గంగావతి/మైసూరు, న్యూస్‌లైన్ : పదేళ్ల కాంగ్రెస్ దుష్ట పాలనలో దేశంలో అభివృద్ధి అధోగతి పాలైందని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. మంగళవారం కొప్పళ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. లాల్‌బహుదూర్ శాస్త్రి గతంలో ‘జై జవాన్, జై కిసాన్’ అనే నినాదాన్ని ఇవ్వడమే కాకుండా దాన్ని సార్థకం చేశారన్నారు.
అనంతరం కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, జవానుల హత్యలు, వారి తలలు తీసే స్థాయికి దుస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు బాగుపడిన నాడే దేశమూ అభివృద్ధి చెందుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు తక్కువ ధరకే విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అందించాలని, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పుడే వారి ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమని అన్నారు. అయితే దశాబ్దకాలంగా యూపీఏ-1, యూపీఏ-2 వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, యువతకు ఉద్యోగాలను సృష్టించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆదర్శ ఆపార్ట్‌మెంట్, 2జీ స్పెక్ట్రం తదితర కుంభకోణాల్లో కాంగ్రెస్ నేతలు వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని తూర్పారబట్టారు.
ప్రతి పథకంలోనూ అవినీతికి పాల్పడుతూ పేదల సొమ్ము కొల్లగొట్టారని విమర్శించారు. ‘మన యువరాజు ఆర్టీ యాక్ట్ తెచ్చామని ప్రతి బహిరంగ సభలో గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప.. ఆ యాక్ట్ నిరుపేదల కడుపు నింపిందా?.. యువతకు ఉపాధి కల్పించిందా?.. రైతులకు మేలు చేసిందా?’ అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు, యువత అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని భరోసా ఇచ్చారు. సభకు బీజేపీ ఎంపీ అభ్యర్థులు శ్రీరాములు, కరడి సంగణ్ణ, కుష్టిగి ఎమ్మెల్యే దొడ్డనగౌడ పాటిల్, ఎమ్మెల్సీ హాలప్ప ఆచార్, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప తదితరులు హాజరయ్యారు.
మైసూరుకు పర్యాటక శోభ
పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న మైసూరును అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మోడీ ఆరోపించారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మైసూరుతో పాటు మండ్య, కొడగు, చామరాజనగర, హాసన జిల్లాలను పర్యాటక రంగంలో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.
మైసూరు మహారాజ మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. పాలనలో యూపీఏ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రైల్వే శాఖ మొత్తం తుప్పు పట్టి పోయిందని, రక్షణ శాఖకే భద్రత కరువైందని విమర్శించారు. రైల్వే, రక్షణ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, భర్తీ చేయడం లేదని ఆరోపించారు.
వాజ్‌పేయి హయాంలోనే ఐటీ విప్లవం
దేశంలో ఐటీ విప్లవం ఏబీ. వాజ్‌పేయి హయాంలో చోటు చేసుకుందని, ఈ దిశగా ఆయన చట్టాలను కూడా తీసుకొచ్చారని మోడీ గుర్తు చేశారు. బెంగళూరులోని హొసూరు రోడ్డు సర్కిల్‌లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు రాజీవ్ హయాంలో ఐటీ విప్లవానికి అంకురార్పణ జరగలేదని అన్నారు. గుజరాత్‌లో 2001లో భూకంపం సంభవించినప్పుడు గ్రామాలకు గ్రామాలే నేల మట్టమయ్యాయని గుర్తు చేశారు. అప్పట్లో కొందరు ఇక గుజరాత్ పనై పోయిందని వ్యాఖ్యానించారని, ఆ సంకటం నుంచి బయట పడడానికి తాను రేయింబవళ్లూ శ్రమించి, తిరిగి మామూలు స్థితికి తీసుకురాగలిగానని చెప్పారు.
అభివృద్ధి అధోగతి
Published Wed, Apr 9 2014 3:43 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement