గోరఖ్‌పూర్ గుణపాఠం
సందర్భం
గోమాతల సంరక్షణ పేరుతో 40 కోట్ల నిధులు విడుదల చేసిన యూపీ ప్రభుత్వం, పసిపిల్లల ప్రాణాలు లెక్కలోకి తీసుకోలేదు. ఆ నిర్లక్ష్యం ఫలితమే.. 130 మంది పసిపిల్లల బలి. తెలుగు రాష్ట్రాలకూ ఇది హెచ్చరికే.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సొంత నియో జకవర్గం గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రి బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజీలో దేశ చరిత్ర లోనే కనీవినీ ఎరుగని ఘోరం జరిగింది. కేవలం ఏడు రోజుల్లో 72 మంది పసిమొగ్గల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కార ణం కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసిపిల్లలకు ప్రాణ వాయువు అందజేయలేకపోవడం, తీవ్రమైన మెదడువాపు వ్యాధితో బాధపడుతున్న 156 మంది పిల్లలకు ఆక్సిజన్ అత్యవసరం కానీ, సరఫరాదారుకు 75 లక్షల రూపాయలు ఆదిత్యనాథ్ సర్కారు బాకీ పడింది. దాంతో ఆ సరఫరా దారు నా డబ్బు చెల్లించనిదే ఆక్సిజన్ సరఫరా చేయలేనని మొత్తుకున్నారు.
ఆసుపత్రికి ఆక్సిజన్ అత్యవసరమని వైద్యులు అరచి గీ పెట్టినా ప్రభుత్వం బకాయి చెల్లించడంలో విఫలమైంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. గోమాతల సంరక్షణ అని రూ. 40 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, పసిపిల్లల ప్రాణాలు లెక్కలోకి తీసుకోలేదు. నిర్లక్ష్యం వహించింది. ఏకంగా ఒకేరోజు 38 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతే మరుసటి రోజు మరో 30 మంది కేవలం ఆక్సిజన్ అందక ఆయువులు కోల్పోయారు.
ఈ ఘటన జరిగినందుకు కాక దేశవ్యాప్తంగా ఈ ఘటనపై విమర్శలు రావడంతో బిత్తరపోయిన ఆదిత్య నాథ్ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలు పోలేదు. ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేని కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే మిశ్రాను విధుల నుంచి తప్పించి, తప్పు కప్పిపుచ్చు కోవాలని చూసింది. ప్రభుత్వం వైద్యుణ్ని విధుల నుంచి తప్పించిందే కానీ, మరణ మృదంగాన్ని ఆపలేకపోయింది. తన సొంత డబ్బులతో, పరపతితో కొంతమంది పిల్లలకు ఆక్సిజన్ అందించి ప్రాణాలు ప్రసాదించిన వైద్యుడు ఖఫీల్ ఖాన్‌ను నోడల్ అధికారిగా తొలగించి, తన బుర్ర పని చేయనిత నాన్ని చాటి చెప్పుకుంది ప్రభుత్వం.
పుండు ఒకరికి ఉంటే, మందు మరొకరికి పెట్టినట్టు వ్యవహరించేసరికి సమస్య జటిలమై మరిన్ని విమర్శలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ రాష్ట్రంలో వివిధ రోగాల బారిన పడుతున్న చిన్నారుల్లో 47 శాతం మెదడువాపుతో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి కారణం పందిని కుట్టిన దోమ పిల్లలకి కుట్టడం. అంటే పందులు, దోమల స్వైర విహారం ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలు ఉంటే, స్వచ్ఛ భారత్ యూపీలో లేదా? నిఖార్సయిన సంఘ్‌పరివార్ వాది సీఎంగా ఉండి స్వచ్ఛ భారత్‌ను ఎందుకు అమలుపర్చడం లేదు? ఎంతసేపూ గోశాలల చుట్టే ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం తిరిగితే మనుషులను ఎవరు పట్టించుకోవాలి?
తమ రాష్ట్రంలో వైద్యం అందించలేనప్పుడు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకి పిల్లల్ని తరలించి ప్రాణాలు ఎందుకు కాపాడటం లేదు? అలాగే మెదడు వాపు వ్యాధి తీవ్రంగా ఉన్న ఈ రాష్ట్రంలో, వ్యాధి నిరోధక వ్యాక్సిన్‌లు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజల నుంచి మీడియా నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం తలకాయ లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నది? ఘోరం జరిగిపోయాక, సుల్తాన్‌పూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల విభాగం ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద రూ.5 కోట్లు కేటాయిస్తానని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హామీ ఇచ్చారు. కాగా, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారుల మరణాలకు అధికారుల లంచగొండితనమే కారణమన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కోసం ప్రభుత్వం రూ.68 లక్షలు విడుదల చేసినా..ఈ నెల 11 నాటికి అధికారులు కేవలం రూ.11 లక్షలే ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు.
గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రిలో 60 మందికి పైగా చిన్నారులు మరణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ చీఫ్ అమిత్ షా తోసిపుచ్చారు. అదొక ప్రమాదమనీ, ఇంత పెద్ద దేశంలో అలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయనీ, ఈ తరహా ఘటన జరగడం ఇది మొదటిసారి కాదని షా వ్యాఖ్యానించారు. ఇంతటి విషాదం జరిగినా సీఎం కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా జరపాలంటూ ఆదేశాలివ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న ఈ ఘటన ప్రభుత్వం మెడకు చుట్టుకున్న పాములాంటిది అని ఒక్క ఉత్తరప్రదేశ్ సర్కార్ అనుకుంటే చాలదు. మన ప్రభుత్వాలూ ఆలో చించాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల్ని ఎలుకలకూ, చీమ లకూ, పందులకూ బలిపెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు సర్కారుకూ ఉంది. ఇటు నిలోఫర్ తదితర ఆసుపత్రుల్లో హైదరాబాద్‌లో సైతం ఎంతోమంది పిల్లలు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం పిల్లల్ని కబళించే అనేక వ్యాధులు కరాళనృత్యం చేస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, యంత్రాంగం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటే, గోరఖ్‌పూర్ ఘోరం మన దగ్గరా జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేగానీ, పిల్లలే కదా అని గాలికి వదిలేస్తే యూపీ ప్రభుత్వంలా మనం కూడా ప్రపంచం ముందు దోషులుగా నిలబడే ప్రమాదం ముంచుకురా వచ్చు. తస్మాత్ జాగ్రత్త.
అచ్యుతరావు
వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం ‘ మొబైల్ : 93910 24242