ‘అయ్యా చౌకీదార్ గారూ! ఇప్పటికయినా తమరు కళ్లు తెరిచారా? 9 వేల కోట్ల విజయ్ మాల్యా అవినీతి మిమ్మల్ని నిద్ర లేపిందా? హఠాత్తుగా ఇంగ్లండులో ప్రత్యక్షమయిన నీరవ్గారి కథ చౌకీదార్ని ఎలా పలకరించింది. మా ఆస్తులకు చౌకీదార్‌నని గర్వంగా చెప్పుకున్న తమరు ఇప్పుడేమంటారు?’ ఇలాంటి విసుర్లు మనం రాహుల్ గాంధీ గారి సభల్లో వింటున్నాం. ప్రతీసారి ‘మన అధోగతికి జవాబుదారీ ఈ చౌకీదార్’ అన్న స్పృహని రాహుల్ గాంధీగారు విడిచిపెట్టలేదు. అంతేకాదు. అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యాల మధ్య ముల్లె భుజానికెత్తుకు నిలిచిన మోదీ కార్టూన్ కింద రాహుల్ గాంధీ పలకరింత. ‘ఇప్పటికయినా నేరం కాస్త గుచ్చుకుం టోందా చౌకీదార్ జీ!’ అంటూ.ఇప్పుడు కాంగ్రెస్ ట్విట్టర్లో నరేంద్ర మోదీ ‘చౌకీదార్ దొంగ’. అంతే. రాత్రికి రాత్రి బీజేపీ ట్విట్టర్లు కొత్తరూపుని సంతరించుకున్నాయి. నరేంద్ర మోదీ అన్నారు: మీ దృష్టిలో చౌకీదార్ దొంగ. కానీ ఈ దేశంలో అవినీతికి తిరగబడే ప్రతీ వ్యక్తీ చౌకీదారే. ఇప్పుడు నరేంద్ర మోదీ ట్విట్టర్ పేరు ‘చౌకీదార్ నరేంద్ర మోదీ’. అలాగే చౌకీదార్ అమిత్ షా, చౌకీ దార్ నరేష్ గోయెల్– ఇలా అవతరించాయి. దేశ మంతా ‘నేనూ చౌకీదార్‌నే’ అనే ప్రతిజ్ఞ చేయాలని నరేంద్ర మోదీ తన ట్విట్టర్లో 3 నిమిషాల సందేశాన్నుంచారు. ఇది కార్చిచ్చులా దేశాన్ని ఊపి ఉర్రూతలూగించనుంది. నిన్న ఏదో చానల్లో బొంబాయి వంతెన కూలిన సంఘటనలో అవినీతిని ప్రశ్నిస్తూ– ‘ఈ దేశంలో మీరూ ఒక చౌకీదార్. నేనూ ఒక చౌకీదార్ని. ప్రధానే కానక్కర లేదు’ అని బల్లగుద్దారు. నేను నిర్ఘాంతపోయాను– ఒక నినా దం, ఒక ఆలోచన ఇంత సూటిగా, ఇంత బలంగా, మించి ఇంత త్వరగా ప్రజల్లోకి దూసుకు పోగలి గినందుకు. దానికి కారణం ఏమిటి? ఒక్కటే సమాధానం– ఆ నినాదంలో ప్రాథమికమయిన నిజాయితీ.ఎదుటి వ్యక్తి విమర్శని ఆశీర్వాదం చేసుకుని, వెక్కిరింతని ‘ఆయుధాన్ని’ చేసుకుని దేశానికి కొత్త నినాదాన్ని ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇది రెండోసారి.మొదటిది ‘చాయ్‌వాలా’ విమర్శ. ఏమిటి ఇందులో రహస్యం? పక్కవాడి విమర్శలో ‘దమ్ము’ చాలనప్పుడు, వెక్కిరింతలో సామంజస్యం కాక, తేలికతనం ఎక్కువగా ద్యోతకమయినప్పుడు విమర్శ ఆయుధమవుతుంది. కొండొకచో అవకాశమూ అవుతుంది.కాగా, వ్యక్తిని చేసే విమర్శ వ్యవస్థకి ఆశీ ర్వాదాన్ని చేసుకోవడం ఎప్పుడు సాధ్యం? ఆ విమర్శలో బలం చాలనప్పుడు, అందులో నిజాయితీ కంటే ‘అక్కసు’ పాలు ఎక్కువగా ఉన్నప్పుడు. ఈ మధ్య వాట్సాప్‌లో ఓ పెద్ద మనిషి అతి మర్యాదగా నన్ను మందలించబోయాడు. ఆయన సందేశం తాత్పర్యం. ‘పెద్దాయనా! మోదీ భజన చాలు. నిజానిజాలు గ్రహించండి’ అని. ప్రయత్నిస్తున్నాను. అయిదేళ్లకిందట మోదీ ఎవరో నాకు తెలీదు. కానీ ప్రతిపక్షం చేసే ఎత్తి పోతలకూ ఓ మార్గాంతరం కనిపించి, తిట్టుని దీవెన చేసుకోగల సెన్స్ ఆఫ్ హ్యూమర్ దేశమంతా ప్రతి ఫలించింది. ఇది ప్రయత్నించినా సాధించలేని కార్యాచరణ.ఈ వృత్తికి 59 ఏళ్లు పాతవాడిని. నా మాటల్లో నిజాయితీ చాలనప్పుడు– ఒక్క ‘పెద్దమనిషి’ కాదు, పెద్ద జంఝామారుతం నాలాంటి చాలా గొంతుల్ని నొక్కేస్తుంది. మహాత్ముడి గొంతు వినమని ఎవరు బతి మాలారు? అన్నా హజారే గొంతు ఎవరు విన మన్నారు? ఆనాడు కేజ్రీవాల్‌ని రెండుసార్లు నిరా ఘాటంగా ఎవరు ఎన్నుకోమన్నారు? గొల్లపూడి మారుతీరావు -
ప్రకృతి అనే భూతం
ప్రకృతి మనల్ని అక్కున చేర్చుకుని ఆశీర్వదించే కన్నతల్లి. అందుకే ఆ శక్తిని– అర్థం చేసుకోనవసరంలేని సామాన్య ప్రజానీకం ‘దేవత’ అన్నారు. ప్రకృతి సామరస్యం దెబ్బతినకుండా నిరంతరం మన జీవనవిధానాన్ని పూర్వులు నియంత్రించారు. కూల్చిన చెట్టుకి ప్రత్యామ్నాయం ఉండాలి. ఎందుకు కూలుస్తున్నామో, దానికి మారుగా ఏంచేస్తున్నామో చెప్పాలి. దీనికి కర్మకాండ ఉంది. ఉద్దేశం– ప్రకృతిని కదిలించే ఏ పనయినా తెలిసి చేయాలి. కానీ మనం తెలివయినవాళ్లం. ప్రకృతి దేవత ఏమిటి– పిచ్చి వాగుడు కాకపోతే! ఏ ప్రకృతి శక్తినయినా యథేచ్ఛగా, నిరాటంకంగా, నిర్భయంగా వాడుకోగలిగే పద్ధతుల్నీ, ఆలోచనలనీ పెంపొందించుకున్నాం. ఫలితం? నేను మా అబ్బాయి, మనుమరాళ్లతో– 2013లో ఈ భూగ్రహం కొనవరకూ ప్రయాణం చేశాను. నార్వేలో ట్రోమ్సో అనే ఊరు. ఆ తర్వాత భూమిలేదు. అక్కడి నుంచీ దాదాపు 2,000 మైళ్ల పైచిలుకు ఆర్కిటిక్ మహా సముద్రం. ఉత్తర ధృవం. పోనుపోను గడ్డకట్టిన మహా స్వరూపం. ఈ అనూహ్యమయిన మంచు భూతం కింద ఎన్నో సమాధి అయిన– మన గ్రహం వంటి భూభాగాలు, సంస్కృతులూ ఉండి ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నట్లు మొన్న పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు అసలు కథ. 2018లో మానవుడి దురాశ, దురాక్రమణ, నాగరిక వైపరీత్యాల కారణంగా రికార్డు స్థాయిలో భూమి ఉష్ణోగ్రత పెరిగిం దట. పెరిగే అతి చిన్న ఉష్ణోగ్రతకే మన ఆరోగ్యం, ఆహారం, తాగే నీటి వనరులూ దెబ్బతింటాయి. ఈ శతాబ్దపు చివరికి– ఈ లెక్కన 3.5 శాతం ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడేమవుతుంది? చాలా జంతు సంతతి నాశనమవుతుంది. వృక్ష సంపద నశిస్తుంది. సముద్రాల్ని శుభ్రపరిచే నాచు వంటి ‘పెరుగుదలలు’(రీఫ్) పోతాయి. ధృవాలలో నీటిమట్టం కరిగి –సముద్రాల నీటి మట్టం పెరిగి–విశాఖపట్నం, భువనేశ్వర్, చెన్నై, కొచ్చి, నాగపట్టణం వంటి ప్రాంతాలలో భూమట్టం బాగా తరిగిపోతుంది. చాలా స్థలాలు మునిగిపోతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలవల్ల భూమి ఆర్చుకుపోతోంది. చెమ్మతో సమతలంగా ఉండే నేల ఒకప్పుడు వర్షం పడగానే– నీటిని చెరువులకూ, నదులకూ పారించేది. కానీ భూమికే నీటి చెమ్మ అవసరం ఏర్పడింది కదా? 160 దేశాలలో పరిశోధన జరిపిన ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ శాస్త్రజ్ఞులు దీనికి రంగుల అన్వయాన్ని ఇచ్చారు. భూమి మీద 100 వర్షపు చుక్కలు పడ్డాయనుకోండి. ప్రస్తుతం 36 చుక్కలే వనర్లకు చేరుతున్నాయి. దీన్ని ‘బ్లూ వాటర్’ అన్నారు. మిగతా 64 చుక్కల్ని భూమి ఆర్చుకుపోయిన తన భూభాగాన్ని నింపుకుం టోంది. దీన్ని ‘గ్రీన్ వాటర్’ అన్నారు. ఇది ఒక పార్శ్వం. గత 22 సంవత్సరాలలో సముద్రమట్టం సాలీనా 3.2 మిల్లీమీటర్లు పెరుగుతోంది. న్యాయంగా ఏ 80 సంవత్సరాలకో పెరగవలసిన మట్టమిది. ఒక్క కొచ్చీలోనే మిగతా సముద్ర తీరపు పట్టణాలలో కంటే నీటిమట్టం భయంకరంగా చాపకింద నీరులాగ పెరుగుతోందట. డచ్ దేశంలో ఒక సామెత ఉంది. ‘ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించి ఉండవచ్చు. కానీ డచ్ వారు జీలెండుని నిర్మించారు’ అని. గత వెయ్యి సంవత్సరాలలో డచ్ వారు ‘జీలాండ్’ అనే ప్రాంతాన్ని సముద్ర జలాలను తప్పించి నిర్మించారు. ఆ పని జపాన్ చేస్తోంది. వేల ఎకరాల స్థలాన్ని సముద్ర ప్రాంతాల నుంచి– నీటిని తప్పించి సాధించింది. విచిత్రం ఏమిటంటే సముద్రాన్నించి భూభాగాన్ని సంపాదించే ఆధునిక విజ్ఞానం ఒక పక్క పురోగమిస్తుం డగా– భూమిని కబళించే సముద్ర ఉష్ణోగ్రతలను పెంచే అనర్థం మరోపక్క జరుగుతోంది. ఈ భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కాలగమనంలో లక్ష ద్వీపాలు, మాల్దీవ్‌లు, బంగ్లాదేశ్‌లో అధిక భాగం సముద్ర గర్భంలో ఉంటాయట. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో ప్రకృతి విపత్తు పరిశీలనకు ఏర్పాటైన కేంద్ర ప్రొఫెసరు డాక్టర్ అమితాసింగ్ ఒకమాట అన్నారు. నేడు నానాటికీ పెరుగుతున్న జంతు సంహారానికి కబేళాలు వాతావరణంలో విష వాయువుల వ్యాప్తికి కారణమవుతున్నాయట. శాకాహారంతో కనీసం ప్రకృతిలో నాలుగో భాగాన్ని పరిరక్షించవచ్చు. అయితే ఈ ఒక్క మాట చాలు సమాజంలో పెద్ద అల్లర్లు లేవడానికి. ఇప్పుడు గోసంరక్షణ కథలు వింటున్నాం కదా? ఏమయినా మానవుడు తెలివైనవాడు. తాను దిగవలసిన గోతిని తానే తెలిసి తెలిసి తవ్వుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చే ప్రళయం నుంచి రక్షించడానికి అలనాడు వచ్చిన నోవా నావ ఉండదు. కారణం– ఇది స్వయంకృతం. మానవుడి పేరాశ, రక్తపాతంతో అతను స్వయంగా తెచ్చిపెట్టుకున్న విపత్తు. ఇది నా మాట కాదు. డాక్టర్ అమిత్ సింగ్ తీర్పు. కాలగమనాన్ని రుతువులతో పలకరిస్తూ, తరతరాలుగా మానవ కల్యాణానికి మన్నికయిన గొడుగును పట్టిన ప్రకృతి శక్తిని గుర్తించిన వారికి ఆనాడు – తల్లి. ఇప్పుడు నిశ్శబ్దంగా మీద పడి కబళించనున్న పెనుభూతం. గొల్లపూడి మారుతీరావు -
వ్యవస్థ విలువ
ఏ రోజు పేపరు తెరిచినా ఈనాటి దేశ పాలన ఆయా ప్రభుత్వాలు కాక సుప్రీం కోర్టు, చాలాచోట్ల హైకో ర్టులు నిర్వహిస్తున్నాయనిపి స్తుంది. తెల్లవారి లేస్తే ఫలానా పరీక్షలలో అయిదు మార్కులు కలపాలా వద్దా, గవర్నరుగారు ఇచ్చిన తాఖీదు ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంత కాలం ఉండవచ్చు, కలిసి ఒక గదిలో బతికే అమ్మాయి, అబ్బాయి ఎంత కాలానికి భార్యాభర్తలనిపించు కుంటారు, అరెస్టయిన ఫలానా వ్యక్తి నేరస్తుడు అవునా? కాదా? చిన్న పిల్లల పునరావాసాలపైన నిబంధనలు సబబా, కాదా? ఫలానా నీటి పారుదల కాలువ పక్కన మరుగుదొడ్డిని నిర్మించవచ్చా, కూడదా?– ఈ విషయాలన్నింటిపై న్యాయం చెప్పా లని సుప్రీంకోర్టును వ్యాజ్యాల ద్వారా అభ్యర్థించారు. ఈ మధ్య డీఎంకే నేత ఎం.కరుణానిధి తమిళ నాడులో కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. దేశమంతా నివాళులర్పించింది. ఆయన 13 సార్లు శాసనసభకి ఎన్నికై, అయిదుసార్లు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా సేవ చేశారు. ఒక పక్క శవం ఉండగా ఆయన పార్థివ శరీరానికి మెరీనా బీచ్‌లో అంత్య క్రియలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆయన పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని అర్థించారు. ముఖ్యమంత్రి కారణాలు చెప్పి కాదన్నారు. రాత్రికి రాత్రే మద్రాసు హైకోర్టు విచారణ జరిపి, మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలు జరపడానికి అనుమతిని ఇచ్చింది. బయటవారికి కనిపించేది పాలకవర్గం వ్యతి రేకతో, చట్టపరమైన అభ్యంతరం మాత్రమే కాదు, ఒక పక్క దేశ రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు, విదేశీ ప్రముఖులు నివాళులర్పిస్తుండగా, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐడీఎంకే ప్రభుత్వం న్యాయస్థా నంలాగా పెద్దరికం చూపలేకపోయిందే అని. ఒక అనూహ్యమైన, అద్భుతమైన విషయం. సాలీనా 160 లక్షల పోలీసు కేసులున్న బిహార్ దక్షిణ ప్రాంతంలోని ‘పాడియా’ అనే గ్రామవాసులు ఇంత వరకూ న్యాయస్థానం ముఖం చూడలేదు. గత 100 సంవత్సరాలలో ఒక్కటి ఒక్కటంటే ఒక్క పోలీసు కేసు లేదట. ఇది ఈనాటి భారతదేశంలో తగాదాలు లేని, మధ్యవర్తి అవసరం రాని జీవితం గొప్ప సంస్కారం. ఇది ఒక గ్రామం ఒక శతాబ్దంగా పాటిం చడం, అదిన్నీ మన దేశంలో గొప్ప విడ్డూరం. న్యాయ వ్యవస్థ మనకు మనం ఏర్పాటు చేసు కున్న ‘నియతి’. ఆ వ్యవస్థ మన సంస్కారానికీ, పరి ణతికీ సూచిక. అయితే ఆ వ్యవస్థ తప్ప మన నిర్ణ యాలకీ, జీవన విధానానికీ గతిలేని స్థితిని తెచ్చు కోవడం ఆ వ్యవస్థ పతనానికి నిదర్శనం. మనం ఏర్పరచుకున్న న్యాయస్థానం గొప్ప విచక్షణ, నిష్పక్ష పాత వైఖరి గల వ్యవస్థ. మన తలకు మించిన సమ స్యలకి దాన్ని ఆశ్రయించడం మన లక్ష్యం. ఏ రామ మందిరం తగాదానో, ఏ ముస్లిం విడాకుల సంప్రదా యమో, కశ్మీరులో 370 అధికరణ ఆవశ్యకతో– ఇలాంటివి సుప్రీంకోర్టు నిర్ణయించి తీర్పు ఇవ్వాల్సిన గంభీరమైన సమస్యలు. ఫలానా పరీక్షలో అయిదు మార్కులు కల పాలా? రహదారి బంగళా పక్క సారా దుకాణం ఉండాలా? వంటి అతి సామాన్య సమస్యల పరిష్కా రానికి కాదు. మరి ఇప్పుడాపనే జరుగుతోంది. ఈ దేశాన్ని పాలక వ్యవస్థ కాక అతి ముఖ్యమైన కొండ కచో నవ్వు పుట్టించే, చాలాసార్లు నవ్వులపాలు చేసే సమస్యల పరిష్కారం ఈ వ్యవస్థ మీద పడింది. ఫలానా జాతీయ గీతం ఫలానా చోట వెయ్యాలా వద్దా? అప్పుడు మనం నిలబడాలా, అక్కరలేదా? ఇది వ్యవస్థలో చిత్తశుద్ధి, విచక్షణ లేకపోవడానికి నిద ర్శనమని నాకనిపిస్తుంది. కాళీపట్నం రామారావుగారి ‘యజ్ఞం’ గొప్ప కథ. వివరాలు అలా ఉండగా స్థానికులు అంగీక రించిన ఊరిపెద్ద శ్రీరాములు నాయుడు ఆ ఊరిలో చిన్న రైతు అప్పలరాముడు అప్పు గురించి నిర్ణ యాన్ని చెప్తాడు. కథంతా ఆ నిర్ణయం పర్యవ సానాన్ని గురించి. ఆ నిర్ణయానికి తలొంచడం ఆ గ్రామం ‘కట్టుబాటు’. నాయుడి తీర్పు విన్నాక పర్య వసానం కథ. అలా కాక అప్పలరాముడు రొమ్ము విరిచి ‘ఇలా నిర్ణయించడానికి నువ్వెవరయ్యా?’ అన్నా, ‘ముందు పట్నంలో నీ మూడో పెళ్లాం సంగతి తేల్చు’ అని బోర విరిస్తే అది మరొక కథ. ఓ గొప్ప విలువ పతనం. ఏమిటీ ఈ విపరీతం? ఏమయింది ఈ వ్యవ స్థకి? ఒకరిపట్ల ఒకరికి, ఒక వ్యవస్థపట్ల గౌరవం, నమ్మకం, మర్యాద లుప్తమవడమే ఇందుకు నిద ర్శనం. ప్రతీ విషయానికీ సుప్రీంకోర్టుని ఆశ్రయిం చడం, క్లిష్ట సమస్యపై తీర్పు చెప్పాలని అభ్యర్థిం చడం గడుసైన వ్యవహారం. వ్యవస్థను బెదిరించి నడి పించడమే. మనం ఏర్పరచుకున్న గొప్ప వ్యవస్థ మన విశ్వాస రాహిత్యం, విచక్షణా రాహిత్యం, దుర్విని యోగం, నవ్వు పుట్టించే ఆకతాయి వ్యాజ్యాల కార ణంగా మరుగుదొడ్లు, దెయ్యాల స్థాయికి తీసుకువస్తే ఏమవుతుంది? ఏ రోజు పేపరు తెరిచినా అందుకు వంద సమాధానాలు దొరుకుతాయి. గొల్లపూడి మారుతీరావు -
‘నేలబారు మనిషి’
తెల్లారిలేస్తే క్రిమినల్ కేసులతో పత్రికల్లో దర్శనమిస్తూ, రేప్‌లు, భూక బ్జాలతో పబ్బంగడుపుకునే నాయకులూ, వారి అడుగులకు మడుగులొ త్తుతూ వారితో పాటు జైళ్లకు వెళ్లే అధికారుల కథలు చదివి చదివి నిస్త్రాణతో ఈడిగిలపడుతున్న ప్రజానీకానికి ఇంకా మంచితనానికీ, మంచిపాలనకీ వేళ మించిపోలేదని గుర్తు చేసి వెన్నుతట్టే కొందరు ఐయ్యేయస్‌ల కథలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూంటాయి. సమాజగతిలో అందరూ మహాత్ములే ఉండరు. మన తరానికి ఒక్కడే మహాత్ముడు. కాని వారి దక్షత, సేవాభావం అందరూ సూర్యరశ్మిలాగ జాతిని జాగృతం చేసి– ఆరోగ్యకరమైన పరిణా మానికి ఇంకా వేళ మించిపోలేదన్న ‘ఆశ’ని బతికిస్తూ ఉంటుంది. అలాంటి ఒక కథ. తిరువణ్ణామళై జిల్లాలో ఆరణి అనే ఊరు దగ్గర 1000 మంది జనాభా ఉన్న కాణికిళుప్పాల్ అనే పల్లెటూరు. అక్కడ ఓ పేద కుటుంబం. ఇల్లాలు మధ్యాహ్న భోజన పథకంలో వంట మనిషికి సహాయకురాలిగా పనిచేస్తుంది. తండ్రి రోజు కూలీ. వాళ్లకి ముగ్గురు పిల్లలు. పెద్ద పిల్ల ఆనంది. 19 ఏళ్లు. తర్వాత కుర్రాడు. చెల్లెలు మరీ చిన్నది. ఉన్నట్టుండి ప్రసవానికి సంబంధించిన రుగ్మతతో తల్లి కన్నుమూసింది. తండ్రి మూత్రపిండాల వ్యాధితో మరణించాడు. వీరుకాక ఆ ఇంట్లో మరో ముదుసలి. ఆమే ఈ పిల్లలకి పెద్ద దిక్కు. ఇప్పుడు చదువుల సంగతి దేవుడెరుగు. బతకడానికి ఆస్కారం లేదు. ఈ పిల్ల వారం వారం ప్రజా సమస్యలు వాకబు చేసే తిరువణ్ణామళై కె.ఎస్. కందస్వామి దర్బారుకి వెళ్లింది. ప్రజా సమస్యలను కేవలం వినడమేకాక– చేతనయిన ఉపకారం చేస్తాడని ఈ అధికారికి ఆ జిల్లాలో పేరుంది. ఆయన సూటూ బూటూ వేసుకుని సభ తీర్చే ఆధికారికాదు. ‘‘బేర్ ఫుట్ బ్యురోక్రాట్ (స్తూలంగా ‘నేలబారు మనిషి’)అని పేరుంది. ఆయనకి తన గోడు చెప్పుకుంది. అక్కడికి వచ్చే ఎందరో ఆర్తులలో ఆ అమ్మాయీ ఒకరు. ఈ కలెక్టరు తమ గోడుని గుర్తుంచుకుంటారా? ఏదైనా ఉపకారం జరుగుతుందా? ఆ పిల్లకి మరో మార్గాంతరం లేదు. కలెక్టరు ఆమె చెప్పిన వివరాలు రాసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న కనీసపు వయస్సుని సడలించ మని– ఈ 19 ఏళ్ల పిల్ల గురించి ప్రభు త్వానికి రాసి సమ్మతిని తెప్పించాడు. ఉద్యోగం చేస్తూనే ఆమె దూరవిద్యా పథకం ద్వారా పై చదువు చదువుకోడానికి ఏర్పాట్లు చేశాడు. ఈలోగా ఆ ఇంటి ముసలమ్మకూడా వెళ్లిపోయింది. ఇప్పుడా ముగ్గురు పిల్లలకీ దిక్కు, లేదు. ఒక రోజు ఆనందికి కలెక్టరుగారు స్వయంగా ఫోన్ చేశారు– డవాలా బంట్రోతుల వెనుక మాయమయే కలెక్టర్లున్న నేటికాలంలో ఓ అమ్మా యికి స్వయంగా కలెక్టరు ఫోన్ చెయ్యడమే విడ్డూరం. విషయం ఏమిటి? తాను ఆ మధ్యాహ్నం వారింటికి భోజనానికి వస్తున్నట్టు. ఆనంది కంగారు పడిపోయింది. ఈవార్త తెలిసిన గ్రామీణులు ఆ యింటి దగ్గర పోగయారు. కలెక్టరుగారు తన సిబ్బందితో వచ్చారు. భోజనానికి మాత్రమే రాలేదు. తానే స్వయంగా నడుంబిగించి– వంకాయ పులుసు, బంగాళ దుంప కూర, రసం, అప్పళం సిద్ధం చేశారు. వారి పంక్తిన కూచుని భోజనం చేశారు. భోజనం అయాక చాపమీద కూర్చుని– తన అసిస్టెంటు చేతిలో కాగితం తీసుకుని ఆ పిల్లని చదవమన్నాడు. ఆ ఉత్తరం ప్రభుత్వం ఇచ్చిన తాఖీదు. ఆ వూళ్లో వాళ్ల అమ్మ నౌఖరుగా పని చేసిన మధ్యాహ్న భోజన పథకం ప్రోగ్రాంకి ఆమెని అధికారిగా నియమించారు. ఉత్తరం చదువుతూనే ఆ పిల్ల భోరుమంది. అంతేకాదు. కుర్రాడి హైస్కూలు చదువుకీ, ఆఖరి పిల్ల ఎలి మెంటరీ చదువుకీ ఏర్పాట్లు చేశారు. ఆమె నౌఖ రీకి వెళ్లడానికి ఓ సైకిలుని బహూకరించారు. ఈ చర్య వల్ల జీవితం మీదా – అంతకంటే సమా జంలో తన నిస్సహాయతకి దన్నుగా నిలిచిన పాలక వ్యవస్థ మీదా – ఓ 19 ఏళ్ల పిల్లకి ఎంత విశ్వాసం, కృతజ్ఞత నిలదొక్కుకుంటుంది! ఆ చిన్న గ్రామం, అవినీతి ఊబిలో కూరుకుపోతున్న ఈ దేశానికి ఎంత ఆశని చిగురింపజేస్తుంది! కుటుంబం కష్టాలను ఆదుకున్న ఓ అధికారి దక్షత యంత్రాంగం మీద ఎంత విశ్వాసాన్ని పెంచుతుంది? మంచితనం వైరస్. అధికారుల ఆరోగ్యకరమైన స్పందన ఈ వ్యవస్థలో సివిల్ సర్వీసుల లక్ష్యం బ్రిటిష్‌వారి పాలన ముగిశాక, వారి ఆఖరి వారసత్వంగా మనం మిగుల్చుకున్న ఒకే ఒక సర్వీసు సివిల్ సర్వీసు. ఎందుకని? ‘సేవ’ని బాధ్యతగా, వృత్తిగా, ఆదర్శంగా నిర్వహింపజేసిన వ్యవ స్థ అది. ఒకనాటి బ్రౌన్, మెకంజీ, ఆర్దర్ కాటన్ వంటి విదేశీ అధికారులు ఈ సర్వీసుని తమ కృషితో చిరస్మరణీయం చేశారు. తర్వాత తరాలవారు చాలా మంది– నాయకుల అడుగులకు మడుగులొత్తి గబ్బుపట్టించారు. ఈ కందస్వామి వంటివారు ఆనాటి తరానికి వారసులు. - గొల్లపూడి మారుతీరావు -
నిశ్శబ్ద విప్లవ వీరులు
మనం తెల్లారిలేస్తే రాబ్రీ దేవి, ఆమె ముద్దుల తనయుడు తేజస్వీ యాదవ్ జైలుకి వెళ్తారా లేదా? విజయ్ మాల్యాని మన దేశానికి ఎప్పుడు తీసుకు వస్తారు. – ఇలాంటి ఆలోచ నలతో సతమతమవుతూ ఉంటాం. ఇవి మనకి సంబం ధించిన, మన జీవితాలను ప్రభావితం చేసే సమస్యలు కావు. అయినా ఆలోచించడం మనల్ని కృంగదీసే వ్యస నం. కానీ మరొకపక్క నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. కొత్త యోధులు– ప్రమేయం లేని వీరులు ఈ సమా జాన్ని, దేశాన్నీ ప్రభావితం చెయ్యబోతున్నారు. ఆ అమ్మాయి – స్వప్నా బర్మన్ – రెండు కాళ్లకీ ఆరేసి వేళ్లు. బెంగాలులో అతిపేద కుటుంబంలో పుట్టింది. ఆ పిల్ల తండ్రి రిక్షా లాగుతాడు. తల్లి తేయాకు తోటల్లో రోజుకూలీ. వాళ్లు ఒక రేకుల షెడ్డులో బతుకుతారు. దైనందిన జీవినమే వారి సమస్య. కానీ ఫొటోలో ఆ పిల్ల నవ్వు – దైనందిన సమస్యల్ని లెక్కచేయని, ఆకాశంలోకి మోర సారించే ఓ యోధురాలి ‘విశ్వాసా’నికి ప్రతీక. మొన్నటి ఆసియా క్రీడల పోటీలలో– హెప్ల థాన్ అనే క్రీడ ఒకటుంది. ఇది కొన్ని రకాల క్రీడల సమగ్ర రూపం– 100 మీటర్ల హార్డిల్స్, హైజంప్, ఇనుప గోళాన్ని విసిరే ‘షాట్ పుట్’, లాంగ్ జంప్, జావలిన్, 800 మీటర్ల హార్డిల్స్– ఇలాగ. వీటన్నిం టినీ కలిపితే– హెప్లథాన్. క్రీడ అన్నివిధాలా కడుపు నిండిన వ్యక్తి వినోదం. కానీ బయటి ప్రపంచపు వికారాలకు దూరంగా, పేదరికంలో, శారీరక అవలక్షణా లతో మగ్గే ఓ అమ్మాయి కాలివేళ్లతో సరైన జోళ్లు లేక నరకయాతన పడుతోంది. మంచి జోళ్లు కొనుక్కునే ఆస్కారం లేదు. అవకాశం లేదు. అయినా ఈ ప్రతికూల లక్షణాలతో, పగిలిన దవడకి బాండేజీతో ఈ క్రీడమీద ఆధిపత్యాన్ని సాధించింది. దేశీయ స్థాయిలో ఆ క్రీడలో పాల్గొని ఆసియా క్రీడలలో స్వర్ణ పతకాన్ని సాధించి– ఈ దేశ పతాకాన్ని అంతర్జాతీయంగా ఎగురవేసింది. ఆమె చిరు నవ్వులో పేదరికం లేదు. ఆకలి లేదు. అవసరాలు లేవు. ప్రపంచాన్ని జయించే విజయోత్సాహం ఉంది. ఈ విజయం తర్వాత దేశం మేలుకొంది. ఆమె కాళ్లకు సరిపోయే జోళ్లను తయారు చేయించి ఇవ్వడానికి తమిళనాడులో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు వచ్చింది. మన వర్తమానాన్ని గజిబిజి చేసే కుళ్లు నాయ కత్వంతో తలమునకలవుతున్న ఈనాటి వ్యవస్థలో సాహసాన్నీ, ఆశనీ, విశ్వాసాన్నీ నింపే గొప్ప యోధులు వీరు. ఇంకా కింది దశలకు వెళ్తాను. 15 ఏళ్ల కిందటి కథ. మా ఇంట్లో ఓ వంట మనిషి. భర్త తాగుబోతు. ఇద్దరు ఆడపిల్లలు. తాగుబోతు భర్తని దూరంగా తగిలేసింది. ఈ ఇంటికి వంటకి వచ్చినప్పుడు– ఏడె నిమిదేళ్ల ఈ ఇద్దరు పిల్లల్నీ అల్లరి చెయ్యకుండా– ఇంటి బయట గోడ దగ్గర కూర్చోపెట్టేది. వారికి వారి పేదరికం తెలుసు. తమ పరిమితి తెలుసు. బుద్ధిగా కూర్చొనేవారు. మా ఆవిడ ఎప్పుడైనా ఏదైనా ఇస్తే తినేవారు. మా మనుమ రాళ్ల బట్టలు ఇస్తే వేసుకునే వారు. పలకరిస్తే పలికే వారు. లేకపోతే కుంచించుకపోయి– తమ ఉనికి మరొకరిని బాధించకుండా ఆ గోడకి ఒదిగిపోయేవారు. తల్లి పని పూర్తయ్యాక– నిశ్శబ్దంగా చెయ్యి పుచ్చుకు నడిచిపోయేవారు. ఏమవుతారు ఈ పిల్లలు? చదువుకుంటారా? వీళ్లూ వంటలు చేస్తారా? అది హీనమైన పనేం కాదు. అయినా రెండో తరానికి వార సత్వంగా ఇచ్చే పనేనా? ఎప్పుడైనా మనస్సులో కదిలేది. 15 ఏళ్ల తరువాత వీళ్లిద్దరూ పోస్టు గ్రాడ్యు యేట్లయ్యారు. బియ్యే తరువాత కాలేజీ వీళ్లని పిలిచి స్కాలర్‌షిప్పు లిచ్చింది. 40 ఏళ్ల కిందటిమాట. మరొక పేద ఇల్లాలు. ఒక మహా కర్ణాటక విద్వాంసుని దూరపు బంధువు. మేం మద్రాసులో ఉన్న రోజుల్లో మా ఇంటికి వచ్చేది. మా ఆవిడకి వంటలో తోడుగా నిలిచేది. జీతానికి కాదు. బియ్యం నూకలు ఇస్తే కొంగున కట్టుకువెళ్లి పిల్లలకు వండిపెట్టేది. ఒక్కోసారి అక్షింతలు పోగుచేసి, కడిగి వండి– అందరికీ వేర్వేరుగా వడ్డిస్తే సరిపోదని ఒక కంచంలో అన్నం కలిపి పిల్లల నోటికి అందించేది. ఆ పిల్లలు సౌందర్యవంతులు. తర్వాతి కాలంలో ఓ పారి శ్రామికవేత్త ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి మేం వెళ్లాం. ఇప్పుడామె కోటీశ్వరురాలు. కుర్రాడు పెన్నుల కంపెనీలో ఆఫీసరు. ఎప్పుడూ ఓ పెన్నుల పార్శిలు పట్టుకుని నన్ను కలుస్తాడు– ‘మీరు మాకు అన్నం పెట్టారు మామయ్యగారూ’ అంటూ. పేదరికం రెండో పార్శ్వమిది. ఒకరు ఆత్మ గౌర వంతో మంచి జీతానికి నిచ్చెనలు వేస్తూ సమా జాన్ని ఆరోగ్యవంతంగా నిలుపుతున్నారు. మరొకరు దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలుపుతున్నారు. వీరు ఉల్ఫా నాయ కులు కారు. ఇది దేశాన్ని కొల్లగొట్టే అవకాశవాదుల కథ కాదు. స్వప్నా బర్మన్ కథ ఈ దేశానికి విజయపతాక. కళ్లు మిరుమిట్లు గొలిపే నిశ్శబ్ద విప్లవానికి సంకేతం. బంగారు కాంతులతో మెరిసే తూర్పు. గొల్లపూడి మారుతీరావు -
ఎలా ఓడిపోయారు.. ఓడిపోయాను అంతే!!
అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూసిన రోజు ఒకానొక ఇంగ్లిష్ టీవీ చానల్ ‘నివాళి’ని ప్రసారం చేసింది. వివరాలు గుర్తు లేవు. అవసరం లేదు. వాజ్ పేయి 2004 సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతుండగా ఒక కార్యకర్త ఫోన్ పట్టుకుని పరుగున వచ్చాడు– ఫోన్లో పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్. అందరూ బయటికి నడిచారు. కాసేపయ్యాక ఈ పాత్రికే యుడు– వినోద్ శర్మ లోనికి వచ్చారు. ‘ఎలా ఓడి పోయారు? ఏమయింది?’ అని ముషార్రఫ్ పరామ ర్శించారట. వాజ్‌పేయి నవ్వి ‘ఓడిపోయాను. అంతే’ అన్నారట. ఇదీ సంఘటన. ఒక ఎదురుదెబ్బకి నవ్వుకునే, తలవంచి అంగీ కరించే సామర్థ్యం (సెన్సాఫ్ హ్యూమర్) వాజ్‌పేయి సొత్తు. ఇది రాజకీయ నాయకుడి ‘పదును’ కాదు. ఒక కళాకారుడి చరిత్రలో ఎన్నో రంగాలకు చెందిన ఎందరో కళాకారులు రాజకీయ ప్రవేశం చేశారు. ప్రస్తుతం మనసులో కదిలే పేరు– పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఎల్లప్పుడూ మనస్సులో కదిలే ఉదాహరణ– అన్నగారు– ఎన్టీఆర్. ఆయన నేషనల్ ఫ్రంట్ అధ్య క్షులుగా ఉన్న రోజుల్లో– నాచారం స్టూడియోలో మేనక, విశ్వామిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు వీపీ సింగ్ వంటి ఎందరో జాతీయ నాయకులు– గెడ్డంతో మీనాక్షి శేషాద్రితో నటించే తమ నాయ కుడిని నోళ్లు తెరిచి చూస్తూ కూర్చోవడం నాకు గుర్తుంది. అప్పుడు నేనక్కడ ఉన్నాను. అస్మదాదు లకు ఆ దృశ్యం కొత్త కాదు. కానీ ఈ ప్రేక్షక సము దాయానికి కొత్త.చాలా ఏళ్ల కిందట– మద్రాసు సెంట్రల్ పక్క నున్న మైదానంలో ప్రపంచ ప్రఖ్యాత వస్తాదు మహమ్మదాలీ విన్యాసాల ప్రదర్శన జరిగింది. ఆనాడు నేనక్కడ ఉన్నాను. ఆనాటి ముఖ్యమంత్రి ఎమ్జీఆర్ ముఖ్య అతిథి. ఆయన మహమ్మదాలీ ఉన్న ‘రింగు’లోకి వచ్చారు. ఒకే ఒక్కసారి రెండు పిడికిళ్లు ఆయనతో కలిపారు. అంతే, ప్రేక్షకులు విర్రవీగి పోయారు. వారిలో కొందరికి అలీ ఎవరో తెలియక పోవచ్చు. కానీ అందరికీ ఎమ్జీఆర్ తెలుసు. మరి రొనాల్డ్ రీగన్ అనే నటుడు అమెరికా అధ్యక్షుడయ్యారు. ఆర్నాల్డ్ స్వీడ్జిగర్ కాలిఫోర్నియా గవర్నరయ్యారు. మొన్ననే కన్నుమూసిన కరుణానిధి తమిళ సినీ రంగంలో చరిత్రను సృష్టించిన రచయిత. అన్నాదురై రచయిత. జయలలిత నటీమణి. మరి ఇమ్రాన్‌ఖాన్ ఆ పదవిలో ఏం చేస్తారు? అయిదు బంతులతో ప్రత్యర్థిని ఏమార్చి– ఆరో బంతితో వికెట్‌ని కైవసం చేసుకోవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అయిదుసార్లు వికెట్‌కి దూరంగా పరిగెత్తే బంతుల్ని ప్రయోగించి ఒక్క బంతిని ఇన్స్వింగర్గానో, యార్కర్గానో ప్రయోగించే కుశా గ్రత క్రీడాకారుడి చాకచక్యం. ముందు ముందు ఎన్ని బంతులు– మనల్ని ఏమారుస్తాయో చూడాలి. వాజ్‌పేయి తన రాజకీయ జీవితమంతా కవి తని సాధనంగా, ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి పరికరంగా పార్లమెంటులోనూ, బయటా వాడుతూ వచ్చారు. ఆయన ప్రసంగాలలో ‘కవి’ ఎప్పుడూ ప్రధాన పాత్రని పోషించేవాడు. సందర్భం కాకపోయినా ఓ గొప్ప కళాకారుడైన రాజకీయ నాయకునితో అనుభవాన్ని ఉటంకించాలి. 1990 ప్రాంతాలలో అనుకుంటాను– అమెరికా వెళ్లాం. నేనూ, జేవీ సోమయాజులు మరి ఒకరిద్దరు మిత్రులూ ఐక్యరాజ్యసమితిని చూడటానికి వెళ్లాం. అప్పట్లో ప్రధాని పీవీ నరసింహారావు భారతదేశ ప్రతినిధిగా ప్రతిపక్ష నాయకులు వాజ్‌పేయిని పంపారు. భారతదేశ విభాగంలో ఆనాడు వాజ్‌పేయి ఒక్కరే కూర్చుని ఉన్నారు. వెళ్లి నమస్కరించాం. ముందురోజు తెలుగువారికి ప్రదర్శన ఇచ్చామని విన్నవించాం. వెంటనే ఆయన స్పందన ‘అలాగా! తెలిస్తే నేనూ వచ్చేవాడినే!’ ఆయన మూర్తీభవించిన సంస్కారం. భారతీయ విభాగం ముందు వారితో ఫొటోలు తీయించుకున్నాం. దురదృష్టం. నా దగ్గ రున్న వేలాది ఫొటోలలో అదొక్కటే కనిపించలేదు.రాజకీయ నాయకుడికి ‘కళ’ ఒక దన్ను. వారి విధానాలకు కొత్త దిశనీ, రుచినీ సమకూరుస్తాయి. వాజ్‌పేయి వస్తుతః కవి. దాదాపు పదమూడు సంవత్సరాల కిందటే రాజకీయ సన్యాసం చేసిన ఆ కవి అంతఃచేతన మౌనంగా ఇన్నేళ్లూ మనస్సులోనే ఎన్ని కవితలల్లిందో, వేళ్లు ఎన్ని కవితల్ని మౌనంగా మనస్సులో రచించాయో తెలియదు. ‘కళ’లో జీవలక్షణం ఉంటుంది. అందుకనే మరో పదేళ్లు ఆ నిశ్శబ్ద పథికుని మౌన చేతన– ఆయనకు ప్రాణం పోసింది. గొల్లపూడి మారుతీరావు -
పార్లమెంటులో ధనుష్కోటి
ఈ మధ్య పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మాన ఘట్టం చాలా కారణాలకు మనదేశంలో చరిత్ర. ఈ రాజకీయ విశ్లేషకులు ఎంతసేపూ పక్కదారుల్లో పోతారు కానీ అసలు విషయాన్ని వదిలేస్తారు. మొదట విషయాలు మొదట చెప్పుకుందాం. రాహుల్ గాంధీ పార్లమెంటులో కన్ను కొట్టారు. నా మట్టుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆ పని చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో అంత తేజస్సును నేను చూడలేదు. బహుశా ఆయన కన్నుకొట్టినప్పుడు వారి ప్రత్యేకమైన సౌందర్యం బయట పడుతుందేమో విశ్లేషకులు పరిశీలించాలి. మహానుభావులు ఏ వివేకానందో, మహాత్ముని వంటివారో దేశానికి సందేశం ఇస్తున్నప్పుడు వారి ముఖాలు తేజస్సుతో వెలిగిపోవడం మనం చూస్తాం. కానీ రాహుల్ గాంధీగారిలో కుర్రతనం ఇంకా పోలేదనడానికి ఇది నిదర్శనం. తీరా అనుకున్న నాటకం ఇప్పటికి రసకందాయంలో పడింది అనడం ఈ కన్ను కొట్టాడానికి నిదర్శనమా? త్యాగరాజస్వామి ఒక కీర్తనలో ‘కోటినదులు ధనుష్కోటిలో నుండగ ఏటికి తిరిగెదవే మనసా’అని ప్రశ్నించారు. ఈ దేశంలో గంగ, యమున, కావేరి, గోదావరి – ఇలా వేర్వేరు నదులలో స్నానం అక్కరలేదు. కోటి నదుల సంగమం – ధనుష్కోటి– అన్నారు. రాహుల్ గాంధీ.. ఆ మధ్య ప్రధాని మోదీ ప్రపంచంలో అందరు నాయకుల్ని కావలించుకోవడం మీద విమర్శ చేశారు. మోదీగారి పని అనుచితంగా ఉన్నదంటూనే– తానూ అలాంటి పని చేయాలనే కోరిక వారి మనస్సులో ఉన్నదేమో. మరి పార్లమెంటులో ప్రధాని ధనుష్కోటి లాంటివారు. ఒక్కసారి వారిని కావలించుకుంటే అందరినీ కావలించుకున్నంత ఫలితం. దీనిని మర్యాద భంగంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు భావించరాదని నా ఉద్దేశం. నిజానికి ఇలాగే పార్లమెంటులో చాలామంది నాయకులకు మోదీగారి విషయంలో రకరకాల తీరని కోరికలుండవచ్చు. వాటిని బయటపెట్టడం ఎలాగో తెలీక మదనపడుతూ ఉండవచ్చు. ఉదాహరణకి శరద్ యాదవ్‌కి మోదీ గెడ్డం గోకాలనిపించవచ్చు. లాలూకి మోదీ కడుపులో పొడిచి పలుకరించాలని కోరిక ఉండవచ్చు. ఢిగ్గీ రాజాకి మోదీ బుగ్గలు పుణకాలని, గురుమీత్ సింగ్ అహుజాకి వీపుమీద తట్టాలని, శివప్రసాద్‌కి వారి జుత్తు సవరించాలని ఇలా వీరికి మార్గదర్శకమైన ఘనత రాహుల్ గాంధీది. ఈ చర్యని పురస్కరించుకుని మిగతా నాయకులకి కూడా అవకాశాన్ని కల్పించాలని నాకనిపిస్తుంది. పార్లమెంటు సమావేశానికి ముందు మోదీని హాలు మధ్యలో నిలిపి ఆయా నాయకుల కోరికలు సాధికారికంగా జరిపిం చాలని స్పీకర్‌గారికి నా వినతి. మొన్న రాహుల్ గాంధీ తన ఔదార్యం చూపారు. ‘‘మీరు నన్ను పప్పు అని పిలవండి. కోపం తెచ్చుకోండి. తిట్టండి. కొట్టండి. మీమీద నాకు కోపం లేదు. రాదు’’ అంటూనే సరాసరి మోదీ సీటు దగ్గరికి చరచరా నడిచి వచ్చారు. పార్లమెంటులో ఎవరికీ ఈ చర్యకి కారణమేమిటో అర్థం కాలేదు. నా మట్టుకు ఈ మధ్యకాలంలో అంత మనస్ఫూర్తిగా కావలించుకున్న సందర్భాన్ని చూడలేదు. అయితే ఇందులో ఏ పాత్రికేయుడూ గుర్తించని ఒక సంఘటన ఉంది. తీరా ఎవరూ ఊహించని రీతిలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని వాటేసుకున్నాక, మోదీ కూడా చూస్తున్న మనందరిలాగే ఒక్క క్షణం బిత్తరపోయినా వెంటనే తేరుకుని, వెళ్లిపోతున్న రాహుల్ గాంధీని వెనక్కి పిలిచారు. రాహుల్ వెళ్లగానే మోదీ తన భుజం తట్టారు. ఆ చిన్న వ్యవధిలో మోదీ చెప్పిన మాటలు ఏమై ఉంటాయి? ఇదీ విశ్లేషకులు పట్టుకోవలసిన అంశం. నా అనుభవాన్ని పురస్కరించుకుని నాలుగయిదు ఊహాగానాలు చేస్తున్నాను. ‘‘వెకిలి వేషాలు వద్దు పప్పూ.. దేశం చూస్తోంది.’’ ‘‘శభాష్! రాజకీయాల్లో మీ అమ్మనీ, నాన్ననీ, మామ్మనీ మరిపించావయ్యా’’ ‘‘ఈ చర్చ మాటల సభ. డ్రామా స్టేజీ కాదు బాబు’’ ‘‘పార్లమెంటుని పది జనపత్ స్థాయికి ఈడ్వకు బాబు, నేను కాంగ్రెస్ చెక్కభజనకారుడిని కాదు’’ ఇలాంటి మాటేదో అని ఉంటారని నా ఉద్దేశం. పార్లమెంటుని పక్కింటి పున్నయ్యతోనో, వెనకింటి వెంకయ్యతోనో ’రచ్చబండ పిచ్చాపాటీ’ చేయబోయిన కన్నుకొట్టే ’చంటివాడికి’ అంత తక్కువ వ్యవధిలో అనుకోకుండా భుజం తట్టి పాఠం చెప్పడం అనూహ్యమైన విషయం. అపభ్రంశానికి సమయస్ఫూర్తి సరైన ఠంకం. నాటకానికి వాస్తవం ఎప్పుడూ చుక్కెదురు. - గొల్లపూడి మారుతీరావు -
‘భూత’భక్తులు
జీవన కాలమ్ మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండువేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. పశ్చిమామ్నాయ ద్వారక శంకర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సాయిబాబాని పూజించడం భూతాన్ని పూజించడం అన్నారు. నాకు ఓ సంఘటన ప్రముఖంగా జ్ఞాపకం వస్తుంది. 1991లో మా ఇద్దరి అబ్బాయిల పెళ్లిళ్లు 8 రోజుల తేడాలో జరిగాయి. పెద్ద ఎత్తున జరిగిన ఘట్టాలు. మాజీ ముఖ్యమంత్రులూ, ప్రధాని కొడుకులూ, సినీ ప్రముఖులూ, పద్మభూష ణ్లూ, రామోజీరావుగారూ, శోభన్‌బాబు, నాగేష్, బెజ వాడ గోపాలరెడ్డి, జగ్గయ్య, జానకి, కేఎస్ ప్రకాశరావు, అల్లు రామలింగయ్య– ఇత్యాది ఎందరో పెద్దలు హాజర యిన ఖరీదైన పండుగలు. విచిత్రంగా ఆ దశలో నా చేతిలో రొక్కం లేదు. ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అప్పు చేయడం ఎప్పుడూ అలవాటు లేనివాడిని. ఏం చెయ్యాలి? అనే బెంగ మనసులో నిలదొక్కుకుని ఉంది. మద్రాసులో మా ఇంటి ముందు లాన్లో కూర్చుని ఉన్నాను. ఫోన్ వచ్చింది. ఆ రోజుల్లో మొబైళ్లు లేవు. ఎవరో పేరు తెలీని వ్యక్తి. ‘‘మీ ఇంటి వాస్తుని చూస్తాను మారుతీరావుగారూ– మీకభ్యంతరం లేకపోతే’’ అన్నారు. పోయేదేముంది? సరేనన్నాను. వచ్చాడు. ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. ముఖం ఇప్పటికీ గుర్తు లేదు. ఇల్లంతా కలయ దిరిగాడు. నేను లాన్లో కూర్చునే ఉన్నాను. నా దగ్గరికి వచ్చాడు. ‘‘ఇల్లు బాగుంది. చిన్న ఇబ్బందుల్లో ఉన్నారు. పరవాలేదు. బయటపడతారు’’ అంటూ సాయిబాబా బొమ్మని నా చేతిలో పెట్టి వెళ్లాడు. నేను సాయిబాబా భక్తుడిని కాను. పైగా ఆయన అభిప్రాయం నేను కోరలేదు. వెళ్లిపోయాడు. ఆ విషయాన్ని దాదాపు అప్పుడే మరచిపోయాను. నాకు బోగ్రోడ్డులో ఒక ఫ్లాట్ ఉంది. రెండుమూడు రోజుల తర్వాత ప్రముఖ దర్శకులు రాంగోపాలవర్మ కంపెనీ మేనేజరు మా అబ్బాయిని కలిశారు. ఆ ఫ్లాట్‌ని ఆఫీసుకి అద్దెకి తీసుకున్నారు. అడ్వాన్సుగా 40 వేలు ఇచ్చారు (ఇది పాతికేళ్ల కిందటి మాట). దరిమిలాను రెండు పెళ్లిళ్లు జరిగి– ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసే రోజు దాకా ఆ డబ్బు సరిపోయింది. ఇది చేతిలో రొక్కం మాట. వ్రతం నాడు ఎందరో కొత్త బంధు వులూ, హితులూ ఉన్నారు. ఇల్లంతా హడావుడిగా ఉంది. అంతా ఆనందంగా ఉన్నారు. నేను ఏదో సంద ర్భంలో గేటు దాకా వచ్చాను. ఒకాయన– ముందు వచ్చి నాయన కాదు– చెయ్యి జాచాడు. ఈ సమయంలో ఈ మనిషి ఏమిటి? అనుకుంటూ జేబులో చెయ్యి పెట్టాను. ఒక్క రూపాయి ఉంది. తీసి ఆయనకిచ్చి లోపలికి నడిచాను–అసంకల్పితంగా. మరోగంట గడిచాక మళ్లీ గేటు దాకా వస్తే ఇంకా అతను అక్కడే ఉన్నాడు. మళ్లీ చెయ్యి జాచాడు. ఈసారి కాస్త విసుగూ, కోపం వచ్చాయి. ఒకసారి ఇస్తే మళ్లీ అడుగుతాడేమిటి? అయినా ఇది శుభ తరుణం. జేబులో చెయ్యి పెట్టాను. మరో రూపాయి చేతికి తగిలింది. తీసి ఇచ్చాను. పెళ్లికి ముందు నా చేతికి వచ్చిన 40 వేల రొక్కంలో ఆఖరి చిల్లర అది–రెండు రూపాయలు. తర్వాత ఎవరో చెప్పారు–బాబాగారికి రెండు రూపాయల దానం అత్యంత ప్రీతికరమైనదట. చేతికందిన రొక్కం అక్క డితో సంపన్నమయింది. రొక్కమూ అయిపోయింది. ‘‘నేను మీ కంటే ముందు మీ ఇంట్లో ఉంటాను’’ అన్నారట బాబా. అంతకు ముందు మా ఇంట్లో బాబా ఫొటో లేదు. తర్వాత లేకుండా లేదు. చాలా ఏళ్ల కిందట విశాఖపట్నంలో ఓ సాయం కాలం నార్త్ షిర్డీ గుడికి వెళ్లాను. విపరీతంగా ఆకలి వేస్తోంది. దర్శనం అయాక ప్రసాదం చేతిలో పెట్టారు. చాలా రుచిగా ఉంది. ఇంకా తినాలనిపించే ఆకలి. మెట్ల పక్కన అరుగు మీద కూర్చున్నాను. అర్చకుడు పెద్ద ఆకులో ప్రసాదం తెచ్చి నా ముందు నిలబడ్డాడు. చేయి జాచి నా చేతిలో పెట్టాడు. తర్వాత కొన్ని వందలసార్లు ఆ గుడికి వెళ్లాను. ఎప్పుడూ అంత ఆకలి అనిపించలేదు. ఎప్పుడూ అలా ప్రసాదాన్ని కోరుకోలేదు. ఎవరూ అలా ప్రసాదాన్ని ఇవ్వలేదు.SSympathetic Vibration దేవుడా ? మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండు వేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. కొన్ని శతాబ్దాల ‘విశ్వాసం’లో ఎన్నో చేరాయి– రాళ్లూ, రప్పలూ, ఆలోచనలూ, నమ్మ కాలూ. హేతువాదులకి ఇది వెర్రి. కాని బయట కని పించే దృశ్యం కాక, అతని మనసులోని ‘ఆలోచన’ది ఆ శక్తి. ఒక మనస్తత్వ పరిశీలకుడు అన్నాడు కదా, వెంకటే శ్వరస్వామి – గుడిలో ఉన్న శిలలో లేకపోయినా కొన్ని కోట్ల మంది, కొన్ని వందల తరాలుగా తమ కోరికల కోసం, ఆర్తితో అనునిత్యం కేంద్రీకృతం చేసే ఆ ‘బిందువు’ మీద వారి దృష్టి, వారి అపారమైన anticipation, magnetic power కారణంగా ఆ శిల దేవుడ వుతుందని. విశ్వాసానికి మరో రకమైన వివరణ ఇది. దేవుడు వ్యక్తి యొక్క కొంగు బంగారం. విశ్వా సానికి మతం లేదు. రాయికి పేరుంది కాని, మనసు లోని ఆలోచనకి పేరు లేదు. నేను సాయిబాబా భక్తుడిని. (వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు) -
రెండు ముసుగుల కథలు
జీవన కాలమ్ ఈ రోజుల్లో స్వేచ్ఛకి అర్థాలు మారిపోయాయి. ముసుగుల అవసరాలు మారిపోయాయి. తన ఉనికిని దాచుకోవలసిన కర్మ తనకు లేదని ఓ ఢిల్లీ అమ్మాయి బోరవిరుచుకోవడమే ఇందుకు నిదర్శనం. మొన్న ఢిల్లీలోని తిలక్‌నగర్ లో జస్లీన్ కౌర్ రోడ్డు దాటు తోంది. మోటారు సైకిలు మీద వెళ్తున్న సరబ్జిత్ సింగ్ అనే కుర్రాడు జోరుగా వెళ్తూ దాదా పు ఆమెను గుద్దేశాడు. ‘సిగ్న ల్స్ చూసుకో’ అంది అమ్మా యి కోపంగా. అక్కడితో కుర్రా డు మోటారు సైకిలు దిగి తిట్లు లంకించుకున్నాడు. ‘నాతో మోటారు సైకిలు ఎక్కు తావా?’ అన్నాడు బులిపిస్తూ. మనది భారతదేశం కనుక చుట్టూ రెండు డజన్ల మోటారు సైకిళ్ల వారున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ అమ్మాయి అతని ఫొటో తీసింది. సింగుగారు వీరుడిలాగ పోజిచ్చి నిలబడ్డాడు. ఆ అమ్మాయిని బెదిరించి వెళ్లాడు. కౌర్ పోలీస్ స్టేషన్లో రిపోర్టి చ్చింది. కుర్రాడిని అరెస్టు చేశారు. ఈ కథలో నాకు నచ్చిన అంశం ఇది. సెంట్ స్టీఫెన్ కాలేజీ విద్యార్థిని కౌర్ అన్నది: ‘నేను నా ముఖాన్ని కప్పుకోను. కప్పుకొంటే అది కుర్రాడి విజయం అవుతుంది’. అంతేకాదు నేరస్థు లను ముసుగులు కప్పుకోనిస్తారెందుకు? ముసుగులు తియ్యండి. దేశాన్ని ఆ మహానుభావుల్ని దర్శించని య్యండి’. కౌర్‌కి నా హార్దిక అభినందనలు. మరో ముసుగు కథ. నేను విశాఖపట్నం బీచిలో మిత్రులతో కూర్చున్నాను. ఒక అమ్మాయీ అబ్బాయీ చెట్టాపట్టాలేసుకుని నడుస్తూ వెళ్తున్నారు. అమ్మాయి తల నిండా ముసుగు. రెండు కళ్లు మాత్రం తెలుస్తున్నాయి. నన్ను చూడగానే ఆ అమ్మాయి చటుక్కున తలమీద ముసుగు తీసేసింది. కుర్రాడు దూరంగా నిలబడ్డాడు. ఒక పుస్తకం తీసి నా ఆటోగ్రాఫ్ అడిగింది. ‘‘ఈ ముసుగు వేసుకున్నావేం’ అనడిగాను- ఎన్నా ళ్లనుంచో ఏ అమ్మాయినయినా ఈ ప్రశ్న అడగాలని నా ఆరాటం. ఆ పిల్ల నవ్వింది - అది అర్థం లేని ప్రశ్న అన్నట్టు ‘నాకు గాలికి చర్మం మీద దురదలు వస్తాయి’’ అంది. ‘‘మీ అమ్మగారు ముసుగు వేసుకునేవారా?’ ‘‘లేదు’’. ‘‘మీ నాన్నగారు?’’ ‘‘లేదు’’. ‘నీ పక్కనున్న నీ బాయ్ ఫ్రెండుకి ముసుగు లేదు. నాకు లేదు. నా పక్కనున్న ఎవరికీ లేదు. బీచిలో నడిచే రెండు వందల మందికీ దు. ఈ చుట్టుపక్కల - అయి దారు మంది వయసున్న ఆడపిల్లలకి మాత్రమే ఉంది. వారికే దురదలు ఎందుకొస్తున్నాయి?’’. ఆ అమ్మాయికి యీ మాటలు ఇబ్బందిగా ఉన్నా యని అర్థమవుతోంది. ఈ దిక్కుమాలిన నటుడిని ఎం దుకు ఆటోగ్రాఫ్ అడిగానా అన్న విసుగు తెలుస్తోంది. ‘‘ఎన్నాళ్లయింది ఈ ముసుగు వేసి?’’ ‘‘ఎనిమిది నెలలు’’ ‘‘ఎన్నాళ్లయింది మీ యిద్దరూ కలిసి?’’ ‘‘తొమ్మిది నెలలు’’ ఇబ్బంది ఎక్కువయింది. మా మిత్రుడు తెగేదాకా లాగొద్దని నన్ను గోకాడు. నా పెద్దరికం ఒక గీత దాటితే అక్కరకు రాదు. పుస్తకం మీద సంతకం పెట్టాను. చటు క్కున మాయమయింది. నాలుగు అడుగులు వేయగానే మళ్లీ ముసుగులోకి వెళ్లిపోయింది. ఢిల్లీలో అమ్మాయి గర్వంగా ‘‘నా గుర్తింపుని దాచి పెడితే నేరస్థుడి విజయం’’ అంటూ తన ఉనికిని చాటు కుంది. విశాఖపట్నం అమ్మాయి తన గుర్తింపుని దాచు కుంది. ఢిల్లీలో నేరస్థుడు ఆమె మొబైల్ ముందు బోర విరిచి నిలబడ్డాడు. విశాఖపట్నంలో బోయ్‌ఫ్రెండు (అతనూ తెలుగువాడే!) దూరంగా నిలబడ్డాడు. ఏమయినా ఇప్పుడిప్పుడు వయస్సున్న అమ్మా యిల్ని పర్యావరణ కాలుష్యం చాలా ఇబ్బంది పెడు తోంది. దురదలు ఎక్కువవుతున్నాయి. ఈ దురదల్ని వదలగొట్టి వాళ్లు ముసుగులు తీసి స్వేచ్ఛగా నడిచే అవకాశాన్ని కల్పించాలని నేను మోదీ గారిని కోరుతు న్నాను. ఇది ఈ కాలం కాలేజీ పిల్లల హక్కు అని హెచ్చ రిస్తున్నాను. ఈ రోజుల్లో స్వేచ్ఛకి అర్థాలు మారిపోయాయి. ముసుగుల అవసరాలు మారిపోయాయి. తన ఉనికిని దాచుకోవలసిన కర్మ తనకు లేదని ఓ ఢిల్లీ అమ్మాయి బోరవిరుచుకోవడమే ఇందుకు నిదర్శనం. అయితే ఈ రోజుల్లో పర్యావరణ కాలుష్యం వయస్సున్న ఆడపిల్లల్ని బాధపెడుతోందన్న విషయం ఏ నగరంలో ఏ రోడ్డు మీద చూసినా మనకు అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం నిజం. నిజాయితీకి ముసుగు వేసే వాళ్లే ముసుగుల్ని ఆశ్రయిస్తారు. అలాగని ముసుగు వేసే వారంతా నిజాయితీపరులు కారని నేననడం లేదు. ఏ ముసుగులో ఏ అర్థం ఉందో తెలియని రోజులొచ్చాయి. ఇలా నేను చెప్తున్నప్పుడు కొందరయినా వ్యక్తి స్వేచ్ఛ తమ హక్కని ఘోషించవచ్చు. వ్యక్తి స్వేచ్ఛ బూతుమాటలాగ కనిపించే రోజులొచ్చాయి. సభ్య సమాజంలో సామూహిక విలువలను పాటించడం కూడా వ్యక్తి బాధ్యతే. ఇదంతా జస్లీన్ కౌర్ అనే 20 ఏళ్ల ఆడపిల్ల ‘‘నా గుర్తింపును నేను దాచుకోవలసిన ఖర్మ లేదు’’ అని గర్వంగా చెప్పి నా నోరు తెరిపించింది కనుక. గొల్లపూడి మారుతీరావు.