గోరఖ్‌పూర్‌లో పరిస్థితి ఘోరం.. చేజారింది
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ (బీఆర్‌డీ) ఆస్పత్రిలో చిన్నారుల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం కంటి తుడుపు చర్యలే కనిపిస్తున్నాయి. ఆస్పత్రి చీఫ్ ను తొలగించటంతోపాటు ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీదారుపై విచారణకు ఆదేశించింది. మరోవైపు, కేవలం కొందరు మాత్రమే ఆక్సిజన్ అందక చనిపోయారని స్వయంగా సీఎం యోగి ఆదిత్యానాథే ప్రకటించారు. మృతుల్లో 30మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయినట్లు హోంశాఖ ప్రకటించగా, 21 మందేనని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఆదివారం ఉదయం మరో చిన్నారి చనిపోవటంతో ఆ సంఖ్య 65కి చేరుకుంది. మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
కళ్ల ముందే కన్నపేగు కన్నుమూస్తుంటే నిస్సహాయతతో చూస్తున్న తల్లిదండ్రుల ఆవేదనపై అంతర్జాతీయ మీడియా కూడా స్పందించింది. గోరఖ్‌పూర్‌లో చిన్నారులు ఒకరి తర్వాత ఒకరి చేజారి పోతున్నారంటూ కథనం ప్రచురించింది. ఆగస్టు 7 నుంచి అక్కడ జరుగుతున్న ఘోర కలిని కూలంకషంగా వివరించింది. 'ఇది ముమ్మాటికీ ఆస్పత్రి వర్గాల తప్పే. వారి మూలంగా చిన్నారులు చనిపోతున్నారు. రాత్రి నా కొడుకు బాగానే ఉన్నాడు. తర్వాతే ఏదో జరిగింది, విగతజీవిగా మారిపోయాడు'అని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఇది విషాదం కాదు.. ముమ్మాటికీ మారణకాండే. ఆక్సిజన్ సరఫరాతో అంత మంది కన్నుమూయటం దారుణం' అని బాలలహక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ట్వీట్ చేశారు.
మరోపక్క హుటాహుటినా సిలిండర్లు తెప్పించి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు యత్నించినప్పటికీ శనివారం మరో ఇద్దరు చిన్నారులు చనిపోవటంతో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. నేడు సీఎం ఆదిత్యానాథ్‌తోపాటు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డా పరిస్థితిని సమీక్షించేందుకు ఆస్పత్రికి వెళ్లనున్నారు.