Jai Kisan
-
అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు
ముస్తాబాద్(సిరిసిల్ల): దగాపడ్డ తెలంగాణ పునర్నిర్మాణానికి రెండు దశాబ్దాల క్రితమే నడుం బిగించారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించాలన్న సంకల్పం వారిని ముందుకు నడిపించింది. వెనకబడ్డ పురిటిగడ్డను బాగు చేసేందుకు మలి దశ తెలంగాణ ఉద్యమానికి ముందే 1999లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆవిర్భవించింది. ఖండాంతరాలలో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు ఒక్కటై.. అమెరికాలోని న్యూజెర్సీలో టీడీఎఫ్ పురుడుపోసుకుంది. అలా మొదలైన టీడీఎఫ్ ప్రస్థానం రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తూనే ఉంది. జైకిసాన్‌తో రైతులకు సేవలు అమెరికాలోని న్యూజెర్సీలో పురుడుపోసుకున్న టీడీఎఫ్‌ను పలు విభాగాలకు విస్తరించారు. 5 వేల మంది సభ్యులతో ప్రారంభమై ఎన్నో సేవలు అందిస్తోంది. భారతదేశం అంటేనే గుర్తుకు వచ్చేది వ్యవసాయ. అందుకు ప్రాధాన్యతను కల్పిస్తూ జైకిసాన్ విభాగాన్ని ప్రారంభించారు. రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. రసాయన ఎరువులకు దూరంగా, సేంద్రియ ఎరువులతో కలిగే లాభాలను వివరిస్తూ ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులకు కృషి చేస్తున్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు చేయూతను అందించి, ఆత్మహత్యలు జరగకుండా అవగాహన కల్పిసున్నారు. జీవామృతం, ఘనామృతం తయారీ, డ్రమ్‌సీడర్ ద్వారా సాగు, పెస్టిసైడ్స్ ద్వారా కలిగే నష్టాలను వివరిస్తున్నారు. సమీకృత వ్యవసాయం వల్ల కలిగే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండ్‌ను తీసుకువస్తున్నారు. పంట మార్పిడి, చిరుధాన్యాల సాగు, వాటి ద్వారా తయారయ్యే ఉత్పత్తులపై చైతన్యాన్ని తెస్తున్నా రు. గ్రామాలలో రైతుసేవా కేంద్రాలు ఏర్పా టు చేసి వారికి అవసరమైన యంత్ర పరికరాలను అందిస్తున్నారు. వ్యవసాయాధికారుల సమన్వయంతో కార్పొరేట్ స్థాయికి తీసుకువచ్చే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వరి కొయ్యలు కాల్చకుండా, కొయ్యకాళ్లను ఎరువుగా ఎలా మార్చుకోవచ్చో చేసి చూపుతున్నారు. పశుపోషణతో కలిగే లాభాలను రైతులకు చేరవేస్తున్నారు. యంత్రాలను వాడుకుంటున్నాం ముస్తాబాద్‌లోని టీడీఎఫ్ రైతుసేవాకేంద్రంలోని యంత్రాలను వాడుకుంటున్నాం. డ్రమ్‌సీడర్, పచ్చిరొట్ట ఎరువుల తయారీ, సేంద్రియ సాగు పద్ధతులను వివరించారు. కేంద్రంలోని యంత్రాల సాయంతో గడ్డిని తొలగించుకున్నాం. కలుపు అవసరం లేకుండా అది ఉపయోగపడింది. రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. – దేవిరెడ్డి, రైతు, ముస్తాబాద్ ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి కావాలి రైతులు ఆరుగాలం శ్రమించి పండించే పంటలు ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆ దిశగా వారిని చైతన్యం చేస్తున్నాం. అనవసర ఖర్చులు తగ్గిస్తూ సేంద్రియ విధానం వైపు తీసుకువస్తున్నాం. రైతులు బాగున్నప్పుడే దేశంలోని ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుంది. దానికోసం జై కిసాన్ పనిచేస్తుంది. – మట్ట రాజేశ్వర్‌రెడ్డి, టీడీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎన్నారైల సహకారంతో సేవలు తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఇక్కడి ప్రజల జీవన విధానాలను మెరుగుపరిచేందుకు ఒక్కటై టీడీఎఫ్‌ను స్థాపించారు. దాని కోసం ఆహర్నిషలు పనిచేస్తున్నారు. సారవంతమైన నేలను కాపాడుకుంటూనే అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో శాస్త్రీయంగా అవగాహన కల్పిస్తున్నాం. రైతుల కోసం టీడీఎఫ్ మరింత ముందుకు వెళ్తుంది. – పాటి నరేందర్, జైకిసాన్ ఇండియా అధ్యక్షుడు -
అవగాహన లేమితోనే వైఫల్యం
భారత్‌లో 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం మరణించింది. కానీ 21వ శతాబ్దంలోకూడా అది తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక జవాబుదారితనం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్‌కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది. అందుకే.. వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావజాలం చిరకాలం వర్ధిల్లాలి. ఇటీవలే ఒక సోషల్ మీడియా కోణంగి నన్ను కమ్మీ–డాగ్ (కమ్యూనిస్టు కుక్క) అని పిలిచాడు. వెంటనే నేను తీవ్ర ఆలోచనలో మునిగిపోయాను. కుక్క అనే అంశాన్ని ఈ సందర్భంలో అర్థం చేసుకోవడం సులభమే. త్రిపురలో ప్రజా తీర్పు నేపథ్యంలో ప్రత్యేకించి బీజేపీ సోషల్ మీడియా పోకిరీలు పట్టలేని సంతోషంతో ఉండటమే కాకుండా కమ్యూనిస్టులపై తీవ్ర నిందాత్మక వ్యాఖ్యలు గుప్పిస్తున్న సందర్బం అది. దీన్ని పక్కనపెడితే, నేను కూడా తప్పకుండా కమ్యూనిస్టునే అయివుంటాను అని అతగాడు ప్రకటించిన అభిప్రాయమే నన్ను ఆలోచింపజేసింది. సోషల్ మీడియా కోణంగిలు నిరక్షర కుక్షిలే..! ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ఉత్పత్తి చేసిన కోణంగిల– ట్రోల్స్–నిరక్షరాస్యత కింద నేను దీన్ని కొట్టిపడేయాలి. నన్ను కమ్యూనిస్టుగా పిలవడానికి నాకున్న ఏకైక అర్హత ఏమిటంటే నేను జేఎన్‌యూలో చదవడం, గడ్డం పెట్టుకున్న వారిని సమర్థించడం, తరచుగా గుడ్డ సంచీ వాడటమే. ఇది మినహా నా జీవితం పొడవునా నేను కమ్యూనిస్టు సిద్ధాంతం, దాని ఆచరణను విమర్శిస్తూ వచ్చాను. విద్యార్థిగా నేను సమతా యువజన్ సభలో చేరాను. ఇది జేఎన్‌యూలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా పనిచేసే సంఘం. తర్వాత గాంధియన్–సోషలిస్ట్ స్రవంతికి చెందిన సమతా సంఘటన్, సమాజ్‌వాదీ పరిషత్‌తో పనిచేశాను. ఇవి కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలకు చాలా దూరంగా ఉంటాయి. విద్యావిషయకంగా నేను 1980లు, 1990లలో ప్రాబల్యంలో ఉండిన మార్క్సిస్ట్ ఛాందసత్వం పట్ల అసమ్మతి తెలి పాను. పైగా నేను పనిచేస్తున్న సీఎస్డీఎస్ (వర్ధమాన సమాజాల అధ్యయన కేంద్రం) తరచుగా వామపక్ష మేధావుల దాడికి గురయ్యేది. చాలా స్పష్టంగా ఈ బీజేపీ ట్రోల్స్‌కి ఇదేమాత్రం తెలీదన్నది స్పష్టం. నేను కొనసాగుతున్న మేధో ప్రపంచం అసలు ఉనికిలోనే ఉండదని వీళ్ల భావన కావచ్చు. వీళ్ల ప్రాపంచిక దృక్పథం చాలా సరళంగా ఉంటుంది. అదేమిటంటే పేదలు, విప్లవం గురించి మాట్లాడే ఎవరినైనా సరే వామపక్షం, కమ్యూనిస్టు, సోషలిస్టు, మావోయిస్టు, అర్బన్ నక్సలైట్, రెడ్ అని ముద్రలు వేసేయడమే వీరికి తెలిసిన విద్య. తగిన సాక్ష్యాధారాల విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఈ ట్రోల్స్ మరికొంత లోతైన భావనను సూచిస్తున్నారు. అదేమిటంటే వామపక్షానికి మన కాలంలో అర్థం మారిందన్నదే. ఈరోజు వామపక్షానికి రెండు రకాల విశిష్ట అర్థాలున్నాయి. పాత అర్థంలో చూస్తే కమ్యూనిస్టులు అంటే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మేవారు, సోవియట్ రష్యా తరహా ప్రభుత్వ సోషలిజాన్ని బలపర్చేవారు, భారత్‌లోని అనేక కమ్యూనిస్టు పార్టీలలో ఏదో ఒకదానికి చెంది ఉండేవారు అని అర్థం. వామపక్షానికి ప్రస్తుతం ఏర్పడిన కొత్త అర్థంలో సమానత్వ భావనవైపు నిలబడే ప్రతి ఒక్కరూ చేరతారు. కమ్యూనిస్టు వామపక్షాలు, గాంధియన్ సోషలిస్టులు, సోషలిస్టులు, అంబేద్కరి స్టులు, ఫెమినిస్టులు అందరూ ఈ కోవలోకి వస్తారు. ఈ అన్ని రకాల శ్రేణులకు చెందినవారు ఈ ముద్రను అంగీకరించరు. పైగా ఇది పెద్దగా ఉపయోగపడే వర్ణన కాదు కూడా. కానీ కొత్త ప్రపంచం వీళ్లను ఈ దృష్టితోనే చూస్తోంది. అంతర్గత పోరు అంతిమ పతనాన్ని ఆపగలదా? పాత వామపక్షం మరణించింది. త్రిపురలో 25 ఏళ్లుగా సాగిన సీపీఎం పాలన నాటకీయంగా పతనం కావడం.. భారతీయ కమ్యూనిస్టు పార్టీల పతనం, క్షీణతకు చెందిన సుదీర్ఘ ప్రక్రియను మరోసారి ఎత్తి చూపింది. 1970లలో వామపక్ష నిరోధక ప్రక్రియ మొదలయ్యాక, దాని ప్రభా వం కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురలకు, జేఎన్యూకు మాత్రమే పరిమితమైపోయింది. 2011లో పశ్చిమబెంగాల్లో వామపక్ష పరాజయంతో కమ్యూనిస్టు పార్టీల అంతిమ పతనం ప్రారంభమయింది. వారు ఇప్పుడు కేరళలో పాలనలో ఉన్నప్పటికీ, సీపీఎంలో తీవ్రమవుతున్న అంతర్గత ముఠా పోరు దాని అంతిమ పతనాన్ని తిరగతోడే అవకాశాలను ఏరకంగానూ పెంపొందించదు. ఇక పార్లమెంటేతర కమ్యూనిస్టులుగా పేరొందిన చిన్న బృందం మావోయిస్టులు రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అనే కాల్పనిక భ్రమను అనుసరిస్తున్నారు కానీ భారత భద్రతా బలగాల ముట్టడిలో అంతమయ్యేందుకు వీరు చేరువలో ఉన్నారు. స్వేచ్ఛ కోసం మానవ ఆకాంక్షను మరిస్తే ఎలా? పాత వామపక్ష మరణం అనేది ఏమాత్రం విస్మరించలేని ముగింపు. యుఎస్ఎస్ఆర్ తరహా సోవియట్ సోషలిజానికి చెందిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థ విఫలమైంది. రాజ కీయంగా అది ప్రవచించిన సోషలిస్టు ప్రజాస్వామ్యం నియంతృత్వం ముసుగులో పార్టీ నియంతృత్వాన్ని ప్రతి పాదించే వాస్తవ ఉద్దేశాన్ని కలిగివుంది. సోవియట్ యూనియన్, తూర్పు యూరోపియన్ కమ్యూనిస్టు వ్యవస్థల పతనం ఆ తరహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పును స్పష్టంగా సూచించింది. తన పాలనలో స్టాలిన్ లక్షలాదిమంది రైతులను వధించడం, పోల్‌పాట్ సాగిం చిన మారణకాండ వంటివి కమ్యూనిజం ముసుగులో కొనసాగిన నిరంకుశాధికారపు అతి చర్యలకు తిరుగులేని ఉదాహరణగా నిలిచిపోయాయి. కమ్యూనిస్టు రాజకీయ వ్యవస్థ స్వేచ్ఛకోసం మానవుడి తృష్ణను గుర్తించడంలో విఫలం కాగా, కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ మార్కెట్ తర్కాన్ని, ఆర్థిక ప్రోత్సాహకాల అవసరాన్ని గుర్తించడంలో విఫలమైంది. ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం ఒక రకం సమానత్వాన్ని సృష్టించింది కానీ ఆర్థిక వ్యవస్థను అది అత్యల్ప సమతుల్యస్థితికి కుదించివేసి వాణిజ్యతత్వాన్ని, సృజనాత్మకతను చంపేసింది. ఇక ప్రభుత్వ సోషలిజం సృష్టించి పెట్టిన నిరంకుశాధికార వైపరీత్యం మార్కెట్లు దాంతో నడవవు అనే సత్యానికి అద్భుత తార్కాణంగా నిలిచిపోయింది. పైగా, పర్యావరణం, నిర్ణయాలను తీసుకోవడంలో కేంద్రీకరణకు సంబంధించిన ఈ ఆర్థిక వ్యవస్థల రికార్డు భయానకంగా మిగిలిపోయింది. నిస్వార్థ త్యాగమూర్తులు జాతి వ్యతిరేకులా? అంతర్జాతీయ కారణాలతోపాటు, భారత్‌లో కమ్యూనిస్టు వామపక్షం కుప్పగూలడానికి ఇక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడంలో దానికి ఎదురవుతున్న అసమర్థతే ప్రధాన కారణం. మన కమ్యూనిస్టుల సైద్ధాంతిక పార్శ్వం లోకి యూరోకేంద్రకవాదం జొరబడింది. దీంతో తాము పనిచేస్తున్న సమాజాన్ని వ్యవస్థాగతంగానే వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన దేశంలో అసమానత్వ కేంద్రంగా కులం ఉందన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో వీరు విఫలమయ్యారు. అలాగే భారత జాతీయ ఉద్యమం ప్రాధాన్యత స్వభావాన్ని అవగాహన చేసుకోవడంలో వైఫల్యం కూడా ఈ సమస్యలోంచే పుట్టుకొచ్చింది. మరింత లోతుగా చూస్తే, సగటు భారతీయుడి సాంస్కృతిక సున్నితత్వాన్ని తీర్చిదిద్దిన మత, సంప్రదాయిక ప్రపంచాన్ని గుర్తించి, ఎత్తిపట్టడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. వేలాది కమ్యూనిస్టుల నిస్వార్థపూరితమైన త్యాగాలను నిర్లక్ష్యం చేసి వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రించడం తప్పే అవుతుంది. కానీ బయట నుంచి వారు భారత్‌కు తీసుకొచ్చిన సిద్ధాంతమే వారి అంతిమ వైఫల్యానికి దారితీయడం విషాదకరం. దీనర్థం ఏమిటంటే 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం ధోరణి మరణించింది. ఇది ఒకందుకు మంచిదే, కానీ రెండో కోణంలో మరింత లోతుగా చూస్తే, వామపక్షం 21వ శతాబ్దంలోకూడా తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. ఈ కోణంలో వామపక్షం సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామిక జువాబుదారీతనం కోసం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. దోపిడీ, అన్యాయంతో కూడిన బలమైన పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ అది ‘వామపక్షం’ గానే ఉంటూ కొనసాగుతోంది. కానీ ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్‌కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది. చివరగా... వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావాలు చిరకాలం వర్ధిల్లాలి. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు 98688 88986 -
పాలక పార్టీకి పెను సవాలు
విశ్లేషణ సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా సాగవని గుజరాత్ ఎన్నికలు స్పష్టం చేశాయి. అయితే రైతు ఉద్యమాలు, యువత అసంతృప్తితో చేసే ఆందోళనల నుంచే అధికార పక్షానికి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చు. తమ పోరాటాన్ని సంఘటితంగా సమన్వయం చేసుకోవడం రైతు ఉద్యమాలకు సవాలు కానుంది. ఇప్పటికైతే యువతలోని అసంతృప్తి ఒక రూపు దిద్దుకోకుండా, చెల్లాచెదురుగానే ఉంది. కానీ, వ్యవసాయ సంక్షోభం కంటే మరింత ఎక్కువ సమస్యాత్మకంగా పరిణమించగలిగిన శక్తి దానికి ఉంది. 2018 ఎన్నికల సంవత్సరం కానున్నది. రెండు దఫాలుగా ఈ ఏడాది శాసన సభల ఎన్నికలు జరగనుండటం మాత్రమే అందుకు కారణం కాదు. లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపి, ఈ ఏడాది చివరకే జరిపేసే అవకాశం ఉన్నం దువల్ల కూడా అలా అనడం లేదు. అలా జరిగినా లేకున్నాగానీ ఈ ఏడా దంతా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినదిగానే ఉంటుంది. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రసంగం ఎన్నికల ప్రసంగంలా ఉంటుంది. ఆర్థిక సర్వే సహా అన్ని ఆర్థిక గణాంకాలనూ ఎన్నికల రంగుటద్దాల నుంచే చూపిస్తారు. డొక్లామ్‌లో చైనా కదలికలు, పాకిస్తాన్‌తో సరిహద్దు ఘర్షణలు విదేశాంగ వ్యవ హారాలుగా ఉండవు. ప్రభుత్వ ప్రజాసంబంధాల వ్యవహారాలుగా, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా ఉంటాయి. అయోధ్య వివాదంపై తీర్పు కోసం ఎదురు చూస్తారు గానీ, ఆ భూమిపై యాజమాన్యం ఎవరికి దక్కుతుందనే దాని కోసం కాదు... రాజకీయపరమైన కూడికలు తీసివేతల కోసం. అస్సాంలోని సంక్షోభాన్ని జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌తో అనుసంధానిస్తారు గానీ, అక్కడి మానన విషాదాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుని మాత్రం కాదు... ఆ రాష్ట్రానికి వెలుపల అది ఎన్నికలను రాల్చేదిగా ఎలా ఉపయోగపడుతుందనే దృష్టితోనే. మా దృష్టిలో ఎన్నికల సంవత్సరం అంటే అర్థం ఇదే. ఇలాంటి ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు వచ్చేవి కావు. 2013, 2008, 2003 ఎన్నికల సంవత్సరాలే గానీ ఈ అర్థంలో కావు. ఎన్నికలతో అతిగా ముడిపడిపోయి ఉండటం ఈసారి పూర్తిగా భిన్నమైన స్థాయికి చేరుతుంది. ఎన్నికలు తప్ప ప్రభుత్వానికి మరేదీ పట్టదు. ప్రజల విమర్శలుగానీ, నిరసన ఉద్యమాలుగానీ, చివరికి ప్రజల దుస్థితిగానీ ఏదీ పట్టదు. వాస్తవికత సైతం ఎన్నికల అద్దంలో ప్రతి బింబిస్తేనే, అది కూడా ఏ మేరకు ప్రతిబింబిస్తుందో అంతమేరకే లెక్కలోకి వస్తుంది. ప్రజాస్వామిక సమంజçసత్వాన్ని ఎన్నికల విజయం స్థాయికి కుదించి వేయడం జరుగుతూ వస్తోంది. కాబట్టే చిన్నవైనా లేక పెద్దవైనా ప్రతి ఎన్నికల్లోకీ ప్రధాని రంగ ప్రవేశం చేస్తున్నారు. దేశ భవితే పణంగా.. ఈ ఎన్నికల్లో పణంగా ఒడ్డుతున్నది దేశ భవిత కాబట్టి కూడా ఈ ఎన్నికల ఏడాది అసాధారణమైనది. రానున్న పార్లమెంటు ఎన్నికలంటే కేవలం మోదీ రెండో దఫా అధికారంలోకి రావడం మాత్రమే కాదు, లేదంటే భారత రాజ కీయ పటంపై బీజేపీ ఆధిపత్యం పరిపూర్ణం కావడం కూడా కాదు. అలాగే రాహుల్‌గాంధీకి లేదా కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉన్నదా, లేదా అనే దానికి సంబంధించినవి మాత్రమే కూడా కావు. బీఎస్పీ, ఐఎన్ ఎల్డీ, ఆప్, లేదా వామపక్ష పార్టీల కథ ఇక ముగింపునకు వచ్చినట్టేనా అనేది తేలడం కూడా కాదు. మన రిపబ్లిక్ భవితకు సంబంధించినవి. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన రిపబ్లిక్ పునాదులపై అత్యంత దృఢ సంకల్పంతో దాడులు జరగడాన్ని దేశం చూసింది. కాంగ్రెస్ హయాంలో నీరు గారిన స్వయంప్రతిపత్తిగల సంస్థలు... అత్యవసర పరిస్థితి తదుపరి నేడు అత్యంత అధమ స్థాయికి చేరాయి. ప్రధాన స్రవంతి మీడియాలో అత్యధిక భాగం, ప్రత్యేకించి టెలివిజన్ మీడియా అధికార పార్టీ బాకాగా మారింది. స్వాతం త్య్రానంతర భారత చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని విధంగా వైవి ధ్యానికి, మతమైనారిటీలకు రక్షణ కల్పించే రాజ్యాంగపరమైన అంశాలను ఓ ప్రహసం స్థాయికి దిగజార్చారు. ఈ నష్టాలలో కొన్ని తిరిగి వెనుకకు మర ల్చరానివి కావచ్చు. ఈ ప్రభుత్వానికి మరో దఫా అధికారం కట్టబెట్టడం అంటే ఈ అలవాట్లను మన రాజకీయ వ్యవస్థ జన్యువులలోకి చొప్పించడమే కావచ్చు. అందువల్లనే ఈ ఏడాది అంటే ఎన్నికలు గుర్రప్పందాలను వీక్షిం చడం కాదు. దేశ భవిష్యత్తును నిర్మించడమా లేక కూలదోయడమా అనే దాన్ని తేల్చేవి. 