చట్టానికి చుట్టాలు | relatives to laws | Sakshi
Sakshi News home page

చట్టానికి చుట్టాలు

Published Thu, May 14 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

చట్టానికి చుట్టాలు

చట్టానికి చుట్టాలు

 (జీవన కాలమ్)
 తీరా నేరం చేశాక- ఈ హీరోగారు ఒక ట్రస్టుని ప్రారంభించి ప్రజా సేవ చేస్తున్నారట. కానీ బాధితుల కుటుంబాలకు కేటాయించిన 19 లక్షల్లో ఒక్క  రూపాయి కూడా ఈ 13 ఏళ్లలో వారికి చేరలేదు!
 
 ఈ దేశంలో దాదాపు అన్ని రంగాలూ అవినీతితో భ్రష్టు పట్టిపోతుండగా ఒక్క చట్ట మూ, న్యాయమూ ఏకాస్తో ఉపశమనం కలిగిస్తున్నదన్న ఆశ సామాన్య మానవునికి మిగిలింది. అయితే డబ్బూ, పరపతి, పదవి, అధికారం వంటివి ఆ చట్టాన్ని కూడా లొంగదీసుకోవచ్చునని ఇప్పుడిప్పుడే రుజువవుతోంది. అలనాడు మహాత్మా గాంధీ ‘యంగ్ ఇండియా’లో అన్నా రు: ‘‘బ్రిటిష్ న్యాయ స్థానాల్లో న్యాయం ఖరీదైన సరు కు. సాధారణంగా బరువైన డబ్బు సంచీదే విజయం’’ అని. మనం బ్రిటిష్ వ్యవస్థ వారసులం.
 13 సంవత్సరాల కిందట తాగి, లెసైన్సు లేకుండా కారు నడిపి ఒకరిని చంపి, నలుగురిని గాయపరిచి, సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ప్రముఖ నటు డు- సల్మాన్ ఖాన్ ఈ 13 సంవత్సరాలూ ఖరీదయిన లాయర్ల దన్నుతో కేసుని సాగదీశారు. 13 ఏళ్ల తర్వాత కారులోలేని మరొక కొత్త సాక్షిని -డ్రైవర్‌ని-రంగంలోకి దింపారు. చట్టంలో అలసత్వం కారణంగా న్యాయవ్య వస్థ - ఎంత డబ్బుని, ఎంత సమయాన్ని, ఎంత విలు వైన సిబ్బంది కృషిని వెచ్చించిందో ఆలోచిస్తే ఇలాంటి నేరస్థుల వల్ల వ్యవస్థ ప్రజాధనాన్ని ఎంత వృథా చేస్తోం దో అర్థమవుతుంది. ఇది సామాన్య పౌరుడి పెట్టుబడి. మనందరి సొమ్ము.
 తీరా న్యాయస్థానం సల్మాన్ ఖాన్ నేరస్థుడని తీర్పు ఇచ్చాక-  ఏనాడూ జరగని విధంగా కోర్టులూ, ఆఫీ సులూ రాత్రి ఎనిమిది వరకు పనిచేసి ఈ నేరస్థుడయిన హీరోగారు జైలుకి వెళ్లకుండా కాపాడాయి. 48 గంటల తర్వాత 13 సంవత్సరాల బెయిలుని మరో రెండు రోజులు పొడిగించారు. కోర్టు ఆర్డరు చేతికి రాకుండానే హైకోర్టు రెండు గంటల్లో తీర్పుని ఇచ్చింది!
 ఈ దేశంలో కనీసం రెండున్నర లక్షల మంది- నూరు రూపాయల లంచం తీసుకున్న పాపానికి బెయి లు డబ్బు కట్టుకోలేక, కోర్టులకు తమ గోడుని ఎలా వినిపించాలో తెలియక సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 1984లో 57 రూపాయలు మనియా ర్డరు సొమ్ము తిన్న ఒకానొక పోస్టుమాన్ 372 సార్లు - 17 సంవత్సరాలు కోర్టుకు హాజరయాడట! చివరికి అతను నిరపరాధి అని కోర్టు తీర్పు ఇచ్చింది!
 తీరా నేరం చేశాక- ఈ హీరోగారు ఒక ట్రస్టుని ప్రారంభించి ప్రజా సేవ చేస్తున్నారట. చేతులు కాల్చుకు న్నాక, చేతులు కాలాయని తెలిసిన గడుసయిన ‘డబ్బు న్న’ నటుడు ఆకులు పట్టుకున్న తెలివైన ప్రణాళిక. ఇం తకీ చచ్చిపోయిన వ్యక్తి కుటుంబానికీ, గాయపడినవారి కుటుంబాలకూ కేటాయించిన 19 లక్షల్లో ఒక్క రూపా యి కూడా ఈ 13 ఏళ్లలో బాధితులకి చేరలేదు!  

 ఇంతకూ సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్తారా? వారి పట్ల అభిమానులు ఎలా ఆవేశపడుతున్నారు? సినీ ప్రపంచం ఏకమయి ఎలా సానుభూతి పలుకుతోంది? ఆయన్ని కోర్టులో చూసి తరించిన పోలీసులు అతి ఆనందంగా వారితో ఎలా కరచాలనం చేస్తున్నారు? చట్టాన్ని అటకె క్కించి తనని జైలు నుంచి తప్పించిన లాయర్లని హీరో గారు ఎంత ఉదారంగా కావలించుకుంటున్నారు?- ఈ దృశ్యాల్ని కేవలం 72 గంటలు చూపించి చానళ్లు సమృ ద్ధిగా డబ్బు చేసుకున్నాయి. ఇదంతా పెద్ద తమాషా. మరో పంచ రంగుల కల.

 1988లో 28 ఏళ్ల ఫిలిం డెరైక్టర్ చారుదత్ ఆచా ర్యని ఓ ప్రముఖ దర్శకుడు, కవి కూతురు కారుతో గుద్దేసింది. అతని కాలు నుగ్గు నుగ్గు అయి శాశ్వతంగా కుంటి అయ్యాడు. ఆమె యాక్సిడెంటు స్థలం నుంచి యథాప్రకారంగా నిష్ర్కమించింది. ఈ ఆచార్యగారి మాటలు: ‘‘ఢీకొట్టి, పారిపోవడంలో (హిట్ అండ్ రన్) రెండు అంశాలున్నాయి. ఢీకొట్టడం, పారిపోవడం. చాలా సందర్భాల్లో-రక్తంలో విస్కీ పాలు ఎక్కువయి ఢీకొట్టవచ్చు. కాని పారిపోవడం- వ్యక్తిలో మానవతా విలువలు పూర్తిగా లోపించాక, రక్తంలో అహంకారం ప్రబలినప్పుడు మాత్రమే జరుగుతుంది. విస్కీ మత్తులో ఉన్నవాడు కారు నడపడం రద్దీగా ఉన్న వీధిలో చింపాం జీ చేతికి ఏకే-47 రైఫిల్ ఇచ్చినట్టు. ఇది కేవలం తాగు బోతు కారు నడిపిన కేసు మాత్రమే కాదు. సిగ్గూ యెగ్గూ లేకుండా పరారీ అయిన నేరస్థుడి కథ. తమ కోటీశ్వరుల క్లబ్బులో వాటాదారుడయిన ఒక స్టార్‌కి వెన్నెముకలేని పరిశ్రమ మద్దతు పలికే సిగ్గు మాలిన కథ.’’

 ఇవి నా మాటలు కావు. 17 సంవత్సరాలు ఇలాం టి యాక్సిడెంటులో ఎన్నో ఆపరేషన్లు, ఎన్నో వైఫ ల్యాలు, రోగాలు తట్టుకుని ఉపాధిని కోల్పోయి చేతి కర్రతో మిగిలిన ఓ దురదృష్టవంతుడి గొంతు. చట్టాలకు కొందరు చుట్టాలుంటారు. వారిలో డబ్బులేని పేద నేర స్థులకి చోటు లేదు. ఆ కారణానికే ఈ దేశంలో ఖరీద యిన చింపాంజీలు చాలా వున్నాయి.
 

 

(గొల్లపూడి మారుతీరావు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement