సద్గురువుల అస్తమయం
ఆయన ముందు కూర్చుని, ఆయన మాట విని లేచాక భారతీయుడినైనందుకు, అంతటి సద్గురువుల నుంచి అన్ని సత్యాలను ఎరిగినందుకు వొళ్లు పులకిస్తుంది. ఆయన నిజమైన సద్గురువు. రామాయణ, భారత, భాగవత ప్రవచనాలు చెప్పలేదు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వ లేదు. తాయెత్తులు కట్టలేదు. మంత్రాలు వెయ్యలేదు. కాని అత్యంత హృద్యమైన రీతిలో ఏంత్రోపాలజీ, చరిత్ర, మాన వ సంస్కృతి, ధర్మనిరతి, సం ప్రదాయ ఔచిత్యం, జీవనసరళి-ఇన్నింటినీ సమన్వ యించి ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతివ్యక్తికీ అందే మా ర్గంలో సత్యాన్ని నిరూపించిన నిజమైన గురువు శివానందమూర్తిగారు. అపూర్వమైన అవగాహన, అనూహ్యమై న సమన్వయం, ఆశ్చర్యకరమైన నైర్మల్యం మూర్తీభవిం చిన గురువరేణ్యులు శివానందమూర్తి మహోదయులు.
ఎప్పుడు వారి సమక్షంలో కూర్చున్నా ఒక జీవితకా లం మననం చేసుకోవలసిన విజ్ఞాన సంపదను - మన దృష్టిని దాటిపోయే విలక్షణమైన కోణాన్ని - ఆవిష్కరిం చేవారు. వారి ప్రత్యేక భాషణాన్ని రాసుకుని మరీ కాల మ్స్ రాసిన సందర్భాలున్నాయి. కొన్ని విషయాలను స్థాళీపులాక న్యాయంగా ఉటంకిస్తాను. శైవం ఒక్క భారతదేశంలోనే కాదు-ఈజిప్టు, మొస పటేమియా, ఆఫ్రికా, మలేసియా వంటి ఎన్నో దేశాలలో ఉంది- అంటూ సోదాహరణంగా నిరూపించారు.
పరాశక్తి ఈశ్వరుని స్వభావం. కన్నుమూస్తే ఈశ్వరుడినే చూడాలి. కన్నుతెరిస్తే ధర్మాన్ని చూడాలి.
మంచి భావాలే విద్య.
ధర్మాన్ని ప్రాణంగా కలిగిన ఆచార వ్యవహారాలే మతం.
శివానుగ్రహం నాకుందని తెలుస్తోం ది. అది అర్హత కాదు. అనుగ్రహం.
సత్యమంత రుచికరమైన వస్తువు ప్రపంచంలో మరొకటి లేదు.
ప్రపంచానికంతటికీ పేదరికం అంటే దరిద్రం. కాని ఒక్క హైందవ జీవనంలోనే అది వైభవం. ఇక్కడ ప్రసక్తి ‘లేమి’ కాదు. ‘అక్కర లేకపోవడం’.
అన్ని ప్రతిభలూ, ప్రజ్ఞాపాటవాలూ, శక్తిసామర్థ్యా లూ, విజయాలూ-అన్నీ పర్యవసించే, పర్యవసించాల్సి న ఒకే ఒక్క గుణం-సంస్కారం. (75 సంవత్సరాల వయస్సున్న నన్ను శృంగేరీస్వామికి ఒకే ఒక్కమాటతో పరిచయం చేశారు- ‘సంస్కారి’ అని!)
సంపద కూడబెట్టడానికి కాదు- వితరణ చెయ్య డానికి. అవసరం ఉన్నవాడికి ఇవ్వడానికి చేర్చి పెట్టుకున్నవాడు కేవలం కస్టోడి యన్. (ఒకసారి భీమిలి ఆనందాశ్రమం లో నేను వారిసమక్షంలో కూర్చుని ఉం డగా ఒక పేదవాడు వచ్చి తన కష్టమేదో చెప్పుకున్నాడు. శివానందమూర్తిగారు లోపల్నుంచి మనిషిని పిలిచి ‘ఇతనికి ఐదువేలు ఇచ్చి పంపించు’ అని చెప్పా రు.) ఈ సత్యాన్ని ఉర్లాం జమీందారీ కుటుంబంలో పుట్టిన ఆయన తన జమీందారీని వదిలి అతి సరళమ యిన జీవికని ఎంచుకుని నిరూపించారు.
ఉత్తర హిందూ దేశంలో గిరిజనుల పునరావాసా లకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నో ప్రజాహిత ప్రణాళికలకు కార్యరూపం ఇచ్చారు. వారు నెలకొల్పిన ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ, సనాతన హిందూ పరిషత్తు - ఎన్ని భారతీయ సంప్రదాయ వైభవాన్ని ఆవిష్కరించే కార్యక్రమాలు నిర్వహించిందో లెక్కలేదు.
ఆయన ముందు కూర్చుని, ఆయన మాట విని లేచాక భారతీయుడినైనందుకు, అంతటి సద్గురువుల నుంచి అన్ని సత్యాలను ఎరిగినందుకు వొళ్లు పులకిస్తుం ది. గర్వపడాలనిపిస్తుంది. అది నా స్థాయి. కాని గర్వా నికీ, స్వోత్కర్షకీ ఆయన దూరం. ఏనాడూ ‘నేను’ అనే మాటని ఆయన నోటి వెంట వినలేదు. నా షష్టి పూర్తికి వారి ఆశీర్వాదాన్ని తీసుకోడానికి నేనూ, నా భార్యా వెళ్లాం. ‘‘రండి. నా పనిని తేలిక చేశారు’’ అంటూ రుద్రాక్ష, ముత్యాల బంగారు మాలని నా మెడలో వేసి ‘దీన్ని ఎప్పుడూ తియ్యకండి’ అంటూ మా యిద్దరికీ బట్ట లు పెట్టి దీవించారు.
ఈ సృష్టిలో అవినీతి, క్రౌర్యం, దుర్మార్గం, దౌష్ట్యం వంటి శక్తులు ప్రబలినప్పుడు సమాజగతిని సమతు ల్యం చేయడానికి ఒక్క గొప్ప శక్తి అవసరమౌతుందన్నది భగవద్గీతకారుడి వాక్యం. ఎన్నో అరాచకాలు, రుగ్మ తలు, దౌష్ట్యాల మధ్య ఒక్క మహానుభావుడి ఉనికి గొప్ప ఊరట. చలివేంద్రం. గొడుగు. గొప్పశక్తుల, వ్యక్తుల సౌజన్యం ఇలాంటి దుష్టశక్తుల నుంచి విడుదల. అలాం టి గొప్ప శక్తి, స్ఫూర్తిని కోల్పోయిన దురదృష్టమైన క్షణం శివానందమూర్తి సద్గురువుల నిర్యాణం. ఎన్ని అవాం చిత పర్యవసానాలకో ఆయన సమక్షం ఒక గొప్ప సమా ధానం. గొప్ప చేయూత. గొప్ప ధైర్యం. ఆ అదృష్టాన్ని ఈ తరం నష్టపోయింది.
- గొల్లపూడి మారుతీరావు