రైతు ఆదాయంపై అర్ధసత్యాలు | Yogendra Yadav Article On The NSS Survey On Farmers | Sakshi
Sakshi News home page

Yogendra Yadav Article On Farmer Income రైతు ఆదాయంపై అర్ధసత్యాలు

Published Fri, Sep 24 2021 12:23 AM | Last Updated on Fri, Sep 24 2021 9:37 AM

Yogendra Yadav Article On The NSS Survey On Farmers - Sakshi

దేశంలోని రైతు కుటుంబాల పరిస్థితిపై ఇటీవలే వెలుగులోకి వచ్చిన జాతీయ గణాంకాల సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌) సర్వే వెల్లడించిన వాస్తవాలకంటే అది దాచిపెట్టిన నిజాలే ఎక్కువగా ఉంటున్నాయి. సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల వరకు సంపాదిస్తోందని ఈ సర్వే చెబుతోంది కానీ, అది అర్ధసత్యం మాత్రమే. రైతు సంపాదిస్తున్న ప్రతి రూపాయి, సాగు ద్వారా మాత్రమే రావడం లేదు. ఇతర శ్రమలు, ద్రవ్యోల్బణం వంటివి తీసివేస్తే, పంట సాగు ద్వారా రైతుకు వచ్చే నెలవారీ ఆదాయం రూ. 3,798 మాత్రమే. మొత్తం రైతు కుటుంబ ఆదాయంలో ఇది చాలా చిన్న భాగమనే వాస్తవాన్ని ఈ సర్వే దాచిపెట్టింది. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోని ఈ సగటు గణాంకాలు అటు రైతులకూ, ఇటు దేశానికీ మేలుకొలుపు కావాలి.

దేశంలో గత కొద్ది నెలలుగా సాగుతున్న రైతుల ఉద్యమంలో బాగా ప్రాచుర్యం పొందిన నినాదాల్లో ‘మా తిండికోసం, మా పంటకోసం’ మేం పోరాడుతున్నాం అనేది ఒకటి. దేశంలోని రైతుల పరిస్థితులపై తాజాగా వెలువడిన ఒక అధికారిక సర్వే, ఈ నినాదం సంపూర్ణ సత్యమని చూపిస్తోంది. 2021 సెప్టెంబర్‌ 10న ప్రకటించిన కేంద్రప్రభుత్వ కీలక నివేదిక వెల్లడిస్తున్న అంశాలు... మన విధాన నిర్ణేతలు, రాజకీయ నేతలకు మాత్రమే కాకుండా రైతులు, రైతుల ఉద్యమాలకు కూడా మేలుకొలుపు కలిగిస్తున్నాయి. 

గ్రామీణ భారతంలో 2019లో వ్యవసాయ కుటుంబాలు, వారి స్వాధీనంలో ఉన్న భూమి, పశుగణం తదితరాల పరిస్థితి అంచనాపై ఎన్‌ఎస్‌ఎస్‌ 77వ నివేదిక పట్ల దేశం ఎంతో ఆసక్తితో వేచి చూసింది. ఎట్టకేలకు విడుదలైన ఆ సర్వే నివేదిక ప్రధానంగా ఒక అంశంపై దృష్టి పెట్టింది. సగటు వ్యవసాయ కుటుంబంపై ఉన్న రుణభారం రూ. 47 వేలనుంచి రూ. 74 వేలకు అమాంతంగా పెరిగిపోయిందని ఈ సర్వే తెలిపింది. ఇది కలవరపెట్టే అంశం. రైతుల పరిస్థితి మెరుగవుతోంది అని చెబుతున్న తరుణంలోనే వారు చెల్లించాల్సిన బకాయిలు అధికంగా పేరుకుపోతున్నాయి. కాని ఇది వ్యాధికాదు, వ్యాధి లక్షణం మాత్రమే. అసలైన సమస్య ఏదంటే రైతు ఆదాయమే. లేదా ఆదాయం లేకపోవడమేనని చెప్పాలి.

రైతుల ఆదాయం గురించి ఈ సర్వే ఏం చెబుతోందంటే... దేశంలో సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల దాకా ఆదాయం సంపాదిస్తోంది. నిజానికి పట్టణాల్లోని ఇళ్లలో పనిచేస్తున్న వారు సంపాదించే ఆదాయం కంటే ఇది తక్కువ. 2013లో నిర్వహించిన ఇదే సర్వేలో రైతు కుటుంబం నెలవారీ ఆదాయం రూ. 6,442లు ఉండగా, ఆరేళ్ల తర్వాత అంటే 2019లో సగటు రైతు కుటుంబం ఆదాయం రూ. 10,218లకు పెరిగింది. ఈ లెక్కలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. పైగా, ఇవి వెల్లడించిన అంశాల కంటే దాచి ఉంచినవే ఎక్కువ. ఈ లెక్కలు సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ సంపాదిస్తోందన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. రైతు కుటుంబం మూల ఆదాయం తక్కువగానే ఉంటున్నప్పటికీ, అది హేతుపూర్వక రీతిలో పెరుగుతోందని ఈ లెక్కలు చెబుతున్నాయి. దీనికంటే వాస్తవాన్ని కప్పిపుచ్చే అంశం మరొకటి ఉండదు. ఇదెలాగో చూద్దాం మరి.

ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వే గణాంకాలతో సమస్య
మొదటగా, రైతుల ఆదాయం అని చెబుతున్నది సగటు కుటుంబ ఆదాయమే కాబట్టి ఇది వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోంది. పదెకరాల కంటే ఎక్కువ భూమి కలిగి నెలకు దాదాపుగా రూ. 30 వేల వరకు సంపాదిస్తున్న బడా రైతులను కూడా సగటు కుటుంబాలలో కలిపేశారు. బడా రైతు కుటుంబాలు సంపాదిస్తున్న ఈ మొత్తం కంటే ప్రభుత్వంలోని నాలుగో గ్రేడ్‌ ఉద్యోగి సంపాదించేదే ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఒకటి నుంచి 2.5 హెక్టార్ల వరకు భూమిని సాగు చేస్తున్న మధ్యతరగతి రైతు కుటుంబ ఆదాయం నెలకు రూ. 8,571ల కంటే తక్కువగానే ఉంటుంది.

రెండోది, ఇది వ్యవసాయం ద్వారా వస్తున్న ఆదాయం కాదు. వ్యవసాయ కుటుంబం సంపాదిస్తున్న ఆదాయం. ఈ రెండింటికి తేడాను అర్థం చేసుకోవడమే చాలా కీలకమైంది. రైతు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ రైతు కాదు. రైతు సంపాదిస్తున్న ప్రతి రూపాయి వ్యవసాయం ద్వారా మాత్రమే రావడం లేదు. వ్యవసాయ కుటుంబం అనే భావనను ఈ సర్వే విస్తృత ప్రాతిపదికన నిర్వచిస్తోంది. గ్రామీణ వ్యవసాయ కుటుంబం పంటల ద్వారా, లేక పశుపెంపకం ద్వారా అతి తక్కువ ఆదాయం మాత్రమే సంపాదిస్తున్నాయి. రైతు కుటుంబంలో తండ్రి పొలం పని చేస్తే, తల్లి పశువులను మేపుతుంది. కుమార్తె స్థానిక పాఠశాలలో బోధిస్తుంటే, రైతు కుమారుడు షాపు నడుపుతుంటాడు. వ్యవసాయ కుటుంబం ఇలాగే ఉంటుంది. ఒక రైతు కుటుంబం సంపాదిస్తున్న ఈ నాలుగు రకాల ఆదాయాన్ని కలిపేసి ఈ మొత్తాన్ని వ్యవసాయ కుటుంబ ఆదాయంగా లెక్కిస్తున్నారు. మొత్తంమీద చూస్తే పంట సాగు ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రైతు ఆదాయంలో చాలా చిన్న భాగం.

ఇది ఊహాజనితమైన ఉదాహరణ కాదు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రైతు కుటుంబం సంపాదించే ఆదాయంలో మూడోవంతు మాత్రమేనని తాజా సర్వే చెబుతోంది. ఒక నెలలో సగటు రైతు కుటుంబం రకరకాల పంటల సాగు ద్వారా రూ. 3,798లు సంపాదిస్తోంది. ఇక పశువుల పెంపకం ద్వారా రూ. 1,582లను, వ్యాపారం నుంచి రూ. 641లను, కూలీలు, వేతనాల ద్వారా రూ. 4,063లను ఆర్జిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే, రైతు కుటుంబం తన సొంత భూముల్లో పనిచేయడం కంటే తన శ్రమను ఇతరత్రా వెచ్చించడం ద్వారానే ఎక్కువగా సంపాదిస్తోంది. కాబట్టి పైన చెప్పినట్లుగా రైతు వ్యవసాయం ద్వారా వస్తున్న ఆదాయం రూ. 3,798లు మాత్రమే. మన రైతులు ఎందుకు పట్టణాలు, నగరాలకు పరుగెడుతున్నారో, ప్రభుత్వోద్యోగాలకు ప్రతి ఒక్కరూ ఎందుకింతగా వెంపర్లాడుతున్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది.

మూడు, ఈ కనీస మొత్తాన్ని కూడా అతిశయించి చెబుతున్నారు. రైతు ఆదాయాన్ని అధికం చేసి చూపడంలో సర్వే పరిమితి దాటినట్లుంది. రైతుచేతికి వస్తున్న డబ్బు మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తులను అమ్మగా వస్తున్నదేనని ఈ లెక్కలు చెబుతున్నాయి. పంటల సాగుకు అయ్యే ఖర్చులన్నీంటినీ రైతు నేరుగా చెల్లించిన తర్వాత రైతుకు మిగులుతున్న ఆదాయంగా ఇవి సూచిస్తున్నాయి.

ఈ వ్యత్యాసమే రైతుకు లాభం అని అంచనా వేశారు. రైతు కుటుంబం సొంత శ్రమ, ఇతర పెట్టుబడులను సాగు ఖర్చులో కలపడం లేదు. నగదు రూపంలో చెల్లించని ఈ మొత్తాల విలువను కూడా లెక్కించినట్లయితే, మొత్తం పంట సాగు ఖర్చు, వశుపెంపకం ఖర్చులు ఎక్కువై రైతు లాభం అంటున్నది తగ్గిపోతుంది. ఈ సరైన పద్ధతిని మీరు అనుసరిస్తే, పంట సాగు ద్వారా రైతుకుటుంబానికి వచ్చే నెలవారీ ఆదాయం కేవలం రూ. 3,058లకు, పశుపెంపకం ద్వారా వచ్చే ఆదాయం రూ. 441లకు పడిపోతుంది. ఈ లెక్కన రైతు కుటుంబం మొత్తం ఆదాయం నెలకు రూ. 8,337లు మాత్రమే అని స్పష్టమవుతుంది.

నాలుగు, రైతుల ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల కనిపిస్తోందంటూ సర్వే చెబుతున్నది అసత్యం. ఎందుకంటే ఇది ద్రవ్యోల్బ ణాన్ని లెక్కలోకి తీసుకోని సాధారణ లెక్కలు. 2013, 2019 మధ్యకాలంలో అంటే అప్పటి, ప్రస్తుత సర్వే నిర్వహించిన మధ్య కాలంలో రైతుల నామమాత్రపు ఆదాయం 59 శాతం పెరిగింది. కానీ ఈ లెక్కలను మీరు ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినట్లయితే, (2019 కోసం గ్రామీణ భారత్‌కి వినియోగదారీ ధరల సూచి, బేస్‌ ఇయర్‌ 2012), రైతు ఆదాయం పెరుగుదల 22 శాతం మాత్రమే. అంటే ముందే చెప్పినట్లుగా ఇది రైతు కుటుంబం మొత్తానికి అన్ని రకాల ఆదాయాలు కలిసి వచ్చిన ఆదాయ పెరుగుదల అన్నమాట.

పంట సాగు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రమే మనం చూసినట్లయితే, ఈ ఆరు సంవత్సరాల్లో రైతు కుటుంబం ఆదాయం వాస్తవానికి క్షీణించిపోయింది. 2013లో రైతు పంట సాగు ద్వారా రూ. 3,081లు సంపాదించేవాడు. 2012 బేస్‌ ఇయర్‌లో ధర ప్రకారం ఇది రూ. 2,770లకు సమానం. ఈ బేస్‌ ఇయర్‌ని మనం నిలుపుకున్నట్లయితే, రైతుల తాజా నెలవారీ ఆదాయం (రూ. 3,798) కేవలం రూ. 2,645లకు సమానం. అంటే గత ఆరేళ్లలో రైతుల ఆదాయం 5 శాతం తగ్గిపోయిందన్నమాట. కాబట్టి ఈ సర్వేకి వాస్తవమైన శీర్షిక ఇలా ఉంటే యుక్తంగా ఉంటుంది. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చారిత్రాత్మక మిషన్‌ నిజానికి చారిత్రాత్మక తిరోగమనానికి దారితీస్తోంది’.


యోగేంద్రయాదవ్‌ 

వ్యాసకర్త జై కిసాన్‌ ఆందోళన్‌ సహ సంస్థాపకుడు,
స్వరాజ్‌ ఇండియా సభ్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement