యోగేంద్ర, భూషణ్‌ల కొత్త పార్టీ ‘స్వరాజ్ ఇండియా’
ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో పోటీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు ఆదివారం ‘స్వరాజ్ ఇండియా’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోవడం లేదని తెలిపారు. పార్టీకి యోగేంద్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టిన ధరమ్‌వీర గాంధీ(సస్పెండైన పంజా బ్ ఆప్ ఎంపీ)కి మద్దతిస్తామని యోగేంద్ర చెప్పారు. ఆమ్ ఆద్మీకి(సామాన్యుడికి) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ద్రోహం చేశారని ఆరోపించారు. తమ పార్టీ ప్రత్యమ్నాయ రాజకీయాలను తీసుకొస్తుందని, వ్యక్తిపూజ రాజకీయాలకు పాల్పడదని అన్నారు.
తమ పార్టీ తనంత తాను ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, ఎమ్మెల్యేలు, ఎంపీలపై విప్ ప్రయోగించదని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. విప్‌ను కేవలం అవిశ్వాస పరీక్షకే పరిమతం చేస్తామన్నారు. తమ సంస్థ ఇకముందూ కొనసాగుతుందని యోగేంద్ర, భూషణ్‌లు స్థాపించిన స్వరాజ్ అభియాన్ తెలిపింది. దీనికి భూషణ్ నాయకత్వం వహిస్తారు.