
విశ్లేషణ
ఈ నిరసనలకు ఇన్ని కోణాలు ఉన్నా, ఒక సారూప్యత కూడా కనిపిస్తుంది. అది, ప్రస్తుత ప్రభుత్వం ఉన్నత విద్యాలయాల మీద అమలు చేయాలనుకుంటున్న కొత్త విధానాల పట్ల వ్యతిరేకత. ఆ కొత్త విధానాన్ని కేవలం కాషాయీకరణగా పేర్కొనలేం. నిజానికి అంతకు మించినదే.
భగత్‌సింగ్ జయంతి పేరుతో అర్థంపర్థంలేని కార్యక్రమాలు చాలా జరిగిపోతున్నాయి. ఉత్సవాలు, నివాళి ఘటించడం, దండలు, ఉపన్యాసాలు.. ఒకటేమిటి! ఆ గొప్ప విప్లవకారుడు నవ్వుకుని ఉండేవాడు. కొన్నేళ్లుగా భగత్‌సింగ్ దేనికీ చెందని చిహ్నంగా మారిపోయాడు. ప్రత్యేకమైన సిద్ధాంతానికి చెందినవాడని అన డం లేదు. భగత్‌సింగ్ పట్ల మనం ఏర్పరుచుకున్న కల్పనకు ఇది పూర్తిగా విరుద్ధం. కానీ వాస్తవంగా భగత్‌సింగ్ అంటే ఏమిటి? దీనిని గుర్తు చేసుకోవడానికి ఆయన 110వ జయంతి ఉపకరిస్తుంది. ఆయన భారతదేశం పట్ల, ప్రపంచం పట్ల ప్రత్యేక దృక్పథం కలిగినవాడు. ఆయనను గుర్తుంచుకోవడానికి మంచి మార్గం ఏమిటంటే, ఆ గతం దగ్గరకు గాని, ఆయన జీవితం గురించి గాని చెప్పుకోవడం కాదు. ఒక గొప్ప విప్లవకారుడిని గుర్తుంచుకోవాలంటే ఉన్న మార్గం ఒక్కటే– వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి ప్రశ్నిం^è డమే. ఆ ప్రశ్న: భావి భారతాన్ని యువతరం ఎలా పునర్నిర్మించగలదు?
అలాంటి ప్రశ్న వేయడానికి ఇది మంచి సమయం కూడా. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మున్నెన్నడూ జరగని రీతిలో విద్యార్థినుల నాయకత్వంలో జరిగిన నిరసన యువజన రాజకీయాల మీద మరోసారి దృష్టి సారించేటట్టు చేసింది. నిజానికి గడచిన రెండేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా– పుణేలోని ఎఫ్‌టిఐఐ, అలహాబాద్ విశ్వవిద్యాలయం, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, జేఎన్‌యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇప్పుడు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వరకు ఇలాంటి నిరసనలు వెల్లువెత్తడం చూశాం. ఈ నిరసనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేని వేర్వేరు ఘటనలేనా? కాకపోతే వాటి మధ్య ఒక అంతస్సూత్రం ఏదైనా ఉందా? ఇది నిజమైతే ఇవి భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలవా? ఈ ప్రశ్న నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టం కూడా కాదు. ఇవాళ్టి యువతరంలో సాధారణంగా కనిపించేవి– అన్నింటిని తేలికగా తీసుకోవడం, కెరీర్ పట్ల ధ్యాస, సరదా సరదా మాటలు, సామాజిక మార్పు కంటే సోషల్ మీడియా అంటేనే ఎక్కువ శ్రద్ధ చూపడం. సమస్య ఏమిటంటే తల నెరిసిన వారంతా తమ కంటే చిన్నవారిని గురించి ఇలాంటి అభిప్రాయాలే కలిగి ఉంటారు.
తమకు ఉన్న పరిధిలోనే విజయాన్ని, గౌరవ ప్రతిష్టలను సాధించాలనుకునే వారు ప్రతి తరంలోను విరివిగానే ఉంటారు. అయితే వ్యవస్థను ధిక్కరించేవారు, కొత్తగా వ్యాఖ్యానించేవారు ఏ తరంలో అయినా స్వల్ప సంఖ్యలోనే ఉంటారు. ఈ తరం కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రజా జీవితంతో నాకున్న అనుభవాన్ని బట్టి నేను ఒకటి చెప్పగలను. ఈ తరంలో కూడా సిద్ధాంతపరంగా ఆలోచించే యువతకు కొదవ లేదు. వారు తమ వ్యక్తిగత అభివృద్ధికి మించి ఆలోచించగలరని సాక్ష్యం ఇవ్వగలను. తాము నమ్మిన విలువలను కాపాడుకునేందుకు గట్టిగా నిలబడగలరని కూడా చెప్పగలను. అయితే వివిధ విశ్వవిద్యాలయాలలో జరిగిన ఘటనలన్నీ ఒకే విధమైనవి కావు. అవి వేర్వేరే. ఎఫ్‌టిఐఐ సంగతి చూస్తే, ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థకు తగినస్థాయి వ్యక్తిని చైర్మన్ పదవిలో నియమించలేదన్న ఆక్రోశంతో నిరసన చెలరేగింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో నిరసన జ్వాలలు రేగాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులు, స్త్రీ పురుష వివక్ష కారణంగా గొడవ మొదలైంది. జేఎన్‌యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయాలలో ‘జాతి వ్యతిరేకత’ ఉదంతాలతో నిరసనలు మొదలైనాయి. మిగిలిన చోట్ల అలజడులన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి.
ఈ నిరసనల వెనుక ఉన్న రాజకీయాలు కూడా భిన్నమైనవే. జేఎన్‌యూ నిరసనల వెనుక వామపక్ష భావాలు కలిగిన విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్ ఉదంతంలో అంబేడ్కర్‌వాదులు ఉన్నారు. ఈమధ్యే విశ్వవిద్యాలయాలలో జరిగిన గొడవలకు ఇలాంటి ముద్రలు వేయలేం. అయితే ఈ నిరసనలకు ఇన్ని కోణాలు ఉన్నా, ఒక సారూప్యత కూడా కనిపిస్తుంది. అది, ప్రస్తుత ప్రభుత్వం ఉన్నత విద్యాలయాల మీద అమలు చేయాలనుకుంటున్న కొత్త విధానాల పట్ల వ్యతిరేకత. ఆ కొత్త విధానాన్ని కేవలం కాషాయీకరణగా పేర్కొనలేం. నిజానికి అంతకు మించినదే. ప్రస్తుత పాలనా వ్యవస్థ ఉన్నత విద్యా వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నది. నియంత్రణకు పాల్పడుతున్నది.
ఈ నియంత్రణ అనేక రూపాలలో ఉంటుంది. విధేయులను తెచ్చి ఈ ఉన్నత విద్యాలయాల అత్యున్నత పీఠాలను అప్పగించడం అందులో ఒకటి. ఇది ఇంతకు ముందు కూడా లేకపోలేదు కాని, ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఇంతకు ముందు కాంగ్రెస్, వామపక్షాల హయాంలో కూడా ఇది జరిగింది. బీజేపీ హయాంలో తారస్థాయికి చేరుకుంది. విద్యార్థులకు సంబంధించినంత వరకు నియంత్రణ అంటే పరాధీనులను చేయడమే. దీని వెంటే రాజకీయాలకు దూరం చేయడమనే తంతు ఉంటుంది. బహిరంగ చర్చలకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు, ఇంకా విద్యార్థి నిరసనలకు అవకాశాలు లేకుండా చేయడం ద్వారా అది జరుగుతుంది. దీని మీదే విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ విధానానికి, ఉన్నత స్థాయి విద్యలో అలాంటి కొత్త విధానానికి నిరసనగాను వారు తిరగబడుతున్నారు.
ఈ నిరసనలు, అలజడులు చివరికి దేనికి దారి తీస్తాయి? వీటికి కచ్చితమైన ముగింపులు త్వరలోనే వస్తాయి. ఒకటి మాత్రం నిజం, ప్రస్తుత పాలక వ్యవస్థ యువతను తమ కనుసన్నలలోకి తెచ్చుకోవడంలో ఎలాంటి ముందడుగు వేయలేకపోయింది. జేఎన్‌యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, హెచ్‌సీయూ, గౌహతి, పంజాబ్ విశ్వవిద్యాలయాలలో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికలే ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. ఒక విశ్వ విద్యాలయానికి మరొక విశ్వవిద్యాలయానికి విజేతలు మారారు కానీ, అన్నిచోట్లా పరాజితులు మాత్రం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), మద్దతుదారులే.
ఈ ప్రతిఘటన భావి భారత రాజకీయాలకు ఆకృతినిస్తుందా? ఈ ప్రతిఘటనను క్రమబద్ధీకరించడం మీదే ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంది. వ్యవస్థాపరంగా– ఈ ఆందోళనల మధ్య సమన్వయం కుదురుతుందా? రాజకీయంగా– సమాన విద్యావకాశాలు, స్తంభించిపోయిన ఉద్యోగావకాశాలు వంటి అంశాలతో విద్యా ప్రాంగాణాలకు బయట ఉన్న యువతలో రేగిన ఆగ్రహావేశాలను విద్యార్థుల నిరసనలతో జోడించడం సాధ్యమా? ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలను సంధించడం ఎలాగో భగత్‌సింగ్ మనకు బోధించాడు. భగత్‌సింగ్ ఈనాడు మన మధ్య ఉండి ఉంటే, బీహెచ్‌యూ విద్యార్థినుల ఆందోళనకు గర్విస్తూ, అవే ప్రశ్నలను అడిగి ఉండేవాడే.
యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు
మొబైల్ : 98688 88986 ‘ ‘ Twitter: @_YogendraYadav