విశ్లేషణ
సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా సాగవని గుజరాత్ ఎన్నికలు స్పష్టం చేశాయి. అయితే రైతు ఉద్యమాలు, యువత అసంతృప్తితో చేసే ఆందోళనల నుంచే అధికార పక్షానికి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చు. తమ పోరాటాన్ని సంఘటితంగా సమన్వయం చేసుకోవడం రైతు ఉద్యమాలకు సవాలు కానుంది. ఇప్పటికైతే యువతలోని అసంతృప్తి ఒక రూపు దిద్దుకోకుండా, చెల్లాచెదురుగానే ఉంది. కానీ, వ్యవసాయ సంక్షోభం కంటే మరింత ఎక్కువ సమస్యాత్మకంగా పరిణమించగలిగిన శక్తి దానికి ఉంది.
2018 ఎన్నికల సంవత్సరం కానున్నది. రెండు దఫాలుగా ఈ ఏడాది శాసన సభల ఎన్నికలు జరగనుండటం మాత్రమే అందుకు కారణం కాదు. లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపి, ఈ ఏడాది చివరకే జరిపేసే అవకాశం ఉన్నం దువల్ల కూడా అలా అనడం లేదు. అలా జరిగినా లేకున్నాగానీ ఈ ఏడా దంతా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినదిగానే ఉంటుంది. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రసంగం ఎన్నికల ప్రసంగంలా ఉంటుంది. ఆర్థిక సర్వే సహా అన్ని ఆర్థిక గణాంకాలనూ ఎన్నికల రంగుటద్దాల నుంచే చూపిస్తారు. డొక్లామ్‌లో చైనా కదలికలు, పాకిస్తాన్‌తో సరిహద్దు ఘర్షణలు విదేశాంగ వ్యవ హారాలుగా ఉండవు. ప్రభుత్వ ప్రజాసంబంధాల వ్యవహారాలుగా, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా ఉంటాయి. అయోధ్య వివాదంపై తీర్పు కోసం ఎదురు చూస్తారు గానీ, ఆ భూమిపై యాజమాన్యం ఎవరికి దక్కుతుందనే దాని కోసం కాదు... రాజకీయపరమైన కూడికలు తీసివేతల కోసం. అస్సాంలోని సంక్షోభాన్ని జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌తో అనుసంధానిస్తారు గానీ, అక్కడి మానన విషాదాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుని మాత్రం కాదు... ఆ రాష్ట్రానికి వెలుపల అది ఎన్నికలను రాల్చేదిగా ఎలా ఉపయోగపడుతుందనే దృష్టితోనే. మా దృష్టిలో ఎన్నికల సంవత్సరం అంటే అర్థం ఇదే.
ఇలాంటి ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు వచ్చేవి కావు. 2013, 2008, 2003 ఎన్నికల సంవత్సరాలే గానీ ఈ అర్థంలో కావు. ఎన్నికలతో అతిగా ముడిపడిపోయి ఉండటం ఈసారి పూర్తిగా భిన్నమైన స్థాయికి చేరుతుంది. ఎన్నికలు తప్ప ప్రభుత్వానికి మరేదీ పట్టదు. ప్రజల విమర్శలుగానీ, నిరసన ఉద్యమాలుగానీ, చివరికి ప్రజల దుస్థితిగానీ ఏదీ పట్టదు. వాస్తవికత సైతం ఎన్నికల అద్దంలో ప్రతి బింబిస్తేనే, అది కూడా ఏ మేరకు ప్రతిబింబిస్తుందో అంతమేరకే లెక్కలోకి వస్తుంది. ప్రజాస్వామిక సమంజçసత్వాన్ని ఎన్నికల విజయం స్థాయికి కుదించి వేయడం జరుగుతూ వస్తోంది. కాబట్టే చిన్నవైనా లేక పెద్దవైనా ప్రతి ఎన్నికల్లోకీ ప్రధాని రంగ ప్రవేశం చేస్తున్నారు.
దేశ భవితే పణంగా..
ఈ ఎన్నికల్లో పణంగా ఒడ్డుతున్నది దేశ భవిత కాబట్టి కూడా ఈ ఎన్నికల ఏడాది అసాధారణమైనది. రానున్న పార్లమెంటు ఎన్నికలంటే కేవలం మోదీ రెండో దఫా అధికారంలోకి రావడం మాత్రమే కాదు, లేదంటే భారత రాజ కీయ పటంపై బీజేపీ ఆధిపత్యం పరిపూర్ణం కావడం కూడా కాదు. అలాగే రాహుల్‌గాంధీకి లేదా కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉన్నదా, లేదా అనే దానికి సంబంధించినవి మాత్రమే కూడా కావు. బీఎస్‌పీ, ఐఎన్ ఎల్‌డీ, ఆప్, లేదా వామపక్ష పార్టీల కథ ఇక ముగింపునకు వచ్చినట్టేనా అనేది తేలడం కూడా కాదు. మన రిపబ్లిక్ భవితకు సంబంధించినవి. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన రిపబ్లిక్ పునాదులపై అత్యంత దృఢ సంకల్పంతో దాడులు జరగడాన్ని దేశం చూసింది. కాంగ్రెస్ హయాంలో నీరు గారిన స్వయంప్రతిపత్తిగల సంస్థలు... అత్యవసర పరిస్థితి తదుపరి నేడు అత్యంత అధమ స్థాయికి చేరాయి. ప్రధాన స్రవంతి మీడియాలో అత్యధిక భాగం, ప్రత్యేకించి టెలివిజన్ మీడియా అధికార పార్టీ బాకాగా మారింది. స్వాతం త్య్రానంతర భారత చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని విధంగా వైవి ధ్యానికి, మతమైనారిటీలకు రక్షణ కల్పించే రాజ్యాంగపరమైన అంశాలను ఓ ప్రహసం స్థాయికి దిగజార్చారు. ఈ నష్టాలలో కొన్ని తిరిగి వెనుకకు మర ల్చరానివి కావచ్చు. ఈ ప్రభుత్వానికి మరో దఫా అధికారం కట్టబెట్టడం అంటే ఈ అలవాట్లను మన రాజకీయ వ్యవస్థ జన్యువులలోకి చొప్పించడమే కావచ్చు. అందువల్లనే ఈ ఏడాది అంటే ఎన్నికలు గుర్రప్పందాలను వీక్షిం చడం కాదు. దేశ భవిష్యత్తును నిర్మించడమా లేక కూలదోయడమా అనే దాన్ని తేల్చేవి. 2018ని అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించాల్సినది ఈ సూక్ష్మదర్మినినే.
ఎవరు ఈ గుర్రపు పందేలలో ముందున్నారు? ఎన్నికలు జరిగేది ఎన్నడు? జరగాల్సిన విధంగా 2019లోనేనా లేక డిసెంబర్ 2018 శాసనసభ ఎన్నికలతో పాటూనా? ఎన్నికల కూటములు ఎలాంటి రూపు తీసుకుంటు న్నాయి? అనే వాటి చూట్టూతే ఈ ఏడాదిలోని రాజకీయ ఊహాగానాలు చాలా వరకు సాగుతాయి. కానీ ఇవి అసలు ప్రశ్నలు కావు. వాటికి బదులుగా మనం దేనిపైన దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది? ఏ సమస్యల చుట్టూ ఎన్నికల పరమైన సమీకరణ జరుగుతుంది అనేదే అసలు ప్రశ్న. వాటిని దృష్టిలో ఉంచుకుని చూస్తేనే ఎవరు, ఎప్పుడు, ఎలా అనేవి అర్థమయ్యేది.
ప్రతిపక్షం గట్టి పోటీ ఇస్తుంది కానీ..
ఈ ఎన్నికల్లో ఎవరు కొంత మెరుగైన స్థితిలో ఉన్నారనే ప్రశ్నకు మనకు తెలి యదని ఒప్పుకోవడమే అత్యుత్తమ సమాధానం అవుతుంది. కాకపోతే మనకు తెలిసిందల్లా గుజరాత్ ఎన్నికలకు ముందు అనిపించినంత ఏక పక్షంగా సాగే పోటీ ఇది కాదు అనేది మాత్రమే. గ్రామీణ ప్రాంతంలో అధికా రపార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం అనేది కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితమైనది కాదు. ఈ ఏడాది జరగనున్న శాసనభ ఎన్నికలలో చాలా వాటిలో బీజేపీ నిస్సందేహంగా గుజరాత్‌లో కంటే గట్టి పోటీనే ఎదు ర్కుంటుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో వలే కాంగ్రెస్ కర్ణాటకను ఏమంత తేలికగా బీజేపీకి సమర్పించుకోకపోవచ్చు. మేఘాలయ, మిజోరాం, త్రిపురలో బీజేï ³కి ఉన్న పునాది చిన్నదే కాబట్టి ఆ రాష్ట్రాల్లో అది కొన్ని రాజకీయ ఫిరా యింపులు, జాతిపరమైన హింసకు మించి ఏమంత ఘనమైన ఫలితాలు సాధించకపోవచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు ఎదు ర్కొంటున్న ప్రభుత్వ వ్యతిరేకత గుజరాత్‌లో కంటే చాలా ఎక్కువ. కాబట్టి బీజేపీ ముందు ముందు కొన్ని గట్టి పోటీలనే ఎదుర్కుంటుంది. అయితే ఫలి తాలు మాత్రం ఆ రాష్ట్రాల్లోని ప్రతిపక్షం పరిస్థితి మీద ఆధారపడి ఉంటాయి. ఏదో కొంత మోదీ వ్యతిరేక వాదం లేదా పార్లమెంటులో మొక్కుబడిగా గగ్గోలు పెట్టడాన్ని మినహాయిస్తే, గత మూడున్నరేళ్ల కాలంలో ఇంత ప్రభుత్వ వ్యతిరేకత దేశంలో కనబడలేదనుకోవడం సమంజసమే.
బీజేపీని ఢీకొనగలి గిన పొందిక గల సమగ్ర దృక్పథాన్ని, జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికను లేదా విశ్వసనీయతగల నాయకత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం అందించడంలో ఇంతవరకు విఫలమైందని చెప్పుకోవడం సమంజసమే. ఇప్పటికైనా ప్రతి పక్షం కొంత గట్టిగా బరిలో నిలవడాన్ని చూస్తామా? లేదంటే ప్రతిపక్షం ఇప్ప టికే ప్రయత్నించిన, విసుగెత్తించేసిన ప్రతిపక్ష కూటముల సమ్మేళనాలతో పతాక శీర్షికలకు ఎక్కడంతోనే సరిపెట్టుకుంటుందా? ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ– బీఎస్పీ కూటమీ, ఒడిశాలో బీజేడీతో, తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ కూటమీ ఏర్పడితే, నితీశ్‌కుమార్ తిరిగి ప్రతిపక్షంవైపు చేరితే... ఎన్నికల సమీకరణాల్లో ప్రతిపక్షం తీవ్రమైన పెనుమార్పులను తేగలుగుతుంది. అయి నాగానీ, విశ్వసనీయతగల ప్రతిపక్షాన్ని అందించడం అంటే పార్టీలను ఐక్యం చేయడం మాత్రమే కాదు. ఎందుకంటే, అసలు బీజేపీ అధికారంలోకి వచ్చిందే ఆ పార్టీల పట్ల ప్రజలు విశ్వసనీయతను కోల్పోయినందువల్లనే.
ఈ ఏడాది కీలకమైన ప్రశ్న రాజకీయ, ఎన్నికలపరమైన పోరాటాలు ఏ సమస్యలపై రూపుదిద్దుకుంటాయనే దానికి సంబంధించినదే. తన నాలుగేళ్ల పాలన తర్వాత ఓటర్లకు, ప్రత్యేకించి గ్రామీణ ఓటర్లకు తాము సాధించిన విగా చూపడానికి తమ వద్ద ఏమీ లేదని గుర్తించగల నిశిత బుద్ధి మోదీకి ఉంది. తన ప్రత్యర్థులలో ఎవరికన్నా కూడా ఆయనే అత్యంత జనాదరణ గల నేతగా ఉన్నారు. అయినాగానీ ఎన్నికలపరంగా అది చాలా బలహీనమైన సానుకూలతేనని ఆయనకు తెలుసు. తీవ్ర సవాలును ఎదుర్కోవాల్సి వస్తే మోదీ మతతత్వవాదం, ఉన్మాదభరితమైన జాతీయవాదాలను ఆశ్రయిస్తారని గుజరాత్ ఎన్నికలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కాబట్టి 2018లో హఠాత్తుగా ఎన్నడో మరచిపోయిన కొన్ని మసీదులు/దేవాల యాల వివాదాలు రచ్చకెక్కినా, అయోధ్య వివాదంపై కోర్టు తీర్పు దేశ వ్యాప్త ప్రచారాంశంగా మారినా, స్వల్పమైన సరిహద్దు సంఘ ర్షణ పెద్ద టెలివిజన్ యుద్ధంగా దర్శనమిచ్చినా ఆశ్చర్యపోకూ డదు. ప్రతిపక్షం దాన్ని ఉదారవాద/లౌకకవాద చర్చతో ఎదుర్కో వాలని ప్రయత్నించవచ్చు. లేదా కుల కూటములతో ఎదుర్కోవా లని అనుకోవచ్చు. కానీ వాటి వల్ల కలిగే ఎన్ని కలపరమైన ప్రయో జనాలు క్రమంగా క్షీణిస్తున్నాయి.
రైతు ఉద్యమాలు, యువతే అసలు సవాలు
రైతు ఉద్యమాలు, యువత అసంతృప్తితో చేసే ఆందోళనలు అనే రెండు రంగాల నుంచి అధికార పక్షానికి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చు. గ్రామీణ ప్రాంతంలోని దైన్య పరిస్థితులు రైతు ఉద్య మాలుగా పరిణమించడాన్ని 2017లో మనం చూశాం. దాదాపు రెండు వందల రైతు సంస్థలు ఒక్కటై గిట్టుబాటు ధరలకు హామీని కల్పిం చాలని, ఒక్కసారికి మొత్తం రుణ మాఫీని ప్రకటించాలని కోరాయి. ప్రభుత్వం వ్యవసాయ రంగంలోని ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి గానీ లేదా దాన్ని పరిష్కరించాలని ప్రయత్నించడానికి గానీ సుముఖంగా లేదు. కాబట్టే ఏవో కంటి తుడుపు చర్యలతో సరిపెట్టేసింది. తమ పోరా టాన్ని సంఘటితంగా సమన్వయం చేసుకునే విషయంలో రైతు ఉద్యమాల కున్న శక్తికి 2018 సవాలుగా నిలవనుంది. ఇప్పటికైతే యువతలోని అసం తృప్తి చాలావరకు ఒక రూపు దిద్దుకోకుండా, చెల్లాచెదురుగానే ఉంది. కానీ, వ్యవసాయ సంక్షోభం కంటే కూడా మరింత ఎక్కువ సమస్యాత్మకంగా పరి ణమించగలిగిన శక్తి దానికి ఉంది. విద్యావకాశాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని, ఉద్యోగ హక్కు కల్పించాలని కోరుతూ యువత సమన్వయంతో పోరాడే సూచనలు కనిపిస్తాయేమోనని మనం 2018లో ఎదురు చూడాలి.
ఈ ఏడాదికి చిట్టచివరకు తేలే సమీకరణం చాలా సరళమైనదే. అది, వ్యవసాయ సంక్షోభం, యువతలోని అసంతృప్తి లేదా హిందూ–ముస్లిం సంఘర్షణగా ఉంటుంది. ఫలితాలను, కొంత కాలంపాటూ దేశ భవితను నిర్ణయించేది మాత్రం ఈ సమీకరణం ఎటువైపు మొగ్గుతుందనేదే.
యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు
మొబైల్ : 98688 88986
Comments
Please login to add a commentAdd a comment