లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రతి విషయానికి పండితులనే ఆశ్రయిస్తున్నారు. తమ జాతకం ప్రకా రం ఎప్పుడు నామినేషన్ వేస్తే గెలుస్తామో? ఎప్పు డు ప్రచారం ప్రారంభిస్తే అఖండ విజయం సొంతమవుతుందో? ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలంటే ఏయే పూజలు చేయాలి? ప్రజలను తమవైపు తిప్పుకోవాలంటే మరేం చేయాలి? అనే సవాలక్ష సమస్యలతో జ్యోతిష్య పండితులను, సాదుసంతులను కలుస్తున్నారు. గుర్గావ్‌లో గురువారం నామినేషన్ వేసిన అభ్యర్థులంతా దాదాపు 3 గంటలలోపే వేసేశారు.
అందుకు కారణం 3 గంటల తర్వాత శుభగడియలు లేవని పంచాంగం చెప్పడంతోనే అలా చేశామంటున్నారు. రావ్ ధర్మపాల్ గురువారం నామినేషన్ వేసినవారిలో మొదటివాడు. మద్దతుదారులతో కలిసి గుర్గావ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆయన 1.25 గంటలకే నామినేషన్ పత్రాలను సం బంధిత అధికారి చేతిలో పెట్టారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...‘నామినేషన్ ఎప్పుడు వేయాలనే విషయమై పండితుణ్ని కలిశాను.
నా జాతకం ప్రకారం 1.30కు ముందే నామినేషన్ వేయాలని ఆయన చెప్పారు. చెప్పిన ప్రకారమే డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి చేరుకొని 1.25 గంటలకు నామినేషన్ వేశాన’ని చెప్పారు. ఇక ఓ పూజారి ఈ విషయమై మాట్లాడుతూ... ‘కొంతమంది రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు నన్ను కలిశారు. తమ గెలుపుకోసం దేవుడి కృప కూడా కావాలన్నారు. తమ విజయావకాశాలు మెరుగుపడేందుకు పూజలు, హోమాలు చేయించుకున్నార’ని చెప్పారు.
స్వతంత్ర అభ్యర్థిగా గుర్గావ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కుశేశ్వర్ భగత్ మాట్లాడుతూ... ‘నా గురువు గురువారం 1.30 గంటలకు ముందే నామినేషన్ వేయమని చెప్పారు. సరిగ్గా ఆ సమయానికే అక్కడికి చేరుకున్నా నేను నామినేషన్ వేయలేకపోయాను. అందుకు కారణం నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తు పదిమంది సాక్షి సంతకాలు చేయాల్సి ఉంటుంది. పదిమందిలో ఓ వ్యక్తి అనారోగ్యబారిన పడడంతో అక్కడకు రాలేకపోయాడు. దీంతో గురువారం నామినేషన్ వేసే ఆలోచనను విరమించుకున్నాను. శుక్రవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయమని గురువు చెప్పాడన్నారు.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ ఈ విషయమై మాట్లాడుతూ... ‘రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు కుటుంబ సభ్యులతో చర్చిస్తా. వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటా. నామినేషన్ వేయడానికి ముహుర్తాలు చూడలేదు. పండితులను కలవలేదు.
నా విషయానికి వస్తే పండితులు, పూజారులు, తాంత్రికులు చివరి వరుసలో ఉంటారు. వారికి నేను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వన’ని చెప్పారు. సిట్టింగ్ ఎంపీ రావు ఇంద్రజీత్‌సింగ్ పనితీరు సంతృప్తికరంగా లేదని, నియోజకవర్గంలో తాను తిరిగినప్పుడు ఈ విషయం స్పష్టమైందన్నారు. ఎంపీగా తన కనీస బాధ్యతలను నిర్వర్తించడంలో కూడా ఇంద్రజీత్ విఫలమయ్యారని ఆరోపించారు.
ఐఎన్‌ఎల్‌డీ తరఫున పోటీ చేస్తున్న జాకీర్ హుస్సేన్ నామినేషన్ వేసేందుకు అభయ్ చౌతాలా, మద్దతుదారులతో కలిసివ చ్చారు. నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడుతూ... ‘మా గెలుపు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మా పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తోందని, నన్ను డమ్మీ అభ్యర్థి అంటూ కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నా రు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధేమీ కనిపించడంలేదని, తనను గెలిపిస్తే చేసి చూపిస్తానన్నారు.
పండితుల మాటే వేదవాక్కు!
Published Fri, Mar 21 2014 11:06 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement
Advertisement