‘భూత’భక్తులు
జీవన కాలమ్
మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండువేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట.
పశ్చిమామ్నాయ ద్వారక శంకర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సాయిబాబాని పూజించడం భూతాన్ని పూజించడం అన్నారు.
నాకు ఓ సంఘటన ప్రముఖంగా జ్ఞాపకం వస్తుంది. 1991లో మా ఇద్దరి అబ్బాయిల పెళ్లిళ్లు 8 రోజుల తేడాలో జరిగాయి. పెద్ద ఎత్తున జరిగిన ఘట్టాలు. మాజీ ముఖ్యమంత్రులూ, ప్రధాని కొడుకులూ, సినీ ప్రముఖులూ, పద్మభూష ణ్‌లూ, రామోజీరావుగారూ, శోభన్‌బాబు, నాగేష్, బెజ వాడ గోపాలరెడ్డి, జగ్గయ్య, జానకి, కేఎస్ ప్రకాశరావు, అల్లు రామలింగయ్య– ఇత్యాది ఎందరో పెద్దలు హాజర యిన ఖరీదైన పండుగలు. విచిత్రంగా ఆ దశలో నా చేతిలో రొక్కం లేదు. ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అప్పు చేయడం ఎప్పుడూ అలవాటు లేనివాడిని. ఏం చెయ్యాలి? అనే బెంగ మనసులో నిలదొక్కుకుని ఉంది.
మద్రాసులో మా ఇంటి ముందు లాన్‌లో కూర్చుని ఉన్నాను. ఫోన్ వచ్చింది. ఆ రోజుల్లో మొబైళ్లు లేవు. ఎవరో పేరు తెలీని వ్యక్తి. ‘‘మీ ఇంటి వాస్తుని చూస్తాను మారుతీరావుగారూ– మీకభ్యంతరం లేకపోతే’’ అన్నారు. పోయేదేముంది? సరేనన్నాను. వచ్చాడు. ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. ముఖం ఇప్పటికీ గుర్తు లేదు. ఇల్లంతా కలయ దిరిగాడు. నేను లాన్‌లో కూర్చునే ఉన్నాను. నా దగ్గరికి వచ్చాడు. ‘‘ఇల్లు బాగుంది. చిన్న ఇబ్బందుల్లో ఉన్నారు. పరవాలేదు. బయటపడతారు’’ అంటూ సాయిబాబా బొమ్మని నా చేతిలో పెట్టి వెళ్లాడు. నేను సాయిబాబా భక్తుడిని కాను. పైగా ఆయన అభిప్రాయం నేను కోరలేదు. వెళ్లిపోయాడు. ఆ విషయాన్ని దాదాపు అప్పుడే మరచిపోయాను.
నాకు బోగ్‌రోడ్డులో ఒక ఫ్లాట్ ఉంది. రెండుమూడు రోజుల తర్వాత ప్రముఖ దర్శకులు రాంగోపాలవర్మ కంపెనీ మేనేజరు మా అబ్బాయిని కలిశారు. ఆ ఫ్లాట్‌ని ఆఫీసుకి అద్దెకి తీసుకున్నారు. అడ్వాన్సుగా 40 వేలు ఇచ్చారు (ఇది పాతికేళ్ల కిందటి మాట). దరిమిలాను రెండు పెళ్లిళ్లు జరిగి– ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసే రోజు దాకా ఆ డబ్బు సరిపోయింది. ఇది చేతిలో రొక్కం మాట. వ్రతం నాడు ఎందరో కొత్త బంధు వులూ, హితులూ ఉన్నారు. ఇల్లంతా హడావుడిగా ఉంది. అంతా ఆనందంగా ఉన్నారు. నేను ఏదో సంద ర్భంలో గేటు దాకా వచ్చాను. ఒకాయన– ముందు వచ్చి నాయన కాదు– చెయ్యి జాచాడు. ఈ సమయంలో ఈ మనిషి ఏమిటి? అనుకుంటూ జేబులో చెయ్యి పెట్టాను. ఒక్క రూపాయి ఉంది. తీసి ఆయనకిచ్చి లోపలికి నడిచాను–అసంకల్పితంగా. మరోగంట గడిచాక మళ్లీ గేటు దాకా వస్తే ఇంకా అతను అక్కడే ఉన్నాడు. మళ్లీ చెయ్యి జాచాడు. ఈసారి కాస్త విసుగూ, కోపం వచ్చాయి. ఒకసారి ఇస్తే మళ్లీ అడుగుతాడేమిటి? అయినా ఇది శుభ తరుణం. జేబులో చెయ్యి పెట్టాను. మరో రూపాయి చేతికి తగిలింది. తీసి ఇచ్చాను. పెళ్లికి ముందు నా చేతికి వచ్చిన 40 వేల రొక్కంలో ఆఖరి చిల్లర అది–రెండు రూపాయలు. తర్వాత ఎవరో చెప్పారు–బాబాగారికి రెండు రూపాయల దానం అత్యంత ప్రీతికరమైనదట. చేతికందిన రొక్కం అక్క డితో సంపన్నమయింది. రొక్కమూ అయిపోయింది.
‘‘నేను మీ కంటే ముందు మీ ఇంట్లో ఉంటాను’’ అన్నారట బాబా. అంతకు ముందు మా ఇంట్లో బాబా ఫొటో లేదు. తర్వాత లేకుండా లేదు.
చాలా ఏళ్ల కిందట విశాఖపట్నంలో ఓ సాయం కాలం నార్త్ షిర్డీ గుడికి వెళ్లాను. విపరీతంగా ఆకలి వేస్తోంది. దర్శనం అయాక ప్రసాదం చేతిలో పెట్టారు. చాలా రుచిగా ఉంది. ఇంకా తినాలనిపించే ఆకలి. మెట్ల పక్కన అరుగు మీద కూర్చున్నాను. అర్చకుడు పెద్ద ఆకులో ప్రసాదం తెచ్చి నా ముందు నిలబడ్డాడు. చేయి జాచి నా చేతిలో పెట్టాడు. తర్వాత కొన్ని వందలసార్లు ఆ గుడికి వెళ్లాను. ఎప్పుడూ అంత ఆకలి అనిపించలేదు. ఎప్పుడూ అలా ప్రసాదాన్ని కోరుకోలేదు. ఎవరూ అలా ప్రసాదాన్ని ఇవ్వలేదు.SSympathetic Vibration దేవుడా ?
మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండు వేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. కొన్ని శతాబ్దాల ‘విశ్వాసం’లో ఎన్నో చేరాయి– రాళ్లూ, రప్పలూ, ఆలోచనలూ, నమ్మ కాలూ. హేతువాదులకి ఇది వెర్రి. కాని బయట కని పించే దృశ్యం కాక, అతని మనసులోని ‘ఆలోచన’ది ఆ శక్తి. ఒక మనస్తత్వ పరిశీలకుడు అన్నాడు కదా, వెంకటే శ్వరస్వామి – గుడిలో ఉన్న శిలలో లేకపోయినా కొన్ని కోట్ల మంది, కొన్ని వందల తరాలుగా తమ కోరికల కోసం, ఆర్తితో అనునిత్యం కేంద్రీకృతం చేసే ఆ ‘బిందువు’ మీద వారి దృష్టి, వారి అపారమైన anticipation, magnetic power కారణంగా ఆ శిల దేవుడ వుతుందని. విశ్వాసానికి మరో రకమైన వివరణ ఇది.
దేవుడు వ్యక్తి యొక్క కొంగు బంగారం. విశ్వా సానికి మతం లేదు. రాయికి పేరుంది కాని, మనసు లోని ఆలోచనకి పేరు లేదు. నేను సాయిబాబా భక్తుడిని.
(వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు)