‘మంద్‌సౌర్’ దిశానిర్దేశం
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ప్రారంభమై యావద్దేశానికి మార్గనిర్దేశం చేసిన రైతుల ఆందోళన స్థానికపరమైన సీజనల్ సమస్య కాదు. పంట నష్టం లేదా ప్రకృతి వైపరీత్యాలతో కూడిన ఒత్తిడి ఫలితమూ కాదు. ఈ నిరసన భారత వ్యవసాయ సంక్షోభంతో నేరుగా ముడిపడి ఉంది.
మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన రైతాంగ ఉద్యమ చరిత్రలో నూతన దశకు ఆజ్యం పోసింది. జూన్ 6న జరిగిన పోలీసు కాల్పుల్లో కనీసం అయిదుమంది రైతులు చనిపోయారని ఇప్పుడు స్పష్టమవుతోంది. రైతుల ఆందోళన అంత త్వరగా సమసిపోదని కూడా స్పష్టమవుతోంది.
అన్ని ఉద్యమాల్లోలాగే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇది ప్రారంభమైంది. జూన్ 1 నుంచి తాము పండిస్తున్న ఉత్పత్తుల్ని–ఆహార ధాన్యాలు, కూరగాయలు– నగరాలకు పంపకుండా నిలిపివేయాలని ఆ ప్రాంత రైతులు నిర్ణయించారు. ఇది వెంటనే మహారాష్ట్రలోని పలు జిల్లాలకు విస్తరించింది. దాని ఫలితంగా జూన్ 1, 2 తేదీల్లో ఏపీఎమ్‌సీ (వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహకార సంస్థ) శాఖల్లో చాలావాటికి వ్యవసాయ ఉత్పత్తులు చేరలేదు. ప్రారంభంలో ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దీంతో చర్చలకు సిద్ధం కావలసి వచ్చింది. ఆ ఆందోళన ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు వ్యాపించింది. ఆ రాష్ట్ర సీఎం కూడా రైతు అనుకూల సంస్థలతో ఒప్పందం గురించి ప్రకటించారు. కానీ ఇది అమ్ముడుపోవడమే అంటూ ఈ ఒప్పందాన్ని చాలా రైతు సంఘాలు తిరస్కరిం చాయి. మహారాష్ట్రలో రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాల్లోని రైతు సంఘాలు కూడా శక్తి పుంజుకున్నాయి.
ప్రస్తుత రైతాంగ ఆందోళన ఎంత అసాధారణమైనదంటే, ప్రకృతి వైపరీత్యాలు, పంటల నష్టం జరిగిన సంవత్సరంలో ఇది చోటుచేసుకోలేదు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో వరుస కరువులు ఎదుర్కొన్న తర్వాత గత వ్యవసాయ సీజన్‌లో మహారాష్ట్రలో సాధారణ వర్షపాతం దన్నుతో పంటలు బాగా పండాయి. సాధారణంగా రైతు ఆందోళనలు పంట నష్టాలతో ఉధృతమవుతుంటాయి. ఈ సంవత్సరం మహా రాష్ట్ర రైతులు అధిక స్థాయిలో కాకున్నప్పటికీ సాధారణ స్థాయిలో పంట లను పండించారు. చాలా సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక వ్యవసాయ ఉత్పాదకతకు గాను అవార్డు అందుకుంటోంది కూడా.
మరి రైతాంగ ఉద్యమాలు ఉన్నట్లుండి ఇలా పెచ్చరిల్లడానికి కార ణం ఏమిటి? ప్రస్తుత ఆందోళనను రెండు పరిణామాలు రెచ్చగొట్టినట్లు కనబడుతోంది. ఒకవైపు, పంటలు బాగానే పండటంతో రైతులు పండిం చిన పంటలకు ధరలు బాగా పడిపోయాయి.
రెండోది, ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలపై మాఫీని ప్రకటించిన ఘటన ఇతర రాష్ట్రాల్లోని రైతులు చిరకాలంగా చేస్తూవస్తున్న డిమాండ్లను మళ్లీ వారి దృష్టికి తీసుకువచ్చింది. ప్రధానంగా కాయధాన్యాల విషయంలో ధరలు కుప్పగూలిపోయాయి. దేశంలో కాయధాన్యాల కొరత ఏర్పడటంతో కేంద్రప్రభుత్వం క్వింటాల్ కంది పప్పు కనీస మద్దతు ధరను రూ. 4,500ల నుంచి రూ. 5,000ల వరకు పెంచింది. రైతులు కూడా ఎంతో సంతోషించారు. కాయధాన్యాల సాగు, ఉత్పత్తి బాగా పుంజుకుంది. కానీ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలుపుకోవడంలో విఫలమైంది. ప్రకటించిన ధర వద్ద ఉత్పత్తిని సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విఫలమయ్యాయి.
క్వింటాల్‌కు రూ. 5 వేలు పొందడానికి బదులుగా రైతులు తమ పంటను రూ.3 వేలకే అమ్ముకోవలసివచ్చింది. మధ్యప్రదేశ్‌లో సోయా బీన్ పండించిన రైతులు, తెలంగాణలో మిర్చి రైతులు కూడా ఇదే విషాదాన్ని ఎదుర్కొన్నారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో టమోటా రైతులు తమ పంటను అత్యంత హీన స్థాయి ధరకు అమ్ముకోవడం కంటే రోడ్డుపై విసిరిపారేయడానికి నిర్ణయించుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుచేత పంట విఫలమైనప్పుడు మాత్రమే కాకుండా రుతుపవనాలు ఆశాజనకంగా ఉండి, పంటలు బాగా పండిన కాలంలో కూడా రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారని తేలుతోంది. ప్రస్తుత రైతాంగ ఆందోళనలకు ఇదే చోదక శక్తి.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో రైతుల ఆందోళనకు వెనుక వాస్తవ ప్రాతిపదిక ఇదే. అది స్థానికమైనదీ, సీజనల్ సమస్య కాదు. పంట సంబంధమైన లేదా ప్రకృతి వైపరీత్యాలతో కూడిన ఒత్తిడి పర్యవసానం కాదు. ఈ నిరసన భారత వ్యవసాయ సంక్షోభంతో నేరుగా ముడిపడి ఉంది. నేటి భారత వ్యవసాయ సంక్షోభం మూడు రూపాల్లో ఉంది. మొదటిది భారత వ్యవసాయంలో పర్యావరణ సంక్షోభం. హరిత విప్లవంతో కూడిన ఆధునిక వ్యవసాయ విధానాలు జనం భరించదగినవి కావు. వనరులు, ఎరువులు, పురుగుమందులు, నీరు వంటివాటిని భారీగా వినియోగించడంతో కూడిన ఈ తరహా వ్యవసాయం ఇప్పుడు దాని అంతిమ దశకు చేరుకుంది. రెండు, భారత వ్యవసాయంలో ఆర్థిక సంక్షోభం. మన వ్యవసాయ ఉత్పాదకత దేశ అవసరాలకు, భూమి, వనరుల లభ్యతకు అనుగుణంగా లేదు. దీంతో ముడిపడిన మూడో అంశం రైతు ఉనికి సంక్షోభం. వ్యవసాయం రైతును బతికించే స్థాయిలో లేదు. రైతుల ఆత్మహత్యలు ఈ సంక్షోభంతోనే ముడిపడి ఉన్నాయి.
ప్రస్తుత రైతుల ఆందోళనలో గుర్తించవలసిన అంశమేదంటే ఈ మౌలిక సమస్యను పరిష్కరించడంపై అది దృష్టి పెట్టడమే. తక్షణ, స్థానికపరమైన ఉపశమనం కోసం రైతులు డిమాండ్ చేయడం లేదు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తామని ఎన్నికల్లో పాలకపార్టీ చేసిన వాగ్దానాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. రైతులందరి రుణాల మాఫీని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దేశీయ రైతాంగ ఉద్యమాలు దీర్ఘకాలం నుంచి చేస్తూ వస్తున్న డిమాండ్లు ఇవి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా వీటి పరిష్కారానికి సంసిద్ధత చూపలేదు.
ప్రస్తుతం పఢణవిస్ ప్రభుత్వం పాక్షికమైన, షరతులతో కూడిన రుణమాఫీ చేయడానికి అంగీకరించింది. కాని ఇది రైతులకు సంతృప్తి కలిగించేలా లేదు. కనీస మద్దతు ధరతోనే పంట దిగుబడులను సేకరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కానీ దీనికి ప్రాతిపదిక ఏది అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఇక శివరాజ్ చౌహాన్ చేస్తున్న ప్రకటనలు కూడా దీనికి భిన్నంగా లేవు. పైగా ఈ రెండు రాష్ట్రాల్లోని బీజేపీ సీఎంలు కేంద్రం నుంచి మద్దతు పొందుతున్నట్లు లేదు.
ఈ స్థితిలో దేశంలోని మిగతా ప్రాంతాలపై మంద్‌సౌర్ రైతాంగ ఉద్యమం చూపే ప్రభావం ఏమిటన్నది చెప్పటం కష్టం. ప్రస్తుత ఆందోళన ఎంతకాలం కొనసాగుతుందో కూడా మనకు తెలీదు. కాని రైతుల వాస్తవ సమస్యలు పరిష్కారం కావటం లేదని మాత్రమే మనకు తెలుసు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు మార్గదర్శనం చేశారు. ఇప్పుడు దేశంలోని మిగతా ప్రాంతాల్లోని రైతులు దాన్ని చేపట్టి ఈ పోరాటానికి తార్కిక ముగింపు ఇవ్వాల్సి ఉంది. రైతుల రాజకీయాల్లో కొత్త దశ కోసం మనం సిద్ధంగా ఉన్నాం.
- యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు
మొబైల్ : 98688 88986 ‘Twitter : @_YogendraYadav