మామా అల్లుళ్ల సవాల్‌ | Gollapudi Maruthi Rao writes opinion on Vishal sikka resign | Sakshi
Sakshi News home page

మామా అల్లుళ్ల సవాల్‌

Published Thu, Aug 24 2017 8:17 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

మామా అల్లుళ్ల సవాల్‌

మామా అల్లుళ్ల సవాల్‌

♦ జీవన కాలమ్‌
కాలం మారుతోంది. ట్రంప్‌ వంటి నాయకుల నుంచి ‘హెచ్‌1–బి’ వీసాల కరువునుంచి వాణిజ్యాన్ని కాపాడవలసిన అగత్యం ఈ తరానికి ఎంతయినా ఉంది. అందుకు విశాల్‌ సిక్కాల అవసరం ఎంతయినా ఉంది.
 
మామ చక్కటి కూతుర్ని కన్నాడు. అల్లారుముద్దుగా 21 ఏళ్లు పెంచాడు. మొట్టమొదటిసారిగా పై ఇంటివాడిని అల్లుడిగా తెచ్చుకుని పిల్లని అతని చేతుల్లో ఉంచాడు. అక్కడితో ఊరుకోకుండా కూతురు కాపురాన్ని మేడమీదే పెట్టించి కింద కాపురం ఉన్నాడు. క్రమంగా అల్లుడిగారి ధోరణి మామగారికి నచ్చలేదు.
 
ఆ దశలో నచ్చవలసింది తన కూతురికీ, అతని చుట్టూ ఉన్న మనుషులకీ కానీ తనకి కాదని మరచిపోయాడు మామ. ఎంతైనా కన్న కడుపు. కూతుర్ని ఎలా చూసుకోవాలో, అలా ఎందుకు చూసుకోకూడదో అల్లుడి చెవిలో ఇల్లు కట్టుకుని పోరడం ప్రారంభించాడు. అల్లుడు యోగ్యుడు. మామగారిమీద అమితమైన గౌరవం ఉన్నవాడు. పరోక్షమైన ఈ స్వారీని తట్టుకోలేక ఓ రోజు అల్లుడు లేచి చక్కాపోయాడు. స్థూలంగా ఇదీ ఇన్ఫోసిస్‌ కథ.
 
నారాయణ మూర్తిగారు సజ్జనుడు. మహామేధావి. పదిమందిని కలుపుకునే స్వభావం కలవాడు. 1981లో ఇన్ఫోసిస్‌ని పూనాలో ప్రారంభించి, బెంగళూరులో నిలదొక్కుకుని 21 సంవత్సరాల ఆధిపత్యంలో దేశంలోకల్లా గొప్ప స్థాయిలో నిలిపి, గద్దెదిగి మరో పదేళ్లు చైర్మన్‌గా వ్యవహరించి, మొదటిసారి ప్రారంభకులను దాటి పైవాడిని తెచ్చి ఆధిపత్యం ఇచ్చారు. ఇచ్చారన్నమాటేగానీ, మరీ బాధ్యతా రహితంగా ఖర్చులు పెంచడం, ఉద్యోగం మానిపిం చిన రాజీవ్‌ బన్సల్కు 23.02 కోట్లను ముట్టజెప్పడం, ప్రైవేటు విమానాల్లో తిరగడం వంటివి మామగారికి నచ్చడం లేదు. 
 
నచ్చడం లేదని చెప్పే హక్కు లేని స్థితి నారాయణ మూర్తి గారిది. కారణం ఆయన కంపెనీలో కేవలం 3.44 శాతం వాటాదారుడు. కానయితే ఆయన నారాయణమూర్తి. ఇది బోర్డు మెంబర్లకు మింగుడుపడని ఇబ్బంది. వంటగదిలో జరిగే ప్రతీ వంటా– కింద కాపురం ఉంటున్న మామగారికి నచ్చ చెప్పాలి. తినేది అల్లుడు. అతను యోగ్యుడు. ఈ పితలాటకం నుంచి– నారాయణ మూర్తి మీద పూర్తిగా గౌరవం ఉన్న అల్లుడు ఏం చెయ్యాలి? ఓ మంచి రోజు చూసుకుని మూటా ముల్లె సర్దుకుని వాళ్ల ఊరెళ్లిపోయాడు. ఇదీ స్థూలంగా ఇన్ఫోసిస్‌ కథ.
 
ఈ కథలో నీతి కాపురానికి పంపాక– కూతురుమీద ప్రేమ ఉండవచ్చు కానీ ‘అధికారాలు’ చెల్లవు. తీరా కల్పించుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఈ దేశంలో టాటా గ్రూపు తర్వాత అంత పెద్ద సంస్థ ఇన్ఫోసిస్‌. 2 లక్షల సిబ్బందితో 122 దేశాలతో సత్సంబంధాలు గల గొప్ప పేరున్న సంస్థ. నారాయణ మూర్తి దక్షతలో, నిజాయితీలో, నీతిలో పేరున్న మనిషి. కానీ పెళ్లయిన కూతురిమీద చెల్లనంత వ్యామోహం పెంచుకున్న మామగారు. అదీ చిక్కు.
 
దాదాపు ఇలాంటి గొడవే ఆ మధ్య టాటా సంస్థలో జరిగింది. తమ కుటుంబానికి చేరువగా ఉన్న మనిషికి సైరస్‌ మిస్త్రీకి– కుటుంబంలోని ఆఖరి పెద్ద రతన్‌ టాటా ఆధిపత్యాన్ని ఇచ్చారు. కానీ కూతురు కాపురం మాట అలా ఉండగా ఇల్లు చెడిపోతోందని గ్రహించి అడ్డం పడ్డారు. ఇది చాలా ఇబ్బం దికరమైన పరిస్థితి. రతన్‌ టాటా పెద్దరికాన్ని ఎరి గిన వారికి ఇది విడ్డూరంగా కనిపించినా, ఆక్షేపణీ యం అనిపించలేదు. కాగా సైరస్‌ అల్లుడు కాదు. వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పెంపుడు కొడుకు. శృతి మించితే పెంపకాన్ని వదులుకునే హక్కు పెద్దాయనకి ఉంది.
 
ఈ మధ్య ఇలాంటిదే మరో గొడవ. ఈ దేశం క్రికెట్‌ సంస్థ పాలనను సరిచేయడానికి ముగ్గురు పెద్దల్ని సుప్రీం కోర్టు నియమించింది. తగని ఖర్చులు పెడుతూ, కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఉద్యోగులు– సీకే ఖన్నా, అమితాబ్‌ చౌదరీ, అనిరుధ్‌ చౌదరీలను తక్షణం బర్తరఫ్‌ చెయ్యాలని వీరు కోరారు.గమనించాలి. ఈ మూడూ మూడు రకాలైన వేర్వేరు కథలు. పిల్లనిచ్చిన మామగారు అల్లుడుగారు చేస్తున్న అనవసరమైన ఖర్చులు గురించి వాపోయారు– మొదటి కథలో. అసలు వారసుడి వ్యవహారమే బొత్తిగా నచ్చలేదు రెండో కథలో. తీరా మూడో కథ అల్లుళ్ల కథ కాదు. సుప్రీం కోర్టు మామని కాదు– కొత్త ‘మొగుళ్ల’ని తీసుకొచ్చి నిలిపింది. కనుక వారి డిమాండ్‌కి ప్రత్యామ్నాయం లేదు.
 
ఏతావాతా ఇన్ఫోసిస్‌ దేశంలో పేరూ, ప్రతిష్టా ఉన్న సంస్థ. నారాయణ మూర్తి పేరూ, ప్రతిష్టని ఆర్జించిన వ్యక్తి. అయితే– తను పదవిలోకి వచ్చిన మూడేళ్లలో విశాల్‌ సిక్కా అనే యోగ్యుడైన మేధావి– ఇంతకాలం డాలరు–రూపాయిల వ్యత్యాసంతో లాభాలను సంపాదించుకునే సంస్థగానే మిగిలిపోకుండా  దశ నుంచి  cost-based నుంచి Innovation-based స్థాయికి పెరగనివ్వాలని ప్రయత్నించాడు. దీనిని మామలు గ్రహించాలి.
 
కాలం మారుతోంది. వ్యాపారం రూపురేఖలు మారుతున్నాయి. ట్రంప్‌ వంటి నాయకుల నుంచి ‘హెచ్‌1–బి’ వీసాల కరువునుంచి వాణిజ్యాన్ని కాపాడవలసిన అగత్యం ఈ తరానికి ఎంతయినా ఉంది. అందుకు విశాల్‌ సిక్కాల అవసరం ఎంతయినా ఉంది. 
గొల్లపూడి మారుతీరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement