BRD hospital
-
గోరఖ్‌పూర్ విషాదం : ఏడుమందిపై చార్జిషీట్
సాక్షి, గోరఖ్‌పూర్ : గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఘటనలో చిన్నారుల మృతికి సంబంధించి 7 మందిపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఆగస్టు 10, 11 తేదీల్లో బీఆర్డీ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా భార్య డాక్టర్ పూర్ణిమా మిశ్రా (సీనియర్ హోమియో మెడికల్ ఆఫీసర్), డాక్టర్ సతీష్ (అనస్తీషియా స్పెషలిస్ట్), గజేంద్ర జైశ్వాల్ (చీఫ్ ఫర్మాసిస్ట్), సుధీర్ పాండే, సంజయ్ త్రిపాఠి, ఉదయ్ ప్రతాప్ (ఆసుపత్రి ఉద్యోగులు), మనీష్ భంగడారి (పుష్పా సేల్స్ ప్రొప్రయిటర్, ఆక్సిజన్ సరఫరదారు)లపై పోలీసలు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో డాక్టర్ పూర్ణిమా మిశ్రా, గజేంద్ర జైశ్వాల్, ఇతర ఉద్యోగులను ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి తొలింగించింది. డాక్డర్ పూర్ణియా, ఇతర ఉద్యోగలను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 25న అనుమలు జారీ చేసింది. మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్ర, డాక్టర్ ఖఫీల్ ఖాన్‌లను విచారణ అనుమతులు కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్వెస్టిగేటింగ్ అధికారులు తెలిపారు. -
పేదవాడి ఇంట చావు డప్పు
లక్నో : గోరఖ్‌పూర్ బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. ప్రైవేటు వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక ప్రభుత్వాసుపత్రికి వచ్చే నిరుపేద కుటుంబాలు కడుపు కోతతో తల్లడిల్లిపోతున్నాయి. ఆదివారం బీఆర్డీ ఆసుపత్రిలో 16 మంది చిన్నారులు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పది మంది పసిపిల్లలు ఉన్నారు. ఎన్సిఫలైటిస్ వ్యాధితో బాధపడుతున్న వీరందరూ ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించాయి. ఇదే వ్యాధితో ఆసుపత్రిలో ఇంకా 36 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. వీరిలో ఐదుగురు బిహార్ నుంచి వచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి నుంచి మొత్తం 1,470 మంది రోగులు బీఆర్డీ ఆసుపత్రిలో చేరగా.. 310 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది ఆగష్టులో ఆసుపత్రిలో అత్యధికంగా 63 మంది చిన్నారులు ఆక్సిజన్ కొరతతో చనిపోయారు. తాజా మరణాలు ఆక్సిజన్ కొరత వల్ల కాదని వైద్యులు తెలిపారు. క్రిటికల్ కండీషన్లో వారిని ఆసుపత్రి తీసుకురావడం వల్లే కాపాడలేకపోయామని చెప్పారు. -
గోరఖ్‌పూర్ విషాదం: కీలక నిందితుడి అరెస్ట్
సాక్షి, లక్నో: యూపీలోని గోరఖ్‌పూర్ బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాల ఉదంతం కేసులో నాలుగో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఆగస్టు నెలలో ఆక్సిజన్‌కొరత కారణంగా దాదాపు 70 మంది చిన్నారులు మృతిచెందగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో మరో కీలక నిందితుడు, బీఆర్డీ కాలేజీ సీఎంఎస్ ఆఫీస క్లర్క్ సుధీర్ పాండేను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు పోటీసులు శనివారం వెల్లడించారు. బీఆర్డీ కాలేజీకి చెందిన కొందరు వైద్యసిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా అందులో సుధీర్ పాండే నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా తప్పించుకు తిరుగుతున్న సుధీర్‌ను ఖాజంచి చౌక్‌లో గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అప్పటి ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా సహకారంతో ఆక్సిజన్‌కు సంబంధించిన నగదును కమిషన్ల కోసం వాడుకుని, సరఫరాదారులకు చెల్లించడంలో జాప్యం చేయడం వల్లేచిన్నారుల మరణాలు సంభవించాయని ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇదివరకే వైద్య విద్య అడిషనల్ చీఫ్ సెక్రటరీ అనితా భట్నాగర్ జైన్‌ను బదిలీ చేస్తూ యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన నిందితులైన రాజీవ్‌మిశ్రా, పూర్ణిమా మిశ్రా, మెదడువాపు వ్యాధి విభాగం నోడల్ అధికారి కఫీల్ ఖాన్ లను యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం వీరు జ్యూడీషయల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా సెప్టెంబర్ 1న కూడా ఈ ఆసుపత్రిలో 35మంది చిన్నారులు చనిపోయారు. -
ఆ ఆస్పత్రి మృత్యు కుహరం..
♦ 40 ఏళ్లలో 25వేల మంది చిన్నారుల మృతి ♦ నేటికి కొనసాగుతున్న వైనం ♦ పాలకులు మారినా మారని తీరు ♦ వైద్యుల నిర్లక్ష్యం తల్లిదండ్రులకు శాపం గోరఖ్‌పూర్ అంటే మృతి చెందుతున్న పసిబిడ్డలు గుర్తుకు వస్తారు. ఒకరు..ఇద్దరు.. వందలు కాదు.. వేల సంఖ్యలో ఇక్కడ చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకూ మృతుల సంఖ్య 1400 వరకూ ఉంది. అదే గత 40 ఏళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఎంతో తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఆగస్టు నెల్లో 60 మంది చిన్నారులు ఒక్కసారిగా మృతిచెందారు. ఈ ఘటనపై దేశమంతా స్పందించింది. జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అప్పటినుంచే బీఆర్డీ ఆసుపత్రి పేరు అందరి నోళ్లలో నానుతోంది. కానీ బీఆర్‌డీలో చిన్నారుల మృతి అనేది 40 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. సెప్టెంబర్ 1న కూడా..! పిల్లల మృతుల పరంపర బీఆర్‌డీలో నేటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా సెప్టెంబర్ 1న కూడా ఈ ఆసుపత్రిలో 35మంది చిన్నారులు చనిపోయారు. మొత్తం మృతులు బీఆర్డీ ఆసుపత్రిలో గడచిన 40 ఏళ్లలో 25 వేల మంది చిన్నారులు మృతి చెందారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చనిపోయిన వారిలో అత్యధికులు మెదడు వాపుకు గురైనవారే. చర్యలేవీ? మెదడువాపు వ్యాధితో చిన్నారులు ఆసుపత్రిలో చేరడం సర్వసాధారణం. ఏళ్లుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాధి ప్రబలకుండా ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రమే. అదే సమయంలో ఈ వ్యాధికి సంబంధించిన వైద్య సౌకర్యాలు కూడా ఇక్కడ పెద్దగా లేవు. తాజా పరిస్థితి ప్రస్తుతం బీఆర్డీ ఆసుపత్రిలో 344మంది చిన్నారులు మెదడు వాపు, న్యుమోనియా వంటి వ్యాధులతో చేరారు. వీరికి వీలైనంత మంచి వైద్యాన్ని అందిస్తున్నామని, గతంతో పోలిస్తే మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆసుపత్రి డైరెక్టర్ రాజేష్ మణి చెబుతున్నారు. ధనార్జనలో డాక్టర్లు గోరఖ్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి అధికంగా ఉండడంతో గతంలో ఇక్కడ 100 వైద్య కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే డాక్టర్లలో ధనార్జన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ వైద్యులు.. సర్కార్ దవాఖానాల్లో కాకుండా సొంత క్లినిక్‌లలో అధికంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ వైద్య కేంద్రాలకు పంపే మందులు, ఇతర సామగ్రిని ఆ వైద్యులు తమ సొంత క్లినిక్స్‌కు తరలించడం ప్రధాన సమస్య. -
గోరఖ్‌పూర్: బీఆర్డీ ఆసుపత్రిలో ఆగస్టు మృతులు 290
గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో ఆగని మృత్యుహేల వందల్లో చనిపోతున్న చిన్నారులు ఈ ఏడాది ఇప్పటి వరకూ చినిపోయిన చిన్నారుల సంఖ్య 1250 గోరఖ్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బాబా రాఘవ్ దాస్ ఆసుపత్రిలో చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రిలో వైద్యం సరిగ్గా అందక కొందరు, మౌలిక వసతులు లేక చనిపోతున్నారు. కేవలం ఈ ఆగస్టు నెల్లో ఇప్పటివరకూ 290 మంది చిన్నారులు మృతి చెందారు. ఇదే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ మృతుల సంఖ్య 1250. ఇదే విషయాన్ని డీఆర్డీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పీకే సింగ్ ధృవీకరించారు. మొదడు వాపు, ఇతర వ్యాధుల కారణంగా చిన్నారులు అధికంగా చనిపోతున్నారని ఆయన చెప్పారు. చిన్నారుల మృతికి సంబంధించి ప్రిన్సిపాల్ పీకే సింగ్ తొలిసారి నోరు విప్పారు. ఆగస్టు 27, 28 తేదీల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో 37 మంది చిన్నారులు చనిపోయారని చెప్పారు. భారీగా మృతులు ఈ ఏడాది జనవరి నుంచి బీఆర్డీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారులు మృత్యుహేళ కొనసాగుతోంది. జనవరిల నెల్లో 152 మంది, ఫిబ్రవరిలో 122, మార్చిలో 159, ఏప్రిల్‌లో 123, మేలో 139, జూన్‌లో 137, జూలైలో 128 మంది చిన్నారులు చనిపోయినట్లు ప్రిన్సిపాల్ సింగ్ తెలిపారు. చాలా కారణాలు బీఆర్డీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలకు చాలా కారణాలున్నాయని ప్రిన్సిపాల్ సింగ్ అన్నారు. ప్రధానంగా ఇక్కడకు చికిత్స వచ్చే చిన్నారుల్లో అత్యధికులు జాండీస్ (పచ్చకామెర్లు), న్యుమోనియా, అంటువ్యాధులు, ఇన్ ఫెక్షన్స్‌తో బాధపడేవారని చెప్పారు. అంతేకాక ప్రీ మెచ్యూర్డ్ బేబీలు చాలా మందే ఉంటారని.. మృతుల్లో వీరి శాతం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చికిత్సకు వచ్చే వారిలో చాలా మందిని ప్రాణాపాయం నుంచి రక్షించామని ఆయన నొక్కి చెప్పారు. -
‘గోరఖ్‌పూర్’ చెప్పే పాఠం
విశ్లేషణ దేశ రాజకీయాలకు అరోగ్యమే ప్రాతిపదిక కావాలని నా ఆకాంక్ష. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య శాఖల ముందు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాలని నా కామన. పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో ఆరోగ్య బడ్జెట్లపైనా, ఆరోగ్య విధానాలపైనా పెద్ద ఎత్తున చర్చలు సాగడం నా కోరిక! ఇవన్నీ జరిగి ఉంటే, గోరఖ్‌పూర్ విషాదాన్ని చూడాల్సి వచ్చేదే కాదు. అది జరిగినది ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో కాబట్టి, అంతా ఆయనపైనా, బీజేపీపైనా, యూపీ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. వారి నిర్లక్ష్యం క్షమార్హం కానిదేగానీ.. అలాంటి ప్రమాదాలు దేశంలోని ఏ ప్రభుత్వ అసుపత్రుల్లోనైనా జరిగే అవకాశం ఉందనేది నిజం. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ‘‘ఆవో బచ్చో తుమే దిఖా ఝాన్కి హిందుస్థాన్ కీ...’’ (రండి పిల్లలూ చూపిస్తా మీకు భారతదేశం అంటే ఏమిటో) అనే పాట రేడియోలో వినవచ్చింది. సరిగ్గా అదే సమయంలో నేను, కేవలం ఆక్సిజన్ లేక పోవడం వల్లనే హిందుస్థాన్‌ను కను విప్పి ఒక్కసారైనా చూడకుండానే ఈ ప్రపంచాన్ని వీడిన గోరఖ్‌పూర్ శిశువుల గురించి అదే పనిగా ఆలోచిస్తున్నాను. ‘‘యే ధర్తీ హై బలిదాన్ కీ!’’ (త్యాగ ధరిత్రి ఇది) అనేది ఆ పాటలోని మరో చరణం. ఈ దేశ రాజకీయాలకు ఆరోగ్యమే ప్రాతిపదిక కావాలని నా ఆకాంక్ష. ప్రభుత్వ ఆసుపత్రుల ముందు, ఆరోగ్య శాఖల ముందు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాలని నా కామన. పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో ఆరోగ్య బడ్జెట్లపైనా, ఆరోగ్య విధానాలపైనా పెద్ద ఎత్తున చర్చలు సాగడం నా కోరిక! ఇవన్నీ జరిగి ఉంటే, నేడు మనం గోరఖ్‌పూర్ విషాదాన్ని చూడాల్సి వచ్చేదే కాదు. గోరఖ్‌పూర్ విషాదం గురించి చాలానే చెప్పారు. కానీ, మాట్లాడినంత ఎక్కువగా దాని గురించి బహుశా ఆలోచించి ఉండకపోవచ్చు. ఆ విషాదం సంభవించి నది యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో. కాబట్టి, అంతా ఆయనపైనా, బీజేపీపైనా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. వారి నిర్లక్ష్యం క్షమార్హంకానిదేగానీ... అలాంటి ప్రమాదాలు దేశంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైనా జరిగే అవకాశం ఉందనేది నిజం. ఈ ప్రమాదం, మనం ఎదుర్కొంటున్న పెద్ద రుగ్మతకు సంబంధించిన చిన్న లక్షణం మాత్రమే. గోరఖ్‌పూర్ నుంచి మనమేవైనా గుణపాఠాలను నేర్చుకోవాలంటే, చర్చను ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వానికే పరిమితం చేయడానికి బదులు దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థ దుస్థితిని గురించి చర్చించడం అవసరం. వైద్య అవసరాలు పెరిగి, ఖర్చులు కొండెక్కి.. ఆసుపత్రి బిల్లులు, డాక్టర్ బిల్లులు నేడు సాధారణ కుటుంబం మెడ మీద కత్తిలా కదలాడుతున్నాయి. చాలా కుటుంబాల విషయంలో కుటుంబ సభ్యులలో ఎవరి కైనా ఏదైనా పెద్ద జబ్బు చేస్తే, ఆ కుటుంబం వెన్ను విరి గిపోవడమే అవుతోంది. కుటుంబ సభ్యులలో ఒకరు ఎవరైనా పెద్ద వ్యా«ధులకు గురికావడం... పేదరిక రేఖకు ఎగువన జీవిస్తున్న కుటుంబాలు పేదరిక రేఖకు దిగువకు దిగజారిపోవడానికి ముఖ్య కారణమని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వారికి మంచి, చౌక చికిత్సను అందించడమూ లేదు, ప్రైవేటు వైద్యం చేయిం చుకునేవారికి సహాయం చేయడమూ లేదు. ఈ జీవన్మరణ పోరాటంలో పేద కుటుంబాలే కాదు, ఎంతో కొంత మెరుగ్గా ఉన్న కుటుంబాలు సైతం నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సగటు భారతీయుల ఆరోగ్యం మెరుగుపడింది. 1947లో 32 ఏళ్లుగా ఉండిన భారతీయుల సగటు జీవిత కాలం దాదాపు 68 ఏళ్లకు పెరిగింది. శిశు మరణాల సంఖ్య వెయ్యి జననాలకు 146 నుంచి 40కి తగ్గాయి. తల్లుల ప్రసవ కాల మరణాలు సైతం గణనీయంగా తగ్గాయి. ఆరోగ్య సదుపాయాలు సైతం చాలా మెరుగుపడ్డాయనడంలో సందేహం లేదు. డాక్టర్ల సంఖ్య, ఆసుపత్రుల సంఖ్య పది రెట్ల కంటే ఎక్కువే పెరిగింది. అయినా అది అవసరమైనదాని కంటే చాలా తక్కువే. అలాగే ఔషధాల ఉత్పత్తి సదుపాయాలు, వైద్య పరీక్షలు కూడా పెరిగాయి. ప్రభుత్వం తరచుగా తాము సాధించినవాటి గురించి చెప్పుకోవడానికి ఈ గణాంకాలనే ఉపయోగిస్తుంటుంది. కానీ ఇది అర్ధ సత్యం మాత్రమే. సగటు జీవిత కాలం, వైద్య సదుపాయాల విస్తరణ జరిగినా ప్రజలు అనుభవిస్తున్న బాధలు మాత్రం తగ్గలేదు, సరికదా, వాస్తవానికి మరింత పెరిగాయనేది పూర్తి సత్యం. సగటు జీవిత కాలం పెరుగుదల, శిశు మరణాల సంఖ్య తగ్గుదల కారణంగా వైద్యసదుపాయాల అవసరం మునుపెన్నటికంటే ఎక్కువగా పెరి గింది. తిండి, బట్ట, నివాసం వంటి అవసరాలు సమకూరాక విద్య, ఆరోగ్యం జీవితానికి అత్యావశ్యకాలుగా మారాయి. ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండటం వ్యాధులకు చికిత్స చేయించుకోవాలనే కోరికను, తప్పనిసరితనాన్ని కూడా సృష్టిస్తోంది. అంటే, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వల్ల నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సదుపాయాల అవసరం తగ్గలేదు. నిజానికి ఆ అవసరం మరింత పెరిగింది. ప్రభుత్వ శ్రద్ధ లేకనే ప్రైవేటు వైద్యం ఆ అవసరాన్ని తీర్చాలంటే ప్రభుత్వం, ప్రభుత్వరంగ ఆరోగ్య సేవలను భారీ ఎత్తున విస్తరింపజేసి ఉండాల్సింది. కానీ అది జరగలేదు. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో కనీసం 3 శాతాన్ని వైద్య రంగంపై ఖర్చు చేయాలనే డిమాండు గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగంపై చేసే మొత్తం వ్యయం దాదాపుగా జీడీపీలో 1 శాతం వద్ద నిలిచిపోయింది. తాజా గణాంక సమాచారం ప్రకారం మనం ఆరోగ్య రంగంపై చేస్తున్న వ్యయం జీడీపీలో 1.2 శాతం మాత్రమే. కాగా, ఇది చైనాలో 2.9 శాతం, బ్రెజిల్లో 4.1 శాతం, బ్రిటన్‌లో 7.8 శాతం, అమెరికాలాంటి పెట్టుబడిదారీ దేశంలో 8.5 శాతం. ఆరోగ్య రంగంపై చేయాల్సిన కనీసమైన ఖర్చులో కేవలం మూడోవంతు మాత్రమే మన ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నది కఠోర సత్యం. ఆరోగ్యసేవల అవసరం పెరుగుదల, ప్రభుత్వం శ్రద్ధ కనబరచకపోవడం ఫలితమే ఆరోగ్యరంగ ప్రైవేటీకరణ. మహా నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు కొత్త ఆసుపత్రులు, వైద్యశాలలు భారీ ఎత్తున పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గ్రామీణ ప్రాంత రోగులలో 72 శాతం, నగర ప్రాంత రోగులలో 79 శాతం ప్రైవేటు డాక్టర్ వద్దకు వెళ్లాలని కోరుకుంటున్నారు. తీవ్ర వ్యాధుల విషయంలో గ్రామీణ ప్రాంత రైతులలో 58 శాతం, నగర ప్రాంతాల ప్రజలలో 68 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు ఆసుపత్రులనే ఎంచుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ మందగించిందిగానీ, ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నాయి. దీనికితోడు అక్కడి ఫీజులు అసమంజసమైనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఒక సగటు భారతీయ కుటుంబం ఆరోగ్య సదుపాయాల కోసం చేసే ఖర్చు, ఆదాయంలో 7 శాతం మాత్రమే. కొత్త పరీక్షలు, శస్త్రచికిత్సలు, ‘‘సదుపాయాలు’’ ప్రవేశిస్తున్నాయి. అవి తరుచుగా ఈ రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు పెరి గిపోవడానికి కారణం అవుతున్నాయి. ప్రభుత్వ లేదా సొంత ఖర్చుతో సమకూర్చుకునే ఆరోగ్య బీమా సదుపాయం ఉన్నది 18 శాతం ప్రజలకే. మిగతా వారందరివీ దైవాధీనం బతుకులే. రాజకీయం చేస్తే తప్ప సమస్యలు పట్టవు గోరఖ్‌పూర్ ప్రభుత్వరంగ సేవల దుస్థితికి చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ ఆరోగ్య సేవలను రాజకీయ సమస్యగా మారిస్తే తప్ప ఈ పరిస్థితి మెరుగుపడదు. ఈ సూచనను విని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ‘రాజకీయాలు’ ‘రాజకీయం’ అంటేనే అవి ప్రతి సమస్యకూ మూల కారణమే తప్ప, పరిష్కారాలు కావనిపించేం తగా మనం ఆ పదాలను ప్రతికూలాత్మకమైన అర్థాన్ని ఇచ్చేవిగా చేసేశాం. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక సమస్యను రాజకీయమైనదిగా చేసిన ప్రతిసారీ, ఎన్నికల్లో ఓడిపోతామని రాజకీయవేత్తలు భయపడతారు, ప్రభుత్వాలు ఆ సమస్య పట్ల శ్రద్ధ చూపడం తప్ప గత్యంతరం లేని స్థితి ఏర్పడుతుంది. అది సమస్యను పూర్తిగా పరి ష్కారం చేయదుగానీ, కొంత పురోగతిని సాధిస్తుంది. ఆకలి, ద్రవ్యోల్బణం రాజకీయ సమస్యలుగా మారినప్పుడే దేశవ్యాప్తంగా రేషన్ దుకాణాలను ప్రవేశపెట్టారు. కొన్నేళ్ల క్రితం విద్యుత్ సరఫరాను, రోడ్ల పరిస్థితిని ఎన్నికల సమయంలో రాజకీయం చేశారు. ఫలి తంగా ఆ రెండు సమస్యల విషయంలోనూ గణనీయమైన మెరుగుదల కనిపించింది. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక రైతులు రాజకీయంగా గొంతెత్తడంతో, ఆ రాష్ట్రాల ప్రభుత్వ విధానాలలో పెద్ద మెరుగుదల సంభవించింది. కాబట్టి రాజకీయం చేయడాన్ని నివారించడం కాదు, అందుకు బదులు ప్రతి ప్రధాన సమస్యను రాజకీయాల పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. మహిళల పట్ల హింసకు, ప్రభుత్వ పాఠశాలలోని విద్య, ప్రభుత్వ ఆసుపత్రులలోని చికిత్స రాజకీయ సమస్యలుగా మారితే తప్ప... ప్రభుత్వం వాటిపట్ల మౌనంగానే ఉండిపోతుంది. పరిస్థితిలో ఏ మార్పూ ఉండదు, గోరఖ్‌పూర్ విషాదం పునరావృతం అవుతూనే ఉంటుంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు ‘ మొబైల్ : 98688 88986 -
గోరఖ్‌పూర్ గుణపాఠం
సందర్భం గోమాతల సంరక్షణ పేరుతో 40 కోట్ల నిధులు విడుదల చేసిన యూపీ ప్రభుత్వం, పసిపిల్లల ప్రాణాలు లెక్కలోకి తీసుకోలేదు. ఆ నిర్లక్ష్యం ఫలితమే.. 130 మంది పసిపిల్లల బలి. తెలుగు రాష్ట్రాలకూ ఇది హెచ్చరికే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సొంత నియో జకవర్గం గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రి బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజీలో దేశ చరిత్ర లోనే కనీవినీ ఎరుగని ఘోరం జరిగింది. కేవలం ఏడు రోజుల్లో 72 మంది పసిమొగ్గల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కార ణం కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసిపిల్లలకు ప్రాణ వాయువు అందజేయలేకపోవడం, తీవ్రమైన మెదడువాపు వ్యాధితో బాధపడుతున్న 156 మంది పిల్లలకు ఆక్సిజన్ అత్యవసరం కానీ, సరఫరాదారుకు 75 లక్షల రూపాయలు ఆదిత్యనాథ్ సర్కారు బాకీ పడింది. దాంతో ఆ సరఫరా దారు నా డబ్బు చెల్లించనిదే ఆక్సిజన్ సరఫరా చేయలేనని మొత్తుకున్నారు. ఆసుపత్రికి ఆక్సిజన్ అత్యవసరమని వైద్యులు అరచి గీ పెట్టినా ప్రభుత్వం బకాయి చెల్లించడంలో విఫలమైంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. గోమాతల సంరక్షణ అని రూ. 40 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, పసిపిల్లల ప్రాణాలు లెక్కలోకి తీసుకోలేదు. నిర్లక్ష్యం వహించింది. ఏకంగా ఒకేరోజు 38 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతే మరుసటి రోజు మరో 30 మంది కేవలం ఆక్సిజన్ అందక ఆయువులు కోల్పోయారు. ఈ ఘటన జరిగినందుకు కాక దేశవ్యాప్తంగా ఈ ఘటనపై విమర్శలు రావడంతో బిత్తరపోయిన ఆదిత్య నాథ్ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలు పోలేదు. ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేని కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే మిశ్రాను విధుల నుంచి తప్పించి, తప్పు కప్పిపుచ్చు కోవాలని చూసింది. ప్రభుత్వం వైద్యుణ్ని విధుల నుంచి తప్పించిందే కానీ, మరణ మృదంగాన్ని ఆపలేకపోయింది. తన సొంత డబ్బులతో, పరపతితో కొంతమంది పిల్లలకు ఆక్సిజన్ అందించి ప్రాణాలు ప్రసాదించిన వైద్యుడు ఖఫీల్ ఖాన్‌ను నోడల్ అధికారిగా తొలగించి, తన బుర్ర పని చేయనిత నాన్ని చాటి చెప్పుకుంది ప్రభుత్వం. పుండు ఒకరికి ఉంటే, మందు మరొకరికి పెట్టినట్టు వ్యవహరించేసరికి సమస్య జటిలమై మరిన్ని విమర్శలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ రాష్ట్రంలో వివిధ రోగాల బారిన పడుతున్న చిన్నారుల్లో 47 శాతం మెదడువాపుతో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి కారణం పందిని కుట్టిన దోమ పిల్లలకి కుట్టడం. అంటే పందులు, దోమల స్వైర విహారం ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలు ఉంటే, స్వచ్ఛ భారత్ యూపీలో లేదా? నిఖార్సయిన సంఘ్‌పరివార్ వాది సీఎంగా ఉండి స్వచ్ఛ భారత్‌ను ఎందుకు అమలుపర్చడం లేదు? ఎంతసేపూ గోశాలల చుట్టే ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం తిరిగితే మనుషులను ఎవరు పట్టించుకోవాలి? తమ రాష్ట్రంలో వైద్యం అందించలేనప్పుడు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకి పిల్లల్ని తరలించి ప్రాణాలు ఎందుకు కాపాడటం లేదు? అలాగే మెదడు వాపు వ్యాధి తీవ్రంగా ఉన్న ఈ రాష్ట్రంలో, వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజల నుంచి మీడియా నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం తలకాయ లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నది? ఘోరం జరిగిపోయాక, సుల్తాన్‌పూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల విభాగం ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద రూ.5 కోట్లు కేటాయిస్తానని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హామీ ఇచ్చారు. కాగా, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారుల మరణాలకు అధికారుల లంచగొండితనమే కారణమన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కోసం ప్రభుత్వం రూ.68 లక్షలు విడుదల చేసినా..ఈ నెల 11 నాటికి అధికారులు కేవలం రూ.11 లక్షలే ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రిలో 60 మందికి పైగా చిన్నారులు మరణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ చీఫ్ అమిత్ షా తోసిపుచ్చారు. అదొక ప్రమాదమనీ, ఇంత పెద్ద దేశంలో అలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయనీ, ఈ తరహా ఘటన జరగడం ఇది మొదటిసారి కాదని షా వ్యాఖ్యానించారు. ఇంతటి విషాదం జరిగినా సీఎం కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా జరపాలంటూ ఆదేశాలివ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న ఈ ఘటన ప్రభుత్వం మెడకు చుట్టుకున్న పాములాంటిది అని ఒక్క ఉత్తరప్రదేశ్ సర్కార్ అనుకుంటే చాలదు. మన ప్రభుత్వాలూ ఆలో చించాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల్ని ఎలుకలకూ, చీమ లకూ, పందులకూ బలిపెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు సర్కారుకూ ఉంది. ఇటు నిలోఫర్ తదితర ఆసుపత్రుల్లో హైదరాబాద్‌లో సైతం ఎంతోమంది పిల్లలు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం పిల్లల్ని కబళించే అనేక వ్యాధులు కరాళనృత్యం చేస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, యంత్రాంగం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటే, గోరఖ్‌పూర్ ఘోరం మన దగ్గరా జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేగానీ, పిల్లలే కదా అని గాలికి వదిలేస్తే యూపీ ప్రభుత్వంలా మనం కూడా ప్రపంచం ముందు దోషులుగా నిలబడే ప్రమాదం ముంచుకురా వచ్చు. తస్మాత్ జాగ్రత్త. అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం ‘ మొబైల్ : 93910 24242 -
ఆస్పత్రి మృత్యుగీతం
అసమర్ధత, అవినీతి, నిర్లక్ష్యం అన్నీ జతగూడి కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చాయి. యూపీలోని గోరఖ్‌పూర్ బాబా రాఘవ్‌దాస్ వైద్య కళాశాల(బీఆర్డీ) ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా సాగుతున్న నరమేథం సామాన్యమైనది కాదు. ఈ నెల 1 మొదలుకొని 12 వరకూ అక్కడ 134 మంది పసిపిల్లలు మృత్యువాత పడ్డారని ఆ ఆస్పత్రిని సందర్శించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికనిచ్చిన వైద్య నిపుణుల బృందం చెబుతోంది. ఇందులో 70 మంది కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధిలో చని పోయారు. కేవలం 48 గంటల్లో 30 మంది కన్నుమూశారు. ప్రాణాలు కోల్పోయిన పిల్లల్లో పది రోజుల వయస్సున్న ఇద్దరు కవలలు మొదలుకొని పది పన్నెండేళ్ల వయసు చిన్నారుల వరకూ ఉన్నారు. వీరిలో అత్యధికులు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందినవారు. కొందరు బడుగు రైతుల పిల్లలు. మరికొందరు చిరు ఉద్యోగస్తుల పిల్లలు. తీవ్రంగా జబ్బుపడ్డ తమ పిల్లల ప్రాణాలు కాపాడుకుందా మని వారిని ఆత్రంగా భుజాలకెత్తుకుని సర్కారీ ఆస్పత్రికొస్తే అది కాస్తా వారిని మింగేసింది. జరిగిన నరమేథానికి కారణం ఆక్సిజెన్ సిలెండర్లు లేకపోవడమా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెబుతున్నట్టు మెదడువాపు వ్యాధి తీవ్రత వల్లనా లేక మరో రకమైన అంటువ్యాధుల వల్లనా అన్నది చర్చనీయాంశం కాదు. అది కేవలం సమస్య తీవ్రత నుంచి జనం దృష్టి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వృధా తర్కం. అధికారంలోకొచ్చిన వెంటనే చాలామంది పాలకులు చేసే పని పోలీసు శాఖలో చురుకుదనం తీసుకురావడం. వారు వీధుల్లో తరచు కనిపించి ఆడపిల్లల్ని వేధించే ఆకతాయిలను అరెస్టు చేయడం, ట్రాఫిక్ నిబంధనల్ని సరిగా పాటించనివారి వాహ నాలు స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తే ప్రభుత్వం పనిచేస్తున్నదన్న భ్రమ కల్పించవచ్చునని పాలకులు భావిస్తారు. యోగి ఆదిత్యనాథ్ చేసింది కూడా అదే. ప్రత్యేక పోలీసు బృందాల గస్తీని పెంచి ఆకతాయిలను పట్టుకుని చితకబాదడం, ఆడ మగా కలిసి వెళ్తుంటే వారిని పట్టుకుని గుంజీలు తీయించడం లాంటివి నిర్వ హించి అల్ప సంతోషులతో సెబాసనిపించుకున్నారు. ఒక పసివాణ్ణి కోల్పోయిన తండ్రి ‘మరణించింది పిల్లలు గనుక మా నోరు నొక్కాలని చూస్తున్నారు. ఇదే ఆవు చనిపోయి ఉంటే ఈపాటికి పట్టణం ఎంత అల్లకల్లోలంగా మారేది!’ అని వాపో యాడు. ఆ తండ్రి మాట అక్షరాలా నిజం. బీఆర్డీ సాధారణమైన ఆస్పత్రి కాదు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల ఆస్పత్రులు సైతం తీవ్రత గల కేసుల్ని పంపించే రెఫరల్ ఆస్పత్రి. అలాంటిచోట ఆక్సిజెన్ సిలెండర్ల వరకూ ఎందుకు... కాటన్ లేదు, గ్లూకోజ్ లేదు, మందుల్లేవు. చేర్పించింది మొదలు ఆ పిల్లల తల్లిదండ్రులు వీటన్నిటి కోసం మెడికల్ షాపులకు ఉరుకులెత్తడమే సరిపోయింది. ఇవన్నీ ఉన్న వారు రక్తం కోసం వెదుకులాడారు. అంతా అయిందనుకున్నాక వైద్యుల జాడ కోసం వివిధ వార్డుల్ని గాలించవలసివచ్చింది. విషాదమేమంటే పిల్లలు ప్రాణంతో ఉన్నంతవరకూ పడిన ఈ ఆత్రుత వారు మరణించాక కూడా కొనసాగింది. ముందు డెత్ సర్టిఫికెట్ కోసం... ఆ తర్వాత పోస్టుమార్టం కోసం...అటుపై మృత దేహాలను తెచ్చుకోవడం కోసం వారంతా యాతనలు పడ్డారు. ఆక్సిజెన్ లేదు మొర్రో అని ఆర్తనాదాలు చేస్తున్న పిల్లల బంధువుల్ని తరిమికొట్టడానికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు దిగాయి. గోరఖ్‌పూర్ జిల్లాలో మెదడువాపు వ్యాధి తీవ్రత నాలుగు దశాబ్దాల నుంచి ఉన్నదని యోగి చెబుతున్న మాటలో నిజముంది. కానీ అదే నియోజకవర్గానికి 1998 నుంచి వరసగా ప్రాతినిధ్యం వహించిన తన నిర్లక్ష్యం పాలు అందులో ఎంతన్నది ఆయన గుర్తించలేదు. కనీసం మొన్నటివరకూ ఉన్న అఖిలేశ్ ప్రభుత్వం మెడలు వంచి సరైన వైద్య సదుపాయాలు కల్పించడానికి ఆయన చేసిన ప్రయత్నమేమిటి? అధికారంలోకి వచ్చాక మాత్రం చేసిందేమిటి? మార్చి 22న తొలిసారి ఆ కళాశాల ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా ఆక్సిజెన్ సిలెండర్ల సరఫరా దారుకు చెల్లించాల్సిన రూ. 68 లక్షల బకాయి గురించి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ బకాయి తీర్చకపోతే సిలెండర్ల సరఫరా సాధ్యం కాదంటున్నాడని చెప్పారు. ఆ తర్వాత నెలకు రెండు, మూడు ఉత్తరాల చొప్పున రాస్తూనే ఉన్నారు. ఇది అయ్యే పని కాదని ఆ సరఫరాదారే స్వయంగా ఆరోగ్యమంత్రిని కలిసి చెప్పాడు. ఎన్ని చేసినా నిరుపయోగమైంది. చివరకు 23మంది పిల్లలు మరణించిన పదో తేదీన స్వయంగా యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకున్నా బకాయి తీర్చడానికి మరో 24 గంటలు పట్టింది. కారణం నిధుల కొరత కాదు. వైద్య కళాశాల ఖాతాలో రూ. 3.86 కోట్లున్నాయి. కేవలం చేతులు తడపలేదన్న ఏకైక కారణంతోనే బకాయిల విడు దలలో జాప్యం చేశారని రికార్డులు చూస్తే అర్ధమవుతుంది. ఆన్లైన్లో కేవలం అయిదు నిమిషాల్లో పూర్తి కావలసిన నిధుల బదలాయింపు అయిదు నెలలు పట్టిం దంటే లోపం ఎక్కడుందో యోగి ఆదిత్యనాథ్‌కు అర్ధమై ఉండాలి. కానీ ఆయన సర్కారు కళాశాల ప్రిన్సిపాల్‌ను తొలగించింది. సిలెండర్ల కోసం రాత్రింబవళ్లు తాపత్రయపడి కొందరు పిల్లల్ని రక్షించిన వైద్యుడు ఖఫీల్‌ఖాన్‌ను సస్పెండ్ చేసింది. నిజానికి సమస్య యూపీకి లేదా గోరఖ్పూర్కూ పరిమితమైనది కాదు. దేశంలో ఇంచుమించు ప్రతిచోటా ప్రభుత్వాసుపత్రులు ఇలాగే అఘోరిస్తున్నాయి. ఆలనా పాలనా కరువై అవి మంచం పట్టాయి. రెండేళ్లక్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఐసీయూలో ఎలుకలు కొరకడంతో ఒక బాలుడు మరణిస్తే ఆ తర్వాత చీమలు కుట్టి మరో నవజాత శిశువు కన్నుమూసింది. ఆరోగ్య రంగాన్ని మన దేశం దారు ణంగా నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఆమధ్య హెచ్చరించింది. స్థూల దేశీయోత్పత్తిలో ప్రజారోగ్యానికి వెచ్చిస్తున్నది కేవలం 1.6 శాతం మాత్రమే. దీనికితోడు సిబ్బంది కొరత, తాత్కాలిక నియామకాలు, పర్యవేక్షణా లోపం, జవాబుదారీతనం లోపించడం సర్కారీ ఆస్పత్రులకు శాపంగా మారాయి. ఇవన్నీ సరిచేయకుండా చవకబారు చిట్కాలతో కాలక్షేపం చేస్తే గోరఖ్‌పూర్‌లు పున రావృతమవుతూనే ఉంటాయి. -
ఆ 'హీరో' డాక్టర్‌పై వేటుపడింది!
గోరఖ్‌పూర్: చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు సొంత డబ్బుతో ఆక్సీజన్ సిలిండర్లు కొనుగోలు చేసినట్టు సోషల్ మీడియాలో హీరోగా ప్రచారం పొందిన డాక్టర్‌పై అనుహ్యంగా వేటు పడింది. బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) మెడికల్ కాలేజీలో మెదడువ్యాపు వ్యాధి విభాగానికి నోడల్ అధికారిగా ఉన్న ఆయనను తొలగించారు. విధులను ఉల్లంఘించి.. ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నందుకు కఫీల్ ఖాన్‌పై వేటు వేశారు. మెదడువాపు వ్యాధి కారణంగా బీఆర్డీ మెడికల్ కాలేజీ దవాఖానాలో పెద్దసంఖ్యలో చిన్నారులు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో గత గురువారం సొంత డబ్బుతో బయటినుంచి ఆక్సీజన్ సిలిండర్లు తెప్పించి.. చిన్నారుల ప్రాణాలు కాపాడినట్టు సోషల్ మీడియాలో, మీడియాలో కఫీల్ ఖాన్‌పై కథనాలు వచ్చాయి. అయితే, ఆస్పత్రిలో ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నా.. తనను తాను 'పిల్లల రక్షకుడి'గా చూపించుకునేందుకు ఆయన కల్పిత కథనాలు మీడియాలో సృష్టించారని, గోరఖ్‌పూర్‌లో కఫీల్‌ఖాన్‌కు 50 పడకల ప్రైవేటు పిల్లల ఆస్పత్రి ఉందని, దీనిని డెంటిస్ట్ అయిన తన భార్య షబిస్తా ఖాన్ ఆధ్వర్యంలో నడుపుతున్నాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అసలు బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సీజన్ సిలిండర్ల కొరతకు కఫీల్ ఖాన్‌తోపాటు, కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే మిశ్రా కారణమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మిశ్రాపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆయన రాజీనామా చేశారు. తాజాగా మీడియాలో తప్పుడు కథనాలు సృష్టించారని, విధులను ఉల్లంఘించారని కఫీల్ ఖాన్‌పై వేటు వేశారు. -
గోరఖ్‌పూర్ ఘోరకలి: ఆక్సిజన్ సప్లయర్‌పై దాడి
- 63 మంది చిన్నారుల మరణాలపై యూపీ సీఎం సీరియస్ - బీఆర్డీ ఆస్పత్రికి పయనమైన ఇద్దరు మంత్రులు.. - ఆదిత్యనాథ్‌పై విపక్షాల మండిపాటు.. రాజీనామాకు డిమాండ్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో 63 మంది చిన్నారులు మృత్యువాతపడిన ఘటనలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. శనివారం మధ్యాహ్నం లక్నోలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధ్యక్షతన అత్యున్నత సమావేశం జరిగింది. భేటీ ముగిసిన కొద్ది సేపటికే.. బీఆర్డీ ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరాదారుగా ఉన్న ప్రైవేటు సంస్థ కార్యాలయంపై పోలీసులు, వైద్యాధికారులు సంయుక్తంగా దాడి చేశారు. అక్కడి నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం తమకు రూ.70 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంన్నదునే, ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం వల్లే సరఫరా నిలిపివేశామని సదరు ప్రైవేటు సంస్థ వాదిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా శుక్రవారం సాయంత్రానికి 300 ఆక్సిజన్ సిలెండర్లను ఫైజాబాద్ నుంచి గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రికి పంపించామని ఆ సంస్థ పేర్కొంది. సరఫరా దారులపై చర్యలు తీసుకునేది, లేనిదీ ఇంకా స్పష్టత రాలేదు. సీఎం వెళ్లిపోయిన కొద్దిసేపటికే 23 మంది మృతి గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో ఆగస్టు 7, 8 తేదీల్లో 21 మంది పిల్లలు చనిపోయారు. గురువారం(ఆగస్ట్ 9న) ఉదయం సీఎం ఆదిత్యనాథ్ బీఆర్డీ ఆస్పత్రికి వెళ్లి, చిన్నారుల మరణాలపై వైద్యులతో మాట్లాడి, మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ సరిగ్గా ఆయన వెళ్లిపోయిన కొద్ది సేపటికే ఒక్కొక్కరుగా చిన్నారులు చనిపోయారు. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 23 మంది చనిపోయారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందన్న విషయాన్ని అధికారులుగానీ, వైద్యులుగానీ సీఎం దృష్టికి తీసుకురాకపోవడం గమనార్హం. అయితే ఆస్పత్రిలో స్టోర్‌ను నిర్వహిస్తోన్న ఉద్యోగులు.. ఆక్సిజన్ కొరతపై సీఎం ఆదిత్యనాథ్‌కు గురువారం ఉదయమే ఓ లేఖరాసినట్లు వెల్లడి కావడం మరో సంచలనం. ఆగస్టు 7 నుంచి 12 (ఉదయం 11 గంటల) వరకు బీఆర్డీ ఆస్పత్రిలో మొత్తం 63 మంది చిన్నారులు చనిపోయారు. వీరిలో నవజాత శిశువులు కూడా ఉన్నారు. స్వచ్ఛందంగా సిలిండర్ల సరఫరా బీఆర్డీ ఆస్పత్రిలో 63 మంది చిన్నారులు చనిపోయిన ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని యూపీ ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. సీఎం ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మరోవైపు, పలువురు ఆక్సిజన్ సరఫరాదారులు బీఆర్డీ ఆస్పత్రికి స్వచ్ఛందంగా సిలిండర్లను పంపుతున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి పరిస్థితిలో మార్పు కనిపించింది. (చదవండి: గోరఖ్‌పూర్ ఘోరకలి: 63కు పెరిగిన మరణాలు) (మందులు తెచ్చేలోపే.. ప్రాణాలు విడిచాడు!)