‘మాల్యా-ఆమ్యామ్యా’
అప్పటి హైదరాబాద్ చిన్న చిన్న రిక్షాలతో, అంతకు మించి నాలుగు రెట్లు సైకిళ్లతో, ఎటు చూసినా ప్రశాంత జీవనం గడుపుతున్న జనంతో- అంతకు మించి 2,800 పైచిలుకు జలాశయాలతో ధైర్యంగా ఉన్న గుర్తు.
అవినీతికి దగ్గర తోవలున్నాయి. కాస్త కుశాగ్రబుద్ధిని వినియోగిస్తే తప్పించుకునే మార్గాలూ ఉన్నాయి. ఒక వ్యక్తి సాక్ష్యాలతో అవినీతిలో పట్టుబడ్డాడనుకోండి. రూఢీగా జైలుకి వెళతాడు. ఆ అవినీతిని పది మందికి పంచాడనుకోండి. అది అవినీతి అనిపించుకోదు. వ్యవస్థ నిస్సహాయత అవుతుంది. వందమంది పంచుకున్నారనుకోండి- ఆ అవినీతిని నీతిగా తర్జుమా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అవుతుంది. ఎందుకని? ఆ ‘సమూహం’ ఓట్లకు పదవిని నిలబెట్టే శక్తి ఉంది కనుక. ఆ సమూహంలో అయిదుగురు ఉన్నారనుకోండి- అది ఆదర్శమవుతుంది.
‘ఆదర్శ హౌసింగ్’ కుంభకోణమవుతుంది. అప్పుడు కొన్నవాడికి ఏమీ అవదు. కొనిపించిన వాడి ఉద్యోగం పోతుంది. ఏ ముఖ్యమంత్రో వెళ్లిపోతాడు. మరి ఏభైఏళ్ల పాటు - అవినీతి తెలిసి తెలిసీ - లక్షల కోట్లు చేతులు మారి- లక్షల ఇళ్లు లేచి- ప్రతిసారీ వరదలకు జుత్తు పీక్కొంటే ఏమవుతుంది? ఏమీ అవదు. జుత్తు ఊడుతుంది. వర్షాలు తగ్గుతాయి. కుళ్లునీరు ఇళ్లలోంచి సెలవు తీసుకుంటుంది. కొందరు జబ్బు పడతారు. డాక్టర్లకు డబ్బులొస్తాయి. అందరికీ కోపం వస్తుంది. కొందరు పళ్లు కొరుకుతారు. కొన్ని పళ్లు ఊడతాయి. కానీ జీవితం మళ్లీ వరదలొచ్చేదాకా యథా ప్రకారంగా సాగుతుంది.
1987లో 347 హెక్టారులున్న మీరాలం చెరువు నానాటికీ కుంచించుకుపోవడం అందరూ చూస్తున్నారు. కుంచించుకుపోయిన దుర్గం చెరువు, తుర్క చెరువు లాంటి చెరువుల చుట్టూ తెలిసితెలిసి చాలామంది కోట్లు గుమ్మరించి ఇళ్లు కొనుక్కున్నారు. అమ్మినవాడిది భాగ్యం. కొన్నవాడిది దరిద్రం. కనీసం 17 చెరువుల్లో 43 హౌసింగ్ కాలనీలు లేచాయి. ఈ కాలనీలలో గవర్న మెంటు ఉద్యోగులూ, పెద్దమనుషులూ, అవినీతి తెలిసి నవారూ, తెలియక కొనుక్కున్నవారూ చాలామంది ఉన్నారు. ఇంకా నెక్టార్ కాలనీ, నదీం కాలనీ, నవాబ్ సాహెబ్ కుంట, అంబికానగర్, రాజీవ్‌గాంధీనగర్, బన్సీలాల్ పేటా- ఈ జాబితా నమూనా మాత్రం. 50 సంవత్సరాల పాటు అవినీతిని తరతరాలుగా - క్రమ బద్ధంగా, ప్రణాళిక ప్రకారం పంచిన ‘అవినీతి’ విశ్వ రూపమిది.
ఒకప్పుడు నీటిని ఆహ్వానించి, గుండెల్లో దాచుకుని-అవసరాలను తీర్చే 2,800 చెరువులను భూబకాసురులు ఆపోశన పట్టేశారు. ఈ యజ్ఞంలో - ప్లానుని అంగీకరించిన కింది తరగతి గుమాస్తా దగ్గ ర్నుంచి, ఫైలుని టేబులు నుంచి కదిపిన నౌఖరు వరకు వాటాలు దక్కి ఉంటాయి. ఇప్పుడు ఎవరి మీద ఎవరు చర్య తీసుకోగలరు? ఇది విశ్వరూపం దాల్చిన ఆదర్శనగర్. నేను సరిగ్గా 62 సంవత్సరాల కిందట మొదటిసారిగా హైదరాబాద్ వచ్చాను. పంజాగుట్ట దాటిన తర్వాత ఇప్పటి శ్రీనగర్ కాలనీ దాటి నగరం లేదు. చీకటిపడగానే ఆ ప్రాంతాలకు నక్కలు రావడం నాకు తెలుసు.
అప్పటి హైదరాబాద్ చిన్న చిన్న రిక్షాలతో, అంతకు మించి నాలుగు రెట్లు సైకిళ్లతో, ఎటు చూసినా ప్రశాంత జీవనం గడుపు తున్న జనంతో- అంతకు మించి 2,800 పైచిలుకు జలాశయాలతో ధైర్యంగా ఉన్న గుర్తు. ఇప్పుడు జనాభా ఎన్నో రెట్లు పెరిగింది. అంతకు మించి భూబకాసురు లకు డబ్బు చేసుకునే యావ పెరిగింది. ‘నలుగురితో చావు పెళ్లితో సమానమని’ వారికి అర్థమయింది. ఇప్పుడు ఎటు చూసినా ‘ఇళ్లు’ కావు- ఓటు బ్యాంకులు. కులాల, మతాల, పదవుల, కరెన్సీ జులుం.
ఎవరిని ఎవరు కదిపే ధైర్యం ఉంది? ఇది కనీసం 50 సంవత్స రాలుగా నిశ్శబ్దంగా సాగుతున్న దందా. నీరు ప్రాణాధారం. నీటి వనరుల్ని ఆనుకునే జీవసంతతి నిలదొక్కుకుంటుంది. సంస్కృతీ వికాసానికి సంకేతం- జలాధారమే. సింధునదీ సంస్కృతి, నైలునదీ సంస్కృతి, గంగానది, నర్మదా నది, రైన్ నది, ఓల్గా నది- ఇవి మానవ సంస్కృతీ వికాసానికి ప్రతీకలు. నీరు జీవాధారం. మనిషి జీవనానికి చక్కని దన్ను. ఇది ఒక పార్శ్వం. నీరు ప్రాథమిక శక్తి. దాని మర్యాదను కాపా డుకోలేకపోతే తిరగబడుతుంది. ఆ మధ్య కేదార్‌లో, ఇటీవలే చెన్నైలో, ఇప్పుడిప్పుడు హైదరాబాద్, సికిం ద్రాబాద్ నగరాల్లో అదే జరిగింది.
ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? నోరులేని- కాని సమయం వస్తే తన సత్తా చాటే నీటి విలయాన్ని తట్టు కుని- నోరుమూసుకుంటే ఎవరికీ గొడవలేదు. కాదం టారా? 50 సంవత్సరాల గోత్రాలను విప్పి ‘తిలా పాపం’ పంచుకున్న, అడ్రసులు తెలీని ఏ భూబకాసు రులను వేటాడతారు? అదీ అవినీతిని పంచిన బకా సురుల ధైర్యం. ఈ మాట కొనేవారికీ చెప్పి, ఒప్పించి ఉంటారు ఆ రోజుల్లో. కొందరు తెలిసీ వాటాలు పంచుకుని ఉంటారు. ఇదే నేను చెప్పిన ‘అవినీతి’ పంపిణీ.
ఇంకా తమకి అర్థం కాకపోతే లండన్‌లో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన ప్రస్తుతం భారతదేశాన్ని కొల్లగొట్టి ఇంగ్లిష్ అమ్మాయిలతో సరసాలు సాగిస్తు న్నాడు. వారిని సంప్రదించమని మనవి.
(తాజావార్త: తెలంగాణ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్రమ కట్టడాలను కూలుస్తోంది-హేట్సాఫ్!)
- గొల్లపూడి మారుతీరావు