గోరఖ్‌పూర్: బీఆర్‌డీ ఆసుపత్రిలో ఆగస్టు మృతులు 290
- గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో ఆగని మృత్యుహేల
- వందల్లో చనిపోతున్న చిన్నారులు
- ఈ ఏడాది ఇప్పటి వరకూ చినిపోయిన చిన్నారుల సంఖ్య 1250
గోరఖ్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బాబా రాఘవ్ దాస్ ఆసుపత్రిలో చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రిలో వైద్యం సరిగ్గా అందక కొందరు, మౌలిక వసతులు లేక చనిపోతున్నారు. కేవలం ఈ ఆగస్టు నెల్లో ఇప్పటివరకూ 290 మంది చిన్నారులు మృతి చెందారు. ఇదే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ మృతుల సంఖ్య 1250. ఇదే విషయాన్ని డీఆర్‌డీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పీకే సింగ్ ధృవీకరించారు. మొదడు వాపు, ఇతర వ్యాధుల కారణంగా చిన్నారులు అధికంగా చనిపోతున్నారని ఆయన చెప్పారు. చిన్నారుల మృతికి సంబంధించి ప్రిన్సిపాల్ పీకే సింగ్ తొలిసారి నోరు విప్పారు. ఆగస్టు 27, 28 తేదీల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో 37 మంది చిన్నారులు చనిపోయారని చెప్పారు.
భారీగా మృతులు
ఈ ఏడాది జనవరి నుంచి బీఆర్‌డీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారులు మృత్యుహేళ కొనసాగుతోంది. జనవరిల నెల్లో 152 మంది, ఫిబ్రవరిలో 122, మార్చిలో 159, ఏప్రిల్‌లో 123, మేలో 139, జూన్‌లో 137, జూలైలో 128 మంది చిన్నారులు చనిపోయినట్లు ప్రిన్సిపాల్ సింగ్ తెలిపారు.
చాలా కారణాలు
బీఆర్‌డీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలకు చాలా కారణాలున్నాయని ప్రిన్సిపాల్ సింగ్ అన్నారు. ప్రధానంగా ఇక్కడకు చికిత్స వచ్చే చిన్నారుల్లో అత్యధికులు జాండీస్ (పచ్చకామెర్లు), న్యుమోనియా, అంటువ్యాధులు, ఇన్ ఫెక్షన్స్‌తో బాధపడేవారని చెప్పారు. అంతేకాక ప్రీ మెచ్యూర్డ్ బేబీలు చాలా మందే ఉంటారని.. మృతుల్లో వీరి శాతం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చికిత్సకు వచ్చే వారిలో చాలా మందిని ప్రాణాపాయం నుంచి రక్షించామని ఆయన నొక్కి చెప్పారు.