‘ఉపాధి’పై జాప్యమొద్దు
నిధుల విడుదలపై కేంద్రానికి సుప్రీం మొట్టికాయ
న్యూఢిల్లీ: కరువు రాష్ట్రాల్లో ఉపాధి హామీ నిధుల విడుదల జాప్యంపై సుప్రీంకోర్టు మరోసారి కేంద్రానికి మొట్టికాయలు వేసింది. ‘నిధులను ముందుగా విడుదల చేస్తే పనులకు అవాంతరం కలగదు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించరు. చెల్లింపుల్లో జాప్యమే అసలు సమస్య. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని మండిపడింది. రాష్ట్రాల్లో కరువును ప్రకటించడంలో కేంద్రం పాత్ర ఏంటని జస్టిస్ ఎంబీ లోకూర్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో తగినంత కరువు సహాయం ప్రకటించలేదన్న పిటిషన్‌ను బెంచ్ మళ్లీ విచారించింది. 10 కరువు రాష్ట్రాల్లోని వివరాలపై సమగ్రనివేదిక ఇవ్వాలని, ఎన్ని జిల్లాల్లో, ఎన్ని గ్రామాల్లో ఎంతమంది ప్రభావితమయ్యారో చెప్పాలని ఆదేశించింది.
కరువు ప్రాంతాల ప్రకటనకు సంబంధించిన ప్రకటన వివరాలను, జాతీయ విపత్తు నిర్వహణ దళానికి, రాష్ట్ర విపత్తు స్పందన నిధికి జరిపిన బడ్జెట్ కేటాయింపుల వివరాలనూ సమర్పించాలంది. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) పీఎస్ నరసింహ వాదనలు వినిపిస్తూ.. కరువు ప్రకటనపై పూర్తి అధికారాలు రాష్ట్రానికే ఉంటాయని, కేంద్రం సలహాదారు పాత్రే పోషిస్తుందన్నారు. నిధుల కేటాయింపు, పర్యవేక్షణే కేంద్రానిదన్నారు. జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ, అయితే ఇందులో కేంద్రం ప్రమేయమేం లేదా, ఇది రాష్ట్రాలు, కోర్టుల మధ్యనే ఉంటుందా అని ప్రశ్నించారు.
కరువు మార్గదర్శకాల అమలు పర్యవేక్షణకు స్వతంత్ర కమిషనర్‌ను నియమించాలనడాన్ని ఏఎస్‌జీ వ్యతిరేకించారు. అలాంటప్పుడు ప్రతీ చట్ట అమలుకు ఒక కమిషనర్‌ను నియమించాల్సి ఉంటుందని, అవసరమైతే దీనిపై కోర్టు ఉత్తర్వులు జారీచేయొచ్చన్నారు. దీనిపై బెంచ్ మండిపడుతూ.. ‘మేం ఏవైనా ఆదేశాలిస్తే పరిధిని అతిక్రమించారంటారు. మేము ఏదైనా చెబితే అది మీకు సమస్య. రాజ్యాంగం కల్పించిన ప్రతీ హక్కును పరిరక్షించడానికి మేమున్నామని భావిస్తారు. ఉపాధి హామీ నిధులను రేపు విడుదల చేయాలని ఆదేశిస్తే.. మీరు ఆ పని చేస్తారా..’ అని అడిగింది. పిటిషనర్ స్వరాజ్ అభియాన్ తరఫున వాదనలు వినిపించిన ప్రశాంత్ భూషణ్ కోర్టు కమిషనర్‌ను నియమించాలని కోరారు. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.