సొంతింటి పుల్లకూర
జీవన కాలమ్
బీబీసీలో ఏమైనా లోపాలుంటే? బీబీసీ పక్షపాత ధోరణిని అవలంబిస్తే? నిలదీసే కమిషన్ ఒకటుంది. ఇది గత 35 సంవత్సరాలుగా ఇంగ్లండ్‌లో ఉంటూ బాధ్యతా యుతమైన పాత్రని నిర్వహిస్తున్న డాక్టరు వ్యాకరణం రామారావు చెప్పిన విషయం.
వార్త లక్ష్యం వాస్తవాన్ని చెప్పడం. సమీక్ష కాదు. విమర్శ కాదు. విశ్లేషణ అంతకన్నా కాదు. లిచ్చయ్య వచ్చాడు. వార్త. లిచ్చయ్య తొందరగా వచ్చాడు, సమీక్ష. లిచ్చయ్య తొందరపడి వచ్చాడు. విమర్శ. లిచ్చయ్య ఎందుకు తొందరపడ్డాడు? విశ్లేషణ.
వార్త చానల్ బాధ్యత. నిజానికి పౌరుడి హక్కు. చానల్స్ గురించి మాట్లాడుతున్నాం కనుక డాక్యుమెంటరీ వార్త మీద సాధికారికమైన విశ్లేషణ. ఇందులో ‘ఎడిటర్’ పాత్ర ఎంతయినా ఉంది. ఎడిటర్‌నే ప్రత్యేకంగా పేర్కొ నడం, అది విశ్లేషకుడి మొదటి పని కనుక. ఇక్కడ ఎడిటర్ కేవలం సాంకేతిక నిపుణుడు కాదు. విశ్లేషకుడు కనుక.
చెప్పే మాట కన్నా, చూపే దృశ్యానికి బలం ఎక్కువ. ప్రఖ్యాత ఫ్రెంచ్ దర్శకుడు గొదార్ద్ ఒక మాట అన్నాడు. సినీమా రీలు ఒక సెకనుకి 24 ఫ్రేములు కదులుతుంది. అది 24 ఫ్రేములు కాదట. సెకనుకి 24 సార్లు వాస్తవాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుందట. A film narrates truth 24 times per second. మరి టెలివిజన్‌లో దృశ్యం కదలాలంటే సెకనుకి 26 ఫ్రేములు కదులుతాయి డ్రాయింగ్ రూమ్‌లో. వాస్తవానికి - సినీమా కథకి కాదు, బలం ఎక్కువ. ప్రభావం ఎక్కువ.
ఒక ఉదాహరణ. టీవీలో వీరయ్య రెండూ రెండూ కలిపితే నాలుగంటున్నాడు. అది కేవలం ప్రకటన. వీరయ్య అదే మాట అనడాన్ని మరోసారి చూపించారు. అది వాస్తవాన్ని నొక్కి చెప్పడం. మూడోసారి చూపించారు. మరచిపోకండి సుమా-హెచ్చరిక. నాలుగోసారి చూపిం చారు. అది కర పత్రం. అయిదోసారి చూపించారు. అది ఉద్యమం. ఆరో సారి చూపించారు. అది వెకిలితనం.
మన దేశంలో చానళ్లు ఆయా సంస్థల జేబులు. వార్త ఏమిటని కాదు. ఏ చానల్ చెప్పింది అన్నదే ముఖ్యం. అవి ఆయా సంస్థల గొంతులు కనుక. అవి వార్తల్ని ప్రసారం చెయ్యవు. వార్తల పట్ల తమ అన్వయాన్ని ప్రసారం చేస్తాయి. తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తాయి. ఉద్యమంగా ముందుకు సాగుతాయి. నేనీమధ్య ఇంగ్లండు, జర్మనీ వెళ్లాను. అక్కడెవరూ చానళ్లు ప్రసారం చెయ్యరు. ఒకే ఒక్క ఇంట్లో 24x7 చూశాను. అదేమిటి? ఫలానా చానల్ చాలా హడావుడి చేస్తుంది కదా! మా దేశంలో గొప్ప ప్రచారంలో ఉన్న చానల్ కదా? ఒకాయన నవ్వి, ‘‘అది హడావుడే. వాస్తవానికి వాగుడు ఆయుధం కాదు’’ అన్నారు. అది అన్యా యాన్ని ఎండగట్టడం కాదు. తామనుకున్న న్యాయాన్ని ఎత్తి చూపడం. ‘నిజం’ చెప్పడానికి గొంతు చించుకోనక్కరలేదు. అద్దం చూపిస్తే చాలు. ఆవేశం వాస్తవాన్ని వక్రీకరిస్తుంది.
ప్రసార మాధ్యమాలకీ, ప్రజాభిప్రాయానికీ దగ్గర తోవ కావాలి. ఇంగ్లండ్ యూరోపియన్ యూనియన్‌లో ఉండాలా లేదా అన్న విషయం మీద కొద్దికాలంలో ప్రజాభి ప్రాయాన్ని సేకరించనుంది ప్రభుత్వం. అందులో పాల్గొన వలసిన ఆవశ్యకతని తప్ప మాధ్యమాలు మన ఎన్నికల లాగా ఊదరగొట్టేయడం లేదు ఎక్కడా.
ఇక బ్రిటన్‌లో ప్రసార మాధ్యమం గురించి, వాటి నిష్పక్షపాత వైఖరి, నియతిని గురించి. బ్రిటన్‌లో బీబీసీ ప్రసార సంస్థకి ప్రతీ ఇల్లు సాలీనా 148 పౌండ్లు చెల్లించాలి- విధిగా. ఇది పౌర బాధ్యత. ఒక్క ముసలివారికి మినహా యింపు. ఈ విషయంలో పేదరికం కొలమానం కాదు. మరి టీవీ ఇంట్లో లేకపోతే? లేదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆ వ్యక్తిదే. ఏమిటి ఈ నిరంకుశత్వం? మాకు స్వేచ్ఛలేదా? బీబీసీకి మేమెందుకు చెల్లించాలి? అని మన దేశంలో వందలమంది కోర్టుకు వెళ్లేవారు. విషయమేమి టంటే బీబీసీ ప్రభుత్వ సంస్థ కాదు. స్వచ్ఛంద సంస్థ. వాస్త వాన్ని వాస్తవంగా చెప్తూ, అవసరమయితే ప్రభుత్వాన్నీ నిలదీయగల (ఆ పని బీబీసీ చేస్తుంది)ఒక స్వచ్ఛంద మాధ్య మాన్ని ప్రజలు నిలుపుకున్నారు- తమ ఖర్చుతో. ఒక బాధ్య తాయుతమైన ‘ప్రజావగాహన’ అనే ఉద్యమంలో ప్రతీ పౌరుడూ వాటాదారుడు- అన్నమాట.
బీబీసీలో ఏమైనా లోపాలుంటే? బీబీసీ బాధ్యతల్ని విస్మరిస్తే? బీబీసీ పక్షపాత ధోరణిని అవలంబిస్తే? నిలదీసే కమిషన్ ఒకటుంది. ఇది గత 35 సంవత్సరాలుగా ఇంగ్లం డ్‌లో ఉంటూ బాధ్యతాయుతమైన పాత్రని నిర్వహిస్తున్న తెలుగు డాక్టరుగారు-వ్యాకరణం రామారావు గారు దాదాపు గర్వంగా చెప్పిన విషయం.
మనదేశంలో ఉన్నన్ని చానళ్లు బహుశా మరే దేశంలోనూ లేవేమో! ఏ ఒక్క చానల్‌కీ సామాజిక బాధ్యత ఉండాలనే నియమం లేదు. నియంత్రించే బలమైన యంత్రాంగం లేదు. నిజానికి వాటి ఉనికికి కారణం ఆయా వర్గాల ప్రాతినిధ్యమే. అలాంటి మాధ్యమాలు ప్రజల్ని ఎలా మభ్యపెడతాయో, వాటి వల్ల ఎన్ని దుష్ఫలితాలు వస్తాయో - రోజూ మన దేశంలో జరిగే సంఘటనలే చెప్తున్నాయి. ఆయా సంఘటనల్ని నేను కావాలనే ఎత్తి చూపడం లేదు.
ఒకే ఒక్క ఉదాహరణ: నేను దినపత్రికలో పని చేసే రోజుల్లో ‘రాయ్‌టర్’ అనే ఒక సామ్రాజ్యవాద దేశపు వార్తా సంస్థ ఆనాటి కాంగో పోరాటాన్ని ‘తిరుగుబాటుదారుల చర్య’గా వర్ణించేది. మేము తప్పనిసరిగా జాతీయవాదుల పోరాటంగా రాసుకునేవాళ్లం. ఒక దేశపు పోరాటానికి ఒక మాధ్యమం ఇవ్వగల ‘రంగు’ అది.
మరి కులం మాట? మతం మాట? హిందూత్వం మాట? వర్గ పోరాటం మాట? ఫలానా పార్టీ లక్ష్యాల మాట? మేము మా కళ్లతో చూసే అవినీతి మాట? ప్రతీ సంఘటనకీ ఆయా చానల్ వాటి వాటి అవసరాల్ని బట్టి పులిమే ‘రంగు’- ఇంద్రధనుస్సు లాగ మన కళ్ల ముందు పరుచుకుని - మన ఆలోచనా శక్తిని కబళించివేస్తుంది.
సొంతింటి పుల్లకూర రుచి చూస్తున్నవాడిగా పొరు గింటి చక్రపొంగలి గురించి చెప్పాలనే ఈ ప్రయత్నం.
- గొల్లపూడి మారుతీరావు