
సాక్షి, హైదరాబాద్ : దేశంలో అన్ని వ్యవస్థల విధ్వంసం జరుగుతోంది.. ఆ పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలని స్వరాజ్ అభియాన్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా శనివారం జరిగిన తెలంగాణ జనసమితి పార్టీ తొలి ప్లీనరీకి యోగేంద్ర యాదవ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కేశవరావు జాదవ్ గుర్తుకొస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గూర్చి ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడటానికి తనను హరియాణా నుంచి పిలిచారన్నారు. ఇది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఇదే నిజమైన జాతీయవాదమని.. కోదండరాం కంటే పెద్ద జాతీయవాది తనకు కపడలేదన్నారు యోగేంద్ర యాదవ్.
ప్రస్తుతం దేశ ప్రజలంతా నిరాశలో ఉన్నారని.. ప్రజాస్వామ్యంలో అంధకారం నెలకొందని యోగేంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ.. తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రతి ఒక్కరు తమ కల్చర్‌ను నిలబెట్టుకుంటూ.. బీజేపీ మోనో కల్చర్‌కు వ్యతిరేకంగా పోరాడలని పిలుపునిచ్చారు. అన్ని సిద్థాంతాల్లో ఉన్న మంచిని గ్రహించి ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే సిద్ధాంతాన్ని తయారు చేయాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర పొరాటంలో పాల్గొనని ఆర్‌ఎస్‌ఎస్ ఈ రోజు దేశభక్తి గల సంఘంగా మభ్యపెడుతోందని మండి పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment