పార్టీలకతీతంగా 'స్వరాజ్ అభియాన్'
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆమ్ఆద్మీపార్టీ బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ సొంత కుంపటిని ప్రారంభించారు. అయితే, అది పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని పేర్కొంటూ స్వరాజ్ అభియాన్ అని దానికి నామకరణం చేశారు. తమ సంస్థ దేశంలోని రైతులు, మహిళలు, సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుందని ప్రకటించారు. నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాల ద్వారా ప్రజల పక్షాన తమ పోరాటం ఉండనుందని తెలియజేశారు.
అయితే, ఆప్ నుంచి బలవంతంగా బహిష్కరణకు గురైన ఈ నేతలు సొంతంగా పార్టీ పెడతారని భారీ ఊహగానాలు వచ్చిన విషయం తెలిసిందే. స్వరాజ్ అభియాన్ ప్రకటన సందర్భంగా మాట్లాడిన నేతలు భూషణ్, యోగేంద్ర.. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూనే తమకు మద్దతు ఇస్తామని 75శాతం కార్యకర్తలు మాట ఇచ్చారని, 25శాతం మంది మాత్రం సొంతంగా పార్టీ పెట్టేందుకు మద్దతిచ్చారని చెప్పారు. అయితే, స్వరాజ్ అభియాన్ తమ పార్టీకి సంబంధించినది కానందున బుధవారం చర్యలు తీసుకుంటామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు.