యూనిఫాం సివిల్ కోడ్(యూసీ సీ)పై వివాదాన్ని మళ్లీ రాజేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్య ఊహించదగిన ప్రతిస్పందనలనే రాబట్టగలిగింది. అనేక మంది ప్రతిపక్ష నాయకులు యూసీసీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ముస్లిం సంస్థలు ఒక అడుగు ముందు కేసి దీన్ని మైనారిటీలకు, రాజ్యాంగానికి విరుద్ధమైన ప్రమాదకరమైన చర్యగా ఖండించాయి.
రాజ్యాంగం వాగ్దానం చేసిన సమానత్వాన్ని అందరికీ అందించడం కోసం అంటూ యూసీసీని బరిలోకి దించింది బీజేపీ. అయితే లౌకికవాద రాజకీయాలు సంప్రదాయ (మైనారిటీ) మతనాయకులతో గొంతుకలుపుతూ దానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. దీంతో విషాదకరమైన, హాస్యస్ఫోరకమైన సైద్ధాంతిక పోరాటానికి వేదిక సిద్ధమైంది.
లౌకికవాదం పేరుతో ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా నిలబడటం ఖాయమని ఊహించే బీజేపీ ఈ చదరంగాన్ని ప్రారంభించి ఉంటుంది. ఆరెస్సెస్, బీజేపీలు చట్టవిరుద్ధంగా హిందూ మతాన్నీ, సంప్రదాయాలనూ, జాతీయవాదాన్నీ ఆక్ర మించి ముందుకు వెళుతుంటే లౌకికవాద రాజకీయాలు ఆ మేర వెనకబడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ముందుకు తీసుకువచ్చిన ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ప్రతిపక్షాలు పప్పులో కాలువేసి బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్ప డటానికి కారణమవుతున్నాయి.
ఈ తిరోగమనం ఆగాలంటే, లౌకిక రాజకీయాలు ఉమ్మడి పౌరస్మృతి పట్ల సూత్రప్రాయమైన, ప్రగతిశీలమైన పాత్ర పోషించాలి. యూసీసీకి ఏ ఒక్క మతానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలతో ప్రమేయం ఉండదనీ, దీని ద్వారా వివిధ మతపరమైన సమూహాల్లోనూ, సమూహాల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వాన్ని పాదుకొల్పడమే ప్రధాన ఉద్దేశం అనే సంగతినీ గుర్తెరగాలి.
స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతలను తొలగించి అందరికీ ఒకే విధమైన న్యాయాన్ని ప్రదానం చేయడం దీని ఉద్దేశమని గ్రహించాలి. యూసీసీని వ్యతిరేకించడం పేలవమైన రాజకీయం! 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు లౌకికవాదులకు ఇది చెడు రాజకీయ వ్యూహం అని చెప్పక తప్పదు.
ఉమ్మడి పౌర స్మృతి ఆలోచన చట్టం ముందు సరళమైన, శక్తిమంతమైన హేతుబద్ధ సమానత్వాన్ని ప్రతిపాదిస్తోంది. పౌరు లందరినీ ఒకే శిక్షాసమ్మృతి ద్వారా పాలించగలిగితే, సివిల్ కోడ్‌కు అదే సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయకూడదు? అలాగే వివిధ సంఘాలు వారి ప్రత్యేక ఆచారాలను సంప్రదాయాలను ఆస్వా దించవచ్చు, అయితే వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఏ సంఘాన్నైనా అనుమతించవచ్చా? ఒక మతం లేదా సంస్కృతికి చెందినవారు తమ ఆచారం పేరుతో సొంత సమా జంలోని మహిళల సమానత్వ హక్కును హరించడాన్ని అనుమ తించవచ్చా? ఇవి బీజేపీ వాదనలు కావు. యూసీసీ కోసం మహిళా సంస్థల అసలు డిమాండ్ వెనుక ఉన్న కారణం ఇదే.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఈ న్యాయబద్ధం కాని ఆదేశిక సూత్రము (సమానత్వం)ను కలిగి ఉంది. భారత భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన సివిల్ కోడ్‌ను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూనే ఉన్న మనలాంటి వారు ఈ కీలక సూత్రాలలో ఒకదాని నుంచి అకస్మాత్తుగా వెనుదిరగలేరు.
జాతీయ ఎన్నికలకు 10 నెలల ముందు, లా కమిషన్ అంతకు ముందు తిరస్కరించిన యూసీసీనే తిరిగి ప్రవేశ పెట్టాలని బీజేపీ భావించడం మైనారిటీలను దెబ్బతీయడానికి మరొక సైట్‌ను తెరవడమే. కాంగ్రెస్ వంటి పార్టీలు కుటుంబ చట్టాల సంస్కరణలను హిందువుల గొంతుకపైకి నెట్టేయ గలవనీ, అయితే ముస్లింలు, క్రిస్టియన్ల విషయంలో అలా చేయడానికి ధైర్యం చేయవనీ దీని ఉద్దేశ్యం. ముస్లిం, క్రైస్తవ వర్గాల సంప్రదాయవాద నాయకత్వంతో ప్రతిపక్షాలు గొంతు కలుపు తాయని ఊహించే బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. ఇంతకు ముందు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించి తప్పు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు బీజేపీ పన్నిన యూసీసీ ఉచ్చులో పడిపోతున్నాయి.
ప్రతిపక్షాలు యూసీసీ ఆలోచనను వ్యతిరేకించే బదులు, ‘యూనిఫాం’ సివిల్ కోడ్‌ను బీజేపీ ఏ విధంగా తప్పుగా వ్యాఖ్యా నిస్తుందో చెప్పాలి. ‘యూనిఫాం’ సివిల్ కోడ్ అంటే దేశంలో బహుళ కుటుంబ చట్టాల స్థానంలో ఒకే చట్టం ఉండాలి. పైగా ఆ చట్టం అన్ని మత వర్గాల సభ్యులకు వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం కోసం ఒకే విధమైన నిబంధనలను కలిగి ఉండాలి. ఇదే ముందుకు తేవాల్సిన వెర్షన్. కానీ బీజేపీ విమర్శ కులు ప్రతిఘటిస్తున్న సంస్కరణ ఇది. ఇది రాజ్యాంగ ఆదేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది.
సంఘ సంస్కర్తల దార్శనికత, రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం, స్త్రీవాద ఉద్యమం డిమాండ్ వంటివి ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఏకరూప కోడ్ అనేది ఒకే రూపంలో కానీ ఒకే సూత్రంగా కానీ ఉండదు. బదులుగా, ఇది ఉమ్మడి సూత్రాలు, విభిన్న నియ మాలను కలిగి ఉంటుంది. ఇక్కడ, ఏకరూపత అంటే అన్ని మత, సామాజిక సంఘాలు ఒకే రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండడం. సమానత్వ హక్కును, వివక్షకు వ్యతిరేకంగా ఉన్న హక్కును, లింగ న్యాయం ఆలోచనను ఉల్లంఘించేలా ఏ కమ్యూ నిటీకి చెందిన కుటుంబ చట్టం అనుమతించబడదు. ఈ సూత్రా లను ఉల్లంఘించే ఏ ఆచారం లేదా కుటుంబ చట్టానికి స్థానం ఉండదు.
అదే సమయంలో, ఈ ఉమ్మడి సూత్రాలు వివిధ సంఘాలకు వేర్వేరు రూపాలను తీసుకోవచ్చు, వాటి ప్రస్తుత లేదా క్రోడీకరించిన పద్ధతులపై ఇది ఆధారపడి ఉంటుంది. హిందూ ఆచారాల మాదిరిగా కాకుండా, ముస్లిం వివాహం ‘నిఖా నామా’పై ఆధారపడిన ఒప్పందం. ‘యూనిఫాం’ సివిల్ కోడ్‌కు ముస్లింలు దీనిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, లేదా హిందువులు దానిని స్వీకరించాల్సిన అవసరం లేదు. వివిధ సంఘాలు అందరికీ ఉద్దేశించిన రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించనంత కాలం... వివాహం, విడాకులు, దత్తత, వారసత్వా నికి సంబంధించి పూర్తిగా భిన్నమైన, పరస్మర విరుద్ధమైన ఆచా రాలు, పద్ధతులను అనుసరించడం కొనసాగించవచ్చు.
చాలా కాలంగా, లౌకిక రాజకీయాలు బీజేపీ చొరబడిన నేలను ఖాళీ చేశాయి. ప్రతిపక్షాల ఈ స్వీయ–ఓటమి రాజకీ యాలకు యూసీసీ మరొక ఉదాహరణగా మారకూడదు. బీజేపీ రచించిన స్క్రిప్ట్ ప్రకారం ఆడటానికి, మైనారిటీ వర్గాల సంప్రదాయవాద నాయకత్వంతో చేతులు కలపడానికి బదులుగా, లౌకిక రాజకీయాలు బీజేపీ బుకాయింపునకు ఎదు రొడ్డాలి. ప్రతిపాదిత యూసీసీ గణనీయమైన ముసాయిదాను సమర్పించమని అడగాలి.
యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
(‘ద ప్రింట్’ సౌజన్యంతో)
ప్రతిపక్షాలు బీజేపీ ఉచ్చులో పడరాదు!
Published Sun, Jul 2 2023 4:30 AM | Last Updated on Sun, Jul 2 2023 4:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment