ఎజెండాను ఆవిష్కరిస్తున్న యోగేంద్రయాదవ్. చిత్రంలో కోదండరామ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: కొంత మంది వ్యక్తులు వచ్చే లోక్‌సభ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య జరిగే పోటీగా చిత్రీకరిస్తున్నారని స్వరాజ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. తెలంగాణ జన సమితి, స్వరాజ్ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ‘2019 లోక్‌సభ ఎన్నికల ఎజెండా, కార్యాచరణ, పౌరుల ప్రతిపాదన’ వంటి అంశాలపై సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టం పేరుతో ముస్లింలను ఇబ్బందులకు గురిచేస్తోందని యోగేంద్ర విమర్శించా రు. మతం పేరుతో పౌరసత్వాన్ని ముడి పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోందని, ప్రపంచంలో ఎక్కడ పుట్టిన సరే ముస్లింలు కాకుంటే భారత పౌరులుగా వారికి గుర్తింపు ఇస్తామనే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రజా ప్రతిని ధుల ఎన్నిక విషయంలో మతం, డబ్బు, మద్యం ప్రధానాంశాలుగా కాకుండా నిస్వార్థం గా పని చేసే వారికి అవకాశం కల్పించే విధంగా మారాలని అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లో కొత్త మార్పులను తీసుకురావడానికి మేధావులు, ప్రజా ఉద్యమకారుల ఆధ్వర్యంలో ‘రీక్లెయిమింగ్ ద రిపబ్లిక్’ పేరుతో ఒక ఎజెండా ను రూపొందించామని చెప్పారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ’ఇండియన్ సిటిజన్ యాక్షన్ ఫర్ నేషన్ (ఐ కేన్)’ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ.. నిస్వార్థంగా పని చేసే వారిని లోక్‌సభ ఎన్నికల బరి లో నిలుపుతామని, దీని కోసం స్వతంత్ర ఎన్నికల ప్యానెల్ అభ్యర్థులను నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికలో బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రచారం కోసం ఐ కేన్ ప్రత్యేక వాలంటరీ వ్యవస్థ పని చేస్తుందన్నారు. తెలంగాణలోని ప్రజలందరూ ఐ కేన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజల తరఫున పోరాడే వారికి మద్దతు..
దేశవ్యాప్తంగా పర్యటించి మేధావులు, ప్రజల పక్షాన పోరాడే వారిని సంప్రదించి ఈ ఎజెండా రూపొందించామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ప్రజల ముందుకు ఈ ఎజెండాను తీసుకుపోవడానికి ఐ కేన్ పని చేస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ, రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున గళం వినిపించే వ్యక్తులు కావాలని, అటువంటి వారికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మద్దతుగా నిలిచేందుకు ఈ ఐ కేన్ పని చేస్తోందన్నారు. యోగేంద్ర యాదవ్ ప్రతిపాదించిన ఎజెండాను తెలంగాణ జన సమితి ముందుకు తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment