Swaraj Abhiyan
-
పోలీసుల కస్టడీలో యోగేంద్ర యాదవ్
తిరువణ్ణామలై: సేలం–చెన్నై 8 వరుసల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్‌ను తమిళనాడు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగమ్ వద్దకు చేరుకున్న తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనీ, దాడికి పాల్పడ్డారని యోగేంద్ర ట్విట్టర్లో తెలిపారు. ‘ఆందోళనకారుల ఆహ్వానం మేరకు సంఘీభావం తెలిపేందుకు మేమిక్కడికి చేరుకున్నాం. కానీ రైతులను కలుసుకునేందుకు వెళ్లకుండా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. మాపై దాడిచేస్తూ వ్యాన్లలోకి తోశారు’ అని ట్వీట్ చేశారు. -
మోదీజీ.. నా నోరు మూయించలేరు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని స్వరాజ్ అభియాన్ అధ్యక్షుడు, జై కిసాన్ ఆందోళన్ వ్యవస్ధాపకుడు యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. రెవారిలో తన సోదరి ఆస్పత్రిపై ఐటీ దాడుల నేపథ్యంలో యోగేంద్ర యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సోదరి నిర్వహిస్తున్న నర్సింగ్ హోంపై ఢిల్లీ నుంచి వచ్చిన వంద మందికి పైగా అధికారుల బృందం దాడులకు పాల్పడిందని బుధవారం వరుస ట్వీట్లలో యాదవ్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పుడు తమ కుటుంబాన్ని టార్గెట్ చేసిందని, రెవారిలో మద్దతు ధర కోసం, రైతుల సమస్యలపై తన పాదయాత్ర ముగిసిన రెండు రోజుల అనంతరం తన చెల్లెళ్లు నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఐటీ దాడులు చేపట్టారని ఆరోపించారు. మోదీ తనపై, తన ఇంటిపై సోదాలు నిర్వహించవచ్చని తన కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆస్పత్రిపై ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందాలు వైద్యులైన తన చెల్లెళ్లు, బావ, మేనల్లుడి చాంబర్లను స్వాధీనం చేసుకుని ఆస్పత్రిని సీల్ చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీయూలో నవజాత శిశువులున్నా పట్టించుకోలేదని వాపోయారు. అణిచివేత వైఖరితో మోదీ తన నోరు మూయించలేరని మరో ట్వీట్లో యాదవ్ స్పష్టం చేశారు. -
రాజకీయ పార్టీగా ‘స్వరాజ్ అభియాన్’
న్యూఢిల్లీ: అక్టోబర్ 2లోగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత ఆప్ నేతలు, స్వరాజ్ అభియాన్ సంస్థ ప్రతినిధులు యోగేశ్ యాదవ్, ప్రశాంత్ భూషణ్ తెలిపారు. తమ పార్టీలో ఆప్ తరహాలో కేంద్రీకృత నాయకత్వ వ్యవస్థ ఉండదని, పూర్తి పారదర్శకతతో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీని ప్రారంభిస్తున్నామన్నారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై వీరు స్పష్టతనివ్వలేదు. -
‘ఉపాధి’పై జాప్యమొద్దు
నిధుల విడుదలపై కేంద్రానికి సుప్రీం మొట్టికాయ న్యూఢిల్లీ: కరువు రాష్ట్రాల్లో ఉపాధి హామీ నిధుల విడుదల జాప్యంపై సుప్రీంకోర్టు మరోసారి కేంద్రానికి మొట్టికాయలు వేసింది. ‘నిధులను ముందుగా విడుదల చేస్తే పనులకు అవాంతరం కలగదు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించరు. చెల్లింపుల్లో జాప్యమే అసలు సమస్య. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని మండిపడింది. రాష్ట్రాల్లో కరువును ప్రకటించడంలో కేంద్రం పాత్ర ఏంటని జస్టిస్ ఎంబీ లోకూర్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో తగినంత కరువు సహాయం ప్రకటించలేదన్న పిటిషన్‌ను బెంచ్ మళ్లీ విచారించింది. 10 కరువు రాష్ట్రాల్లోని వివరాలపై సమగ్రనివేదిక ఇవ్వాలని, ఎన్ని జిల్లాల్లో, ఎన్ని గ్రామాల్లో ఎంతమంది ప్రభావితమయ్యారో చెప్పాలని ఆదేశించింది. కరువు ప్రాంతాల ప్రకటనకు సంబంధించిన ప్రకటన వివరాలను, జాతీయ విపత్తు నిర్వహణ దళానికి, రాష్ట్ర విపత్తు స్పందన నిధికి జరిపిన బడ్జెట్ కేటాయింపుల వివరాలనూ సమర్పించాలంది. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) పీఎస్ నరసింహ వాదనలు వినిపిస్తూ.. కరువు ప్రకటనపై పూర్తి అధికారాలు రాష్ట్రానికే ఉంటాయని, కేంద్రం సలహాదారు పాత్రే పోషిస్తుందన్నారు. నిధుల కేటాయింపు, పర్యవేక్షణే కేంద్రానిదన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ, అయితే ఇందులో కేంద్రం ప్రమేయమేం లేదా, ఇది రాష్ట్రాలు, కోర్టుల మధ్యనే ఉంటుందా అని ప్రశ్నించారు. కరువు మార్గదర్శకాల అమలు పర్యవేక్షణకు స్వతంత్ర కమిషనర్‌ను నియమించాలనడాన్ని ఏఎస్జీ వ్యతిరేకించారు. అలాంటప్పుడు ప్రతీ చట్ట అమలుకు ఒక కమిషనర్‌ను నియమించాల్సి ఉంటుందని, అవసరమైతే దీనిపై కోర్టు ఉత్తర్వులు జారీచేయొచ్చన్నారు. దీనిపై బెంచ్ మండిపడుతూ.. ‘మేం ఏవైనా ఆదేశాలిస్తే పరిధిని అతిక్రమించారంటారు. మేము ఏదైనా చెబితే అది మీకు సమస్య. రాజ్యాంగం కల్పించిన ప్రతీ హక్కును పరిరక్షించడానికి మేమున్నామని భావిస్తారు. ఉపాధి హామీ నిధులను రేపు విడుదల చేయాలని ఆదేశిస్తే.. మీరు ఆ పని చేస్తారా..’ అని అడిగింది. పిటిషనర్ స్వరాజ్ అభియాన్ తరఫున వాదనలు వినిపించిన ప్రశాంత్ భూషణ్ కోర్టు కమిషనర్‌ను నియమించాలని కోరారు. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు. -
కోదండరాం నేతృత్వంలో జై కిసాన్ ర్యాలీకి..
న్యూఢిల్లీ: భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ తోపాటు మరో మూడు డిమాండ్లు ప్రధానంగా గూర్గావ్లో జరుగుతున్న జై కిసాన్ ట్రాక్టర్ ర్యాలీలో తెలంగాణ తరుపున పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ విద్యా వంతుల వేదిక తరుపునుంచి రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు రైతు స్వరాజ్య వేదిక, స్వరాజ్ అభియాన్, అఖిల భారత రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం నేతృత్వంలో 100 మంది నాయకులు, రైతులు ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆదివారం నాటి ర్యాలీలో పాల్గొన్న వీరంతా సోమవారం జంతర్ మంతర్ వద్ద జరిగే భారీ ప్రదర్శన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసేకరణ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తోపాటు, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఎకరానికి రూ.10 వేలను మూడు నెలల్లోపు నష్టపరిహారంగా చెల్లించాలని, భూమిలేని పేదలకు మూడు ఎకరాలు ఇవ్వాలని ఈ ప్రదర్శనలో డిమాండ్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురు కిసాన్ ర్యాలీలో పాల్గొంటున్నారు. -
పార్టీలకతీతంగా 'స్వరాజ్ అభియాన్'
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆమ్ఆద్మీపార్టీ బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ సొంత కుంపటిని ప్రారంభించారు. అయితే, అది పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని పేర్కొంటూ స్వరాజ్ అభియాన్ అని దానికి నామకరణం చేశారు. తమ సంస్థ దేశంలోని రైతులు, మహిళలు, సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుందని ప్రకటించారు. నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాల ద్వారా ప్రజల పక్షాన తమ పోరాటం ఉండనుందని తెలియజేశారు. అయితే, ఆప్ నుంచి బలవంతంగా బహిష్కరణకు గురైన ఈ నేతలు సొంతంగా పార్టీ పెడతారని భారీ ఊహగానాలు వచ్చిన విషయం తెలిసిందే. స్వరాజ్ అభియాన్ ప్రకటన సందర్భంగా మాట్లాడిన నేతలు భూషణ్, యోగేంద్ర.. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూనే తమకు మద్దతు ఇస్తామని 75శాతం కార్యకర్తలు మాట ఇచ్చారని, 25శాతం మంది మాత్రం సొంతంగా పార్టీ పెట్టేందుకు మద్దతిచ్చారని చెప్పారు. అయితే, స్వరాజ్ అభియాన్ తమ పార్టీకి సంబంధించినది కానందున బుధవారం చర్యలు తీసుకుంటామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు.