‘గోరఖ్‌పూర్‌’ చెప్పే పాఠం | yogendra yadav Article on Gorakhpur Tragedy | Sakshi
Sakshi News home page

‘గోరఖ్‌పూర్‌’ చెప్పే పాఠం

Published Fri, Aug 18 2017 12:40 AM | Last Updated on Mon, Aug 27 2018 3:32 PM

‘గోరఖ్‌పూర్‌’ చెప్పే పాఠం - Sakshi

‘గోరఖ్‌పూర్‌’ చెప్పే పాఠం

విశ్లేషణ
దేశ రాజకీయాలకు అరోగ్యమే ప్రాతిపదిక కావాలని నా ఆకాంక్ష. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య శాఖల ముందు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాలని నా కామన. పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో ఆరోగ్య బడ్జెట్లపైనా, ఆరోగ్య విధానాలపైనా పెద్ద ఎత్తున చర్చలు సాగడం నా కోరిక! ఇవన్నీ జరిగి ఉంటే, గోరఖ్‌పూర్‌ విషాదాన్ని చూడాల్సి వచ్చేదే కాదు. అది జరిగినది ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌లో కాబట్టి, అంతా ఆయనపైనా, బీజేపీపైనా, యూపీ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. వారి నిర్లక్ష్యం క్షమార్హం కానిదేగానీ.. అలాంటి ప్రమాదాలు దేశంలోని ఏ ప్రభుత్వ అసుపత్రుల్లోనైనా జరిగే అవకాశం ఉందనేది నిజం.

ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ‘‘ఆవో బచ్చో తుమే దిఖా ఝాన్‌కి హిందుస్థాన్‌ కీ...’’ (రండి పిల్లలూ చూపిస్తా మీకు భారతదేశం అంటే ఏమిటో) అనే పాట రేడియోలో వినవచ్చింది. సరిగ్గా అదే సమయంలో నేను, కేవలం ఆక్సిజన్‌ లేక పోవడం వల్లనే హిందుస్థాన్‌ను కను విప్పి ఒక్కసారైనా చూడకుండానే ఈ ప్రపంచాన్ని వీడిన గోరఖ్‌పూర్‌ శిశువుల గురించి అదే పనిగా ఆలోచిస్తున్నాను. ‘‘యే ధర్తీ హై బలిదాన్‌ కీ!’’ (త్యాగ ధరిత్రి ఇది) అనేది ఆ పాటలోని మరో చరణం.

ఈ దేశ రాజకీయాలకు ఆరోగ్యమే ప్రాతిపదిక కావాలని నా ఆకాంక్ష. ప్రభుత్వ ఆసుపత్రుల ముందు, ఆరోగ్య శాఖల ముందు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాలని నా కామన. పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో ఆరోగ్య బడ్జెట్లపైనా, ఆరోగ్య విధానాలపైనా పెద్ద ఎత్తున చర్చలు సాగడం నా కోరిక! ఇవన్నీ జరిగి ఉంటే, నేడు మనం గోరఖ్‌పూర్‌ విషాదాన్ని చూడాల్సి వచ్చేదే కాదు. గోరఖ్‌పూర్‌ విషాదం గురించి చాలానే చెప్పారు. కానీ, మాట్లాడినంత ఎక్కువగా దాని గురించి బహుశా ఆలోచించి ఉండకపోవచ్చు.

ఆ విషాదం సంభవించి నది యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌లో. కాబట్టి, అంతా ఆయనపైనా, బీజేపీపైనా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. వారి నిర్లక్ష్యం క్షమార్హంకానిదేగానీ... అలాంటి ప్రమాదాలు దేశంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైనా జరిగే అవకాశం ఉందనేది నిజం. ఈ ప్రమాదం, మనం ఎదుర్కొంటున్న పెద్ద రుగ్మతకు సంబంధించిన చిన్న లక్షణం మాత్రమే. గోరఖ్‌పూర్‌ నుంచి మనమేవైనా గుణపాఠాలను నేర్చుకోవాలంటే, చర్చను ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వానికే పరిమితం చేయడానికి బదులు దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థ దుస్థితిని గురించి చర్చించడం అవసరం.

వైద్య అవసరాలు పెరిగి, ఖర్చులు కొండెక్కి..
ఆసుపత్రి బిల్లులు, డాక్టర్‌ బిల్లులు నేడు సాధారణ కుటుంబం మెడ మీద కత్తిలా కదలాడుతున్నాయి. చాలా కుటుంబాల విషయంలో కుటుంబ సభ్యులలో ఎవరి కైనా ఏదైనా పెద్ద జబ్బు చేస్తే, ఆ కుటుంబం వెన్ను విరి గిపోవడమే అవుతోంది. కుటుంబ సభ్యులలో ఒకరు ఎవరైనా పెద్ద వ్యా«ధులకు గురికావడం... పేదరిక రేఖకు ఎగువన జీవిస్తున్న కుటుంబాలు పేదరిక రేఖకు దిగువకు దిగజారిపోవడానికి ముఖ్య కారణమని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వారికి మంచి, చౌక చికిత్సను అందించడమూ లేదు, ప్రైవేటు వైద్యం చేయిం చుకునేవారికి సహాయం చేయడమూ లేదు. ఈ జీవన్మరణ పోరాటంలో పేద కుటుంబాలే కాదు, ఎంతో కొంత మెరుగ్గా ఉన్న కుటుంబాలు సైతం నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నాయి.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సగటు భారతీయుల ఆరోగ్యం మెరుగుపడింది. 1947లో 32 ఏళ్లుగా ఉండిన భారతీయుల సగటు జీవిత కాలం దాదాపు 68 ఏళ్లకు పెరిగింది. శిశు మరణాల సంఖ్య వెయ్యి జననాలకు 146 నుంచి 40కి తగ్గాయి. తల్లుల ప్రసవ కాల మరణాలు సైతం గణనీయంగా తగ్గాయి. ఆరోగ్య సదుపాయాలు సైతం చాలా మెరుగుపడ్డాయనడంలో సందేహం లేదు. డాక్టర్ల సంఖ్య, ఆసుపత్రుల సంఖ్య పది రెట్ల కంటే ఎక్కువే పెరిగింది. అయినా అది అవసరమైనదాని కంటే చాలా తక్కువే. అలాగే ఔషధాల ఉత్పత్తి సదుపాయాలు, వైద్య పరీక్షలు కూడా పెరిగాయి. ప్రభుత్వం తరచుగా తాము సాధించినవాటి గురించి చెప్పుకోవడానికి ఈ గణాంకాలనే ఉపయోగిస్తుంటుంది.

కానీ ఇది అర్ధ సత్యం మాత్రమే. సగటు జీవిత కాలం, వైద్య సదుపాయాల విస్తరణ జరిగినా ప్రజలు అనుభవిస్తున్న బాధలు మాత్రం తగ్గలేదు, సరికదా, వాస్తవానికి మరింత పెరిగాయనేది పూర్తి సత్యం. సగటు జీవిత కాలం పెరుగుదల, శిశు మరణాల సంఖ్య తగ్గుదల కారణంగా వైద్యసదుపాయాల అవసరం మునుపెన్నటికంటే ఎక్కువగా పెరి గింది. తిండి, బట్ట, నివాసం వంటి అవసరాలు సమకూరాక విద్య, ఆరోగ్యం జీవితానికి అత్యావశ్యకాలుగా మారాయి. ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండటం వ్యాధులకు చికిత్స చేయించుకోవాలనే కోరికను, తప్పనిసరితనాన్ని కూడా సృష్టిస్తోంది. అంటే, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వల్ల నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సదుపాయాల అవసరం తగ్గలేదు. నిజానికి ఆ అవసరం మరింత పెరిగింది.

ప్రభుత్వ శ్రద్ధ లేకనే ప్రైవేటు వైద్యం
ఆ అవసరాన్ని తీర్చాలంటే ప్రభుత్వం, ప్రభుత్వరంగ ఆరోగ్య సేవలను భారీ ఎత్తున విస్తరింపజేసి ఉండాల్సింది. కానీ అది జరగలేదు. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో కనీసం 3 శాతాన్ని వైద్య రంగంపై ఖర్చు చేయాలనే డిమాండు గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగంపై చేసే మొత్తం వ్యయం దాదాపుగా జీడీపీలో 1 శాతం వద్ద నిలిచిపోయింది. తాజా గణాంక సమాచారం ప్రకారం మనం ఆరోగ్య రంగంపై చేస్తున్న  వ్యయం జీడీపీలో 1.2 శాతం మాత్రమే. కాగా, ఇది చైనాలో 2.9 శాతం, బ్రెజిల్‌లో 4.1 శాతం, బ్రిటన్‌లో 7.8 శాతం, అమెరికాలాంటి పెట్టుబడిదారీ దేశంలో 8.5 శాతం. ఆరోగ్య రంగంపై చేయాల్సిన కనీసమైన ఖర్చులో కేవలం మూడోవంతు మాత్రమే మన ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నది కఠోర సత్యం.

ఆరోగ్యసేవల అవసరం పెరుగుదల, ప్రభుత్వం శ్రద్ధ కనబరచకపోవడం ఫలితమే ఆరోగ్యరంగ ప్రైవేటీకరణ. మహా నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు కొత్త ఆసుపత్రులు, వైద్యశాలలు భారీ ఎత్తున పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గ్రామీణ ప్రాంత రోగులలో 72 శాతం, నగర ప్రాంత రోగులలో 79 శాతం ప్రైవేటు డాక్టర్‌ వద్దకు వెళ్లాలని కోరుకుంటున్నారు. తీవ్ర వ్యాధుల విషయంలో గ్రామీణ ప్రాంత రైతులలో 58 శాతం, నగర ప్రాంతాల ప్రజలలో 68 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు ఆసుపత్రులనే ఎంచుకుంటున్నారు.

గత కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ మందగించిందిగానీ, ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నాయి. దీనికితోడు అక్కడి ఫీజులు అసమంజసమైనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఒక సగటు భారతీయ కుటుంబం ఆరోగ్య సదుపాయాల కోసం చేసే ఖర్చు, ఆదాయంలో 7 శాతం మాత్రమే. కొత్త పరీక్షలు, శస్త్రచికిత్సలు, ‘‘సదుపాయాలు’’ ప్రవేశిస్తున్నాయి. అవి తరుచుగా ఈ రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు పెరి గిపోవడానికి కారణం అవుతున్నాయి. ప్రభుత్వ లేదా సొంత ఖర్చుతో సమకూర్చుకునే ఆరోగ్య బీమా సదుపాయం ఉన్నది 18 శాతం ప్రజలకే. మిగతా వారందరివీ దైవాధీనం బతుకులే.

రాజకీయం చేస్తే తప్ప సమస్యలు పట్టవు
గోరఖ్‌పూర్‌ ప్రభుత్వరంగ సేవల దుస్థితికి చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ ఆరోగ్య సేవలను రాజకీయ సమస్యగా మారిస్తే తప్ప ఈ పరిస్థితి మెరుగుపడదు. ఈ సూచనను విని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ‘రాజకీయాలు’ ‘రాజకీయం’ అంటేనే అవి ప్రతి సమస్యకూ మూల కారణమే తప్ప, పరిష్కారాలు కావనిపించేం తగా మనం ఆ పదాలను ప్రతికూలాత్మకమైన అర్థాన్ని ఇచ్చేవిగా చేసేశాం. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక సమస్యను రాజకీయమైనదిగా చేసిన ప్రతిసారీ, ఎన్నికల్లో ఓడిపోతామని రాజకీయవేత్తలు భయపడతారు, ప్రభుత్వాలు ఆ సమస్య పట్ల శ్రద్ధ చూపడం తప్ప గత్యంతరం లేని స్థితి ఏర్పడుతుంది. అది సమస్యను పూర్తిగా పరి ష్కారం చేయదుగానీ, కొంత పురోగతిని సాధిస్తుంది.

ఆకలి, ద్రవ్యోల్బణం రాజకీయ సమస్యలుగా మారినప్పుడే దేశవ్యాప్తంగా రేషన్‌ దుకాణాలను ప్రవేశపెట్టారు. కొన్నేళ్ల క్రితం విద్యుత్‌ సరఫరాను, రోడ్ల పరిస్థితిని ఎన్నికల సమయంలో రాజకీయం చేశారు. ఫలి తంగా ఆ రెండు సమస్యల విషయంలోనూ గణనీయమైన మెరుగుదల కనిపించింది. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక రైతులు రాజకీయంగా గొంతెత్తడంతో, ఆ రాష్ట్రాల ప్రభుత్వ విధానాలలో పెద్ద మెరుగుదల సంభవించింది. కాబట్టి రాజకీయం చేయడాన్ని నివారించడం కాదు, అందుకు బదులు ప్రతి ప్రధాన సమస్యను రాజకీయాల పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది.

మహిళల పట్ల హింసకు, ప్రభుత్వ పాఠశాలలోని విద్య, ప్రభుత్వ ఆసుపత్రులలోని చికిత్స రాజకీయ సమస్యలుగా మారితే తప్ప... ప్రభుత్వం వాటిపట్ల మౌనంగానే ఉండిపోతుంది. పరిస్థితిలో ఏ మార్పూ ఉండదు, గోరఖ్‌పూర్‌ విషాదం పునరావృతం అవుతూనే ఉంటుంది.

యోగేంద్ర యాదవ్‌
వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు ‘ మొబైల్‌ : 98688 88986

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement