గుర్గావ్‌లో ఆప్ గాలి..
Published Sat, Apr 5 2014 11:22 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
న్యూఢిల్లీ: గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి యోగేంద్ర యాదవ్, తన ప్రత్యర్థులకంటే ఎంతో ముందంజలో ఉన్నారని ఆ పార్టీ నిర్వహించిన సర్వేలో తేలింది. యాదవ్‌కు అతడి సొంత ఊరు రేవరీ, మేవాట్‌లో మంచి పట్టు ఉంది. అలాగే గుర్గావ్ నగరంలో కూడా అతడు బీజేపీ అభ్యర్థి ఇందర్‌జీత్ సింగ్‌తో పోటాపోటీగా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. దీంతో ఈ ప్రొఫెసర్‌కు విజయావకాశాలు నానాటికి మెరుగుపడుతున్నాయని ఆ సర్వే అంచనా వేసింది. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున ఇందర్‌జీత్ సింగ్, కాంగ్రెస్ తరఫున ధరమ్‌పాల్, ఐఎన్‌ఎల్‌డీ తరఫున జాకిర్ హుస్సేన్ బరిలో ఉన్నారు. కాగా ఈ సర్వే ప్రకారం బీజేపీ, కాంగ్రెస్‌లకు విజయావకాశాలు చాలా తక్కువగా కనిపించాయి. మేవాట్ వాసి అయిన జాఖిర్ హుస్సేన్ మాత్రమే 12 శాతం ఓట్లు సాధించగలరని ఈ సర్వే వెల్లడించింది. గుర్గావ్‌లో ఈ నెల 10వ తేదీన ఢిల్లీతో పాటు ఎన్నికలు జరుగనున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ నిర్వహించిన సర్వే నిజమైన విషయం విదితమే. బీజేపీలో ఇటీవల చేరిన కేంద్ర మాజీమంత్రి రావ్ ఇందర్‌జీత్‌సింగ్ కంటే మేవాట్, రేవరీ, గుర్గావ్ నగరాల్లో ఆప్ అభ్యర్థి యోగేంద్రకు ఎక్కువ పట్టు లభించినట్లు సర్వే తేల్చింది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించని సమయంలో ఫిబ్రవరిలో జరిపిన సర్వేలో ఆప్‌కు మూడోస్థానం లభించందని, అయితే ప్రస్తుతం క్రమబద్ధమైన ప్రచారంతో యాదవ్ విజయావకాశాలు మెరుగుపడ్డాయని సర్వే తెలిపింది. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు 25 శాతానికి పైగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకమని సర్వే పేర్కొంది. ఈ ఓటర్లలో ముస్లిం అభ్యర్థి జాకిర్ హుస్సేన్‌కు 26 శాతం ఓట్లు పడతాయని, మిగతా వారంతా ఆప్ వెంటే ఉంటారని వెల్లడించింది. అంతేకాక ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపేది యాదవ్ కులస్తులే. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల వారు ఆప్‌ను ఆదరిస్తున్నారని ఆ సర్వే నిగ్గు తేల్చింది.
Advertisement