2018ని అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించాల్సినది ఈ సూక్ష్మదర్మినినే. ఎవరు ఈ గుర్రపు పందేలలో ముందున్నారు? ఎన్నికలు జరిగేది ఎన్నడు? జరగాల్సిన విధంగా 2019లోనేనా లేక డిసెంబర్ 2018 శాసనసభ ఎన్నికలతో పాటూనా? ఎన్నికల కూటములు ఎలాంటి రూపు తీసుకుంటు న్నాయి? అనే వాటి చూట్టూతే ఈ ఏడాదిలోని రాజకీయ ఊహాగానాలు చాలా వరకు సాగుతాయి. కానీ ఇవి అసలు ప్రశ్నలు కావు. వాటికి బదులుగా మనం దేనిపైన దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది? ఏ సమస్యల చుట్టూ ఎన్నికల పరమైన సమీకరణ జరుగుతుంది అనేదే అసలు ప్రశ్న. వాటిని దృష్టిలో ఉంచుకుని చూస్తేనే ఎవరు, ఎప్పుడు, ఎలా అనేవి అర్థమయ్యేది. ప్రతిపక్షం గట్టి పోటీ ఇస్తుంది కానీ.. ఈ ఎన్నికల్లో ఎవరు కొంత మెరుగైన స్థితిలో ఉన్నారనే ప్రశ్నకు మనకు తెలి యదని ఒప్పుకోవడమే అత్యుత్తమ సమాధానం అవుతుంది. కాకపోతే మనకు తెలిసిందల్లా గుజరాత్ ఎన్నికలకు ముందు అనిపించినంత ఏక పక్షంగా సాగే పోటీ ఇది కాదు అనేది మాత్రమే. గ్రామీణ ప్రాంతంలో అధికా రపార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం అనేది కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితమైనది కాదు. ఈ ఏడాది జరగనున్న శాసనభ ఎన్నికలలో చాలా వాటిలో బీజేపీ నిస్సందేహంగా గుజరాత్లో కంటే గట్టి పోటీనే ఎదు ర్కుంటుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో వలే కాంగ్రెస్ కర్ణాటకను ఏమంత తేలికగా బీజేపీకి సమర్పించుకోకపోవచ్చు. మేఘాలయ, మిజోరాం, త్రిపురలో బీజేï ³కి ఉన్న పునాది చిన్నదే కాబట్టి ఆ రాష్ట్రాల్లో అది కొన్ని రాజకీయ ఫిరా యింపులు, జాతిపరమైన హింసకు మించి ఏమంత ఘనమైన ఫలితాలు సాధించకపోవచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు ఎదు ర్కొంటున్న ప్రభుత్వ వ్యతిరేకత గుజరాత్లో కంటే చాలా ఎక్కువ. కాబట్టి బీజేపీ ముందు ముందు కొన్ని గట్టి పోటీలనే ఎదుర్కుంటుంది. అయితే ఫలి తాలు మాత్రం ఆ రాష్ట్రాల్లోని ప్రతిపక్షం పరిస్థితి మీద ఆధారపడి ఉంటాయి. ఏదో కొంత మోదీ వ్యతిరేక వాదం లేదా పార్లమెంటులో మొక్కుబడిగా గగ్గోలు పెట్టడాన్ని మినహాయిస్తే, గత మూడున్నరేళ్ల కాలంలో ఇంత ప్రభుత్వ వ్యతిరేకత దేశంలో కనబడలేదనుకోవడం సమంజసమే. బీజేపీని ఢీకొనగలి గిన పొందిక గల సమగ్ర దృక్పథాన్ని, జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికను లేదా విశ్వసనీయతగల నాయకత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం అందించడంలో ఇంతవరకు విఫలమైందని చెప్పుకోవడం సమంజసమే. ఇప్పటికైనా ప్రతి పక్షం కొంత గట్టిగా బరిలో నిలవడాన్ని చూస్తామా? లేదంటే ప్రతిపక్షం ఇప్ప టికే ప్రయత్నించిన, విసుగెత్తించేసిన ప్రతిపక్ష కూటముల సమ్మేళనాలతో పతాక శీర్షికలకు ఎక్కడంతోనే సరిపెట్టుకుంటుందా? ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ– బీఎస్పీ కూటమీ, ఒడిశాలో బీజేడీతో, తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ కూటమీ ఏర్పడితే, నితీశ్‌కుమార్ తిరిగి ప్రతిపక్షంవైపు చేరితే... ఎన్నికల సమీకరణాల్లో ప్రతిపక్షం తీవ్రమైన పెనుమార్పులను తేగలుగుతుంది. అయి నాగానీ, విశ్వసనీయతగల ప్రతిపక్షాన్ని అందించడం అంటే పార్టీలను ఐక్యం చేయడం మాత్రమే కాదు. ఎందుకంటే, అసలు బీజేపీ అధికారంలోకి వచ్చిందే ఆ పార్టీల పట్ల ప్రజలు విశ్వసనీయతను కోల్పోయినందువల్లనే. ఈ ఏడాది కీలకమైన ప్రశ్న రాజకీయ, ఎన్నికలపరమైన పోరాటాలు ఏ సమస్యలపై రూపుదిద్దుకుంటాయనే దానికి సంబంధించినదే. తన నాలుగేళ్ల పాలన తర్వాత ఓటర్లకు, ప్రత్యేకించి గ్రామీణ ఓటర్లకు తాము సాధించిన విగా చూపడానికి తమ వద్ద ఏమీ లేదని గుర్తించగల నిశిత బుద్ధి మోదీకి ఉంది. తన ప్రత్యర్థులలో ఎవరికన్నా కూడా ఆయనే అత్యంత జనాదరణ గల నేతగా ఉన్నారు. అయినాగానీ ఎన్నికలపరంగా అది చాలా బలహీనమైన సానుకూలతేనని ఆయనకు తెలుసు. తీవ్ర సవాలును ఎదుర్కోవాల్సి వస్తే మోదీ మతతత్వవాదం, ఉన్మాదభరితమైన జాతీయవాదాలను ఆశ్రయిస్తారని గుజరాత్ ఎన్నికలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కాబట్టి 2018లో హఠాత్తుగా ఎన్నడో మరచిపోయిన కొన్ని మసీదులు/దేవాల యాల వివాదాలు రచ్చకెక్కినా, అయోధ్య వివాదంపై కోర్టు తీర్పు దేశ వ్యాప్త ప్రచారాంశంగా మారినా, స్వల్పమైన సరిహద్దు సంఘ ర్షణ పెద్ద టెలివిజన్ యుద్ధంగా దర్శనమిచ్చినా ఆశ్చర్యపోకూ డదు. ప్రతిపక్షం దాన్ని ఉదారవాద/లౌకకవాద చర్చతో ఎదుర్కో వాలని ప్రయత్నించవచ్చు. లేదా కుల కూటములతో ఎదుర్కోవా లని అనుకోవచ్చు. కానీ వాటి వల్ల కలిగే ఎన్ని కలపరమైన ప్రయో జనాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. రైతు ఉద్యమాలు, యువతే అసలు సవాలు రైతు ఉద్యమాలు, యువత అసంతృప్తితో చేసే ఆందోళనలు అనే రెండు రంగాల నుంచి అధికార పక్షానికి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చు. గ్రామీణ ప్రాంతంలోని దైన్య పరిస్థితులు రైతు ఉద్య మాలుగా పరిణమించడాన్ని 2017లో మనం చూశాం. దాదాపు రెండు వందల రైతు సంస్థలు ఒక్కటై గిట్టుబాటు ధరలకు హామీని కల్పిం చాలని, ఒక్కసారికి మొత్తం రుణ మాఫీని ప్రకటించాలని కోరాయి. ప్రభుత్వం వ్యవసాయ రంగంలోని ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి గానీ లేదా దాన్ని పరిష్కరించాలని ప్రయత్నించడానికి గానీ సుముఖంగా లేదు. కాబట్టే ఏవో కంటి తుడుపు చర్యలతో సరిపెట్టేసింది. తమ పోరా టాన్ని సంఘటితంగా సమన్వయం చేసుకునే విషయంలో రైతు ఉద్యమాల కున్న శక్తికి 2018 సవాలుగా నిలవనుంది. ఇప్పటికైతే యువతలోని అసం తృప్తి చాలావరకు ఒక రూపు దిద్దుకోకుండా, చెల్లాచెదురుగానే ఉంది. కానీ, వ్యవసాయ సంక్షోభం కంటే కూడా మరింత ఎక్కువ సమస్యాత్మకంగా పరి ణమించగలిగిన శక్తి దానికి ఉంది. విద్యావకాశాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని, ఉద్యోగ హక్కు కల్పించాలని కోరుతూ యువత సమన్వయంతో పోరాడే సూచనలు కనిపిస్తాయేమోనని మనం 2018లో ఎదురు చూడాలి. ఈ ఏడాదికి చిట్టచివరకు తేలే సమీకరణం చాలా సరళమైనదే. అది, వ్యవసాయ సంక్షోభం, యువతలోని అసంతృప్తి లేదా హిందూ–ముస్లిం సంఘర్షణగా ఉంటుంది. ఫలితాలను, కొంత కాలంపాటూ దేశ భవితను నిర్ణయించేది మాత్రం ఈ సమీకరణం ఎటువైపు మొగ్గుతుందనేదే. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986 -
అభివృద్ధి అధోగతి
గంగావతి/మైసూరు, న్యూస్‌లైన్ : పదేళ్ల కాంగ్రెస్ దుష్ట పాలనలో దేశంలో అభివృద్ధి అధోగతి పాలైందని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. మంగళవారం కొప్పళ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. లాల్‌బహుదూర్ శాస్త్రి గతంలో ‘జై జవాన్, జై కిసాన్’ అనే నినాదాన్ని ఇవ్వడమే కాకుండా దాన్ని సార్థకం చేశారన్నారు. అనంతరం కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, జవానుల హత్యలు, వారి తలలు తీసే స్థాయికి దుస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు బాగుపడిన నాడే దేశమూ అభివృద్ధి చెందుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు తక్కువ ధరకే విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అందించాలని, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పుడే వారి ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమని అన్నారు. అయితే దశాబ్దకాలంగా యూపీఏ-1, యూపీఏ-2 వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, యువతకు ఉద్యోగాలను సృష్టించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆదర్శ ఆపార్ట్మెంట్, 2జీ స్పెక్ట్రం తదితర కుంభకోణాల్లో కాంగ్రెస్ నేతలు వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని తూర్పారబట్టారు. ప్రతి పథకంలోనూ అవినీతికి పాల్పడుతూ పేదల సొమ్ము కొల్లగొట్టారని విమర్శించారు. ‘మన యువరాజు ఆర్టీ యాక్ట్ తెచ్చామని ప్రతి బహిరంగ సభలో గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప.. ఆ యాక్ట్ నిరుపేదల కడుపు నింపిందా?.. యువతకు ఉపాధి కల్పించిందా?.. రైతులకు మేలు చేసిందా?’ అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు, యువత అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని భరోసా ఇచ్చారు. సభకు బీజేపీ ఎంపీ అభ్యర్థులు శ్రీరాములు, కరడి సంగణ్ణ, కుష్టిగి ఎమ్మెల్యే దొడ్డనగౌడ పాటిల్, ఎమ్మెల్సీ హాలప్ప ఆచార్, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప తదితరులు హాజరయ్యారు. మైసూరుకు పర్యాటక శోభ పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న మైసూరును అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మోడీ ఆరోపించారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మైసూరుతో పాటు మండ్య, కొడగు, చామరాజనగర, హాసన జిల్లాలను పర్యాటక రంగంలో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. మైసూరు మహారాజ మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. పాలనలో యూపీఏ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రైల్వే శాఖ మొత్తం తుప్పు పట్టి పోయిందని, రక్షణ శాఖకే భద్రత కరువైందని విమర్శించారు. రైల్వే, రక్షణ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, భర్తీ చేయడం లేదని ఆరోపించారు. వాజ్‌పేయి హయాంలోనే ఐటీ విప్లవం దేశంలో ఐటీ విప్లవం ఏబీ. వాజ్‌పేయి హయాంలో చోటు చేసుకుందని, ఈ దిశగా ఆయన చట్టాలను కూడా తీసుకొచ్చారని మోడీ గుర్తు చేశారు. బెంగళూరులోని హొసూరు రోడ్డు సర్కిల్లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు రాజీవ్ హయాంలో ఐటీ విప్లవానికి అంకురార్పణ జరగలేదని అన్నారు. గుజరాత్లో 2001లో భూకంపం సంభవించినప్పుడు గ్రామాలకు గ్రామాలే నేల మట్టమయ్యాయని గుర్తు చేశారు. అప్పట్లో కొందరు ఇక గుజరాత్ పనై పోయిందని వ్యాఖ్యానించారని, ఆ సంకటం నుంచి బయట పడడానికి తాను రేయింబవళ్లూ శ్రమించి, తిరిగి మామూలు స్థితికి తీసుకురాగలిగానని చెప్పారు.