కబాలి
చిన్న ఫోకస్ లైట్లు వెలుగుతున్నాయి. ఆ చీకటిలో ఎవరో భుజం మీద చెయ్యి వేసి పలకరించారు. చీకట్లోకి చూస్తే- రజనీకాంత్. ఉండబట్టలేక - నేను మీకు కథ చెప్పాను-అన్నాను. ‘‘నాకు తెలుసు సార్! తెలుసు’’ అన్నారు.
దశాబ్దాల పాటు కోట్లాది అభిమానుల్ని ఆకట్టుకున్న హీరో-పదిమందిలోకి వచ్చి నప్పుడు-కాస్త షోకు చేసుకో వాలనీ, తెర మీద కనిపించే హీరో అవతారాన్ని గుర్తు చేసేలాగ మురిపించాలనీ నాకనిపిస్తుంది. ఇది వ్యాపార బాధ్యత. కాగా, అవసరం కూడా. అసలు ఆ రంగానికి ఉన్న మొదటి సూత్రమే- ప్రదర్శన. వాస్తవానికి చిన్న ముసుగు. అయితే ఈ ముసుగుని బొత్తిగా చించేసిన నటుడు, బహుశా ప్రపంచంలో మరే నటుడికీ లేనంత ఆవేశపూరిత మయిన అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు, రోడ్డు మీద తారసపడితే కలలోనైనా తెర మీద హీరోతో పోల్చడానికయినా అవకాశం ఇవ్వని నటుడు- రజనీ కాంత్. నల్లగా, ఒక పద్ధతిలో లేని బట్టతలా, రెండు పక్కలా అస్తవ్యస్తంగా చెదిరిన జుత్తూ, తెల్లని మాసిన గెడ్డం, నలిగిపోయిన బట్టలూ - బయటకు వచ్చే ముందు ఒక్కసారయినా అద్దంలో తన ముఖం చూసు కున్నాడా అనిపిస్తుంది. మాటల్లో కూడా - ఈ 65 ఏళ్ల హీరో ‘‘మా అమ్మాయి వయస్సులో, ఆమెతో సరదాగా ఉండే చిన్నపిల్లతో పాటలు పాడాను’’ అని ఆయనే చెప్తారు సభల్లో. కొన్ని కోట్ల వ్యాపారానికి పెట్టుబడి అయిన ఈ నటుడు- ఆ వ్యాపారానికి ఏ విధమయిన ఉపకారమూ చెయ్యడేం! అనిపిస్తుంది.
అయితే ఆయన చిత్రాలు, వాటి ఆదాయం అద్భుతాలు. నానాటికీ ప్రచార మాధ్యమాల శక్తీ, ఉధృతీ పెరుగుతున్న రోజుల్లో- వ్యాపారానికి ఎల్లలు చెరిగిపోతున్న రోజుల్లో రేపు రిలీజు కాబోతున్న చిత్రం ‘కబాలి’, రిలీజు కాకముందే కొత్త రికార్డులను సృష్టించింది. 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రిలీజు కాక ముందే 200 కోట్ల ఆదాయాన్ని తెస్తుందని పండితుల అంచనా. రిలీజయాక మరో వంద కోట్లు. 4 వేల థియేటర్లలో ప్రపంచమంతటా, 400 థియేటర్లలో ఒక్క అమెరికాలో ఈ చిత్రం రేపు రిలీజు కాబోతోంది.
తమిళం, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో వస్తున్న ఈ చిత్రం మలేసియా, థాయ్‌లాండ్‌లలో కూడా రిలీజవుతోంది. మొదటి రోజే హాంకాంగ్, చైనాలో రిలీజుకి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎయిర్ ఏషియా సంస్థ ఈ చిత్ర ప్రచారానికి చెయ్యి కలిపి - ఒక విమానానికి రజనీ కాంత్ బొమ్మ వేసింది. కబాలి బనీన్లు, కప్పులు, తాళం చెవులూ - అమెరికా వెర్రికి ఇండియా హీరో బొమ్మ తోడయింది. ఈ చిత్రం టీజర్‌ని కేవలం 24 గంటల్లో 50 లక్షల మంది ఆసియాలో చూశారట! ఇదొక రికార్డు. 28 మే నాటికి 5 కోట్ల మంది చూశారు.
చాలామందికి తెలియని విషయం- రజనీకాంత్ అతి నేలబారు మనిషి. ఏ మాత్రం భేషజాలకు పోని మనిషి. విగ్గు పెట్టి కెమెరా ముందు నిలిచినప్పుడు ఆయ నలో కనిపించే దుడుకుతనం, పెళుసుతనం, వేగం, విసురూ, ప్రేక్షకుల్ని కిర్రెక్కించే విన్యాసాలు నిజ జీవితంలో దగ్గరకయినా రానివ్వని మనిషి. నేను ఆయనకి ఓ సినీమా రాశాను. ఆయన ఇంట్లో మా పెద్దబ్బాయితో కూర్చుని కనీసం రెండు గంటలు కథ చెప్పాను. తెలుగు మాట్లాడుతారు. హేమ్‌నాగ్ సంస్థ- మూడు దక్షిణాది భాషల్లో- తమిళం, కన్నడ, మలయాళంలో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆయా భాషల్లో దిగ్గజాలయిన ముగ్గురు రచయితల్ని కూర్చోబెట్టి కథ చెప్పాను. రాశాను- పంజు అరుణాచలం, ఉదయ్‌శంకర్, శ్రీకుమరన్ తంబి. సినీమా పేరు ‘గర్జనై’. ఇది 35 సంవత్సరాల కిందటి మాట. ఆ మధ్య కమల్‌హాసన్ పుట్టినరోజుకి ఒక హోటల్లో విందుకి వెళ్లాను. దక్షిణాది సినీ పరిశ్రమ అంతా ఉంది. దీపాలు ఆర్పేశారు.
చిన్న ఫోకస్ లైట్లు వెలుగుతున్నాయి. ఆ చీకటిలో ఎవరో భుజం మీద చెయ్యి వేసి పలకరించారు. చీకట్లోకి చూస్తే- రజనీ కాంత్. ఉండబట్టలేక - నేను మీకు కథ చెప్పాను- అన్నాను. ‘‘నాకు తెలుసు సార్! తెలుసు’’ అన్నారు. గ్లామర్‌ని తన భుజాల మీద మోస్తూ గాలిలో నడి చే నటుల్ని మనం తరతరాలుగా చూస్తున్నాం. వృద్ధా ప్యంలో కూడా యువకులతో సమంగా గ్లామర్‌ని పెద్ద రికంతో నిలుపుకున్న అమితాబ్ బచ్చన్‌ని తెలుసు. గ్లామర్‌ని రాజకీయాలకు తర్జుమా చేయడానికి ప్రయ త్నించి పిల్లిమొగ్గలు వేసిన చిరంజీవిని తెలుసు. తాగి మనుషుల్ని చంపి గ్లామర్ వెనుక మాయమయే సుల్తా న్‌లను తెలుసు. తన పరపతి, గ్లామర్‌ని పెట్టుబడిని చేసి రాష్ట్రాలను ఏలిన అపూర్వ నాయకులు- ఎమ్.జి.ఆర్.; ఎన్.టి.ఆర్‌లను తెలుసు. తన పరిమితిని ఎరిగి- హుందాతనం స్థాయిలో నిలిచి జీవించిన నటసమ్రాట్‌ని తెలుసు.
కాని ప్రచార మాధ్యమాలు గ్లామర్‌ని ఆకాశంలో (మాటవరసకి కాదు - అక్షరాలా! ఎయిర్ ఏషియా అందుకు సాక్ష్యం) నిలిపిన కొత్త స్థాయిని ఇప్పుడు చూస్తున్నాం. కాని-కాని- వీటన్నిటినీ భుజాల మీద మోస్తూనే ఎప్పటికప్పుడు తెర మీది హీరో ఇమేజ్‌ని చీల్చి చెండాడుతూ జీవించే అతి సరళమయిన హీరో విశ్వరూపాన్ని - కపాలీశ్వర న్ వెరసి- కబాలిని రేపు ప్రపంచం చూడబోతోంది.
- గొల్లపూడి మారుతీరావు