సీఎస్‌డీఎస్ బృందం చేపట్టిన మూడు వరుస సర్వేలు కాంగ్రెస్‌పై బీజేపీ ఆధిక్యత వేగంగా క్షీణిస్తూ సున్నాకు చేరినట్టు వెల్లడించాయి. ఈ ధోరణి బీజేపీ ఓటమిని విస్పష్టంగా సూచిస్తున్నదని నేను భావిస్తున్నా. స్పష్టంగా, నిలకడగా సాగే ఇలాంటి ధోరణి వెనుకకు మరలేది కాదు. సాధారణంగా అది మరింత తీవ్రమౌతుంది. కాబట్టి బీజేపీ ఆధిక్యత సున్నా నుంచి రుణాత్మకమైనదిగా మారవచ్చు. రెండు పార్టీల మధ్య పోటీలో విచిత్రంగా నాలుగు శాతానికి మించిన ఆధిక్యతే కాంగ్రెస్ విస్పష్ట విజయానికి సరిపోతుంది.
గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమిపాలు కావడం జరగొచ్చా? ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఓటమిని చవి చూడనున్నారా? జాతీయ రాజకీయాల తీరుతెన్నుల కథనం హఠాత్తుగా మారిపోనున్నదా? ఓ రెండు నెలల క్రితమైతే ఇలాంటి సందేహాలను నేను కొట్టి పారేసేవాడిని. బీజేపీ గుజరాత్‌లో అధికార పార్టీ మాత్రమే కాదు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు పాతుకుపోయినట్టు అది అక్కడ బాగా పాతుకుపోయి ఉన్న పార్టీ. 1991 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ సాధించిన దిగ్భ్రాంతికరమైన విజయం (26 లోక్‌సభ స్థానాలకు 20) తర్వాత బీజేపీ ఏ ఒక్క ఎన్నికల్లోనూ ఓడింది లేదు. అప్పటి నుంచి జరిగిన ఐదు శాసనసభ ఎన్నికల్లోనూ అది 10 శాతం పాయింట్ల పటిష్టమైన ఆధిక్యతను కనబరుస్తూనే వచ్చింది. బీజేపీ ఆధిపత్యం ఎన్నికలకే పరిమితం కాలేదు. పారిశ్రామిక, వాణిజ్య రంగాల నుంచి సహకార సంస్థలు, మీడియా, మేధావులు సహా మొత్తంగా గుజరాత్ సమాజంపైనే అది తన ఆధిపత్యాన్ని నెలకొల్పగలిగింది. దాని ప్రత్యర్థి కాంగ్రెస్ అత్యంత సత్తువలేని ప్రతిపక్షంలా కనిపించింది.
‘గుజరాత్ మోడల్’కు చుక్కెదురు
అందువల్లనే నేను గుజరాత్ నుంచి వచ్చే వార్తల పట్ల ఏమంత శ్రద్ధ పెట్టలేదు. మరోసారి, అది కూడా ఒక గుజరాతీ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ విజయం సాధిస్తుందని ముందుగానే నిర్ధారణకు వచ్చేశాను. సీఎస్‌డీఎస్ (సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్) బృందం గత ఆగస్టులో నిర్వహించిన తొలి రౌండు సర్వే బీజేపీ భారీ ఆధిక్యతలో ఉన్నదని తెలిపింది. ఆ ఆధిక్యత ఇక అధిగమించరానిదని అనిపించింది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల ప్రభ వెలిగిపోతున్నప్పటిలా, గుజరాత్‌లో బీజేపీ గెలుపు చెప్పుకోదగిన వార్తేమీ కాదు. అదే తర్కంతో చూస్తే, అది ఓడిపోవడం అంటే భూకంపం సంభవించడమే. భూకంపాలు ఎప్పుడూ వచ్చేవి కావు.
కానీ గుజరాత్ పరిస్థితిని చూస్తే అంతా బాగా ఉన్నట్టేమీ లేదు. సుప్రసిద్ధమైన ‘గుజరాత్ నమూనా’భారీ ప్రచార ఆర్భాటమే తప్ప, వాస్తవంగా సాధించినది మాత్రం కొన్ని ఓ మోస్తరు విజయాలు మాత్రమేనని అందరికీ తెలుసు. విద్య, ఆరోగ్యం వంటి సామాజిక సూచికలకు సంబంధించి గుజరాత్ ఇంకా మధ్యస్త స్థాయి ఫలితాలను సాధిస్తున్న రాష్ట్రంగానే ఉంటూ వస్తోంది. ప్రత్యేకించి రైతులకు ఈ నమూనా వల్ల ఒరిగిందేమీ లేదు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం అది, అత్యంత బలమైన రైతు నిరసనలు వెల్లువెత్తిన రాష్ట్రం. నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యాక గుజరాత్‌లోని పరిస్థితులు స్పష్టంగానే మరింత అధ్వానంగా దిగజారాయి. గ్రామీణ సంక్షోభం తీవ్రమైంది. వరుసగా వచ్చిన రెండు కరువు కాలాల్లో ప్రభుత్వం రైతులకు సరిపడేంత సహాయాన్ని అందించడంలో లేదా వాటిని పూర్తిగా గుర్తించడంలో విఫలమైంది. గత ఏడాదిగా, గుజరాత్ అల్లకల్లోలంగా ఉంది.
మరెక్కడైనా అయితే అధికారపార్టీ ఎన్నికల్లో ఓటమి పాలు కాక తప్పదన్నట్టే ఉండేది. కానీ గుజరాత్ భిన్నమైనదని భావించాను. ప్రజలు అంసతృప్తితో ఉండటం, బీజేపీ ప్రభుత్వంపై భ్రమలు కోల్పోవడం, ఆగ్రహంతో కూడా ఉండటం మాత్రమే ఆ పార్టీ ఓడిపోవడానికి సరిపోవు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ, సరిగ్గా బీజేపీ కావాలని కోరుకునే ప్రత్యర్థిలాగానే... ఎలాంటి దూరదృష్టి, వ్యూహంగానీ లేదా విశ్వసనీయతగల నాయకుడుగానీ లేనిదిగానే ఉన్నదని అనిపించింది. కాబట్టే ఎవరైనా గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోనున్నదనే వార్తను పట్టుకొస్తే ‘‘ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పకండి. వారు బీజేపీని ఓడించడానికి ఎవరికైనా ఓటు వేసేంత ఆగ్రహంతో ఉన్నారా? కాంగ్రెస్‌కైనా సరే ఓటు వేస్తారా?’’ అని ప్రశ్నించేవాడిని. ఓటర్లు అంతటి ఆగ్రహంతోనే ఉండి ఉండవచ్చని ఇప్పుడు అనుకుంటున్నా. ఆలోచించ శక్యంకానిదే జరగవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలకు జరిగినదే సరిగ్గా జరగొచ్చు. బీజేపీ స్పష్టంగా ఓటమికి గురికావడం, పర్యవసానంగా కాంగ్రెస్‌కు విస్పష్టమైన విజయం లభించడమే గుజరాత్ ఎన్నికల ఫలితం కావచ్చునని అనిపిస్తోంది.
సీఎస్‌డీఎస్ సర్వేలు ఏం చెబుతున్నాయి?
ఈ నిర్ధారణ నా స్వీయాత్మక అంచనాపైనో లేక రాజకీయ ప్రాధాన్యలపైనో ఆధారపడి చేసినది కాదు. బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్న సర్వేలపై ఆధారపడి, ప్రత్యేకించి లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ బృందం ఏబీపీ వార్తా సంస్థ కోసం చేపట్టిన మూడు వరుస ‘‘ట్రాకర్’’ సర్వేలపై ఆధారపడి నేను నా సొంత తార్కిక నిర్ధారణలను చేస్తున్నా. ఈ మూడు సర్వేలూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 నియోజక వర్గాల్లో 3,500 మందిని యథాలాపంగా ఎంపిక చేసి, వారి సమాధానాలను సేకరించి జరిపిన చక్కటి జనాభిప్రాయసేకరణలు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తప్ప అన్ని సర్వేల్లోనూ సమంజసమైనంత కచ్చితత్వంతో ఓట్ల శాతాలను లెక్కగట్టగలగడమనే రికార్డు ఈ బృందానికి ఉంది. అందువల్లనే ఆ బృందం సర్వేపై నేను నమ్మకాన్ని ఉంచాను. అంతేకాదు, ఈ బృందం తన సర్వే ఫలితాలను అన్నిటినీ సమంజసమైనంత పారదర్శకతతో బహిరంగంగా వెల్లడించింది. అందువల్లనే నేను ఈ సర్వే సమాచారాన్ని తీసుకుని ఉపయోగిస్తున్నా. (http://www.lokniti.org/pdf/Gujarat-Tracker-3-Report.pdf) ఒకప్పుడు ఈ లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ సర్వే బృందాన్ని స్థాపించినప్పుడు నేనూ అందులో పాల్గొన్నా, గత నాలుగేళ్లుగా దానితో నాకు ఎలాంటి సంబంధమూ లేదని కూడా చెప్పాల్సి ఉంది.
ఈ ట్రాకర్ జనాభిప్రాయ సేకరణలో మొదటి రౌండ్ ఈ ఏడాది ఆగస్టు నెల ప్రథమార్ధ భాగంలో జరిగింది. అందులో కాంగ్రెస్‌పై బీజేపీ 30 శాతం పాయింట్ల భారీ ఆధిక్యతతో ఉన్నట్టు తెలిసింది. అక్టోబర్‌లో జరిగిన రెండో రౌండ్‌కు వచ్చే సరికి దాని నివేదికలో నాటకీయమైన మార్పు జరిగింది. బీజేపీ ఆధిక్యత కేవలం 6 పాయింట్లకు పడిపోయిందని సీఎస్‌డీఎస్ బృందం ఆరౌండ్‌లో తేల్చింది. ఇదేమైనా జనాభిప్రాయాన్ని పొరపాటుగా జనాభిప్రాయాన్ని అంచనా కట్టడమా లేక ఓటింగ్ సరిళిలోని ధోరణిని అంచనా వేయడంలో జరిగిన పొరపాటా? నవంబర్ చివరి వారంలో జరిగిన తాజా రౌండులో ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. బీజేపీ ఆధిక్యత సున్నాగా మారి, రెండు పార్టీలూ 43 శాతం ఓట్లతో గెలుపు ఓటములు తేలని స్థితిలో ఉన్నాయని మూడో రౌండు ఫలితాల నివేదిక తెలిపింది. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి, బీజేపీ ఓడిపోతుందనే ముందస్తు అంచనాను సీఎస్‌డీఎస్ బృందం ఇవ్వలేదు. నవంబర్ ఆఖరి వారంలో ఎన్నికలు జరిగితే బీజేపీకి 91 నుంచి 99 స్థానాలు రావచ్చని మాత్రమే అది చెప్పింది. మరి పోలింగ్ రోజున ఏం జరుగుతుంది? లోక్‌నీతి–సీఎస్‌డీఎస్–ఏబీపీ ప్రజాభిప్రాయ సేకరణ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
విస్పష్ట విజయం దిశగా కాంగ్రెస్
ఈ ధోరణి బీజేపీ విస్పష్టంగా పరాజయం పాలుకానున్నదని సూచిస్తున్నట్టు నేను భావిస్తున్నా. స్పష్టంగా, నిలకడగా సాగే ఇలాంటి ధోరణి సాధారణంగా వెనుకకు మరలేది కాదు. సాధారణంగా అది మరింత తీవ్రమౌతుంది. కాబట్టి బీజేపీ ఆధిక్యత సున్నా నుంచి రుణాత్మకమైనదిగా మారవచ్చు. రెండు పార్టీల మధ్య పోటీ జరిగేటప్పుడు విచిత్రంగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ శాతం పాయింట్ల ఆధిక్యతే విస్పష్ట విజయానికి కాంగ్రెస్‌కు సరిపోతుంది. ఎన్నికలకు ముందు జరిగే ఇలాంటి సర్వేలు సాధారణంగా అధికార పార్టీని ఎక్కువగా అంచనా వేసే ధోరణిని కనబరుస్తాయనే విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకుని తీరాలి. కాబట్టి ఈ దశలో మనం అంచనా కట్టగలిగిన దానికంటే పెద్ద ఆధిక్యతే ఫలితాల్లో కనిపించవచ్చు. ఈ వ్యాసం శీర్షికలోని నా అంచనాను ఈ సర్వే వెల్లడించిన ఇతర అంశాలు కూడా బలపరుస్తున్నాయి. గుజరాత్ ప్రభుత్వం పట్ల ప్రజామోదం రేటింగ్‌లు నిలకడగా పడిపోతూ, ఇప్పుడు ప్రమాద సూచికను కూడా దాటేశాయి. ఈ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వనివారి సంఖ్య, మరో అవకాశాన్ని ఇచ్చేవారి సంఖ్యను మించిపోయింది. వ్యక్తిగత ప్రతిష్ట ఈసారి కీలకమైన అంశం అయ్యేట్టు కనిపించడం లేదు.
అధారాలు ఇవిగో
ముఖ్యమంత్రి జనాదరణ రేటింగ్‌లు ప్రత్యర్థులతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నా, బాగా తక్కువ స్థాయికి పడిపోయాయి. ప్రధాని ఇప్పటికీ అత్యంత జనాదరణగల నేతగా ఉన్నా, ఆయన రేటింగ్‌లు, కేంద్ర ప్రభుత్వ రేటింగ్‌లు కూడా పడిపోయాయి. హార్దిక్ పటేల్ సీడీలు, మత సమస్యలు ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రముఖ పాత్ర నిర్వహించడం లేదు. ఈ ఎన్నికల్లోని అసలు సమస్య ఆర్థిక వ్యవస్థే అనే విషయాన్ని కూడా ఈ సర్వే వెల్లడించింది. ఓటర్లు నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందుతున్నారు. ధరల పెరుగుదల అంటే ప్రజలందరి కొనుగోలు శక్తి పడిపోవడం అనే అర్థం.
కేవలం ఈ సీఎస్‌బీఎస్ సర్వే అనే కాదు. గుజరాత్ నుంచి వస్తున్న విశ్వసనీయమైన క్షేత్ర స్థాయి నివేదికలు సైతం ఈ నిర్ధారణను మరింతగా బలపరుస్తున్నాయి. ప్రధాని పాల్గొంటున్న సభలుసహా బీజేపీ ఎన్నికల సభలకు జనం బాగా తక్కువగా వస్తున్నారు. అదే సమయంలో, హార్దిక్ పటేల్ సభలకు భారీగా ప్రజలు వస్తున్నారు. రైతుల ఆగ్రహమూ, తాజాగా వేరుశనగ, పత్తి ధరలు పడిపోవడం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న చెప్పుకోదగిన అంశాలుగా కనిపిస్తున్నాయి. అలాగే గుజరాతీ వ్యాపారవేత్తల్లో కూడా వంచనకు గురయ్యామన్న భావన కనిపిస్తోంది.
అయినా ఇంకా మారేది ఏమైనా ఉందా? మోదీ బహిరంగ సభలు మొత్తంగా ఆ మార్పును తెచ్చే ఇంద్రజాలాన్ని పునరావృతం చేస్తున్నట్టు అనిపించడం లేదు. మరి రిగ్గింగ్ మాటేమిటి? పంజాబ్, యూపీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) కుట్ర గురించి మాట్లాడిన వారిలో నేను లేను. ఏది ఏమైనా వీవీపీఏటీల (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) మెషీన్‌ల పట్లా, యథాలాపంగా ఓటర్ స్లిప్పులను మెషీన్ లెక్కతో సరిపోల్చి చూసే విషయంలో జాగ్రత్త వహించాలి.
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు
మొబైల్: 98688 88986
యోగేంద్ర యాదవ్
Comments
Please login to add a commentAdd a comment