కోళ్లూ–కుంపట్లూ
జీవన కాలమ్
పదవిలో ఉండే అర్హత తనకి లేకపోతే వంటగదిలోంచి భార్యల్ని ముఖ్యమంత్రి పదవికి బదిలీ చేసిన ఘనులున్న దేశం మనది. తన చెప్పుచేతల్లో ఉన్న ‘చెంచా’ని పదవిలో ఉంచి–ఇంటి నుంచే పాలన చేసే నాయకులున్న రోజులివి.
ప్రపంచంలో కల్లా బాగా డబ్బున్న క్రికెట్ సంస్థ ఇండియా క్రికెట్ బోర్డు. కేవలం ఆదాయం కారణంగా ప్రపంచంలోని క్రికెట్ దేశాల న్నింటినీ శాసించే స్థితిలో ఉంది భారతదేశం. ఇది ఊహించనంత తియ్యని బెల్లం. బెల్లం ఉన్నచోట చీమలు చేరడం సహజం. కానీ ఈ ‘బెల్లం’ చుట్టూ చీమలే కాదు, పాములూ, జలగలూ చేరి కొన్ని దశా బ్దాలుగా పీల్చుకు తింటున్నాయి. ఆ మధ్య ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త–కేవలం అధికారం కారణంగానే పద విని చేజిక్కించుకుని, తన వారినీ రంగంలోకి దింపి– క్రికెట్‌ని జూదం చేసిన ఘనతని సాధించారు.
సుప్రీం కోర్టు ఈ సంస్థ అవకతవకల్ని పరిశీలించి సూచనలు ఇవ్వడానికి లోధా కమిటీని నియమించింది. లోగడ బోర్డు సంపద కోసం, పదవుల కోసం–ఆటకి సంబం« దంలేని వ్యాపారులూ, రాజకీయ నాయకులూ– కుర్చీల్లో స్థిరపడి–వయసు మీద పడినా ఎవరినీ దగ్గరకి రానివ్వకుండా అధికారాన్ని వెలగబెడుతూ వచ్చారు. శరద్ పవార్, బిహార్ బోర్డును పాలించిన లాలూప్రసాద్ యాదవ్, ఎన్‌కెపి సాల్వే, మాధవరావ్ సింధియా, అరుణ్ జైట్లీ–నమూనా ఉదాహరణలు. ‘‘కొందరు మహానుభావులు క్రికెట్‌ని తమ వ్యక్తిగతమైన ఆస్తిగా మలుచుకున్నారు’’ అన్నారు ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులు బిషన్‌సింగ్ బేడీ. తమ కుటుంబ వార సత్వంలాగా ఈ సంస్థని పాలించారు.
ఇకముందు ఈ పప్పులు ఉడకవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ చాలాకాలం దబాయించి ఎదిరించే ప్రయత్నం ప్రస్తుతం పదవిలో ఉన్న పార్లమెంటు సభ్యులు, బోర్డు అధ్యక్షులు అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ అజయ్ షిర్కేలు చేశారు. నిన్ననే సుప్రీంకోర్టు వారి కొమ్ముల్ని కత్తిరించింది. పదవుల్లోంచి తొలగించింది. ప్రస్తుతం లోధాగారి సూచనల ప్రకారం–ఏళ్ల తరబడి పాతుకుపోయి, 70 ఏళ్లు పైబడిన మహానుభావులు– దాదాపు తొంభై శాతం మంది వైదొలగక తప్పదని తెలుస్తోంది. ఇకముందు బోర్డు చేసే ఖర్చులను ఒక దారిన పెట్ట డానికి ఆడిటర్ జనరల్ ఆఫీసరు కమిటీలో ఉంటారు.
అయితే పదవిలో ఉండే అర్హత తనకి లేకపోతే వంటగది లోంచి భార్యల్ని ముఖ్యమంత్రి పదవికి బదిలీ చేసిన ఘనులున్న దేశం మనది. తన చెప్పుచేతల్లో ఉన్న ‘చెంచా’ని పదవిలో ఉంచి– ఇంటి నుంచే పాలన చేసే దొంగ దారులు మరిగిన నాయకులున్న రోజులివి. పైన చెప్పిన పారిశ్రా మికవేత్తకి బంధువున్నాడు. లాలూ గారికి శ్రీమతి ఉంది. వీరు పక్కకి తప్పు కోవలసి వస్తే తమ తమ్ముళ్లనీ, చెల్లెళ్లనీ, కొడుకుల్నీ, కూతుళ్లనీ కుర్చీల్లో కూర్చోపెట్టగల దిక్కుమాలిన తెలివితేటలు వీరికు న్నాయి. ఇవన్నీ లోధాగారికి తెలుసు. తెలిసే ఆ ద్వారా లన్నీ పకడ్బందీగా మూసేశారు. లోధాగారు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. సుప్రీంకోర్టు ఆ దెబ్బ తగిలే లాగ తీర్పు నిచ్చింది.
ఈ దేశంలో సుప్రీంకోర్టు పెద్ద అత్త. అక్కడ మొట్టికాయలు పడితేగాని ఎవరికీ తృప్తి ఉండదు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం జరగాలన్నా, విడిపోయిన పార్టీలు గుర్తులు పంచుకోవాలన్నా, అవినీతిని నిర్ధారిం చాలన్నా, పదవుల్లోంచి తొలగించాలన్నా, జనగణ మనæపాట పాడాలన్నా ఈ దేశంలో విచక్షణకీ, సామ రస్యానికీ, సౌజన్యానికీ స్థానభ్రంశం కలిగి చాలా రోజుల యింది. ఎవరూ ఎవరి మాటా వినరు. దేనికయినా పెద్దత్తగారిదే ఆఖరిమాట. లేకపోతే స్పష్టమైన అవినీతి ఛాయలు కనబడుతుండగా–ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతి సహేతుకంగా ఇచ్చిన రిపోర్టుని అమలు చెయ్యకుండా తిరగబడే ఘనత–బెల్లం రుచి మరిగిన వారికి ఉండకుండా ఎలా ఉంటుంది? ఏమయినా ఈ తీర్పు పట్ల ఠాకూర్‌గారి స్పందన చాలా ముచ్చటగా ఉంది.
‘‘నేను న్యాయస్థానం తీర్పుని శిరసావహిస్తాను. అయితే క్రికెట్ సంస్థని రిటైర్డ్ కోర్టు న్యాయమూర్తులు నడుపుతారంటే వారికి నా శుభాకాంక్షలు’’ అని వాక్రుచ్చారు. ఇందులో ఠాకూర్ గారి అక్కసు, అనవసర విష యాలలో కోర్టు తల దూరు స్తోందన్న కినుక తెలుస్తోంది. ‘‘తన కోడీ, తన కుంపటీ ఉంటేకానీ ఇలాంటి సంస్థ నడవదనే చిన్న ‘అహంకారం’ వారి మాటల్లో «ధ్వని స్తోంది. ఈ దేశంలో ‘బెల్లం’ రుచి మరగని సమర్థులు చాలామంది ఉన్నారు. ఉంటారు. చీమలు దూర మయి నంత మాత్రన బెల్లం రుచి తరగదు. వాళ్ల క్రీడల మంచిచెడ్డలు వారే చూసుకునే సత్సంప్రదాయా నికి ఇన్ని దశాబ్దాల తర్వాత– సుప్రీం కోర్టు జోక్యం కావలసి రావడం క్రికెట్‌కు జరిగిన పెద్ద ఉపకారం. ఏమైనా భారతదేశపు క్రికెట్ ప్రస్తుతం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. తమ ఇంటిని తాము చక్కబెట్టుకునే అవకాశం క్రీడకి మరింత శోభనీ, ‘బెల్లం’ చుట్టూ ఈగలు ముసరకుండా సుప్రీంకోర్టు ధర్మమా అని ‘స్వేచ్ఛ’నీ ఇస్తుందని ఆశిద్దాం.
( గొల్లపూడి మారుతీరావు )